• facebook
  • twitter
  • whatsapp
  • telegram

 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం (1900 - 1950)

ఆధునిక ప్రపంచ చరిత్రలో 20వ శతాబ్దం ప్రథమార్థం అనేక ప్రత్యేకతలకు ప్రసిద్ధి. నాలుగేళ్లు భీకరంగా జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం, నానాజాతి సమితి ఆవిర్భావం - వైఫల్యం, రష్యాలో నిరంకుశ పాలనపై నిరసన, తీవ్ర ఆర్థిక మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం, ఐక్యరాజ్య సమితి స్థాపన.... ఇలా ఎన్నో వైవిధ్యాలకు నిలయమైంది.

మొదటి ప్రపంచ యుద్ధమనే సుడిగుండం యూరప్‌లోని చిన్న రాజ్యాలతో పాటు, ప్రపంచ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. దీనికి తోడు 1929 - 30లో సంభవించిన 'తీవ్ర ఆర్థిక మాంద్యం' యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. శాంతి స్థాపన కోసం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది.

దాదాపు అయిదు సంవత్సరాలపాటు సాగిన రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచమంతా భీతిల్లింది. యుద్ధం వల్ల లక్షలాది మంది మరణించారు. అంచనాలకు వీల్లేనంత ఆర్థికపరమైన నష్టాలు సంభవించాయి. బ్రిటన్ ఒక్కటే దాదాపు రెండువేల కోట్లు ఖర్చు పెట్టింది. రష్యా తన మొత్తం సంపదలో నాలుగోవంతు నష్టపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అగ్రరాజ్యాల కృషి ఫలితంగా స్థాపించిన ఐక్యరాజ్య సమితి శాంతియుత ప్రపంచానికి వేదికగా మారింది.

తీవ్ర సంచలనాల యుగం

20వ శతాబ్దం రాజకీయంగా, విజ్ఞానపరంగా, ఆర్థికంగా ఎన్నో ఆశలు, ప్రయోగాలు, ప్రమాదకర పరిణామాల సమ్మేళనంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఫాసిజం తీవ్రరూపం దాలుస్తున్న సమయంలో ప్రజాస్వామిక ఆకాంక్షలు చిగురించాయి. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలు స్వాతంత్య్రం పొందాయి. సమ సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు కొనసాగాయి. ప్రపంచం అంతటా అక్షరాస్యతస్థాయి, సగటు జీవితకాలం పెరిగాయి. పాశ్చాత్య దేశాల్లో మహిళలకు మొదటిసారిగా ఓటు హక్కును ఈ కాలంలోనే కల్పించారు. ఈ శతాబ్దంలోనే 'తీవ్ర ఆర్థిక మాంద్యం' (గ్రేట్ డిప్రెషన్) సంభవించి ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. అధిక సంఖ్యలో నిరుద్యోగులయ్యారు. రెండు ప్రపంచ యుద్ధాలు జరగడం వల్ల లక్షలాదిమంది చనిపోయారు. ఎన్నో లక్షలమంది నిర్వాసితులయ్యారు. దీన్నిబట్టి చరిత్రకారుడైన 'ఎరిక్ హాబ్స్‌బామ్' 20వ శతాబ్దాన్ని 'తీవ్ర సంచలనాల యుగం' అనడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది.

భూగోళ యుద్ధాలు: కొన్ని ప్రతికూల నిజాలు 20వ శతాబ్దపు ప్రారంభంలో ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది.

పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలు: బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. వలస పాలిత దేశాలు: ఆఫ్రికా, ఆసియాలకు చెందిన వలసపాలిత ప్రాంతాలు ఆరంభం నుంచి స్వాతంత్య్రం కోసం పోరాటాలు మొదలుపెట్టాయి. ప్రపంచ ఆధిపత్యం కోసం పారిశ్రామిక దేశాలు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. దీనికి గొడవలు తోడై రెండు బృందాలుగా విడిపోయాయి. 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధంలో తూర్పున జపాన్, చైనా నుంచి పశ్చిమాన అమెరికా వరకు దాదాపు అన్ని దేశాలు ఈ యుద్ధంలో పాల్గొనడం వల్ల దీన్ని ప్రపంచ యుద్ధంగా పేర్కొనవచ్చు. రెండు ప్రపంచ యుద్ధాల్లో నెగ్గిన, ఓడిన దేశాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి

నష్టాలు: రెండు ప్రపంచ యుద్ధాల వల్ల కనీవినీ ఎరుగని వినాశనం జరిగింది. అంతకుముందు దేశాల మధ్య జరిగిన యుద్ధాలు ఎక్కువకాలం కొనసాగినా, అవి భూగోళం అంతటా విస్తరించలేదు. అంత ప్రాణనష్టం జరగలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో కోటిమంది మృత్యువాత పడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో 2.2 - 2.5 కోట్ల సైనికులు, 4 - 5.2 కోట్ల పౌరులు చనిపోయారు. రెండు యుద్ధాల్లో కోట్లాది ధనం వెచ్చించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఎక్కడ చూసినా ఆకలి, అంటురోగాలు, అనారోగ్యం వీరవిహారం చేశాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని నాగసాకి, హిరోషిమాలపై అమెరికా వేసిన అణుబాంబుల వల్ల ల్యుకేమియా, క్యాన్సర్ లాంటి సమస్యలు దశాబ్దాల పాటు కొనసాగాయి.

ఎవరెవరు ఏ కూటమిలో?

1907 కల్లా యూరప్ ఖండం రెండు సైనిక శిబిరాలుగా విడిపోయింది. అవి 'త్రిరాజ్య కూటమి' (Triple Alliance), 'త్రిరాజ్య మిత్ర కూటమి ' (Triple Entente). త్రిరాజ్య కూటమిలో జర్మనీ, ఆస్ట్రియా - హంగేరి, ఇటలీ దేశాలు; త్రిరాజ్య మిత్ర కూటమిలో ఫ్రాన్స్, రష్యా, ఇంగ్లండ్ ఉన్నాయి. పరస్పర ద్వేషం, ఈర్ష్యా అసూయలు రెండు శిబిరాల మధ్య పెరిగాయి. రహస్య మిత్రవర్గాలుగా ఏర్పడ్డాయి. దీనివల్ల జనించిన పరస్పర ద్వేషం మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడానికి కారణమైంది. అంతిమంగా రెండు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. అవి కేంద్ర రాజ్యాల కూటమి, మిత్ర రాజ్యాల కూటమి. వీటి మధ్య పోటీల ఫలితంగా గతంలో శత్రువులైన ఆస్ట్రియా - ఇటలీ మధ్య లేదా బ్రిటన్ - ఫ్రాన్స్ మధ్య అభద్రతా భావం పెరిగి రహస్య ఒడంబడికలకు దారితీసింది. ఇదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధకాలంలోనూ రహస్య కూటములు కొనసాగాయి. అవి: అక్ష/ కేంద్ర రాజ్యాల కూటమి, మిత్ర రాజ్యాల కూటమి. అక్ష/ కేంద్ర రాజ్యాల కూటమికి జర్మనీ నాయకత్వం వహించగా, మిత్ర రాజ్యాల కూటమికి బ్రిటన్, అమెరికా, రష్యా నాయకత్వం వహించాయి.

సంపూర్ణ యుద్ధాలకు కారణాలు - పోలికలు, తేడాలు:

ఏ రెండు సంఘటనలూ ఒకేరకంగా ఉండవు. ఆర్థిక పరిస్థితులు, దౌత్యపరమైన కూటములు, ఆయుధ సామగ్రి లాంటి వాటిలో ఎన్నో తేడాలున్నాయి. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య తేడాలు, పోలికలు, తక్షణ కారణాలు కింది పట్టికను పరిశీలిస్తే అర్థమవుతుంది.

రెండు ప్రపంచ యుద్ధాలు

ప్రధాన కారణాలు:

మొదటి ప్రపంచ యుద్ధానికి 19వ శతాబ్దం నుంచే రంగం సిద్ధమైంది. దురహంకార పూరిత జాతీయతావాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలు, సైనికవాదం మొదటి ప్రపంచ యుద్ధానికి ముఖ్యకారణాలు. వర్సెయిల్స్ సంధిలోని అవమానకరమైన షరతులు, నానాజాతి - సమితి వైఫల్యం, ప్రతీకార పెత్తనందారీతనంపై జర్మనీ సవాలు, సామ్యవాదం, రష్యాపట్ల భయాలు, సైనిక సన్నాహాలు రెండో ప్రపంచయుద్ధం సంభవించడానికి ప్రధాన కారణాలు.

ప్రపంచ యుద్ధాలు ఎలా ప్రభావితం చేశాయి?

ఆయుధాల పోటీతో వినాశనం తప్పదా? రెండు ప్రపంచ యుద్ధాల వల్ల అణుబాంబులు, రసాయనిక ఆయుధాల పోటీ పెరిగింది. ఇలాంటి ఆయుధాలు ప్రమాదవశాత్తు పేలిపోయినా పూర్తి వినాశనం, మానవ నష్టం జరిగే భయంతో నేటి ప్రపంచం జీవిస్తుంది.

ప్రజాస్వామ్య సూత్రాల పునరుద్ఘాటన: అప్రజాస్వామిక ప్రభుత్వాల వల్ల కలిగే నష్టాలను ప్రపంచ యుద్ధాలు తెలియజేశాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాల ఆవశ్యకతను గుర్తించారు. రాచరికాలు రాలిపోయాయి. ప్రజాస్వామ్య లౌకిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

కొత్త అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు: మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి అనే శాంతి సంఘాలు ఏర్పడ్డాయి. శాంతిని నెలకొల్పడం, మానవ హక్కులను కాపాడటం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం అనే నాలుగు సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడిన ఐక్యరాజ్యసమితి ప్రపంచ ప్రభుత్వం లాంటిది.

మహిళలకు ఓటుహక్కు: సుదీర్ఘ పోరాటం తర్వాత 1918లో బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు లభించింది. పురుషులు యుద్ధభూమిలో ఉండటంతో ఫ్యాక్టరీలు, దుకాణాలు, కార్యాలయాలు, స్వచ్ఛంద సేవలు, ఆసుపత్రులు లాంటి వాటిలో మహిళలు పనిచేయాల్సి వచ్చింది. సంపాదనపరులు కావడంతో పెరిగిన ఆత్మవిశ్వాసంతో జీవితంలోని అన్ని అంశాల్లో మహిళలు సమానత్వాన్ని కోరారు.

ప్రధానాంశాలు:

20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా 160 కోట్లు.

పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం పాశ్చాత్య దేశాల్లోని ప్రజల జీవనోపాధిని పొందే విధానాన్ని మార్చేసింది.

పారిశ్రామికంగా అగ్రభాగాన ఉన్న దేశం బ్రిటన్.

చరిత్రకారుడైన 'ఎరిక్ హాబ్స్‌బామ్' 20వ శతాబ్దాన్ని 'తీవ్ర సంచలనాల యుగం'గా పేర్కొన్నాడు.

ప్రపంచంలోని ఇతర ప్రజల పట్ల ద్వేషం, అవధులు లేని అధికారంతో ఫాసిజం తీవ్రరూపం దాలుస్తున్న క్రమంలోనే ప్రజల్లో ప్రజాస్వామిక ఆకాంక్షలు చిగురించాయి.

అందరికీ అక్షరాస్యత స్థాయి, సగటు జీవితకాలం అపారంగా పెరిగాయి.

సినిమాలు లాంటి కొత్త కళలు ఆవిర్భవించాయి.

పరమాణువు, జీవుల రహస్యాన్ని ఛేదించింది.

మహిళలకు పాశ్చాత్య దేశాల్లో మొదటగా ఓటు హక్కును కల్పించారు.

వందకుపైగా దేశాలు స్వాతంత్య్రం పొందాయి.

ఇదే సమయంలో 'తీవ్ర ఆర్థిక మాంద్యం' (గ్రేట్ డిప్రెషన్) సంభవించి ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది.

ప్రజలు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులయ్యారు.

రెండు ప్రపంచ యుద్ధాలు సంభవించి లక్షలాదిమంది మరణించగా ఎన్నో లక్షలమంది నిర్వాసితులయ్యారు.

20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ విభజన చెందాయి.

పారిశ్రామిక దేశాలు రెండు బృందాలు (జర్మనీ - ఆస్ట్రియా - హంగేరీ, బ్రిటన్ - ఫ్రాన్స్ - రష్యా)గా విడిపోయాయి.

ఈ దేశాలు ప్రపంచ ఆధిపత్యం కోసం, తద్వారా వలస ప్రాంతాలు, మార్కెట్లపై ఆధిపత్యం కోసం పోటీపడ్డాయి.

మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలైంది.

1918లో జర్మనీ, దాని మిత్రదేశాల ఓటమితో; బ్రిటన్, ఫ్రాన్స్‌ల గెలుపుతో ఈ యుద్ధం ముగిసింది.

శాంతి కోసం జర్మనీపై విధించిన షరతులే రెండో ప్రపంచ యుద్ధానికి (1939 - 1945) దారితీశాయి.

రెండో ప్రపంచ యుద్ధంలో ఒకవైపున జర్మనీ, జపాన్, ఇటలీ ఉండగా మరోకవైపు బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా, అమెరికాలున్నాయి.

జర్మనీ, దాని మిత్రదేశాల ఓటమితో యుద్ధం ముగిసింది.

మొదటి ప్రపంచ యుద్ధంలో కోటిమంది మరణించారు.

బ్రిటన్ తరఫున పోరాడి చనిపోయిన వారిలో 75,000 మంది భారతీయ సైనికులు ఉన్నారు.

రెండో ప్రపంచ యుద్ధంలో 2.2-2.5 కోట్ల సైనికులు చనిపోయారు. సుమారుగా 4 - 5.2 కోట్ల పౌరులు కూడా చనిపోయారు.

జపాన్ లోని నాగసాకి, హిరోషిమాలపై అమెరికా వేసిన అణుబాంబు వల్ల 1,50,000 నుంచి 2,46,000 మంది పౌరులు వెంటనే చనిపోయారు.

ఈ అణుబాంబువల్ల ల్యుకేమియా, క్యాన్సర్ లాంటి సమస్యలు దశాబ్దాల పాటు కొనసాగాయి.

19వ శతాబ్దం చివరి నాటికి యూరప్ లోని వివిధ దేశాలు, ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని కూటములుగా విడిపోయాయి.

అంతిమంగా అక్ష/ కేంద్ర రాజ్యాల కూటమి, మిత్రరాజ్యాల కూటమి అనే రెండు ప్రధాన కూటములుగా ఏర్పడ్డాయి.

అక్ష/ కేంద్ర రాజ్యాల కూటమికి జర్మనీ నాయకత్వం వహించగా, మిత్ర రాజ్యాల కూటమికి బ్రిటన్, అమెరికా, రష్యా నాయకత్వం వహించాయి.

రెండు ప్రపంచ యుద్ధాల మధ్య 21 సంవత్సరాల వ్యవధి ఉంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు, దౌత్యపరమైన కూటములు, ఆయుధ సామగ్రి లాంటి వాటిలో ఎన్నో తేడాలున్నాయి.

ప్రతి యుద్ధానికి దీర్ఘకాలంగా ఉండే కారణాలతో పాటు తక్షణ కారణాలు కొన్ని ఉంటాయి.

మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం 1914 జూన్ 28న ఆస్ట్రియాకు చెందిన ''ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్'' ఒక సెర్బియన్ ఉన్మాది చేతిలో హత్యకు గురవడం. దీంతో సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధం ప్రకటించింది.

బ్రిట‌న్‌, ఫ్రాన్స్,ర‌ష్యా కూట‌మిలో సెర్బియా ఉండ‌టం వ‌ల్ల, ఆస్ట్రియా దండెత్తడంతో సెర్బియాకు మ‌ద్దతుగా ఆ దేశాలు వ‌చ్చాయి.

ఆస్ట్రియా ప‌క్షాన ఉన్న జ‌ర్మనీ, ఇట‌లీ కూడా యుద్ధంలో చేర‌డంతో మొద‌టి ప్రపంచ యుద్ధం మొద‌లైంది.

రెండో ప్రపంచ యుద్ధానికి 1939 సెప్టెంబ‌ర్ 1న డాంజింగ్ రేవును జర్మనీకి అప్పగించ‌డానికి పోలండ్ నిరాక‌రించ‌డ‌మే త‌క్షణ కార‌ణం.

పోలండ్‌లోకి ప్రవేశించి, శిక్షించ‌డానికి జ‌ర్మనీ యుద్ధట్యాంకులు, హిట్లర్ సేన‌లు దండెత్తాయి.

పోలండ్‌కు బ్రిట‌న్‌తో సైనిక ఒప్పందం ఉండ‌టంతో పోలండ్ ప‌క్షాన అది యుద్ధంలో చేరింది. దీంతో రెండో ప్రపంచ యుద్ధం మొద‌లైంది.

మొద‌టి ప్రపంచ యుద్ధానికి 19వ శ‌తాబ్ధం నుంచే రంగం సిద్ధమైంది.

దుర‌హంకార‌పూరిత జాతీయ‌తావాదం, సామ్రాజ్యవాదం, ర‌హ‌స్య ఒప్పందాలు, సైనిక‌వాదం మొద‌టి ప్రపంచ యుద్ధానికి దారితీసిన ప్రధాన‌మైన దీర్ఘకాలిక కార‌ణాలు.

1923 నుంచి ఇట‌లీలో ఫాసిజం, జ‌ర్మనీలో నాజీయిజం రెండూ విధ్వంస‌క రూపంలోని దుర‌హంకార పూరిత జాతీయ‌తావాదాలు.

బ్రిటన్, జర్మనీ, అమెరికాల్లో పారిశ్రామిక మూలధనం అభివృద్ధి చెందడం వల్ల, తమ ఉత్పత్తులకు ముడిసరకులు, మార్కెట్లు అవసరమయ్యాయి. 

పెట్టుబడి మరింతగా పోగుబడటంతో వలస ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం కోసం ఎదురుచూశారు.

19వ శతాబ్దం ముగిసేనాటికి ఐరోపా శక్తుల మధ్య వలస ప్రాంతాల కోసం పోటీ మొదలైంది.

కొత్త పారిశ్రామిక శక్తులు (జపాన్, జర్మనీ, ఇటలీ లాంటివి) ఏర్పడటంతో ఇవి వలస ప్రాంతాలను తిరిగి విభజించాలని కోరుకున్నాయి.

అయితే పాత శక్తులు దీనికి సిద్ధంగా లేవు.

ఇది తీవ్ర ఒత్తిడులకు, తరచూ యుద్ధాలకు కారణమయ్యేది.

1870లో ఫ్రాన్స్‌ను ఓడించిన తర్వాత జర్మనీ ఛాన్స్‌లర్ బిస్మార్క్ దాన్ని ఒంటరి చేయాలని చూశాడు.

బిస్మార్క్ ఆస్ట్రియాతో 1879లోనూ, ఇటలీతో 1882లోనూ రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.

ఈ రక్షణ ఒప్పందంలో ఒక అంశం రష్యా నుంచి ఆస్ట్రియాను, ఫ్రాన్స్ నుంచి ఇటలీని కాపాడటం.

ఫ్రాన్స్ 1891లో రష్యాతోనూ, 1940లో బ్రిటన్‌తోనూ సంబంధాలు కుదుర్చుకుంది.

1907లో రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ మిత్రదేశాల కూటమిగా ఏర్పడ్డాయి.

జర్మనీ త్రైపాక్షిక కూటమి, ఫ్రాన్స్ మిత్ర రాజ్యాల వల్ల యూరప్‌లో సాయుధశాంతి, భయ వాతావరణం నెలకొన్నాయి.

భద్రతకు సైనికశక్తి మంచి మార్గమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మడాన్ని 'సైనిక వాదం' అంటారు.

1880 నుంచి 1914 నాటికి ఆరు ప్రధాన శక్తుల (జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్) సైనిక ఖర్చు 300 శాతానికి పైగా అంటే 132 మిలియన్ పౌండ్ల నుంచి 397 మిలియన్ పౌండ్లకు పెరిగింది.

సైనిక వాదం నేపథ్యంలో మూడు ముఖ్యమైన విషయాలను గమనించాలి. అవి: పెద్ద సంఖ్యలో శాశ్వత సైన్యాన్ని పెంచడం. ఆయుధాలు సమకూర్చుకోవడంలో ఒక దేశంతో మరో దేశం పోటీ పడటం. తమ ప్రజలను మానసికంగా యుద్ధానికి సంసిద్ధం చేయడం.

మొదటి ప్రపంచ యుద్ధం 1919లో వర్సెయిల్స్ శాంతి సమావేశంతో ముగిసింది. 32 దేశాల ప్రతినిధి బృందాలు హాజరైన అతిపెద్ద సమావేశం ఇది.

మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ ఈ సమావేశంలో పాల్గొన్నాయి.

రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీలను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు.

జర్మనీని బలహీనపరచడానికి వర్సెయిల్స్ ఒప్పందంలో సైనిక కోతలను, భౌగోళిక పరిమితులను విధించారు.

1880లో ఆక్రమించుకున్న ఆఫ్రికాలోని వలస ప్రాంతాలను, ఫ్రాన్స్ నుంచి 1871లో స్వాధీనం చేసుకున్న ఆల్వాస్, లోరైన్ లాంటి ఐరోపా ప్రాంతాలను జర్మనీ వదులకునేలా చేశారు.

9 లక్షల నుంచి లక్షకు సైనిక బలగాన్ని తగ్గించాలని, జలాంతర్గాములు ఉండకూడదని, పదివేల టన్నుల లోపు ఉండే ఆరు యుద్ధనౌకలకు మించని నావికాదళం ఉండాలని జర్మనీని నిర్దేశించారు.

భవిష్యత్తులో యుద్ధాలను నివారించడానికి వర్సెయిల్స్ ఒప్పందం నానాజాతి సమితిని ఏర్పాటు చేసింది.

నానాజాతి సమితిలో చేరడానికి రష్యా, జర్మనీలను ఆహ్వానించలేదు.

ఈ కూటమి ఏర్పడటంలో అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ చురుకైన పాత్ర పోషించినప్పటికీ, అతడి ప్రతిపాదనను అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఆమోదించడానికి తిరస్కరించడంతో అది కూడా సభ్యత్వం పొందలేదు.

నానాజాతి సమితిలో 1934లో 58 మంది సభ్యులే ఉన్నారు.

''ఉమ్మడి భద్రత'' ద్వారా చర్చలు, సంప్రదింపులతో దేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకోవడం ద్వారా యుద్ధాలు రాకుండా చేయవచ్చని సభ్య దేశాలు ఆశించాయి.

ఆరోగ్యం, కార్మిక సంక్షేమం లాంటి సంక్షేమ కార్యకలాపాల కోసం అనేక అంతర్జాతీయ సంస్థలను నానాజాతి సమితి ఏర్పాటుచేసింది.

దేశాల మధ్య వివాదాల పరిష్కారాల కోసం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఏర్పాటుచేసింది.

ఎంతో మేలు జరుగుతుందని ఏర్పాటు చేసిన నానాజాతి సమితి జర్మనీ, ఇటలీల దురాక్రమణలను నివారించలేకపోయింది.

1919 చివరిలో మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోవడంతో యుద్ధాన్ని మొదలుపెట్టినందుకు జర్మనీని శిక్షించాలని, మళ్లీ కోలుకోకుండా దెబ్బతీయాలని గెలుపొందిన మిత్రదేశాలు భావించాయి.

వర్సెయిల్స్ ఒప్పందం తమపై విధించిన షరతులు తమను బానిసత్వంలోకి నెడుతున్నాయని జర్మనీ వాసులు భావించారు.

నాజీల కింద జర్మనీ తిరిగి వేగంగా పారిశ్రామికీకరణ చెందింది.

యుద్ధం వల్ల మాత్రమే ఉపయోగంలోకి వచ్చే ఆయుధ పరిశ్రమను, అతిపెద్ద సైన్యాన్ని నిర్మించుకుంది.

మొదటి ప్రపంచయుద్ధ తీవ్ర పరిణామాల వల్ల యూరప్ అంతటా సామాజిక కల్లోలం ఏర్పడింది.

కార్మికులు సామ్యవాదం, కమ్యూనిజం భావాల వల్ల ప్రభావితులయ్యారు.

రష్యాలో 1917లో విప్లవం సంభవించి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది.

యుద్ధంలో రష్యా భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకుని శాంతి చర్చలు చేపట్టడం కొత్త ప్రభుత్వం చేపట్టిన తొలి చర్యల్లో ఒకటి.

రష్యా 1924లో సోవియట్ సోషలిస్టు దేశాల సమాఖ్యగా మారింది.

1939లో జర్మనీ, రష్యా పరస్పరం దండెత్తకుండా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

బ్రిటన్, ఫ్రాన్స్ కూటమికి వ్యతిరేకంగా హిట్లర్ నిలిచాడు.

ఇది రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైంది.

1942లో హిట్లర్ రష్యాపై దండెత్తాలని నిర్ణయించుకున్నాడు.

అదే సంవత్సరంలో జర్మనీ మిత్రదేశమైన జపాన్ అమెరికాపై దాడిచేసింది.

దాంతో జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలో అమెరికా, రష్యా కూడా భాగస్వాములయ్యాయి.

రెండో ప్రపంచ యుద్ధంలో మరణించినవారిలో అధిక శాతం 40 ఏళ్లలోపు పురుషులే.

రెండు ప్రపంచ యుద్ధాల వల్ల అణుబాంబులు, రసాయనిక ఆయుధాల పోటీ పెరిగింది.

మొదటి ప్రపంచయుద్ధంతోపాటే అనేక సామ్రాజ్యాలు (ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం, ఒట్టోమాన్ సామ్రాజ్యం, జర్మన్ సామ్రాజ్యం) అంతమయ్యాయి.

రష్యా లాంటి దేశాల్లో సోషలిస్టు విప్లవాలు సంభవించాయి.

జర్మనీ లాంటి దేశాలు రాచరికం నుంచి బయటపడి 'వైమర్ గణతంత్రం' గా ఏర్పడ్డాయి.

టర్కీలో ఒట్టోమాన్ సామ్రాజ్య స్థానంలో ప్రజాస్వామ్య, లౌకిక ప్రభుత్వం ఏర్పడింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పదుల సంఖ్యలో వలస పాలిత దేశాలు స్వాతంత్య్రం పొంది కొత్త దేశాలుగా ఏర్పడ్డాయి.

మధ్య, తూర్పు యూరపు ప్రాంతం జాతీయత, ఆర్థిక మనుగడ, సైనిక భద్రత మొదలైన అంశాల ఆధారంగా తిరిగి విభజన చెందింది.

 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి (U.N.O) ఏర్పడింది. ఇది శాంతిని నెలకొల్పడం, మానవ హక్కులను కాపాడటం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం అనే నాలుగు సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడిన ప్రపంచ ప్రభుత్వం లాంటిది.

బాలల అత్యవసర నిధి (యునిసెఫ్); విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో), ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లాంటి సంస్థల ద్వారా ఐక్యరాజ్యసమితి పనిచేస్తుంది.

అమెరికా, రష్యా లాంటి పెద్ద దేశాల చేతిలో ఐక్యరాజ్యసమితి కీలుబొమ్మగా మారిందన్న అపవాదులు ఉన్నప్పటికీ రెండో ప్రపంచయుద్ధ స్థాయి యుద్ధాలు సంభవించకుండా నిలువరించగలిగింది.

చరిత్రలో తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధంలో బాంబులు వేయడానికి విమానాలను ఉపయోగించారు.

1918లో బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు లభించింది.

పురుషులు యుద్ధ భూమిలో ఉండటంతో ఫ్యాక్టరీలు, దుకాణాలు, కార్యాలయాలు, స్వచ్ఛంద సేవలు, ఆసుపత్రులు, పాఠశాలలు మొదలైన వాటిలో మహిళలు పనిచేయాల్సి వచ్చింది.

సంపాదనపరులు కావడంతో, పెరిగిన ఆత్మవిశ్వాసంతో జీవితంలోని అన్ని అంశాల్లో మహిళలు సమానత్వాన్ని కోరారు.

ఆ దిశలో ఓటు హక్కు లభించడం అనేది ఒక పెద్ద ముందడుగు.

Posted Date : 19-03-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

సాంఘిక శాస్త్రం

ఇతర సబ్జెక్టులు