• facebook
  • whatsapp
  • telegram

ఒకేసారి గ్రూప్స్‌ అన్ని నోటిఫికేషన్లు వస్తే ఏంచేయాలి?

టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు నిపుణుల సూచనలు

 

 

9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రూప్‌-4తో పాటు గ్రూప్‌-2, గ్రూప్‌-3 సర్వీసుల నియామక నోటిఫికేషన్లు డిసెంబర్లో వస్తున్నాయన్న వార్తలు.. ఉద్యోగార్థుల్లో ఉత్సాహం పెంచేశాయి. ఈ సదవకాశాన్ని గరిష్ఠ స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే అభ్యర్థులు ఎలా ముందుకు సాగాలి? ఏమేం గమనించాలి? ఏ మెలకువలు పాటించాలి?  


భారీ నోటిఫికేషన్‌ గ్రూప్‌-1 కి తోడుగా గ్రూప్‌-2, 3, 4 నోటిఫికేషన్ల జారీకి తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలపటంతో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగులు పొందేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం అన్ని నోటిఫికేషన్లకూ స్పందించి ప్రిపేర్‌ అవ్వాలా, ఏదో ఒక దాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాని కోసమే సన్నద్ధమవ్వాలా అనే సందిగ్ధతలో చాలామంది అభ్యర్థులు ఉన్నారు.


గ్రూప్‌-1 ఆశావహులు


ప్రిలిమ్స్‌ పూర్తయింది. కానీ మెయిన్స్‌కి ఎంపిక అవుతామా లేదా అని చాలామంది సందేహం. కటాఫ్‌ విషయంలో ఒక నిర్ణయం రాలేకపోవటం, సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతుల వల్ల నిర్దిష్టంగా మెయిన్స్‌కు ప్రిపేర్‌ అవ్వాలా? లేదా? అనే ఊగిసలాట వీరిని ముందుకు వెళ్ళనీయటం లేదు. తాజాగా గ్రూప్‌ 4 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతించటంతో గ్రూప్‌-1 మెయిన్స్‌పై దృష్టి పెట్టాలా, గ్రూప్‌- 2, 3, 4లను లక్ష్యంగా చేసుకోవాలా అనే చిక్కులో పడ్డారు. 


గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఇప్పటికే రాసివున్నారు కాబట్టి 2, 3, 4 నోటిఫికేషన్ల పరీక్షలు 2023 మేలో జరిగే అవకాశం ఉంది. అందుకని ప్రస్తుతం మెయిన్స్‌ ప్రిపేర్‌ అవడం మేలైన నిర్ణయం.  


గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కచ్చితంగా పాస్‌ అవుతాం అనుకునేవారు డిస్క్రిప్టివ్‌ పరీక్షలో ఉండే క్లిష్టతను బట్టి మెయిన్స్‌ రాయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవటం మంచిది. గ్రూప్‌-1 మెయిన్స్‌లో ప్రధానంగా రాత శైలి, ప్రజెంటేషన్, సమయ నిర్వహణలపై ఆధారపడి మార్కులు వస్తాయి. ఆయా విషయాల్లో ఏ లోపం ఉన్నాగానీ మెయిన్స్‌ ప్రిపరేషన్‌ని పక్కనపెట్టి వస్తున్న అవకాశాలపై దృష్టి సారించి ఒక ఉద్యోగాన్ని స్థిరపరచుకోవటం మేలు. 


‣ ఇప్పటికే ఏదో ఒక కొలువులో స్థిరపడి ఉన్న అభ్యర్థులు గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత పొందుతామనుకున్న నమ్మకముంటే రాబోయే నోటిఫికేషన్లపై దృష్టి నిలపకుండా మెయిన్స్‌పైనే పూర్తి శ్రద్ధ పెట్టడం మంచిది. అయితే నోటిఫికేషన్లకు మాత్రం దరఖాస్తు చేయండి. ఇప్పటినుంచీ సన్నద్ధమవ్వాల్సిన అవసరం లేదు.

 

 

గ్రూప్‌-2 ఆశావహులు


783 ఖాళీలతో డిసెంబర్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సంఖ్య చిన్నదేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో చాలా సందర్భాల్లో దాదాపుగా ఇంతే సంఖ్యతో నోటిఫికేషన్లు వచ్చేవి. అందువల్ల ఒకరకంగా బాగా కష్టపడిన వాళ్లందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి. అందుకని గ్రూప్‌-2 ప్రిపరేషన్‌ను మరింత ఏకాగ్రతతో కొనసాగించడం మేలు. గ్రూప్‌-2 ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు గ్రూప్‌ 3, 4కి దరఖాస్తు చేసుకోండి. గ్రూప్‌-2 ప్రిపరేషన్‌కి అదనంగా ప్రతిరోజూ గంట సమయం గ్రూప్‌-4 పరీక్షల్లో అదనంగా ఉన్న సెక్రటేరియట్‌ ఎబిలిటీస్‌ సిలబస్‌పై వెచ్చిస్తే సరిపోతుంది. గ్రూప్‌-3, గ్రూప్‌-2 సిలబస్‌ల మధ్య తేడా లేనందువల్ల గ్రూప్‌-2కు చదివేవారు గ్రూప్‌-3 పరీక్షను సులభంగా ఎదుర్కోగలరు. గ్రూప్‌-2లో అభ్యసించే విస్తృత పరిధి వల్ల గ్రూప్‌-3, 4 పరీక్షల్లో కచ్చితంగా గుర్తించదగిన అదనపు ప్రయోజనాలుంటాయి. అందుకే గ్రూప్‌-2 ప్రిపరేషన్‌పై అధిక దృష్టి పెట్టటం, మిగతా నోటిఫికేషన్లను ఎదుర్కొనే వ్యూహాన్ని అనుసరించటం నిస్సందేహంగా సరైన నిర్ణయం అవుతుంది.


 

గ్రూప్‌-3 ఆశావహులు 


గ్రూప్‌-3లో 1373 ఖాళీలు గుర్తించారు. గ్రూప్‌-3, 4లకు మాత్రమే సిద్ధపడదాం అనుకునేవాళ్లు సిలబస్‌ ఒకటే కాబట్టి గ్రూప్‌-2 స్థాయిలో ప్రిపేర్‌ అయితే గ్రూప్‌-3 పరీక్షను సులభంగా ఎదుర్కోవచ్చు. ఫలితంగా గ్రూప్‌ 2, 4 కూడా రాయవచ్చు. అంతేగానీ గ్రూప్‌-3 మాత్రమే రాస్తాను అని నిర్ణయించుకోవటం సరికాదు.

 

 

గ్రూప్‌-4 ఆశావహులు 


‘గ్రూప్‌-4లో 9,168 ఉద్యోగాలున్నాయి. జాబ్‌ కొట్టవచ్చు’ అనే పాజిటివ్‌ ఆలోచన మంచిదే. అయితే పోటీ కూడా అదే స్థాయిలో ఉంటుందని గుర్తించాలి. ముందు ఏదో ఒక కొలువు పొందాలనే ఆలోచనతో సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థులతో సహా గ్రూప్‌-1, 2, 3 ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థుల్లో ఎక్కువమంది ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది. ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్, ఉపాధ్యాయ, ఇంజినీరింగ్‌ ఉద్యోగాల ఆశావహులు మొదలైనవారు పెద్ద సంఖ్యలో పోటీ అభ్యర్థులుగా ఉంటారు. అందుకే ప్రతి మార్కూ అత్యంత విలువైనదని గుర్తించాలి. ‘ఉద్యోగాల సంఖ్య ఎక్కువుంది కాబట్టి తేలిగ్గా కొట్టొచ్చు’ అనే అహేతుక ఆలోచన వదిలివేయాలి. తీవ్రమైన పోటీ నేపథ్యంలో గరిష్ఠ స్థాయి సన్నద్ధత వల్ల మాత్రమే ఉద్యోగాలు పొందగలం అన్న నిజాన్ని గుర్తించాలి.

 

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నేర్పిన పాఠాలు 


గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష అక్టోబర్‌ 16న జరిగింది. మూస ధోరణితో బిట్లు బట్టీ పట్టే అభ్యర్థులు ప్రతికూల ఫలితాలను చూశారు. కోచింగ్‌ సెంటర్‌ నోట్సులు, ఏవో పుస్తకాలను పట్టుకుని అవే సర్వస్వమని చదువుకున్న అభ్యర్థులకు తీవ్ర నిరాశ ఎదురయింది. గ్రూప్‌-4 పరీక్ష ఆ స్థాయిలో ఉంటుందని కాదు కానీ, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అనుభవాల నుంచి కింది విషయాలను నేర్చుకోవాలి.


1. బేసిక్స్‌: సబ్జెక్టుల ప్రాథమికాంశాల్లో (బేసిక్స్‌) బలంగా ఉండాలి. వివిధ సబ్జెక్టులకు చెందిన పాఠశాల పరిజ్ఞానమే బేసిక్స్‌ అని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో విఫలమయ్యే అత్యధిక అభ్యర్థుల్లో కనిపించే ప్రధాన లోపం సరైన బేసిక్స్‌ లేకపోవటం. ప్రిలిమ్స్‌ పరీక్షల్లో అడిగిన అనేక ప్రశ్నలకు బేసిక్స్‌ బలంగా ఉన్న అభ్యర్థులు తేలిగ్గా సమాధానం గుర్తించారు. అందువల్ల రాబోయే గ్రూప్‌-2, 3, 4 పరీక్షల్లో నెగ్గాలనుకునేవారు బేసిక్స్‌పై ముందు పట్టు సాధించాలి.


2. సమయ నిర్వహణ: ఇది సరిగా లేని అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో ఎదురీదాల్సి వచ్చింది. గతంలో లేని విధంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఎక్కువ సమయాన్ని కోరే పెద్ద పెద్ద బిట్లు ఇచ్చారు. దానికి తోడు జతపరచమనే ప్రశ్నలు, ఎసర్షన్‌- రీజన్‌ ప్రశ్నలు అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టే పరిస్థితి తీసుకొచ్చాయి. రేపు రాబోయే పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత తగ్గవచ్చు గానీ ప్రశ్నల నమూనాలు అవే కొనసాగవచ్చు. అదే జరిగితే వ్యూహాత్మకంగా అన్ని ప్రశ్నలనూ సాధించే మెలకువలు అనుసరించే అభ్యర్థులనే విజయం వరిస్తుంది. సమయ నిర్వహణ మెరుగుపరుచుకోవాలంటే వీలైనన్ని ప్రాక్టీస్‌ టెస్టులను చేయాలి. అది కూడా నిర్దిష్ట సమయాన్ని పాటిస్తూ చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల కోచింగ్‌ నోట్సు లేదా ఏదైనా పుస్తకం మాత్రమే చదువుతూ కూర్చుంటే ఆశించిన ప్రయోజనం నెరవేరకపోవచ్చు.


3. భావన వికాసం: భావన వికాసంతో కూడిన అభ్యసనం ఉన్న అభ్యర్థులకు ప్రిలిమ్స్‌ మంచి ప్రయోజనాన్ని ఇచ్చింది. అంటే.. ఒక విషయాన్ని దానికి సంబంధించిన ఉదాహరణలు, పోలికలు, తేడాలు, కారణ ఫలిత సంబంధాలు, పరిష్కార మార్గాలు, ఇతర సబ్జెక్టు అంశాలతో ఉన్న అనుబంధాలు అనే వివిధ రూపాల్లో అధ్యయనం చేయటమే. ఇలా చదివినవారు పోటీ పరీక్షలో ఏ విధమైన ప్రశ్నలు వచ్చినప్పటికీ తేలికగా ఆన్సర్‌ చేయగలుగుతారు. అందుకని రాబోయే నోటిఫికేషన్లలో విజయం సాధించాలనుకుంటే ఇప్పటినుంచి భావనాత్మక అభ్యసనానికి అలవాటైతే మంచి ప్రయోజనం సమకూరుతుంది.


4. తెలంగాణకే అధిక ప్రాధాన్యం: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 150కి గాను దాదాపు 40 ప్రశ్నలు తెలంగాణ సంబంధిత విషయాలపైనే అడిగారు. రాబోయే గ్రూప్‌-3, 4 పరీక్షల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రశ్నలు తెలంగాణ నుంచి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ చరిత్ర- సంస్కృతి, కళలు, సాహిత్యం, తెలంగాణ పాలన విధానాలు, పథకాలు, తెలంగాణ జాగ్రఫీ, సొసైటీ, తెలంగాణ ఉద్యమం, ఆర్థిక వ్యవస్థ మొదలైన అంశాలు సిలబస్‌లో ఉన్నందున ఆయా విషయాలపై గట్టి పట్టు సాధించటం ద్వారా అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు పొందవచ్చు. 


- కొడాలి భవానీ శంకర్‌ 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

‣ క్లిష్ట స‌మ‌యాల్లోనూ ఉద్యోగ సాధ‌న ఎలా?

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

 

Posted Date : 28-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌