• facebook
  • whatsapp
  • telegram

ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు ముందు ఏం చేయాలి?

గ్రూప్‌-1 ప్రాథ‌మిక ప‌రీక్ష తుది స‌న్న‌ద్ధ‌త‌కు సూచ‌న‌లు

 

 

మరో ఆరు రోజుల్లో గ్రూప్‌-1 సర్వీసుల్లో నియామకానికి తొలి పరీక్ష అయిన ప్రిలిమినరీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించనుంది. ఇప్పటివరకూ పరీక్ష కోణంలో తయారైన అభ్యర్థులు తమ సన్నద్ధతకు తుది మెరుగులు ఎలా దిద్దుకోవాలో తెలుసుకుందాం! 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగే మొట్టమొదటి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కాబట్టి పరీక్షా కఠినత్వ స్థాయి, పరిధి ఎలా ఉంటుంది అనే ఆందోళన సీరియస్‌గా సిద్ధమైన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూనియర్‌ పంచాయతీ ఆఫీసర్స్‌ గ్రూప్‌-2 మొదలైన పరీక్షల్ని సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించింది. ఈ పరీక్షలన్నీ సగటు కఠినత్వ స్థాయితో ఉన్నాయి. అదేవిధంగా అన్ని సబ్జెక్టులనూ తగిన మోతాదులో ఇచ్చారు. అదే ధోరణి పునరావృతం అవుతుందని భావించవచ్చు. కాబట్టి అనవసరమైన కఠినత్వాన్ని ఊహించుకుని ఆందోళనపడటం అశాస్త్రీయం. ఇలాంటి ఆందోళనకు ఈ కొద్దిరోజుల సమయంలో ఏమాత్రం అవకాశం ఇచ్చినా నష్టపోయే ప్రమాదం ఉంది.

 

ప్రకటించిన పోస్టులు 503 కాబట్టి 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. దాదాపుగా సీరియస్‌ అభ్యర్థులందరూ మెయిన్స్‌కు అర్హులయ్యే అవకాశం ఉంటుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఒత్తిడీ లేకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరైతే సగం విజయం సాధించినట్లే!

 

ఈ ఆరు రోజుల్లో..

కొంతమంది అభ్యర్థులు చివరిరోజు వరకు ‘అది చదవాలి, ఇది చదవాలి’ అని ఆందోళనకు గురవుతూనే ఉంటారు. చివరికి పరీక్ష హాలు దగ్గరా గోడల పక్కన కూర్చుని చదువుతూనే ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో. 

ఆబ్జెక్టివ్‌ పరీక్షలకు హాజరయ్యేటప్పుడు కనీసం వారం రోజులు ముందు నుంచీ తగినంత నిద్ర ద్వారా మెదడుకు ప్రశాంతతను అందించాలి. తద్వారా అభ్యర్థుల పెర్ఫార్మెన్స్‌ పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇదే విషయాన్ని అన్వయించుకుని కనీసం 10 గంటల సమయమైనా మెదడుకు విశ్రాంతినివ్వాలి.

సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారానికి దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా నిద్రపోవాలి.

కొత్త కొత్త విషయాలను చదివే ఆలోచనకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి. చదివిన పుస్తకాల్లో కూడా కొన్ని సబ్జెక్టులను ఇక చదవాల్సిన అవసరం లేదని నిర్ధారించుకుని వాటిని పక్కన పెట్టేసేయాలి.

కరెంట్‌ అఫైర్స్, గణాంకాలు, ఆర్థిక గణాంకాలు మొదలైనవాటి పునశ్చరణ (రివిజన్‌)కు మాత్రమే ఇప్పటి సమయాన్ని కేటాయించాలి.

ఈ సమయంలో ఎటువంటి పరీక్షలనూ ప్రాక్టీస్‌ కోసమైనా సరే.. రాయకపోవటమే మంచిది. ఎందుకంటే 100% హేతుబద్ధత కలిగిన ప్రశ్నపత్రాలు ఎవరూ తయారుచేయలేరు కాబట్టి. పైగా చాలా నమూనా ప్రశ్నపత్రాలు అనవసరమైన కఠినత్వంతో ఉంటాయి. రిమోట్‌ బిట్లు తయారుచేసి అడుగుతూ ఉంటారు. అందువల్ల అభ్యర్థులు ఆయా ప్రశ్నపత్రాలను సాధన చేసిన తరువాత వచ్చిన మార్కుల్ని పరిగణనలోకి తీసుకుని కుంగిపోకూడదు; పొంగిపోకూడదు. వీటిలో ఏది చేసినా అంతిమంగా పరీక్షలు సరిగా ఎదుర్కోలేని మానసిక పరిస్థితి ఏర్పడవచ్చు.

తెలంగాణ విధానాలు, తెలంగాణ భౌగోళిక అంశాలు, తెలంగాణ చారిత్రక సాంస్కృతిక అంశాలు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొదలైన విభాగాలపై గుర్తించదగ్గ సంఖ్యలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీలైతే ఈ కొద్ది రోజుల్లో విహంగ వీక్షణ అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

పరీక్షకు 24 గంటల ముందు ఏదీ చదవకుండా ప్రశాంతంగా ఉండటం మేలు. దీనివల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చు.

 

సంసిద్ధత

ఇతర పట్టణాల్లో మీ పరీక్షా కేంద్రం ఉంటే ముందు రోజే అక్కడకు చేరుకోవడం మంచిది.

పరీక్ష ముందురోజు రాత్రి ప్రశాంతంగా త్వరగా నిద్రపోండి. అలా ఉండే పరిస్థితినే ఎంపిక చేసుకోండి. తర్వాతి రోజు జరగబోయే పరీక్ష గురించి ఆందోళన పడకుండా స్థిర చిత్తంతో ఉంటే మంచి ఫలితాలను రాబట్టవచ్చు.

హాల్‌ టికెట్, పెన్ను లాంటి తప్పనిసరి వస్తువులను ముందస్తుగానే సిద్ధపరచుకోవాలి. హాల్‌ టికెట్‌పై ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి. 

వీలైనంతవరకు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను పరీక్షకు తీసుకువెళ్ళవద్దు. వాటిని పరీక్ష హాల్లోకి అంగీకరించకపోతే వాటిని కాపాడుకోవడం అనే టెన్షన్‌ అనవసరంగా ఏర్పడుతుంది.

పరీక్ష కేంద్రానికి కనీసం ఒక గంట ముందుగానే చేరుకోండి. 

సాత్వికమైన ఆహారం తిని పరీక్షకు వెళ్లటం మేలు. 

అవకాశం ఉంటే ముందు రోజే వెళ్లి పరీక్ష హాలును చూసుకుని నిర్దేశించినది అదేనని నిర్థారించుకోవాలి.

 

పరీక్ష హాలులో 

పరీక్ష పర్యవేక్షణాధికారి ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

ఇతర అభ్యర్థులతో ముచ్చట్లకు దిగకుండా పరీక్షా పత్రం ఇచ్చేంతవరకు ప్రశాంతంగా కూర్చోండి.

అనవసరమైన ఉద్విగ్నతలకు చోటు ఇవ్వకండి

అభ్యర్థులు తమ వివరాలను పర్యవేక్షణాధికారి ఆదేశించిన రీతిలో నమోదు చేసుకోవాలి. హాల్‌ టికెట్‌ నంబర్, పరీక్షా పత్రం కోడ్‌ లాంటివి తప్పులు రాస్తూ చాలా సందర్భాల్లో నష్టపోయిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువే.

సమాధానాలను గుర్తించే సందర్భంలో మొదట తెలిసిన సమాధానాలు అన్ని గుర్తించుకుంటూ వెళ్లి తర్వాతి రౌండ్‌లో నమ్మకం ఉన్న సమాధానాన్ని గుర్తించడం మంచిది.  

మనకు తెలిసిన సబ్జెక్టు ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయి అనే వెతుకులాట వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. వరుస క్రమంలో సమాధానాలు గుర్తించుకుంటూ వెళ్లటమే మంచిది. 

పరీక్ష హాల్లో అనవసరమైన అవాంతరాలు ఏవైనా వచ్చినా వాటిని పట్టించుకోకుండా పరీక్షను సంపూర్ణంగా, ఏకాగ్రతతో రాయాలి.

ఇతర అభ్యర్థులు కాపీకి పాల్పడినా, ఇతర అక్రమ చర్యలు చేస్తున్నా వాటిని నియంత్రించే బాధ్యత పర్యవేక్షణాధికారిదే. మీరు అనవసరమైన ఆందోళనకు గురై రాద్ధాంతానికి దిగితే దానివల్ల నష్టం మీకే.

ప్రతి 10 నిమిషాలకూ, 20 నిమిషాలకు ఒకసారి మొత్తం సమయంలో పూర్తిచేయాల్సిన బిట్ల సంఖ్యను అంచనా వేసుకుని తగినంత వేగంతో పూర్తి చేయటం అవసరం. 

ప్రశ్నపత్రంలో మీకు కఠినంగా ఉన్న ప్రశ్నలు అనేకం ఉన్నప్పటికీ మీకు తెలిసినంతవరకు సమాధానాలు గుర్తించండి. ‘కఠినంగా ఉంది, ఇంక ఈ పరీక్ష పోయినట్లే’ అని మీకు మీరే ధ్రువీకరించుకుని ఉన్న అవకాశాలను జారవిడుచుకోవద్దు. ప్రశ్నపత్రంలో కఠినత్వం ఎక్కువగా ఉంటే అది మీకే కాదు, మిగతావారికీ సమంగా వర్తిస్తుంది. అందువల్ల కటాఫ్‌లు తగ్గుతాయి తప్ప వ్యక్తిగతంగా మీకొచ్చే ప్రమాదమేమీ ఉండదు.

కొంతమంది అభ్యర్థులు కంగారుపడుతూ బిట్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఇచ్చిన సమయాని కంటే చాలా ముందుగానే పూర్తి చేస్తారు. ఇది సరైన విధానం కాదు. ఒకవేళ అలా పూర్తి చేసినట్లయితే మళ్లీ అన్ని ప్రశ్నలనూ, గుర్తించిన సమాధానాలనూ మరొకసారి పరిశీలించుకోవాలి. అనుమానం ఉన్న ప్రశ్నలను అయినా పరిశీలించాలి.

మీ సమాధాన పత్రాలను ఇచ్చే ముందు మరొకసారి మీరు ఇవ్వవలసిన వ్యక్తిగత సమాచారం కచ్చితంగా ఇచ్చారో లేదో నిర్థారించుకోండి.

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు ఎలా చ‌ద‌వాలి?

‣ సృజ‌నాత్మ‌క‌త‌కు స్వాగ‌తం!

‣ సైన్స్‌తో సైకాలజీ.. ఫిజిక్స్‌తో మ్యూజిక్‌!

‣ విదేశీ విద్యకు కొన్ని నైపుణ్యాలు

‣ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,00,000 స్కాలర్‌షిప్‌లు

‣ వేగంగా నేర్చుకోవాలంటే!

Posted Date : 10-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌