• facebook
  • whatsapp
  • telegram

మహిళలకు ప్రత్యేకం.. ఆఫీసర్‌ ఉద్యోగాలు

 టీఎస్‌పీఎస్సీ- 181 ఈవో ఖాళీల భర్తీకి ప్రకటన

 

 

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్‌-1 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లు/ సూపర్‌వైజర్ల ఉద్యోగాలకు ప్రకటన వెలువరించింది. వీటికి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశించిన సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షకు సన్నద్ధమయ్యే మెలకువలు తెలుసుకుందామా?

 

ఈవో పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య 15 నుంచి 20 వేల మధ్య ఉండవచ్చు అనేది ప్రాథమిక అంచనా. అందులోనూ సీరియస్‌గా తీవ్రంగా పోటీ పడగల అభ్యర్థుల సంఖ్య వెయ్యికి తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు జోనల్‌ స్థాయి పోటీ ద్వారా ఎంపిక జరుగుతుంది కాబట్టి కొన్ని జోన్లలో పోటీ తక్కువగా ఉండొచ్చు.

వెనుకబడిన వర్గాలకు చెందిన కొన్ని విభాగాల్లో, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో అభ్యర్థుల సంఖ్య దాదాపు వందల్లోనే ఉంటుందని అంచనా. అంటే పోటీ చాలా తక్కువగా ఉంటుంది.

 

విద్యార్హతలుగా వివిధ రకాలైన డిగ్రీలను నోటిఫికేషన్‌లో ప్రకటించారు. యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలనుంచి 27.8.22 నాటికి పట్టభద్రులైనవారందరూ అర్హులే. ఉత్తీర్ణతకు సంబంధించి క్లాస్‌ నిబంధన గానీ, మార్కుల శాతం నిబంధన గానీ ఏమీ లేదు. అంటే పట్టభద్రులై ఉంటే చాలు. 

  
ఆన్‌లైన్‌ పరీక్షలో ఏముంటాయి? 

ఆబ్జెక్టివ్‌ పరీక్షా విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ (ఆన్‌లైన్‌) పరీక్షను నిర్వహిస్తారు. ఈ పోటీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌; రెండోది సబ్జెక్టు సంబంధిత పరీక్ష. పరీక్షకు ఉద్దేశించిన రెండు పేపర్లలోనూ సరైన ప్రతిభ చూపగలిగినవారు తప్పక ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.

సబ్జెక్టు సంబంధిత పరీక్షలో ఉమ్మడి సిలబస్‌ను ఇచ్చారు. 11 రకాల డిగ్రీలు అర్హతకు ప్రాతిపదిక కాబట్టి అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే ఉద్దేశంతో సబ్జెక్టు సంబంధిత పేపర్‌ సిలబస్‌ను తయారుచేశారు. అందువల్ల అందరికీ ఎంపికయ్యేందుకు సమాన అవకాశాలు ఉంటాయి.

 అయితే తెలివైన అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్‌ అంశాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా మిగతా విభాగాలకు చెందిన సిలబస్‌ అంశాలనూ చదువుతారు. వాటిలో ఏవి సులభంగా ఉన్నాయో పరిశీలించుకుని ముందుగా వాటిపై పట్టు సాధిస్తూ క్రమక్రమంగా సిలబస్‌ మొత్తాన్ని అధ్యయనం చేసే ప్రణాళికను తయారు చేసుకుని పాటించటం ఉత్తమం. 

 ఉదాహరణకు సోషియాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థికి మానవ ప్రత్యుత్పత్తి విధానం, పౌష్టికాంశాలు, శిశు మనోవికాసాలు మొదలైనవాటిపై పట్టు ఉండదు. అయినా సరే.. ముందుగా సోషియాలజీ విషయాలపై పట్టు సాధించి తరువాత తప్పనిసరిగా మిగతా విషయాలపై స్థూల అవగాహనైనా పెంచుకోవాలి.

 మరొక ఉదాహరణ-  ఆహార శాస్త్రం, పౌష్టికతపై గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థికి సామాజిక అంశాలపై అవగాహన ఉండదు. అదేవిధంగా శిశు మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలపైనా అవగాహన తక్కువే. ఇలాంటివారు మొత్తం సిలబస్‌లో తమ గ్రాడ్యుయేషన్‌ సంబంధిత అంశాలపై ముందు పట్టు బిగించి, ఆపై తమకు అవగాహన ఉన్న విషయాలపై దృష్టి సారించుకోవాలి. ఇలా మొత్తం సిలబస్‌ కవర్‌ చేసే ప్రణాళికను తప్పనిసరిగా అనుసరించాలి.

 తమ గ్రాడ్యుయేషన్‌ సిలబస్‌ తక్కువగా ఉందని పోటీ నుంచి విరమించుకోవాల్సిన అవసరం లేదు. దాదాపుగా పోటీపడే అభ్యర్థుల అందరి పరిస్థితీ ఒక్కటే. ఈ సత్యాన్ని గుర్తించి ముందుకెళ్లే అభ్యర్థులే ఈ పరీక్షలో ఎంపికయ్యే అవకాశం ఉంది.

 

జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌

పరీక్ష డిసెంబర్‌లో అని సూచించారు కాబట్టి ఒకరకంగా ఈ పేపర్‌పై కొత్త అభ్యర్థులు పట్టు సాధించటం క్లిష్టతతో కూడిన పని. ఈ పేపర్లో 13 అంశాలను సిలబస్‌గా పేర్కొన్నారు. 

 అన్ని అంశాలనూ ఒకేసారి అధ్యయనం చేసే బదులుగా ఇంక్రిమెంటల్‌ పద్ధతిలో మొదట ముఖ్యమైన కొన్ని విభాగాల్ని పట్టు సాధించి, తర్వాత మిగతా విభాగాలకు విస్తరించుకుంటూ వెళ్లటం సరైన నిర్ణయం అవుతుంది.

 సాధారణంగా ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం, పాలిటీ, భారత భౌగోళిక అంశాలు, వర్తమాన అంశాలు, జనరల్‌ సైన్స్‌... మిగతా అంశాల కంటే ఎక్కువ ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. అందుకని ముందస్తుగా వాటిపై దృష్టి నిలపటం మంచిది.

 తెలంగాణ భౌగోళిక, ఆర్థిక, సామాజిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలు, తెలంగాణ ఉద్యమం, ప్రాంతీయ అంశాలపై దృష్టి సారించడం వల్ల 30 నుంచి 40 ప్రశ్నలు ఆశించవచ్చు.

 గతంలో లేని మాదిరిగా జనరల్‌ స్టడీస్‌లో ఈ పరీక్షలో జనరల్‌ ఇంగ్లిష్‌ కూడా ఇచ్చారు. కొద్దిపాటి ప్రయత్నంతో ఒక ఐదు ప్రశ్నలవరకూ సమాధానమిచ్చే పరిస్థితిని కల్పించుకోవచ్చు.

 గ్రూప్‌-1, 2 లాంటి పోటీ పరీక్షలకు తయారైన అభ్యర్థులకు ఈ పేపర్లో తక్కువ సమయంలో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. 

 ప్రకటనలో నిర్దేశించిన డిగ్రీల్లో ఏదో ఒకదానిలో గ్రాడ్యుయేషన్‌ చేసి ఉండి, గ్రూప్‌-1, 2 లక్ష్యంగా చదువుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని జీవితంలో స్థిరపడవచ్చు. ఇప్పటికే జనరల్‌ స్టడీస్‌లో స్థిరంగా కొంత సౌలభ్యతను పొంది ఉంటారు కాబట్టి ఈ పరిస్థితి వీరికి మంచి అవకాశమని గుర్తించాలి. 

 

ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (సూపర్‌వైజర్‌) గ్రేడ్‌-1: 181 పోస్టులు

జోన్ల వారీగా ఖాళీలు: * కాళేశ్వరం- 26, * బాసర- 27, * రాజన్న- 29, * భద్రాద్రి- 26, * యాదాద్రి- 21, * చార్మినార్‌- 21, * జోగులాంబ- 31

అర్హతలు: బ్యాచిలర్స్‌ డిగ్రీ (హోమ్‌ సైన్స్‌/ సోషల్‌ వర్క్‌/ సోషియాలజీ). లేదా బీఎస్సీ (ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌), బీఎస్సీ (ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ అండ్‌ కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ  (అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్, బోటనీ/ జువాలజీ అండ్‌ కెమిస్ట్రీ). లేదా బీఎస్సీ(క్లినికల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్, బోటనీ/ జువాలజీ అండ్‌ కెమిస్ట్రీ). లేదా బీఎస్సీ (అప్లైడ్‌ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ అండ్‌ కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ). లేదా బీఎస్సీ (ఫుడ్‌ సైన్సెస్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్, జువాలజీ/ బోటనీ అండ్‌ కెమిస్ట్రీ/ బయోలాజికల్‌ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.

వయసు: 01/07/2022 నాటికి 18 - 44 సంవత్సరాలు.

దరఖాస్తు రుసుము: రూ.200.

ఎంపిక: రాత పరీక్షలో రెండు పేపర్లు. పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌), పేపర్‌-2 సంబంధిత సబ్జెక్టు (డిగ్రీ స్థాయి)లో ప్రశ్నలుంటాయి. పేపర్‌-1లో 150 ప్రశ్నలు, పేపర్‌-2లో 150 ప్రశ్నలు.. మొత్తం 300 ప్రశ్నలు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 08.09.2022.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 29.09.2022.

పరీక్ష తేదీ(ఆబ్జెక్టివ్‌ టైప్‌): డిసెంబర్, 2022.

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/

- కొడాలి భవానీ శంకర్‌ 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!

‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?

‣ పీజీలో ప్రవేశాలకు సీపీగెట్‌-2022

‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ దివ్యమైన కోర్సులు

 

Posted Date : 29-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌