• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పీజీలో ప్రవేశాలకు సీపీగెట్‌-2022

8 విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లకు ప్రకటన

తెలంగాణలోని ఎనిమిది విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ (కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) - 2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. దీని ద్వారా ఎంచుకున్న యూనివర్శిటీ, అనుబంధ కళాశాలల్లో నచ్చిన కోర్సు చదవొచ్చు. పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో (సీబీటీ) జరుగుతుంది.

ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీలు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇందులో పాల్గొంటున్నాయి. దీని ద్వారా వీటిలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ, ఇంటిగ్రేటెడ్‌తో కలిపి దాదాపు 50 కోర్సుల్లో చేరొచ్చు. 

అర్హత: ఏదైనా డిగ్రీ. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారూ అర్హులే. 

దరఖాస్తులకు చివరితేది: జులై 4 

పరీక్ష ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు ఒక సబ్జెక్టుకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.600. అదనపు సబ్జెక్టుకు రూ.450 కట్టాలి. 

రూ.500 ఆలస్య రుసుముతో: జులై 11

రూ.2000 ఆలస్య రుసుముతో: జులై 15 

ప్రవేశ పరీక్ష తేది: జులై 20

వెబ్‌సైట్‌: https://cpget.tsche.ac.in/CPGET/CPGET_HomePage.aspx

పరీక్ష విధానం: ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు రాయాలి. ప్రతి సబ్జెక్టుకూ సిలబస్‌ను నిర్దేశించారు. అందులోనుంచే ప్రశ్నలు వస్తాయి. కోర్సుప్రకారం ప్రశ్నపత్రం మారుతుంది.

సీట్ల కేటాయింపు ఇలా...

సాధారణంగా విద్యార్థులంతా యూనివర్శిటీ క్యాంపస్‌ల్లో చదవాలి అనుకుంటారు. అయితే విద్యార్థికి సీటు కేటాయింపు అనేది తను ఎంచుకున్న సబ్జెక్టు, ఆ సబ్జెక్టులో పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య, తన ర్యాంకు, క్యాటగిరీ, ఉన్న సీట్ల సంఖ్య.. తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది దాదాపు 68వేల మంది రాస్తే 63వేల మంది పాసయ్యారు. 80శాతం మార్కులు సాధిస్తేనే యూనివర్శిటీ క్యాంపస్‌లో సీటు ఆశించవచ్చు. దీన్నిబట్టి విద్యార్థి అంచనా వేసుకుని చదువుకోవాలి. 

సన్నద్ధత ఎలా?

అధికారిక వెబ్‌సైట్‌లో రెండు మాక్‌ టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని రాస్తే పేపర్‌ సరళి ఎలా ఉంటుందనే విషయంపై అవగాహన పెరుగుతుంది. 

అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టును బట్టి ప్రశ్నపత్రం మారుతుంది. ఏ కోర్సుకు ఏ సిలబస్‌ చదవాలి, కోర్సునుబట్టి ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయనే పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు. 

ప్రశ్నపత్రం మొత్తం సిలబస్‌ నుంచే వస్తుంది. అందులో ఉన్న టాపిక్స్‌ బాగా చదువుకుంటే సరిపోతుంది. 

మంచి ర్యాంకు రావాలంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. 

డిగ్రీలో చదివిన సబ్జెక్టు కాకుండా వేరే సబ్జెక్టులో పీజీ సీటు కావాలి అనుకుంటే సన్నద్ధతకు కొంచెం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. డిగ్రీలో చదివిన అంశాలే అయితే పాతనోట్సును మళ్లీ చదవడం ఉపకరిస్తుంది. 

సిలబస్‌ను పూర్తిగా చదివాక... పరీక్షలో ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉందో తెలుసుకోవాలి అంటే గత సంవత్సరాల ప్రశ్నపత్రాలకు ఒకసారి జవాబులు రాయాలి. దాన్నిబట్టి ఏది ఎంతవరకూ చదవాలో అవగాహన పెరుగుతుంది. 

ప్రాథమిక అంశాలను నేర్చుకోవడానికి అకాడమీ పుస్తకాలు మాత్రమే చదవాలి. మాదిరి ప్రశ్నలు సాధన చేయడానికి నచ్చిన పబ్లికేషన్‌ పుస్తకాలు ఎంచుకోవచ్చు.

రాష్ట్ర అవతరణ అనంతరం తొలిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఈ ఏడాది సీపీగెట్‌ ద్వారా ఇందులో ప్రస్తుతానికి 18 కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కోఠి విమెన్స్‌ కాలేజ్‌గా చరిత్ర కలిగిన కళాశాల ఇప్పుడు యూనివర్శిటీగా రూపాంతరం చెందనుంది.

ఇంటర్‌ తర్వాత కూడా...

ఇంటర్‌ అర్హతతో బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఎకనమిక్స్, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. ఇది విద్యార్థులకు చక్కని అవకాశం. తొలిసారిగా ముందే పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించాం. దాన్ని చూసి అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు ఒకేరోజు పరీక్ష ఉన్న రెండు సబ్జెక్టులను ఎంపిక చేసుకోకుండా జాగ్రత్త పడాలి. సాధారణంగా అలా ఉండవు, అయినా ఒకసారి సరిచూసుకుంటే మంచిది. తాజాగా తీసుకున్న ఆదాయ, కుల ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలి. దరఖాస్తుల్లో ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. ఉమ్మడి 10 జిల్లాల్లో గత ఏడాది మాదిరిగానే పరీక్షాకేంద్రాలు ఉంటాయి. పరీక్షా విధానంలో కూడా ఎటువంటి మార్పూ లేదు. ముందుగా దరఖాస్తు చేసుకున్నవారు కోరిన కేంద్రంలో పరీక్ష రాసుకోవచ్చు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ దివ్యమైన కోర్సులు

‣ ఇంటర్‌తో హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం

‣ ఆయుధ సంపత్తికి సమరం సెగ

‣ ధరల దరువు... ఆదాయాలు కరవు

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

Posted Date : 14-06-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌