• facebook
  • whatsapp
  • telegram

ధరల దరువు... ఆదాయాలు కరవు

‘నరేగా’ పనులకు పెరిగిన గిరాకీ

రబీ పంట కోతలయ్యాక, నైరుతి రుతుపవనాల రాకకు ముందు మే నెలలో దేశంలో ఎక్కువశాతం పంటపొలాలు ఖాళీగా ఉంటాయి. ఆ సమయంలో సహజంగానే గ్రామాల్లో వ్యవసాయ పనులు, ఇతరత్రా ఉపాధి అవకాశాలు తగ్గి ఉపాధిహామీ పనులకు గిరాకీ పెరుగుతుంది. ఈ ఏడాది మే నెలలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (నరేగా) పని కోరిన కుటుంబాల సంఖ్య గతేడాదితో పోలిస్తే అనూహ్యంగా పెరిగింది. 2021మేలో 2.66 కోట్ల కుటుంబాలు ఉపాధి పనులు కోరితే, ఈ ఏడాది మేలో 3.08 కోట్ల కుటుంబాలు పని కావాలని అడిగాయి. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 2.32 కోట్లు మాత్రమే. అంటే నెల వ్యవధిలోనే 30శాతానికి పైగా డిమాండు అధికమైంది. వారిలో కేవలం 60శాతానికే అధికారులు పని కల్పించగలిగారు. సంపాదనకు ఇతరత్రా అవకాశాలేమీ లేని సందర్భంలోనే ఉపాధిహామీ పనులకు ఈ స్థాయిలో గిరాకీ ఉంటుంది.

తగ్గిన వినియోగం

గ్రామాల్లో నిరుద్యోగ స్థాయిని అంచనా వేసేందుకు నరేగా లెక్కలు ఓ ప్రామాణిక సూచీ. దేశంలో కరోనా వ్యాపించి, లాక్‌డౌన్‌లు విస్తృతంగా అమలైన 2020లో ఉపాధి పనులకు గిరాకీ విపరీతంగా పెరిగింది. మరుసటి ఏడాది తగ్గినా, మళ్ళీ ఈ సంవత్సరం అధికమవడం గ్రామీణంలో నిరుద్యోగం, ఆర్థిక కష్టాలు తీవ్రమవుతున్నాయనేందుకు సూచికలని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన తీవ్రస్థాయిలో ఉండగా, కొత్తగా గ్రామీణ వినియోగ వ్యయం దిగజారితే అది ఆర్థికవ్యవస్థకు మరింత నష్టదాయకం కావచ్చు.

గ్రామాల్లో వస్తు వినియోగ గిరాకీ మందగించిందని ఇటీవల పలు కంపెనీలు తమ త్రైమాసిక వార్షిక ఫలితాల్లో వెల్లడించాయి. నిత్యావసర సరకులు, వాహనాలు, గృహోపయోగ ఎలెక్ట్రానిక్‌ వస్తువుల విక్రయాలు గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిపోయినట్లు కంపెనీల అమ్మకాల సమాచారం స్పష్టం చేస్తోంది. అదీకాక ద్రవ్యోల్బణ ప్రభావంతో పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఆహార ఉత్పత్తుల ధరలు అధికమయ్యాయి. పట్టణాల్లో 8.8శాతం, గ్రామాల్లో 11.9శాతం చొప్పున పెరిగాయి. పైగా తక్కువ ధరకు దొరుకుతూ వేగంగా అమ్ముడయ్యే వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలన్నీ ఇటీవలి కాలంలో చిన్న ప్యాకెట్ల ధరలను పెంచేశాయి. వాటి వినియోగం గణనీయంగా ఉన్న గ్రామీణ భారతంపైనే ఆ ధరల భారం పడింది. ఫలితంగా పట్టణ మార్కెట్లలో ఎఫ్‌ఎంసీజీ వస్తువుల విక్రయాలు 3.2శాతం క్షీణించగా, గ్రామీణ మార్కెట్లలో 5.3శాతం మేర అమ్మకాలు పడిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండు ఎక్కువగా ఉండే ద్విచక్రవాహనాలు, బేసిక్‌ మోడళ్ల కార్ల విక్రయాలు సైతం గణనీయంగా తగ్గాయి. పెట్రో ధరల భారంతో గ్రామీణ ప్రాంతాలకు తిరిగే బస్సు, ఆటోల ఛార్జీలు 20శాతం మేర పెరిగాయి. పెట్రో, రవాణా ధరలకు అనుగుణంగా సాగు వ్యయం అధికమైంది. పొటాష్‌ వంటి ఎరువుల ధరలు ఏడాదిలో 100శాతానికి పైగా ఎగబాకడంతో ఉద్యానవన పంటల రైతుల్లోనూ ఆనందం లేకుండా పోయింది. పంట ఉత్పత్తుల ధరల్లో మాత్రం పెరుగుదల లేదు. వంటగ్యాస్‌ ధర వెయ్యి రూపాయలు దాటిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ల వినియోగం తగ్గుతోంది. తాజాగా వెలువడిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లెక్కలు సైతం గ్రామీణ వినియోగం, ప్రైవేటు వినియోగ వ్యయంలో మందగమనాన్ని స్పష్టం చేశాయి. ద్రవ్యోల్బణం తీవ్రత కొనసాగినంత కాలం పరిస్థితులు ఇలాగే ఉండవచ్చు.

పంట విక్రయాలకు ప్రయాస

గోధుమలకు మద్దతు ధర ఉన్నా, పలు ఉత్తరాది రాష్ట్రాల్లో దళారులు రూ.1600కు మించి కొనడంలేదు. దానిపై ప్రశ్నిస్తే గోధుమ ఎగుమతులపై నిషేధం ఉందని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో గోధుమ దిగుబడి సైతం ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. ఎగుమతులపై నిషేధం లేని వరి పంట పరిస్థితీ భిన్నంగా ఏమీ లేదు. పండించిన వడ్లు అమ్ముకోవడం తెలుగు రాష్ట్రాల్లో ఏటికేడాది ప్రయాసగా మారుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విధించే సవాలక్ష షరతులు భరించలేక ప్రైవేటుగా అమ్ముకొనే రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా జిల్లాల్లో వడ్లను విక్రయించిన పైకం రైతుల చేతికి అందడానికి నెలల సమయం పడుతోంది. మద్దతు ధర కష్టాలు వరితో పోలిస్తే గోధుమకు, దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదికి ఈ ఏడాది ఎక్కువగా ఉన్నాయి. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో రైతు ఆత్మహత్మలు, ఆకలిచావులు పెరగడం ఇటీవలి ఆందోళనకర పరిణామం. కరోనా ప్రభావం పట్టణాలతో పోలిస్తే గ్రామాలపై నిదానంగా పడింది. మహమ్మారి రెండోదశ ఉద్ధృతిలో తలెత్తిన సరఫరా గొలుసుల అంతరాయాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నేటికీ కోలుకోనీయడం లేదు. ద్రవ్యోల్బణం సెగలు కక్కుతున్నప్పటికీ ఉపాధిహామీ రోజువారీ వేతనాన్ని కనీసం పది శాతమైనా పెంచకపోవడంపై కూలీల్లో అసంతృప్తి నెలకొంది. వేతనాల్లో రాష్ట్రాల మధ్య ఏకరూపత లేకపోవడమూ గమనార్హం. సకాలంలో చెల్లింపులు, పనుల కల్పనలో ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది.

ప్రభుత్వ వ్యయంపై ఆశలు

ఈ ఏడాది ‘లా నినా’ ప్రభావంతో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ అంచనాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిస్తున్నాయి. ట్రాక్టర్ల అమ్మకాల్లో కనిపిస్తున్న వృద్ధీ సానుకూల పరిణామమే. పట్టణాల్లో నిర్మాణ రంగం వృద్ధి రేటు మెరుగ్గా ఉంది. ఫలితంగా రానున్న నెలల్లో గ్రామాల నుంచి కూలీల వలసలు పెరిగి ప్రస్తుత పరిస్థితి క్రమంగా మెరుగు పడుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇటీవల కేంద్రం ఇంధనాలపై సుంకాలు తగ్గించడంతో నిత్యావసర ధరలు క్రమంగా తగ్గుతాయన్న సూచనలున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లలోపే గడువు ఉండటంతో గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రభుత్వాల ఖర్చు పెరుగుతుందన్న విశ్లేషణలు ఒకింత ఆశలు రేపుతున్నాయి. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానిస్తే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రైతు సంఘాలు చాలా కాలం నుంచి చెబుతున్నాయి. దానివల్ల విత్తనాలు నాటడం, కలుపు తీయడం, పంటకోతలు వంటి పనులు కూలీలకు లభిస్తాయి. రైతుల అవసరాలూ తీరతాయి. సాగు వ్యయం సైతం గణనీయంగా తగ్గుతుంది.

- మదన్‌ మోహన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

‣ డీజే కావాలని అనుకుంటున్నారా?

‣ మీరెంత ధీమాగా ఉన్నారు?

‣ పిలుస్తోంది పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు!

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

Posted Date: 11-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం