• facebook
  • whatsapp
  • telegram

ఆయుధ సంపత్తికి సమరం సెగ

రక్షణ స్వావలంబనకు భారత్‌ కసరత్తు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం రక్షణ రంగంలో ఇండియాను ఆత్మనిర్భరత వైపు నడిపిస్తోంది. మన దళాల దగ్గర ఉన్న ఆయుధాల్లో సగానికి పైగా రష్యా నుంచి వచ్చినవే. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ట్యాంకులు, తుపాకులు, హెలికాప్టర్లు, రాడార్లు... ఇలా దాదాపు ప్రతి విభాగంలో ఆ దిగుమతులు కనిపిస్తాయి. పోరు మూలంగా మన ఆయుధాల కోసం అవసరమైన విడిభాగాలకు ప్రస్తుతం కొరత ఏర్పడుతోంది. ఉక్రెయిన్‌లోని ఆంటనోవ్‌ కర్మాగారం యుద్ధంలో తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా భారత సైనిక రవాణా విమానమైన ఏఎన్‌-32 ఆధునికీకరణలో జాప్యం చోటుచేసుకోనుంది. ఉక్రెయిన్‌కు నాటో దేశాల నుంచి ఆయుధ ప్రవాహం కొనసాగుతుండటంతో... రష్యా సైతం స్థానికంగా తయారైన ఆయుధాలను యుద్ధం వైపు మళ్ళిస్తోంది. ఫలితంగా ఇండియాకు విడిభాగాలు, ఆయుధాల సరఫరాల్లో జాప్యం తప్పడంలేదు. మరోవైపు, భద్రతావసరాలకు రష్యాపై ఆధారపడటంతో యుద్ధంపై తటస్థ వైఖరిని అనుసరించాల్సి వస్తోంది. పశ్చిమ దేశాలతో భారతదేశ సంబంధాలపై అది ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మలచుకున్నప్పుడే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఆలోచనతో భారత నాయకత్వం వ్యవహరిస్తోంది. దేశీయ తయారీ రంగాన్ని సమధికంగా ప్రోత్సహిస్తోంది.

నౌకాదళానికి ప్రాధాన్యం

దేశీయ పరిశ్రమల నుంచి భారీగా కొనుగోళ్లను చేపట్టేలా మూడో ‘సానుకూల జాబితా’ను ఏప్రిల్‌లో భారత్‌ విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి 2027 చివరిలోపు స్థానికంగా అభివృద్ధి చేసిన 101 ఉపకరణాలను కొనుగోలు చేయాలని నిర్దేశించింది. అత్యంత సంక్లిష్టమైన రక్షణ వ్యవస్థలు, సబ్‌మెరైన్ల నుంచి ప్రయోగించే క్రూజ్‌ క్షిపణులు, సెన్సర్లు, బాంబులు వంటివి వాటిలో ఉన్నాయి. 2020, 21ల్లోనూ ఇలాంటి జాబితాలను ఇండియా విడుదల చేసింది. తాజా జాబితాతో కలిపి మొత్తం 310 పరికరాలను భవిష్యత్తులో పూర్తిగా భారతీయ సంస్థల నుంచే కొనుగోలు చేయనున్నారు. ఆయుధ కొనుగోళ్లకు కేటాయించిన నిధుల్లో 68శాతాన్ని దేశీయంగానే వెచ్చించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఆ జాబితా సిద్ధమైంది. రూ.76,390 కోట్ల విలువైన సాయుధ సంపత్తిని పూర్తిగా దేశీయ సంస్థల నుంచి సమకూర్చుకోవడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని ఆయుధ కొనుగోళ్ల మండలి తాజాగా పచ్చజెండా ఊపింది. ఇండో-పసిఫిక్‌ వ్యూహం ఊపందుకున్న దృష్ట్యా ఆ మొత్తంలో అధికంగా రూ.36వేల కోట్లను నౌకాదళానికి కేటాయించారు. ఆ నిధులతో ఎనిమిది అత్యాధునిక కవెట్‌లను(ఎన్‌జీసీ) కొనుగోలు చేస్తారు. మిగిలిన సొమ్ముతో దేశీయంగా తయారు చేసిన యాంటీ ట్యాంక్‌ క్షిపణులు, రాడార్లు, సాయుధ వాహనాల కొనుగోళ్లు జరగనున్నాయి. వాటితో పాటు డోర్నియర్‌, సుఖోయ్‌ ఎంకేఐ విమానాల ఇంజిన్లను హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో తయారు చేయనున్నారు. ఇప్పటికే యుద్ధ నౌకల్లో 90శాతం, ప్రొపల్షన్‌ విభాగంలో 60శాతం, పోరాటానికి వినియోగించే ఆయుధాల్లో 50శాతం దేశీయంగా తయారు చేయగలుగుతున్నాం. యుద్ధ విమాన ఇంజిన్‌ అభివృద్ధి మాత్రం కొరకరాని కొయ్యగా మారింది. 120 కిలో న్యూటన్‌ ఇంజిన్‌ తయారీలో ఇండియా పలుమార్లు విఫలమైంది. వేల విడిభాగాలతో వందల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను తట్టుకోగలిగేలా ఇంజిన్‌ అభివృద్ధి చేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. అత్యాధునిక ఫైటర్‌ జెట్‌ ‘ఆమ్కా’(అడ్వాన్డ్స్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) ప్రాజెక్టుకు అది ఎంతో కీలకం. భారత్‌తో కలిసి సంయుక్తంగా విమాన ఇంజిన్‌ అభివృద్ధి చేసేందుకు శాఫ్రన్‌(ఫ్రాన్స్‌), రోల్స్‌రాయిస్‌(బ్రిటన్‌) వంటి కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ భాగస్వామ్య ప్రతిపాదనలను వీలైనంత తొందరగా ఓ కొలిక్కి తెచ్చి ప్రాజెక్టును పట్టాలెక్కించాలి.

మన్నికగా... చౌకగా...

రక్షణ రంగ పరిశోధనలపై భారత్‌ మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా బడ్జెట్‌లో డీఆర్‌డీఓకు కేటాయించిన నిధుల్లో 25శాతం ప్రైవేటు రంగం, అంకుర, విద్యాసంస్థలకు అందేలా నిర్దేశించారు. పరిశోధనలను మరింత బలోపేతం చేసేలా డీఆర్‌డీఓ సాంకేతికత అభివృద్ధి నిధి(టీడీఎఫ్‌)ని తాజాగా రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచడం సానుకూల పరిణామం. దానివల్ల డీఆర్‌డీఓ ప్రాయోజిత దేశీయ పరిశ్రమలు మరింత ఉన్నతస్థాయి పరిశోధనలు నిర్వహించేందుకు ఆస్కారం లభిస్తుంది. గతంలో టీడీఎఫ్‌ మార్గంలోనే వైమానిక దళానికి అవసరమైన పలు వ్యవస్థలను భారత్‌ అభివృద్ధి చేసింది. కొన్నేళ్ల పరిశోధనల తరవాత చేతికి అందివచ్చే ఆయుధాలు ప్రపంచ విపణితో పోలిస్తే చౌకగా ఉండేలా చూసుకోవడమూ అత్యావశ్యకం. అప్పుడే ఎగుమతులు సాధ్యమై, వాటిపై వెచ్చించిన పెట్టుబడులు తిరిగి వస్తాయి. ఇజ్రాయెల్‌ ఇటీవల అభివృద్ధి చేసిన లేజర్‌ ఆధారిత గగనతల రక్షణ వ్యవస్థ అందుకు సరైన ఉదాహరణ. ప్రత్యర్థులు ప్రయోగించే ఒక రాకెట్‌ను కూల్చేందుకు ఆ వ్యవస్థకు అయ్యే ఖర్చు కేవలం రెండు డాలర్లు (రూ.160లోపే). అలాంటి వాటి నుంచి స్ఫూర్తి పొందుతూ మన్నికైన, చౌకైన ఆయుధాలను స్థానికంగా వేగంగా సమకూర్చుకోవడం జాతి భద్రతకు కీలకం. 

- పెద్దింటి ఫణికిరణ్‌ 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ధరల దరువు... ఆదాయాలు కరవు

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

‣ డీజే కావాలని అనుకుంటున్నారా?

‣ మీరెంత ధీమాగా ఉన్నారు?

‣ పిలుస్తోంది పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు!

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

Posted Date: 11-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం