• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం

టెక్‌బీ ఎర్లీ కెరియర్‌ ప్రోగ్రాం ప్రకటన విడుదల

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో సేవలందించే అవకాశం వచ్చింది. శిక్షణలో భాగంగా ప్రతి నెలా స్టైపెండ్‌ అందుకోవచ్చు. అనంతరం ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యనూ అభ్యసించవచ్చు. అందువల్ల ఆసక్తి, అర్హతలు ఉన్నవారు హెచ్‌సీఎల్‌ టెక్‌బీ ఎర్లీ కెరియర్‌ ప్రోగ్రాం దిశగా అడుగులేయవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు. తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం...

యువతరంలో ఎక్కువమంది లక్ష్యం.. పేరున్న ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం! ఇందుకోసం డిగ్రీ (బీఎస్సీ, బీసీఏ, బీటెక్‌) పూర్తయినంత వరకు ఆగాల్సిన పనిలేదు. ఇంటర్మీడియట్‌ అర్హతతోనే హెచ్‌సీఎల్‌ టెక్‌బీతో ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చు. పూర్తి స్థాయిలో శిక్షణ పొంది, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా సేవలు అందించవచ్చు. పనిచేసుకుంటూనే, మెచ్చిన కోర్సులు పూర్తిచేసుకునే అవకాశం ఉండటం ఈ ప్రోగ్రాం ప్రత్యేకత. ఈ విధానంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ముందుగా హెచ్‌సీఎల్‌ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకోసం ఫీజు చెల్లించనవసరం లేదు. 

ఎంపిక, శిక్షణ..

దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఆన్‌లైన్‌లో హెచ్‌సీఎల్‌ కెరియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (క్యాట్‌) నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్, లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ ఎబిలిటీస్‌ విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. నిర్దేశిత స్కోర్‌ సాధించినవారికి ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందులోనూ మెరిస్తే ఏడాది శిక్షణ నిమిత్తం ఐటీ సర్వీసెస్‌ లేదా అసోసియేట్‌ విభాగాల్లోకి తీసుకుంటారు. ఈ శిక్షణ హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, మధురై, నాగ్‌పూర్, నోయిడా, లఖ్‌నవూల్లో అందిస్తున్నారు. ఇందులో ఫౌండేషన్‌లో భాగంగా ఐటీకి సంబంధించిన ప్రాథమికాంశాల్లో శిక్షణ ఉంటుంది. అనంతరం సాంకేతికాంశాల్లో తర్ఫీదునిస్తారు. దీని తర్వాత వృత్తి పరమైన శిక్షణ (ఆన్‌జాబ్‌ ట్రైనింగ్‌)ను హెచ్‌సీఎల్‌ సంస్థల్లో అందిస్తారు. శిక్షణలో ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్లు, అసైన్‌మెంట్లు, కేస్‌ బేస్డ్‌ సబ్మిషన్లు ఉంటాయి. సుమారు 6 నుంచి 9 నెలలు తరగతి గది శిక్షణ, 3 నుంచి 6 నెలలు ఆన్‌జాబ్‌ ట్రైనింగ్‌ నిర్వహిస్తారు. శిక్షణ సమయంలో అంటే ఏడాది మొత్తం ప్రతి నెలా రూ.10 వేలు స్టైపెండ్‌ చెల్లిస్తారు. అయితే శిక్షణ నిమిత్తం అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ సర్వీసెస్‌/ అసోసియేట్‌కు ఎంపికైనవారు రూ.లక్ష+ పన్నులు చెల్లించాలి. బ్యాంకు నుంచి రుణ సౌకర్యం పొందవచ్చు. శిక్షణ అనంతరం సులభవాయిదాల్లో దీన్ని చెల్లించుకోవచ్చు.

హెచ్‌సీఎల్‌ అందించే టెక్‌బీ ప్రొగ్రాం 2017లో మొదలైంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 5000 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. 

ఈ సంస్థ 52 దేశాల్లో సేవలు అందిస్తోంది. హెచ్‌సీఎల్‌ రెవెన్యూ విలువ సుమారు రూ.90వేల కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఇందులో 2.08 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

విధులు, ఉన్నత విద్య 

శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని హెచ్‌సీఎల్‌లో ఫుట్‌ టైమ్‌ ఉద్యోగిగా విధుల్లోకి తీసుకుంటారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, టెస్టింగ్‌/ డిజైన్‌ ఇంజినీర్‌/ డిజిటల్‌ ప్రాసెస్‌ ఆపరేషన్స్‌.. తదితర సేవలను వీరు ప్రాథమిక స్థాయి (ఎంట్రీ లెవెల్‌)లో దేశంలో ఏదైనా హెచ్‌సీఎల్‌ కేంద్రంలో అందిస్తారు. ఐటీ సర్వీస్‌ ఉద్యోగాలకు రూ.2.2 లక్షల వార్షిక వేతనం అందుతుంది. అసోసియేట్లకు రూ.1.7 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తారు. మెడికల్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్‌..మొదలైన సౌకర్యాలు కల్పిస్తారు. శిక్షణలో చేరిన విద్యార్థులు ఎలాంటి ఆటంకమూ లేకుండా యూజీ విద్య కొనసాగించుకోవచ్చు. 

శస్త్ర డీమ్డ్‌ యూనివర్సిటీ తంజావూరు అందించే బీసీఏ కోర్సులో చేరవచ్చు. అనంతరం వీరు అదే సంస్థ నుంచి ఎంసీఏ పూర్తి చేసుకోవచ్చు లేదా బీసీఏ తర్వాత బిట్స్‌ పిలానీ నుంచి నాలుగేళ్ల వ్యవధితో ఎంటెక్‌ చదువుకోవచ్చు.

శిక్షణ అనంతరం బిట్స్‌ పిలానీ నుంచి బీఎస్సీ (డిజైన్‌ అండ్‌ కంప్యూటింగ్‌) పూర్తి చేసుకుని, అదే సంస్థలో రెండున్నరేళ్ల ఎమ్మెస్సీ లేదా నాలుగేళ్ల ఎంటెక్‌ కోర్సులో చేరవచ్చు.

అమిటీ విశ్వవిద్యాలయం నుంచి బీబీఏ, బీసీఏ, బీకాం కోర్సుల్లో నచ్చినవాటిని ఎంచుకోవచ్చు. 

ఈ మూడు సంస్థల్లో ఎందులో చేరినప్పటికీ సెమిస్టర్లవారీ ఉద్యోగులు ఫీజు చెల్లించాలి. ఆ సెమిస్టర్‌లో నిర్దేశిత మార్కులు పొందితే చెల్లించిన ఫీజును హెచ్‌సీఎల్‌ సంస్థ వీరికి అందిస్తుంది. అంటే ఈ మార్గంలో యూజీ, పీజీ కోర్సుల్ని ఉచితంగానే చదవచ్చన్నమాట. అయితే ఉద్యోగంలో ఉంటూ యూజీ/పీజీ చదువుకున్నవారు కోర్సు అనంతరం హెచ్‌సీఎల్‌ సంస్థలో మూడేళ్లు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం ఒప్పందపత్రం రాయాల్సి ఉంటుంది. 

అర్హత

ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు ఐటీ సర్వీసెస్‌లో ఐటీ రోల్స్‌ ఉద్యోగాలకు మ్యాథ్స్‌లో 60 శాతం ఉండాలి. ఇందులోనే ఎనేబ్లింగ్‌ ఐటీ విభాగానికి గణితంలో 50 శాతం అవసరం. అసోసియేట్‌లో సర్వీస్‌ డెస్క్‌ ఉద్యోగాలకు మ్యాథ్స్‌లో ఉత్తీర్ణత సరిపోతుంది. ఇందులో బిజినెస్‌ ప్రాసెస్‌ విభాగానికి మ్యాథ్స్‌ తప్పనిసరి కాదు. 2021లో ఇంటర్‌ ఉత్తీర్ణులు, 2022లో అంటే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవాళ్లు మాత్రమే అర్హులు. వీరు జనవరి 1, 1999 - అక్టోబరు 31, 2003 మధ్య జన్మించి ఉండాలి.

వెబ్‌సైట్‌: https://www.hcltechbee.com/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆయుధ సంపత్తికి సమరం సెగ

‣ ధరల దరువు... ఆదాయాలు కరవు

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

‣ డీజే కావాలని అనుకుంటున్నారా?

‣ మీరెంత ధీమాగా ఉన్నారు?

‣ పిలుస్తోంది పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు!

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

Posted Date : 13-06-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌