• facebook
  • whatsapp
  • telegram

1857 తిరుగుబాటు

సిపాయిల సింహగర్జన!

ప్రతి భారతీయుడి ఛాతీని ఉప్పొగించే మహోజ్వల ఘట్టం ఒకటి 1857లో జరిగింది. అది ఆంగ్లేయుల అరాచక పాలనపై, అణచివేతలపై, అడ్డూ అదుపులేని అక్రమాలపై జరిగిన సామాన్యుల పోరాటం. రాజ్యాలు, సంస్థానాల ఆక్రమణలపై చెలరేగిన అంతులేని అసంతృప్తి. వివక్షపూరిత విధానాలతో విచ్చలవిడిగా సాగిన ఆర్థిక దోపిడీలపై విరుచుకుపడిన విప్లవం. మత విశ్వాసాలను మంటగలిపే శాసనాలకు వ్యతిరేకంగా సాగిన సమరం. అతి క్రూరమైన ఆంగ్లేయ అధికారులపై తూటాలు కురిపించి భారతీయ సిపాయిలు చేసిన సింహగర్జన. అదే 1857 తిరుగుబాటు. ఆధునిక భారతదేశ చరిత్రలోని ఈ అసాధారణ సంఘటనపై దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులు దీనిపై పరిపూర్ణ అవగాహన పెంచుకోవాలి. 

 

1857 తిరుగుబాటు

ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక మహోజ్వల ఘట్టం. ఆనాటి వీరుల త్యాగం చరిత్రపుటల్లో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. క్రీ.శ.1757 ప్లాసీ యుద్ధం నుంచి ప్రారంభమైన బ్రిటిష్‌ కంపెనీ సామ్రాజ్యవాదం 1857 వరకు అప్రతిహతంగా సాగి, పతాకస్థాయికి చేరింది. ఈ మధ్య కాలంలో ఒకవైపు దేశంలో ఒక్కో భారత రాజ్యాన్ని కబళిస్తూ, బ్రిటిష్‌ అధికార విస్తరణ కొనసాగుతోంది. భారతీయులను అణచివేస్తూ, ఆర్థిక దోపిడీలకు పాల్పడుతున్నారు. దాంతో ఆంగ్లేయ కంపెనీ పాలన పట్ల దేశం నలుమూలలా అసంతృప్తి పెరిగిపోయింది. ఈ పరిణామం చిన్న చిన్న తిరుగుబాట్లకు దారితీయగా వాటిని కంపెనీ నిర్దాక్షిణ్యంగా తొక్కేసింది. అయితే ఆ అసంతృప్తులకు పరాకాష్ఠగా 1857 తిరుగుబాటు రగిలింది. 1857లో ఉత్తర మధ్య భారతదేశంలో ఒక బ్రహ్మాండమైన ప్రజాతిరుగుబాటు ప్రారంభమై, ఆంగ్లేయ కంపెనీని గడగడలాడించింది. మొదట ఇది సిపాయిలతో ప్రారంభమైనా, అనతికాలంలోనే దానానలంలా ఉత్తర భారతదేశాన్ని చుట్టేసింది. సిపాయిలతో పాటు, సమాజంలోని అనేక వర్గాలు, కర్షకులు, కొలువులు కోల్పోయిన సైనికులు, చేతివృత్తుల వారు, ఇలా అనేకమంది ఈ మహా ప్రచండ విప్లవంలో పాల్గొని, ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టాన్ని లిఖించారు.

 

దోపిడీ పాలనపై తిరుగుబాటు

ఆంగ్లేయ కంపెనీ అణచివేత విధానాలు, వివక్షపూరిత, దోపిడీ పాలనతో విసుగెత్తిపోయిన ప్రజానీకం చేసిన ఈ తిరుగుబాటుకు రాజకీయ, ఆర్థిక, సామాజిక, మత, సైనిక కారణాలూ ప్రాతిపదికలయ్యాయి.

 

రాజకీయ కారణాలు 

ఆంగ్లేయ కంపెనీ అంతులేని రాజ్యాధికార దాహమే అశాంతికి, గందరగోళ, అనిశ్చిత పరిస్థితికి ప్రధాన కారణం. బక్సర్‌ యుద్ధం (1764) బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి బలమైన పునాది వేసింది. కంపెనీ భారతదేశంలో చేసిన అనేక యుద్ధాలు ముఖ్యంగా నాలుగు ఆంగ్లో- మైసూరు యుద్ధాలు, మూడు ఆంగ్లో - మరాఠా యుద్ధాలు, రెండు ఆంగ్లో - సిక్కు యుద్ధాలు, దురాక్రమణ విధానాలు భారతదేశంలోని బలమైన రాజకీయ సంస్థానాల ఘన చరిత్రకు ముగింపు పలికాయి. వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి వల్ల అనేక స్వదేశీ సంస్థానాలు తమ స్వాతంత్య్రాన్ని ఆంగ్లేయ కంపెనీకి తాకట్టు పెట్టి ఆధారిత, అసంపూర్ణ స్వతంత్ర రాజ్యాలు (డిపెండెంట్‌ స్టేట్స్‌)గా మారిపోయాయి.

డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా సతారా (1848), జైపుర్‌ (1849), సంబల్పూర్‌ (1849), భగత్‌ (1850), ఉదయపుర్‌ (1852), ఝాన్సీ (1853), నాగపుర్‌ (1854)లను అన్యాయంగా ఆక్రమించాడు. అసమర్థ పాలన అనే నెపంతో అయోధ్య రాజ్యాన్ని ఆక్రమించి, సైనికులను ఉద్యోగాల నుంచి తొలగించాడు. నానాసాహెబ్‌ పెన్షన్, మరికొంతమందికి బిరుదులు, రాజాభరణాలు రద్దు చేశాడు. భారతీయ ముస్లింల మనసు గాయపరుస్తూ మొగల్‌ చక్రవర్తి రెండో బహదూర్‌ షా తర్వాత మొగలులు ఎర్రకోటలో నివసించకూడదని ఆజ్ఞాపించాడు. ఈ పరిస్థితులు స్వదేశీ సంస్థానాధీశుల్లో అభద్రతాభావం పెంచాయి. దేశంలో రాజకీయ అశాంతి నెలకొంది. ఇలా తీవ్ర అసంతృప్తితో రగులుతున్న కొంతమంది అధికారం కోల్పోయిన జమీందారులు, పెన్షన్‌ రద్దయిన, బిరుదులు, భరణాలు కోల్పోయిన సంస్థానాధీశులు తమ పూర్వ ప్రాబల్యం పొందేందుకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటులో పాల్గొన్నారు.

 

ఆర్థిక కారణాలు 

భారతదేశాన్ని ఒక వలస రాజ్యంగా, ఇక్కడి ఆర్థిక వనరుల దోపిడీయే లక్ష్యంగా బ్రిటన్‌ పాలించింది. ఈ అరాచక పాలనలో అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా కుదేలయ్యారు. ఆంగ్లేయ కంపెనీ, స్వదేశీ సంస్థానాల్లోని అనేక మంది ఉద్యోగాలు తీసేసి వారిని తీవ్ర దుస్థితిలోకి నెట్టింది. జమీందారీ విధానం, రైత్వారీ విధానం, మహల్వారీ విధానం అంటూ రైతులపై అధిక పన్నులు విధించి, నిర్దాక్షిణ్యంగా వసూలు చేసింది. కంపెనీ పాలనలో భూస్వాములు, వడ్డీ వ్యాపారుల దోపిడీతో రైతులు బికారులుగా మారారు. ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం వల్ల, చౌకగా వస్తువులు భారత్‌కు దిగుమతి అయ్యాయి. దాంతోపాటు కంపెనీ ఇక్కడ అమలు చేసిన వివక్షపూరిత వ్యాపార విధానాలతో ఒకప్పుడు వైభవంగా విరాజిల్లిన చేతివృత్తులు, హస్తకళలు, కుటీర పరిశ్రమలు నాశనమయ్యాయి. వీరు జీవనోపాధి కోసం గ్రామాలకు తరలిపోయి వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. కరవు కాటకాలతో, అంటురోగాలతో ప్రజలు విలవిలలాడుతూ నిత్యం మరణిస్తున్నా, కంపెనీ ప్రభుత్వం ప్రజాసంక్షేమం పట్ల శ్రద్ధ వహించలేదు. విద్యావంతులైన భారతీయులకు కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంగ్లిష్‌ ప్రభుత్వోద్యోగుల అవినీతి, అక్రమాల కారణంగా కూడా దేశ ప్రజల జీవనం దుర్భరమైంది.

 

మత కారణాలు

బ్రిటిషర్ల కొన్ని చర్యలు సామాజిక, మతపరమైన అపోహలు, అనుమానాలు కలగజేసి, విపరీతమైన మానసిక అశాంతి, ఉద్రేకాలకు కారణమయ్యాయి. వారు తరచూ భారతీయులను, భారతీయ సంస్కృతిని, ఆచార వ్యవహారాలను పరిహసించేవారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు మితిమీరాయి. పైగా వీరికి 1813 చార్టర్‌ చట్టంలో మద్దతు లభించింది. ఈ చర్యలు భారతీయుల అనుమానాలను అధికం చేశాయి. సతీసహగమనం రద్దు (1829), బాల్య వివాహాలు, శిశు హత్యల నిషేధం, వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడం (1856), హిందూ మతాన్ని వీడి ఇతర మతం స్వీకరించిన వారికి తండ్రి ఆస్తిలో హక్కు కల్పించడం (1850 చట్టం) వంటి సంస్కరణలను తమ మతాచారాలను నాశనం చేసే చర్యలుగా భారతీయులు భావించారు. అలాగే డల్హౌసీ ప్రవేశపెట్టిన రైల్వే, తపాలా, టెలిగ్రాఫ్‌ లైన్లను కూడా తరతరాల భారతీయ సామాజిక వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నమని విశ్వసించారు. 

 

సైనిక కారణాలు

బ్రిటిష్‌ పాలన జాత్యహంకారంతో, వివక్షాపూరితంగా ఉండేది. కంపెనీ సైన్యంలో భారతీయ హిందూ, ముస్లిం సైనికులను ‘సిపాయి’ అని, బ్రిటిష్‌ సైనికులను ‘సోల్జర్‌’ అనేవారు. వీరి ఇరువురికి జీతభత్యాలు, పదోన్నతి మొదలైన విషయాల్లో చాలా తేడా ఉండేది. భారతీయ సైనికుడు సుబేదార్‌ స్థాయి మించి పదోన్నతి పొందేవాడు కాదు. సిపాయిలకు చాలీచాలని, నాణ్యత లేని ఆహారం పెట్టేవారు. ఎక్కువ ప్రయోజనాలు బ్రిటిష్‌ సైనికులకే ఉండేవి. లార్డ్‌ కానింగ్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు ‘సామాన్య సేవ నియుక్త చట్టం (1856)’ (జనరల్‌ సర్వీసెస్‌ ఎన్‌లిస్ట్‌మెంట్‌ యాక్ట్‌ 1856) చేసి భారతీయ సిపాయిలు సముద్రం దాటి వెళ్లి విదేశాల్లో యుద్ధం చేయాలని శాసించాడు. హిందూ సిపాయిలు దీన్ని తీవ్రంగా నిరసించారు. కారణం - సామాజికంగా ఆ రోజుల్లో సముద్రం దాటటం పాప కర్మగా నిర్ణయించి, కులం నుంచి వెలివేసేవారు. ముస్లింల ఆచారానికి విరుద్ధంగా గడ్డాలు, మీసాలు తీసివేయాలని, హిందువులు శరీరంపై కుంకుమ ధారణ చేయకూడదని శాసించాడు. ఇలాంటి అన్ని చర్యలు కంపెనీ సైన్యంలోని భారతీయ హిందూ, ముస్లిం సిపాయిల మనోభావాలను దెబ్బతీశాయి.

 

తక్షణ కారణం

1857 నాటికి బ్రిటిష్‌ పాలనపై అసంతృప్తి భారతీయ సమాజంలో నివురుగప్పిన నిప్పులా గూడుకట్టుకొని ఉంది. అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలు కావచ్చు. అసంతృప్తి లావాను బయటకు నెట్టే బలమైన శక్తి కావాలి. సరిగ్గా ఇదే సమయంలో ఇంగ్లిష్‌ ప్రభుత్వం సైన్యంలోకి కొత్తగా ఎన్‌ఫీల్డ్‌ తుపాకులను ప్రవేశపెట్టింది. వీటిలో ఉపయోగించే తూటా పై పొరను సిపాయి తన పంటితో తీసి తుపాకీలో అమర్చాల్సి వచ్చేది. ఈ తూటాల పైపొరను ఆవు కొవ్వు, పంది కొవ్వుతో చేశారన్న ఒక వదంతి ప్రచారంలోకి వచ్చింది. దాంతో అప్పటికే అసంతృప్తితో ఉడికిపోతున్న భారతీయ సిపాయిల్లో కోపం కట్టలు తెచ్చుకుంది. దీన్ని తమ మతాచారాలను భ్రష్టు పట్టించడానికి చేస్తున్న కుట్రగా భావించి తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. 1857 మార్చిలో బరక్‌పుర్‌ స్వదేశీ పదాతి దళానికి చెందిన మంగళపాండే అనే సిపాయి తూటా ఉపయోగించడానికి ఇష్టపడలేదు. ఒత్తిడి చేసిన తన పైఅధికారిని కాల్చి చంపాడు. దాంతో మంగళపాండేను ఉరితీశారు. 1857 మేలో మీరట్‌ అశ్వికదళంలో 85 మంది సిపాయిలు, కొవ్వు పూసిన తూటాలను తిరస్కరించడంతో మిలటరీ కోర్టు జైలుశిక్ష విధించింది. 1857, మే 10న మీరట్‌ సైనిక స్థావరంలో తిరుగుబాటు మొదలైంది. కొంతమంది సిపాయిలు బ్రిటిష్‌ అధికారులను కాల్చి చంపి, తమ సహచర సైనికులను జైలు నుంచి విడిపించారు. వారంతా ‘ఢిల్లీ ఛలో’ అంటూ కదం తొక్కి ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల విప్లవ ఘట్టానికి తెరతీశారు.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 యుద్ధాలు

 సంఘ సంస్కరణోద్యమాలు​​​​​​​

‣ రాష్ట్రకూటులు​​​​​​​

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015 

Posted Date : 11-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌