• facebook
  • whatsapp
  • telegram

ఆంగ్లో-సిక్కు యుద్ధాలు

ఆంగ్లేయుల ఆక్రమణలో ఆఖరి స్వతంత్ర రాజ్యం

పంజాబ్‌ సింహం రంజిత్‌ సింగ్‌ బతికి ఉన్నంత కాలం ఆ రాజ్యం వైపు కన్నెత్తి చూడటానికి కూడా బ్రిటిషర్లు సాహ‌సించ‌లేదు. ఆయన మరణంతో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని అంతర్యుద్ధాలను, వారసత్వ రాజకీయాలను రెచ్చగొట్టారు. అనేక కుట్రలు, అనైతిక సిద్ధాంతాలతో స్వతంత్ర సిక్కురాజ్యాన్ని ఆక్రమించారు. 

 

  పద్దెనిమిదో శతాబ్దం ద్వితీయార్ధం నుంచి భారతదేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం ధాటికి స్వదేశీ సంస్థానాలు విలవిలలాడటం మొదలైంది. బెంగాల్, మైసూర్, హైదరాబాద్‌ నిజాం, మరాఠాలతో పాటు అనేక భారత రాజ్యాలు ఆంగ్లేయ కంపెనీ సామ్రాజ్యవాద ఛత్రం కిందకు చేరిపోయాయి. 19వ శతాబ్దం ప్రథమార్ధం చివరి భాగానికి దేశంలో స్వతంత్రంగా ఉన్న సంస్థానం పంజాబ్‌లోని సిక్కు రాజ్యం ఒక్కటే.

  పంజాబ్‌లోని సుకర్‌ చకియా సిక్కు మిజిల్‌ సర్దార్‌ రంజిత్‌ సింగ్‌. ఆయన తన నాయకత్వంలో సిక్కులను నిరుపమాన శక్తిగా రూపొందించాడు. తన శక్తి సామర్థ్యాలతో పంజాబ్‌లోని 12 సిక్కు మిజిల్‌లను ఏకం చేసి కశ్మీర్, ముల్తాన్, పెషావర్‌ ప్రాంతాలను జయించాడు.  శత్రు దుర్భేద్య స్వతంత్ర సిక్కు రాజ్యాన్ని స్థాపించి, శాంతిభద్రతలు నెలకొల్పి పంజాబ్‌ సింహంగా కీర్తి గడించాడు. క్రీ.శ.1799లో లాహోర్‌ను ఆక్రమించి దాన్ని రాజకీయ రాజధానిగా, అమృత్‌సర్‌ను మత రాజధానిగా చేశాడు. రంజిత్‌ సింగ్‌ గొప్ప పాలనా దక్షత, రాజకీయ చతురత కలిగినవాడు. ఐరోపా దేశాల యుద్ధ విధానంలో ఆయుధాలు సమకూర్చుకొని, యుద్ధ పద్ధతుల్లో తర్ఫీదు ఇప్పించి సైన్యాన్ని ఆధునీకరించాడు. సిక్కుల సంస్కృతి, కళల పునర్‌ వైభవానికి కృషి చేస్తూ పరమత సహనం కలిగి అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. సింధు, సట్లెజ్‌ నదుల మధ్య ఉన్న పంజాబ్, కశ్మీర్‌; జమ్మూ వాయవ్య ప్రాంతంలోని హజారా; పెషావర్‌ సులైమాన్‌ కొండల మధ్య ఉన్న డేరా ఇస్మాయిల్, డేరా ఘాజీఖం జిల్లాలు రంజిత్‌ సింగ్‌ విశాల రాజ్యంలోని భాగాలు. ఆ రాజ్యం కశ్మీర్, పెషావర్, ముల్తాన్, లాహోర్‌ అనే నాలుగు రాష్ట్రాలుగా ఉండేది. రాష్ట్రాలను సుబాలు అని పిలిచేవారు. సుబాలను పరగణాలుగా, పరగణాలను మౌజాలుగా విభజించాడు.

  భారతదేశంలో ఆంగ్లేయుల సామ్రాజ్య విస్తీర్ణ విధానం అప్రతిహతంగా సాగుతున్న ఆ రోజుల్లో వారు రంజిత్‌ సింగ్‌తో వైరానికి వెనుకాడారంటే అతడి శక్తి సామర్థ్యాలు, బలం, దౌత్య కౌశలం అర్థం చేసుకోవచ్చు. అజేయుడిగా సాగుతున్న రంజిత్‌ సింగ్‌ను చూసి ఆంగ్లేయులు ఆందోళన చెందారు. దీనికితోడు నెపోలియన్‌ చక్రవర్తి భారతదేశంపై దండయాత్ర చేస్తాడేమో, రంజిత్‌ సింగ్‌ వారితో స్నేహం చేస్తాడేమో అనే భయం ఇంగ్లిష్‌ కంపెనీకి ఉండేది. అందుకే వారు లార్డ్‌ మింటో గవర్నర్‌ జనరల్‌గా ఉన్న కాలంలో 1809లో రంజిత్‌ సింగ్‌ను ఒప్పించి అమృత్‌సర్‌ సంధి చేసుకున్నారు. దీని ప్రకారం ఇరు రాజ్యాల మధ్య సట్లెజ్‌ నదిని సరిహద్దుగా అంగీకరించి, దాన్ని అతిక్రమించకూడదని నిర్ణయించుకున్నారు.

 

మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం (1845 - 46)

  గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా హార్డింగ్‌ ఉన్న కాలంలో ఈ యుద్ధం జరిగింది. రంజిత్‌ సింగ్‌ సుదీర్ఘ కాలం పంజాబ్‌ సిక్కు రాజ్యాన్ని పాలించి 1839లో మరణించాడు. దీంతో పంజాబ్‌లో రాజకీయ అస్థిరత‌ ఏర్పడింది. సింహాసనం కోసం వారసత్వ యుద్ధాలు ప్రారంభమయ్యాయి. రంజిత్‌ సింగ్‌ తర్వాత సింహాసనానికి వచ్చిన ఖరవీ సింగ్, నౌనిహాల్‌ సింగ్‌లు బలహీనులు, అసమర్థులు, కొంతమంది సిక్కు సర్దారుల చేతిలో కీలుబొమ్మలు. ఇంతకాలం ఏ సైన్యం పంజాబ్‌ ఐక్యతకు తోడ్పడిందో అదే సైన్యం అంతర్యుద్ధాల్లో ముఖ్యపాత్ర వహించింది. 1843లో రంజిత్‌ సింగ్‌  కుమారుడు దిలీప్‌ సింగ్‌ చిన్న వయసులోనే (మైనర్‌) పంజాబ్‌ పాలకుడయ్యాడు. దిలీప్‌ సింగ్‌ తల్లి మహారాణి జిందాన్‌ అతడికి సంరక్షకురాలిగా మారింది. రంజిత్‌ సింగ్‌ తన కాలంలో సైనిక ప్రభుత్వాన్ని స్థాపించాడు. బలహీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ సైన్యం రెచ్చిపోయింది. పంజాబ్‌లో అశాంతి పరిస్థితులకు కారణమైంది. ఎటుచూసినా అల్లర్లు, దోపిడీలు, తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి. ఆంగ్లేయులను కూడా వారు హింసించారు. ఈ నేపథ్యంలో కంపెనీ సైనిక కదలికలు, దాని బలసంపత్తి పెంచుకోవడం పంజాబ్‌ను జయించడానికే అని ఖల్సా సైన్యంలో అనుమానాలు వచ్చాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ఖల్సా సైనిక అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని మహారాణి భావించింది. అమృత్‌సర్‌ సంధిని ఉల్లంఘించి సట్లెజ్‌ నదిని దాటి ఆంగ్లేయులను ఎదుర్కోమని వారిని పురిగొల్పింది.  

  మొదటి సిక్కు యుద్ధానికి ముఖ్య కారణాల్లో వారసత్వపు యుద్ధాలు, సైనిక అలజడులు మాత్రమే కాకుండా పంజాబ్‌ను ఆక్రమించుకోవాలని ఆంగ్లేయులు తీర్మానించుకోవడం కూడా కీలకమే. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ముడికి, ఫిరోజ్‌ షా, బుద్దేవాల్, అలీవాల్,  సోబ్రాన్‌ అనే అయిదు ప్రాంతాల్లో జరిగింది. యుద్ధంలో కొంతమంది నాయకులు ద్రోహులుగా మారారు. సిక్కు సైనికులు వీరోచితంగా పోరాడినా ఆంగ్లేయుల ఆధునిక ఆయుధాలు, యుద్ధ పద్ధతుల ముందు నిలవలేక ఓడిపోయారు. ఆంగ్లేయులు, సిక్కులకు మధ్య యుద్ధం 1846లో లాహోర్‌ సంధితో ముగిసింది. ఈ సంధి నిబంధనల మేరకు జలంధర్‌ అంతర్వేదిని ఆంగ్లేయులు ఆక్రమించారు. యుద్ధ ఖర్చుల నిమిత్తం ఆంగ్లేయులకు సిక్కులు కోటిన్నర రూపాయలు చెల్లించాలి. వారి దగ్గర అంత ధనం లేకపోవడంతో కశ్మీర్‌ను ఆంగ్లేయులకు ఇచ్చేశారు. తర్వాత ఆంగ్లేయులు కశ్మీర్‌ను స్వల్ప ధరకు గులాబ్‌ సింగ్‌కు అమ్ముకున్నారు. సిక్కులు తమ సైనికుల సంఖ్యను తగ్గించడంతో పాటు పంజాబ్‌ మీదుగా ఆంగ్లేయ సైన్యం వెళ్లడానికి అనుమతించాలన్నది కూడా సంధి నిబంధన. ఈ సంధి తర్వాత 1846లో కంపెనీ సిక్కులతో బైరవోల్‌ సంధిని కుదుర్చుకుంది. దీని ప్రకారం యువరాజుకు యుక్త వయసు వచ్చేవరకు అతడి రక్షణార్థం ఆంగ్ల సైన్యం లాహోర్‌లోనే ఉంటుంది. దాని ఖర్చు సిక్కులు భరించాలి. పాలనా వ్యవహారాల కోసం ఒక ఆంగ్ల రెసిడెంట్‌ అధికారి, అతడికి సహాయకులుగా ఎనిమిది మంది సిక్కు సర్దారులతో కూడిన ఒక కౌన్సిల్‌ ఆఫ్‌ రీజెన్సీ ఏర్పాటైంది. దిలీప్‌ సింగ్‌ నామమాత్రపు రాజు అయ్యాడు. పంజాబ్‌ స్వాతంత్య్రాన్ని కోల్పోయింది.

 

రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం (1848 - 49)

  డల్హౌసీ గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా ఉన్న కాలంలో ఈ యుద్ధం జరిగింది. భారతదేశమంతటా బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనే సామ్రాజ్య కాంక్ష డల్హౌసీకి ఉండేది. దీనికోసం యుద్ధాలతో పాటు ఇతర విధానాలను చాకచక్యంగా అవలంబించాడు. అలాంటి విధానమే అతడు ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం. దేశంలో ఏ సంస్థానాధీశుడైనా పుత్రులు లేకుండా మరణిస్తే దత్తత అనుమతించకుండా ఆ సంస్థానాలను కంపెనీ రాజ్యంలో కలిపేశాడు. ఆ విధంగానే ఝాన్సీ, సతార, సంబల్‌పూర్, నాగపూర్, భగత్, జైత్‌పూర్, ఉదయపూర్‌ సంస్థానాలపై ఈ సిద్ధాంతాన్ని ప్రయోగించి, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి కంపెనీ రాజ్యంలో కలిపేశాడు. ఈ క్రమంలో అతడి దృష్టి సుసంపన్నంగా ఉన్న పంజాబ్‌పై పడింది. డల్హౌసీ సామ్రాజ్య కాంక్షే రెండో సిక్కు యుద్ధానికి కారణమైంది. పంజాబ్‌ను ఆక్రమిస్తే బ్రిటిష్‌ రాజ్యానికి పశ్చిమ ఆసియా దేశాలు, మధ్య ఆసియా దేశాలతో దగ్గర సంబంధాలు ఏర్పరచుకోవచ్చని భావించారు. అవకాశం కోసం ఎదురుచూశారు. సిక్కులకు కూడా ఆంగ్లేయుల నిజస్వరూపం అర్థమైంది. పాలనలో బ్రిటిష్‌ రెసిడెంట్‌ అధికారి మితిమీరిన జోక్యంతో మహారాణి జిందాన్‌ కూడా విసుగెత్తిపోయింది. ఇరుపక్షాలు యుద్ధం అనివార్యం అనే ఆలోచనకు వచ్చాయి.

  ముల్తాన్‌ పాలకుడు మూలరాజ్‌ ఆంగ్లేయులపై తిరుగుబాటు చేయడం తదనంతర పరిణామాలు రెండో ఆంగ్లో సిక్కు యుద్ధానికి తక్షణ కారణం. హజారా సంస్థానాధీశుడు చత్తర్‌ సింగ్‌ కూడా తోడయ్యాడు. డల్హౌసీ ఈ అవకాశాన్ని వదులుకోలేదు. ఫలితంగా రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగింది. సర్‌ హ్యూగౌ నాయకత్వంలోని ఆంగ్ల సేనలు రాంనగర్‌ (1848) యుద్ధం, చిలియన్‌ వాలా యుద్ధం, గుజరాత్‌ యుద్ధంలో (1849) సిక్కులను ఓడించడంతో డల్హౌసీ పంజాబ్‌ను ఆక్రమించాడు. మహారాజా దిలీప్‌ సింగ్‌ పదవిని రద్దు చేసి భరణం మంజూరు చేశారు. భారతదేశంలో ఆఖరి స్వతంత్ర రాజ్యం ఈస్టిండియా కంపెనీలో విలీనమై బ్రిటిష్‌ సామ్రాజ్యం బలోపేతమైంది.

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!
‣  భ‌క్తి, సూఫీ ఉద్య‌మాలు

‣ ప్లాసీయుద్ధం

‣ ఆంగ్లో-మరాఠా యుద్ధాలు

 

 ‣ ప్ర‌తిభ పేజీలు

ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015
 

 

Posted Date : 21-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌