• facebook
  • whatsapp
  • telegram

కుతుబ్‌ షాహీలు - సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు 

షాహీల యుగం.. సంస్కృతుల సమ్మేళనం!

 

కుతుబ్‌షాహీల పాలనాకాలంలో సంస్కృతుల సమ్మేళనం జరిగింది. సాంఘిక జీవనంలో సామరస్యం వెల్లివిరిసింది. ఉపకులాలతో కూడిన వర్ణవ్యవస్థ వివిధ కార్యకలాపాలను నిర్వహించేది. హిందూ, ముస్లింలు పరస్పరం పండగల్లో పాల్గొనేవారు. భాషలకు అతీతంగా సాహిత్య సేద్యం సాగింది. ఉపనిషత్తులను ఉర్దూ, పర్షియన్‌ భాషల్లోకి అనువదించారు. హిందూ, పారశీక, పఠాన్‌ పద్ధతులు కలిపి మిశ్రమశైలిలో నిర్మాణాలు చేపట్టారు. దక్కనీ వర్ణచిత్రకళను అభివృద్ధి చేశారు.   

కుతుబ్‌షాహీల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించింది. వీరు మహమ్మదీయ పాలకులైనప్పటికీ అనేక మంది తెలుగు కవులను పోషించి, తెలుగు సాహిత్యాభివృద్ధికి పాటుపడ్డారు. వ్యవసాయానికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించడంతోపాటు హైదరాబాద్‌ సహా అనేక ప్రాంతాల్లో వివిధ నిర్మాణాలు చేపట్టి ప్రజాసంక్షేమం కోసం పాటుపడ్డారు.

 

సాంఘిక జీవనం
కుతుబ్‌షాహీల కాలంలో వర్ణవ్యవస్థ బలపడి అనేక ఉప కులాలు స్థిరపడ్డాయి. బ్రాహ్మణులకు సమాజంలో గౌరవం ఉండేది. వారు ఉన్నతోద్యోగాలను నిర్వహించేవారు. క్షత్రియులు సామంతులుగా, జాగీర్దార్లుగా, మిరాశీదార్లుగా ఉండేవారు. వైశ్యులు వ్యాపారం, వ్యవసాయం చేసేవారు. ఈ కాలంలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. స్త్రీలకు సమాజంలో గౌరవం దక్కేది. బాల్య వివాహాలు, బహుభార్యత్వం, జ్యోతిషం, శకునాల మీద నమ్మకాలు, దేవదాసీ పద్ధతి లాంటి సామాజిక దురాచారాలుండేవి. వితంతువుల పరిస్థితి దుర్భరంగా ఉండేది. వేశ్యలకు రాజాదరణ, సమాజంలో గౌరవం ఉండేవి. గోల్కొండలో రెండు వేల మంది వేశ్యలున్నట్లు టావెర్నియర్‌ పేర్కొన్నాడు. వారు కల్లు దుకాణాలు నడిపేవారు. పాలకులు సతీసహగమనం రూపుమాపడానికి ప్రయత్నించారు. క్రీ.శ.1670లో గోల్కొండ రాజ్యంలో వైద్యులు ప్లాస్టిక్‌ సర్జరీ చేయడం చూసిన విదేశీయులు ప్రశంసించారు. 

       పాలకులు హిందూ దేవాలయాలకు మాన్యాలిచ్చి పోషించారు. క్రీ.శ.1652లో నిర్మించిన భద్రాచల రామాలయానికి భద్రాచలం, శంకరగిరి, పాల్వంచలను,  కృష్ణా తీరంలోని మల్లేశ్వరస్వామి దేవాలయానికి భోగాపురం, చెరుకూరు, వీరన్నపట్నాలను అబుల్‌హసన్‌ దానం చేశాడు. ఆనాటి మసీదుల్లో హిందూ ప్రభావం కనిపిస్తుంది. సుల్తాన్‌ అబ్దుల్లా ఆస్థానంలోని మూసాఖాన్‌ తొలి మసీదు కట్టించాడు. హిందువుల పూర్ణకుంభ ఆకారాన్ని, ఏనుగుల జాజు పీఠాన్ని మసీదులో ఉపయోగించారు. ముస్లిం, సూఫీ మత గురువుల బోధనల వల్ల హిందూ ముస్లిం సామరస్యం పెంపొంది సంస్కృతీ సమ్మేళనానికి దారితీసింది. హిందూ ముస్లిం సామరస్యం ఈ యుగ ముఖ్య లక్షణం. రంజాన్, మొహర్రం పండగల్లో హిందువులు పాల్గొనేవారు. మొహర్రంను తెలంగాణ గ్రామాల్లో పీరీల (పీర్ల) పండగగా హిందూ ముస్లింలు నిర్వహించేవారు. మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా గోల్కొండలో వసంతోత్సవాలను జరిపించేవాడు. ఈయన 14 పండగలను జాతీయ పర్వదినాలుగా గుర్తించాడు. రాజ్యంలో అధిక సంఖ్యాకులు హిందువులు. ఎక్కువ మంది వైష్ణవాన్ని అనుసరించారు. శ్రీరామచంద్రుడు వారి ఆరాధ్యదైవం. అబుల్‌హసన్‌ బ్రిటిషర్లకు మద్రాసు మొత్తాన్ని సంవత్సరానికి 1200 పగోడాల చొప్పున శాశ్వతంగా అద్దెకు ఇచ్చాడు.

 

సాహిత్యం 
కుతుబ్‌షాహీల రాజభాష పర్షియన్‌. ఈ కాలంనాటి సాహిత్య చరిత్ర శంకర కవి రచించిన హరిశ్చంద్రోపాఖ్యానంతో ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఈ కావ్యాన్ని గోల్కొండ రాజ్యస్థాపకుడైన సుల్తాన్‌ కులీ జాగీర్దారు అయిన ఈడూరు ఎల్లయ్యకు అంకితం ఇచ్చాడు. ఇబ్రహీం కుతుబ్‌షా తెలుగు, ఉర్దూ భాషా కవులను పోషించాడు. ఈయన ఆస్థానకవి కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం (తెలుగులో మొదటి యక్షగానం), నిరంకుశోపాఖ్యానం, జనార్దనాష్టకములు, బలవదరి శతకం, గువ్వల చెన్న శతకం లాంటి రచనలు చేశాడు. ఈ కవికి ఇబ్రహీం కుతుబ్‌షా రెంటచింతల/చింతలపాలెం గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. అద్దంకి గంగాధర కవి తపతి సంహ‌రణోపాఖ్యానాన్ని రచించి ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితం ఇచ్చాడు. పొన్నెగంటి తెలగనార్యుడు యయాతి చరిత్ర (మొదటి అచ్చ తెలుగు కావ్యం) రచించాడు. పటాన్‌చెరువు ప్రాంతానికి అధికారి అయిన అమీన్‌ఖాన్‌ ఈ కవిని ఆదరించాడు. 
                               ఇబ్రహీం కుతుబ్‌షా ఆస్థానంలో ఉర్దూ కవి అలివుర్సీ ‘నసబ్‌ నామా కుతుబ్‌షాహీ’, మరో కవి ఫెరోజ్‌ ‘తెసల్‌ నామా’లను రచించారు. పారశీక భాష కవి ఖుర్హా ‘తారీఖ్‌ ఎల్చి నిజాంషా’ అనే చారిత్రక గ్రంథాన్ని రచించి ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితమిచ్చాడు. తెలుగు కవులు ఇబ్రహీం కుతుబ్‌షాను మల్కీభరాముడిగా కీర్తించారు. ఇబ్రహీం తెలుగు, ఉర్దూ ముషాయిరాలను (కవి సమ్మేళనాలు) ఏర్పాటుచేసి కవి పండితులను సత్కరించాడు. మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా గొప్ప ఉర్దూ కవి. ఇతడు ఉర్దూ, పారశీక భాషల్లో కావ్యాలు రచించాడు. స్వయంగా కొన్ని వందల పద్యాలు రచించాడు. వర్ణనాత్మక కవిత్వంలోనూ, గజల్‌ రచనల్లోనూ నిష్ణాతుడు. ఈయన పద్యాల్లో నాటి హైదరాబాద్‌ సాంఘిక జీవితం ప్రతిఫలిస్తుంది. ఇతడి ఆస్థానంలో తెలుగు కవులైన సారంగతమ్మయ వైజయంతీ విలాసమును, పోశెట్టి లింగ నవచోళ చరిత్ర, మల్వణ చరిత్ర, శంకర దాసమయ్య చరిత్ర; ఎల్లారెడ్డి కిరాతార్జునీయం, బాల భారతకావ్యం; మల్లారెడ్డి పద్మపురాణం, శివధర్మోత్తరం; సింగరాచార్యులు సీతాకల్యాణం, రాఘవ యాదవ పాండవీయం; సిద్ధరాయ కవి ప్రభుదేవర వాక్యం లాంటి గ్రంథాలను రచించారు. ఉర్దూ కవి గులాం అలీ ‘పద్మావతి’ అనే గ్రంథాన్ని తెలుగు నుంచి ఉర్దూ భాషలోకి అనువదించాడు. అబ్దుల్లా కుతుబ్‌షా ఉర్దూభాషలో అనేక ద్విపదలు రచించాడు. ఈయన ఆస్థాన ఉర్దూ కవి కుష్‌-షియారా గవాసి వెనుకటి కావ్యాలకు స్వేచ్ఛానువాదాలు చేసిన మొదటి ప్రసిద్ధకవి. ఈయన ‘సైపుల్‌ ముల్క్‌ నాబదియుల్‌ జమాల్‌’ అనే కావ్యాన్ని క్రీ.శ‌.1625లో రచించాడు. సంస్కృత శుకసప్తతికి అనువాదంగా గవాసి రచించిన ‘తూత్‌నామా’ ప్రముఖమైంది. ఇబన్‌-ఎ-నిషాతీ ‘పూల్‌బన్‌’ అనే కావ్యాన్ని రచించాడు. క్షేత్రయ్యను అబ్దుల్లాకుతుబ్‌షా ఆదరించాడు. క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. ఇతడిది కృష్ణా జిల్లా మొవ్వ గ్రామం. ఇతడు మొవ్వ గ్రామ ఆలయంలోని గోపాలకృష్ణుడిపై మొవ్వ గోపాల పదాలు రాశాడు. ఈయన రచించిన 4500 పద కీర్తనల్లో 1500 పదాలు అబ్దుల్లా కుతుబ్‌షాకి అంకితం ఇచ్చాడు. మహమ్మద్‌ కుతుబ్‌షా ఆస్థాన కవులైన హకీంతకి ముద్దీన్‌ ‘మిజానుత్‌ తబాయి కుతుబ్‌షాహి’ అనే వైద్య గ్రంథాన్ని, మహమ్మద్‌ ముమీన్‌ రిసాలా ‘మిక్దరియా’ (తూనికలు, కొలతలపై) గ్రంథాన్ని రచించారు. అబుల్‌ హసన్‌ తానీషా కాలంలో కంచర్ల గోపన్న (భక్త రామదాసు) దాశరథి శతకం, రామదాసు కీర్తనలు రచించాడు. అలీచిన్‌ తైపూర్‌ అనే పారశీక కవి హదైఖుల్‌ సలాతిన్‌ అనే గ్రంథాన్ని రచించాడు. వేమన (క్రీ.శ‌.1625) 4000 పద్యాలు రచించాడు. లక్ష్మీనరసింహం ‘నరసింహవిలాసం’, సురభి యాదవ రాయలు ‘చంద్రికా పరిణయం’, కర్పూర కృష్ణమాచార్యుడు భగవద్గీతను ద్విపద కావ్యంగా రచించారు. ఈ కాలంలో ఉపనిషత్తులు ఉర్దూ, పర్షియన్‌ భాషల్లోకి అనువాదమయ్యాయి. చివరి ఇద్దరు సుల్తాన్‌లు తమ ఫర్మానాలను తెలుగు, పారశీకంలో రాయించారు.

 

నిర్మాణాలు
పారశీక, పఠాన్, హిందూ సంప్రదాయాలు సమ్మిళితమైన మిశ్రమశైలిలో కుతుబ్‌షాహీలు నిర్మాణాలు చేశారు. ఈ పద్ధతిని మహమ్మద్‌ కులీకుతుబ్‌షా ప్రారంభించాడు. గోల్కొండ బాలాహిసార్‌ ద్వారం మీద హిందూపురాణ కథల చిత్రాలు, సంకేతాలున్నాయి. ఇబ్రహీం కుతుబ్‌షా మూసీనదిపై వంతెన (పురానాపూల్‌)ను క్రీ.శ.1578లో నిర్మించాడు. ఫ్రెంచి బాటసారి టావెర్నియర్‌ దీన్ని ప్యారిస్‌లోని పాంట్‌న్యుఫ్‌తో పోల్చాడు. దీన్ని ప్రేమవంతెన (బ్రిడ్జ్‌ ఆఫ్‌ లవ్‌)గా పేర్కొన్నాడు. హుస్సేన్‌సాగర్‌ను మూసీనది ఉపనదిపై క్రీ.శ.1562లో నిర్మించాడు. దీనికి బలక్‌పూర్‌ నదీ శాఖల నుంచి నీరు చేరేది. దీని పొడవు 1.5 మైళ్లు, విస్తీర్ణం 8 చదరపు మైళ్లు. దీన్ని నగర వాసుల తాగునీటి కోసం ఉపయోగించారు. ఈయన కాలంలో ఇంకా గోల్కొండ దుర్గప్రాకారం, పూల్‌బాగ్‌ (ఉద్యానవనం), ఇబ్రహీంబాగ్, లంగర్‌హౌజ్‌ (ఇక్కడ సామూహిక భోజనాలు జరిగేవి) నిర్మించారు. మహమ్మద్‌ కులీకుతుబ్‌షా తన పీష్వా (ప్రధాని) సహాయంతో 1591లో హైదరాబాద్‌ నగర నిర్మాణాన్ని ప్రారంభించాడు. మహమ్మద్‌ కులీ ప్రధాని అయిన మీర్‌మొమీద్‌ అహ్మద్‌ అస్త్రబాది గొప్ప పరిపాలనావేత్త, ఇంజినీర్‌. ఆయన తన మాతృదేశమైన ఇరాన్‌లోని ఇస్పాహాన్‌ నగరాన్ని హైదరాబాద్‌ నగర నిర్మాణానికి మోడల్‌గా తీసుకున్నాడు. ఇరాన్‌లోని సఫాయిద్‌ నగరంలోని మైదాన్‌-ఇ-నక్షజహాన్‌ మాదిరిగా చార్‌మినార్‌ను ప్రధాన కూడలిగా రూపొందించాడు. హైదరాబాద్‌ నిర్మాణాన్ని డబుల్‌క్రాస్‌ రూపంలో చేశారు. చార్మినార్‌ నిర్మాణం 1591-92లో పూర్తయింది. 1595-96లో దారుల్‌షిఫా (ది హౌస్‌ ఆఫ్‌ క్యూర్‌) అనే యునానీ వైద్యశాలను దారుల్‌షిఫా వద్ద నిర్మించాడు. ఇక్కడ దేశ, విదేశాల నుంచి వచ్చిన వైద్యులుండేవారు. రోగులకు ఉచిత మందులు, భోజనం ఏర్పాటు చేసేవారు. మహమ్మద్‌ కుతుబ్‌షా  క్రీ.శ.1617లో మక్కా మసీదుకు పునాది వేయగా ఔరంగజేబు క్రీ.శ.1694లో పూర్తిచేశాడు. మక్కాలోని కాబా ఆలయంలో జరిగినట్లు ఈ మసీదులో కూడా అన్నివేళల్లో ప్రార్థనలు నిర్వహించడం వల్ల దీనికి మక్కా మసీదు అనే పేరు వచ్చింది. అబ్దుల్లా కుతుబ్‌షా తన తల్లి హయత్‌ భక్షి పేరు మీద హయత్‌నగర్‌ నిర్మించాడు. గోల్కొండ కోటకు ఒక కిలోమీటరు దూరంలో బంజారా దర్వాజ వద్ద కుతుబ్‌షాహీ పాలకులకు చెందిన ఏడు సమాధులు ఉన్నాయి. 
 

చిత్రలేఖనం
కుతుబ్‌షాహీల కాలం చిత్రలేఖనంపై హిందూ పారశీక పద్ధతుల సమ్మేళనం, పాశ్చాత్య సంప్రదాయ ప్రభావం ఉండేది. నాటి చిత్రకళను దక్కనీ వర్ణ చిత్రకళ  అనేవారు. దక్కనీ వర్ణ చిత్రశైలికి పితామహుడు మీర్‌హాసిం. ఈ కాలంలో దక్కన్‌లో గ్రంథాలను సూక్ష్మచిత్రాలతో అలంకరించే పద్ధతి ఉండేది.  ‘షాద్‌ షాహి దక్కన్‌’ అనే గ్రంథంలో తారిఫ్‌ హుసేన్‌షా రూపొందించిన 14 మినియేచర్‌ చిత్రాలున్నాయి. ఇవి దక్షిణ దేశంలోని మొదటి సూక్ష్మ చిత్రాలు. ఈ గ్రంథంలో రాక్షస తంగడి యుద్ధ చిత్రాలు, సుల్తాన్‌ దర్బారు జీవితం, గ్రామీణ సౌందర్యం చిత్రాలను పొందుపరిచారు. ఈ శైలి అబ్దుల్లా, తానీషాల కాలంలో పరిపూర్ణత సాధించింది. నాటి ఊరేగింపులో అక్కన్న, మాదన్న చిత్రాలు కనిపిస్తాయి. అవి అజంతా చిత్రాలను పోలి ఉంటాయి. అబుల్‌హసన్‌ కాలంలో అర్ధముఖాకృతిలో చిత్రించిన అబ్దుల్లా, అబుల్‌హసన్‌ చిత్రాలు ఇటీవల బయటపడ్డాయి.

నృత్యం, సంగీతం
కుతుబ్‌ షాహీ పాలకులు సంగీత, నృత్య కళలను బాగా ఆదరించారు. దర్బారులో, సామంతుల ఆస్థానాల్లో నృత్య ప్రదర్శనలు జరిగేవి. సాంఘిక, మత ఉత్సవాల సందర్భంగా నృత్య, సంగీత ప్రదర్శనలు నిర్వహించేవారు. ఫ్రెంచి నగల వ్యాపారి టావెర్నియర్‌ ప్రకారం గోల్కొండలోని రెండు వేలమంది వేశ్యలు నృత్య, సంగీతాల్లో నిష్ణాతులు. ప్రతి శుక్రవారం దర్బారులో నృత్యం చేసేవారు. కూచిపూడి భాగవతులు బ్రాహ్మణులు.నృత్యనాటకాలను ప్రదర్శించేవారు.అబుల్‌హసన్‌ కూచిపూడి గ్రామాన్ని వీరికి మిరాశీగా ఇచ్చాడు.కూచిపూడి నృత్యానికి మూలపురుషుడు సిద్ధేంద్రయోగి ఈ కాలానికి చెందినవాడే. ఈ నాట్య సంప్రదాయంలో భామాకలాపం, ఉషాపరిణయం, గోలకలాపం లాంటి ప్రదర్శనలు ప్రజాదరణ పొందాయి. పేరిణి నృత్యం, భాండికం, చర్చరి, దండులాస్యం, కుండలీనృత్యం లాంటి నాట్యాలుండేవి. త్రిపుట, ఏకజంపె మొదలైన తాళాలుండేవి. హెందోళ, దేవగాంధారి, భైరవి, మాళవి, కన్నడ రాగాలుండేవి. అబ్దుల్లా కుతుబ్‌షా ఆస్థానంలో తులసీమూర్తి,  అబుల్‌హసన్‌ కాలంలో గులాం అలీ అనే సంగీత విద్వాంసులు ఉండేవారు. 


డాక్ట‌ర్ ఎం.జితేంద‌ర్ రెడ్డి 

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

కుతుబ్‌షాహీలు (క్రీ.శ.1512 - 1687)

రేచర్ల పద్మనాయకులు

ఇక్ష్వాకులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 26-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌