• facebook
  • whatsapp
  • telegram

జాతీయాదాయం

ఒక దేశంలో సంవత్సరం కాలంలో తయారైన మొత్తం వస్తుసేవల అంతిమ నికర విలువనే జాతీయ ఆదాయంగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థలోని ఆర్థిక కార్యకలాపాల వల్ల వస్తుసేవల ఉత్పత్తి పెరిగితే దేశ ఆదాయం పెరుగుతుంది. అంటే ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయానికి సంబంధం ఉంటుంది.

జాతీయాదాయ భావనలు

స్థూల దేశీయోత్పత్తి (GDP): ఒక దేశంలో సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసే మొత్తం వస్తుసేవల విలువను స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఈ భావనలో పరిగణించే వస్తుసేవలను అంతిమ వస్తుసేవలుగా భావించాలి. జాతీయాదాయ అంచనాల్లో అంతిమ వస్తువులనే లెక్కిస్తారు. అంతిమ ఉత్పత్తిలో నాలుగు అంశాలు ఉంటాయి. 

    1) వినియోగం 2) పెట్టుబడి 3) ప్రభుత్వ కొనుగోళ్లు 4) నికర లాభాలు (ఎగుమతులు - దిగుమతులు)

నికర జాతీయోత్పత్తి (NNP): వస్తుసేవల ఉత్పత్తిలో యంత్ర పరికరాల ఉపయోగం వల్ల అరుగుదల, తరుగుదల ఉంటాయి. మొత్తం ఉత్పత్తిలో అరుగుదల, తరుగుదలను మినహాయిస్తే నికర జాతీయోత్పత్తి తెలుస్తుంది.

    నికర జాతీయోత్పత్తి  = స్థూల జాతీయోత్పత్తి - తరుగుదల 

జాతీయాదాయం (National Income): భూమి, శ్రామికులు, మూలధనం లాంటి ఉత్పత్తి కారకాలు సంపాదించిన ఆదాయాల మొత్తాన్ని జాతీయాదాయంగా చెప్పవచ్చు. నికర జాతీయోత్పత్తిలో పరోక్ష వ్యాపార పన్నులను (ఆస్తిపన్ను, అమ్మకం పన్ను) మినహాయిస్తే జాతీయాదాయం వస్తుంది.

    జాతీయాదాయం = నికర జాతీయోత్పత్తి - పరోక్ష పన్నులు

వైయక్తిక/వ్యక్తిగత ఆదాయం (Personal Income): ఒక కుటుంబానికి వివిధ మార్గాల నుంచి లభించే మొత్తం ఆదాయాన్ని వైయక్తిక ఆదాయం అంటారు.

వ్యయార్హ ఆదాయం (Disposable Income): వైయక్తిక ఆదాయంలో వ్యక్తిగత పన్నులను మినహాయిస్తే వ్యయార్హ ఆదాయం వస్తుంది. వ్యక్తి వినియోగానికి, పొదుపు చేయడానికి ఉపయోగపడే ఆదాయం వ్యయార్హ ఆదాయం.

కలపబడిన స్థూల విలువ (Gross Value Added): ఉత్పత్తి చేసిన అన్ని వస్తుసేవల స్థూల విలువ నుంచి వాటి ఉత్పత్తి కోసం ఉపయోగించిన ఉత్పాదకాల విలువను తీసివేస్తే కలపబడిన స్థూల విలువ తెలుస్తుంది. దీన్నే జాతీయ ఉత్పత్తిగా పేర్కొంటారు.

కలపబడిన నికర విలువ (Net Value Added): కలపబడిన స్థూల విలువ నుంచి స్థిర మూలధన వినియోగ విలువ తీసివేస్తే కలపబడిన నికర విలువ తెలుస్తుంది.

తలసరి ఆదాయం లేదా తలసరి స్థూల జాతీయోత్పత్తి (PCI): సగటున ఒక వ్యక్తి పొందే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. జాతీయాదాయాన్ని మొత్తం దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది

జాతీయాదాయ అంచనాలు

    స్వాతంత్య్రానికి పూర్వం మన దేశంలో జాతీయాదాయాన్ని మొదటిసారి గణించినవారు దాదాభాయ్‌ నౌరోజీ.  ఈయన పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు. సంపద దోపిడి (డ్రైన్‌ థియరీ) సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈయన 1868 సంవత్సరానికి సంబంధించిన జాతీయాదాయ అంచనాలు తయారుచేశారు. ఆ తర్వాత లెక్కించినవారు విలియం డిగ్బీ (1899), ఎఫ్‌.షిర్రాస్‌ (1911, 1922, 1931), షా (1921), కాంబట్టా (1925 - 29), ఆర్‌.సి.దేశాయ్‌ (1931 - 40).

    స్వాతంత్య్రానికి ముందు దేశంలో శాస్త్రీయ లేదా ఒక క్రమ పద్ధతిలో తొలిసారిగా జాతీయాదాయాన్ని 1931 - 32లో డాక్టర్‌ వి.కె.ఆర్‌.వి.రావు (విజయేంద్ర కస్తూరిరంగా వరదరాజారావు) అంచనా వేశారు. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వం 1949లో జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి, దత్తాంశాల సేకరణకు ఒక సమగ్రమైన పద్ధతిని రూపొందించడానికి జాతీయాదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి పి.సి.మహలనోబిస్‌ అధ్యక్షత వహించగా డి.ఆర్‌.గాడ్గిల్, వి.కె.ఆర్‌.వి.రావు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 1948 - 49 నుంచి 1950 - 51 వరకు జాతీయాదాయానికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తూ తన మొదటి నివేదికను 1954 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమర్పించింది.

జాతీయాదాయ అంచనా - సంస్థల ఏర్పాటు

    జాతీయాదాయాన్ని అంచనావేయడానికి 1951లో కేంద్ర గణాంక సంస్థను (Central Statistical Organisation) ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. 1954 నుంచి 2019 వరకు సీఎస్‌వో జాతీయాదాయాన్ని అంచనావేసింది. జాతీయ నమూనా సర్వేక్షణ సంస్థ (National Sample Survey Organisation) ను 1950లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. 2019లో ఎన్‌ఎస్‌ఎస్‌వో, సీఎస్‌వోలను విలీనం చేసి ‘జాతీయ గణాంక సంస్థ’ (National Statistical Office) గా ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ సంస్థ 2019 నుంచి మన దేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేస్తుంది.

    జాతీయ గణాంక సంస్థ (NSO) వివిధ ఆధార సంవత్సరాల ప్రాతిపదికన జాతీయాదాయాన్ని అంచనా వేస్తుంది. 

    1) 1948 - 49

    2) 1960 - 61

    3) 1970 - 71

    4) 1980 - 81

    5) 1993 - 94

    6) 1999 - 2000

    7) 2004 - 05

    8) 2011 - 12 (ప్రస్తుతం)

    ప్రస్తుతం మన దేశంలో జాతీయాదాయాన్ని అంచనావేయడానికి తీసుకుంటున్న ప్రాతిపదిక/ఆధార సంవత్సరం 2011 - 12 (8వది). 2011 - 12 ప్రాతిపదిక సంవత్సరాన్ని 2017 - 18 ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకోవాలని ప్రతిపాదన చేస్తున్నారు.

జాతీయాదాయ అంచనా - రంగాల విభజన

    ఎన్‌ఎస్‌వో ప్రస్తుత లేదా మార్కెట్ ధ‌ర‌లు, నిల‌క‌డ ధ‌ర‌ల్లో జాతీయాదాయాన్ని అంచనావేస్తుంది. జాతీయాదాయాన్ని అంచనావేయడానికి ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల విభజనను కింది విధంగా ఉపయోగిస్తుంది. 

1) ప్రాథమిక రంగం: వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలు; అడవులు, చేపల పెంపకం, గనులు.

2) ద్వితీయ రంగం: వస్తు తయారీ, విద్యుత్, గ్యాస్, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, నిర్మాణ రంగం. 

3) తృతీయ రంగం/సేవా రంగం: బ్యాంకులు, బీమా, రవాణా, కమ్యూనికేషన్స్, వ్యాపారం, వర్తకం. 

జాతీయాదాయాన్ని కొలిచే పద్ధతులు

    జాతీయ గణాంక సంస్థ జాతీయాదాయాన్ని అంచనావేయడానికి కింది పద్ధతులను ఉపయోగిస్తుంది.  

1)     ఉత్పత్తి మదింపు పద్ధతి: దీన్ని ఇన్వెంటరీ పద్ధతి, వాల్యు యాడెడ్‌ మెథడ్‌ అంటారు. ఒక దేశంలోని వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన మొత్తం వస్తుసేవల ద్రవ్య విలువను జాతీయాదాయంగా చెప్పవచ్చు.

2)     ఆదాయ మదింపు పద్ధతి: ఇందులో ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఉత్పత్తి కారకాలు పొందే మొత్తం ఆదాయాలను కలపడం ద్వారా దేశ జాతీయాదాయాన్ని నిర్ణయిస్తారు. 

3)     వ్యయాల మదింపు పద్ధతి: ఇందులో అంతిమ వస్తుసేవలపై ఖర్చు చేసిన మొత్తాలను కలపడం ద్వారా జాతీయాదాయాన్ని లెక్కిస్తారు.

*  ముఖ్యంగా ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతులను ఉపయోగించి జాతీయాదాయాన్ని అంచనావేస్తుంది. 

జాతీయదాయ అంచనాల వల్ల ఉపయోగాలు

*  ఆర్థిక వ్యవస్థ మొత్తం పనితీరును విశ్లేషిస్తుంది.

స్థూల జాతీయోత్పత్తిలోని వివిధ రంగాల వాటాలు, వాటి ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది.

*   దేశ ఆర్థిక ప్రగతిని తెలుసుకోవచ్చు.

*   పన్నుల విధానంలోని మార్పులు తెలుసుకోవచ్చు

*   ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని తెలుసుకోవచ్చు.

*   దేశంలోని వినియోగం, పొదుపు స్థాయిని తెలుసుకోవచ్చు. 

*    2021 - 22 భారత ఆర్థిక సర్వే ప్రకారం 2021 నాటికి  జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా 18.8%, పరిశ్రమల రంగం వాటా 28.2%, సేవారంగం వాటా 53 శాతంగా ఉంది. దీనిలో సేవారంగం వాటా ఎక్కువగా, వ్యవసాయ రంగం వాటా తక్కువగా ఉంది. 

*    2021 - 22 భారత ఆర్థిక సర్వే ప్రకారం ప్రస్తుత ధరల్లో స్థూల జాతీయాదాయం రూ.2,30,38,772 కోట్లు కాగా స్థిర ధరల్లో రూ.1,46,40,445 కోట్లుగా ఉంది. 

*    ప్రస్తుత ధరల్లో నికర జాతీయాదాయం రూ.2,05,73,371 కోట్లు ఉండగా స్థిర ధరల్లో రూ.1,28,61,032 కోట్లుగా ఉంది. 

*     ప్రస్తుత ధరల్లో తలసరి నికర జాతీయాదాయం రూ.15,03,326 ఉండగా స్థిర ధరల్లో రూ.93,973గా ఉంది. 


    రచయిత: బండారి ధనుంజయ

మరింత సమాచారం ... మీ కోసం!

ఆర్థిక సంఘం

వస్తు సేవల పన్ను

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ మార్కెట్

ఆర్థిక వృద్ధి - సూచికలు

Posted Date : 12-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌