• facebook
  • whatsapp
  • telegram

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (1956 - 2014)

వనరులు ఉన్నా... వృద్ధి సున్నా!

  తెలంగాణ ఆర్థికవ వ్యవస్థను అధ్యయనం చేసేటప్పుడు మొదటగా ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక ప్రగతికి ప్రధానమైన వ్యవసాయం, పరిశ్రమలు, నీటిపారుదల తదితర రంగాలు నాడు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. అందుబాటులో ఉన్న అధికారిక లెక్కల ప్రకారం అప్పటికి తెలంగాణ ప్రాంతంలో వనరులు ఉన్నప్పటికీ ఆ మేరకు వృద్ధి జరగలేదనేది నిపుణుల అభిప్రాయం. అభ్యర్థులు పరీక్షల కోణంలో ఆ వివరాలను అర్థం చేసుకోవాలి. 

 

     ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు దశల్లో (1956 - 70, 1971 - 1990, 1991 - 2014) అధ్యయనం చేశారు. వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, విద్యుచ్ఛక్తి రంగాలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య అనేక తేడాలు ఉన్నాయి.  

  1956 నవంబరు 1కి ముందు వరకు కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో విలీనమై ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆలోచనకు 1905లోనే బీజం పడింది. ఈ ఆలోచన విశాలాంధ్ర ఏర్పాటుకు దారితీసింది. 

 

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు ముందు ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు

* రాజధాని సమస్య 

* ఆంధ్రాలో బొగ్గు నిల్వలు లేకపోవడం

* నీటివనరులు, విద్యుచ్ఛక్తి, ఖనిజ సంపద, ముడిసరకుల కొరత 

* లోటు బడ్జెట్, తలసరి ఆదాయం తక్కువగా ఉండటం 

* అవిభక్త ఆంధ్రప్రదేశ్‌/తెలంగాణ పరిస్థితులకు సంబంధించి 1956 - 2014 కాలం మొత్తాన్ని మూడు దశలుగా విభజించారు 

 

మొదటి దశ (1956 - 1970): ఇది విలీనం తర్వాత దశ. ఈ సమయంలో 1969లో తెలంగాణ ఉద్యమం జరిగింది.  తెలంగాణ ఆర్థిక వ్యవస్థను హైదరాబాద్‌ నగరంతో కలిపి 10 జిల్లాలుగా ఉన్న భూభాగంగా గుర్తించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడే  నాటికి తెలంగాణ భూభాగం 9 జిల్లాలు. అవి: మహబూబ్‌నగర్, నల్గొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. 1976లో రంగారెడ్డి 10వ జిల్లాగా ఏర్పడింది. 

 

రెండో దశ (1971 - 1990): ఈ దశలో ప్రభుత్వ రంగం ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన పాత్ర పోషించింది.

 

మూడో దశ (1991 - 2014): దీన్ని ఆర్థిక సంస్కరణల అమలు, సంస్కరణల అనంతర దశగా పేర్కొంటారు.  

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మౌలిక లక్షణాలు

భూభాగం 44314 చదరపు మైళ్లు (41.9)
జనాభా (1961 జనాభా లెక్కల ప్రకారం) 127.12 లక్షలు (35.3)
జనసాంద్రత (1961) 286 చ.కి.మీ.
సాగు కింద ఉన్న స్థూల భూమి (లక్షల ఎకరాల్లో)
* 1956 - 57                              123.8
* 1967 - 68                              124.2
నీటిపారుదల కింద ఉన్న స్థూల భూమి (లక్షల ఎకరాల్లో)
* 1956 - 57                                   23
* 1967 - 68                                   26.5

 

తెలంగాణ ఆదాయంలో వివిధ రంగాల వాటా (శాతంలో)

రంగం శాతం
వ్యవసాయ రంగం 37%
పరిశ్రమలు 24%
సేవలు 39%

 

వ్యవసాయ రంగం

 హైదరాబాద్‌ రాజ్యం భారతదేశంలో విలీనమైన తర్వాత 1949లో జాగిర్దారీ రద్దు చట్టం అమల్లోకి వచ్చింది. భూస్వామ్య వ్యవస్థలోని జాగీర్లు, మక్తాలు, మున్సబ్‌లు రద్దయ్యాయి. 1950లో అమల్లోకి వచ్చిన హైదరాబాద్‌ కౌలుదారీ చట్టం ప్రకారం కౌలు రైతులకు రక్షిత కౌలు కింద యాజమాన్య హక్కులు ఖరారయ్యాయి. దీంతో సాగు కిందకు వచ్చిన భూమితో పాటు రైతులు చెల్లించే భూమిశిస్తు కూడా పెరిగింది. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. 

  1956 నుంచి 12 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి తీరు పర్యవసానమే 1969లో జరిగిన ఉద్యమానికి కారణమని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గొప్పగా ఉందని చెప్పుకున్నప్పటికీ 1969లో వెలువడిన తెలంగాణ ప్రాంతీయ కమిటీ నివేదిక (మధ్యంతర నివేదిక) తెలంగాణలో అభివృద్ధి స్థాయి భారతదేశం కంటే తక్కువగా ఉందని నిర్ధారించింది. వ్యవసాయం, నీటిపారుదల, విద్య, ప్రసారాలు, రవాణా లాంటి రంగాల్లో అభివృద్ధి స్థాయి దేశ ప్రగతి సగటు స్థాయిలో సగం కూడా లేదని ఈ నివేదిక పేర్కొంది. 1956 - 57లో సాగు కింద ఉన్న మొత్తం భూమి 123.8 లక్షల ఎకరాలు కాగా 1967 - 68 నాటికి అది అదే స్థాయిలో 124.2 లక్షల ఎకరాలుగానే ఉంది. అదేవిధంగా నీటిపారుదల కింద ఉన్న విస్తీర్ణం 1956 - 57లో 23 లక్షల ఎకరాలు ఉండగా 1967 - 68లో కొద్ది మార్పులతో 26.47 లక్షల ఎకరాలుగా ఉంది. ఈ కాలంలో సాగు విస్తీర్ణం, నీటిపారుదల కింద ఉన్న విస్తీర్ణాల్లో సాధించిన పెరుగుదల నామమాత్రమే.  

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తెలంగాణలో సాగు కింద ఉన్న భూభాగం 40%. కానీ కీలక ఉత్పాదకాల్లో తెలంగాణ వాటా 1967 - 68 నాటికి 27% నుంచి 35% మాత్రమే. 1956 - 69 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలంగాణలో వ్యవసాయం కోసం ఖర్చు చేసిన మొత్తం భూభాగం వాటా ప్రకారంగా లేదా తెలంగాణ జనాభా వాటా ప్రకారంగా లేదా సాగు విస్తీర్ణం వాటా ప్రకారంగా ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉంది. కుమార్‌ లలిత్‌ నివేదిక ప్రకారం తెలంగాణ - ఆంధ్రలో 2 : 2.5 నిష్పత్తిలో వ్యయం చేయాల్సి ఉండగా వాస్తవంగా 1 : 2.2 నిష్పత్తిలో జరిగింది. రెండో ప్రణాళిక (1956 - 60) కాలంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ వాటా 45% ఉన్నప్పటికీ తెలంగాణలో ఖర్చు చేసిన మొత్తం 34%కి మించలేదు. పర్యవసానంగా వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి కావల్సిన ప్రోత్సాహకం లభించలేదు. 

 

నీటిపారుదల 

  సాగునీరు వ్యవసాయాభివృద్ధికి కీలకమైంది. 1956 - 57లో తెలంగాణలో స్థూల సాగు కింద ఉన్న భూమిలో 18.5% మాత్రమే సాగునీటి సౌకర్యాన్ని కలిగి ఉంది. 1967 - 68 నాటికి ఇది 21.3%కి పెరిగింది. ఆంధ్రాలో స్థూల సాగుభూమిలో 33% నీటి సౌకర్యాన్ని కలిగి ఉంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల కృష్ణానది నుంచి 174.3 టీఎంసీల నీరు రావల్సి ఉండగా కేవలం 17.48 టీఎంసీలు మాత్రమే జూరాల ప్రాజెక్టుకు కేటాయించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన భీమ, ఎగువ కృష్ణ, నందికొండ, రాజోలిబండ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై సరైన నీటి కేటాయింపులు లేకపోవడం వల్ల ఈ జిల్లాలో నీటిపారుదల కనిష్ఠ స్థాయిలో ఉండి తరచూ క్షామానికి గురైంది. కృష్ణానది జలాల అంతర్‌ రాష్ట్ర పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం 1969లో ఆర్‌.ఎస్‌.బచావత్‌ ఆధ్వర్యంలో ఇద్దరు సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 1973లో సమర్పించింది. 

 

పరిశ్రమలు

  తెలంగాణలో ఉన్న పరిశ్రమలు వ్యవసాయాధారితమైనవి కావు. సహజవనరుల లభ్యత వల్ల జిల్లాలు వివిధ పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు; ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లి బొగ్గు, ముడిఇనుము లాంటి ఖనిజ ఆధారిత పరిశ్రమలకు అనుకూలమైనవి. ఆదిలాబాద్‌ జిల్లా అటవీ వనరుల ఆధారిత పరిశ్రమలకు అనువైంది. దేశంలోని ప్రధాన మార్కెట్‌లతో అనుసంధానం చేసుకునే అవకాశం హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాలకు ఉండటం వల్ల ఇవి అనేక పరిశ్రమలకు నెలవుగా ఉన్నాయి. సింథటిక్‌ డ్రగ్‌ ఫ్యాక్టరీ, భారత హెవీ ఎలక్ట్రికల్స్, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్‌ ఫోర్బ్‌ లాంటి పరిశ్రమలు ప్రభుత్వరంగంలో ప్రధానమైనవి. హైదరాబాద్‌లోని ఆల్విన్‌ మెటల్స్, ఆస్‌బెస్టాస్, సిమెంట్‌ పరిశ్రమలు; ఆంధ్రప్రదేశ్‌లోని ఎలక్ట్రికల్‌ పరికరాల కార్పొరేషన్‌ లాంటివి ప్రైవేట్‌ రంగంలోని పరిశ్రమలు. 

  పారిశ్రామికాభివృద్ధి ఎక్కువగా హైదరాబాద్‌ పట్టణానికే పరిమితమైంది. ఇక్కడ భూమి, నీరు, విద్యుత్, మానవశ్రమ విరివిగా లభించడం వల్ల పరిశ్రమలను స్థాపించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడే నాటికి తెలంగాణ పారిశ్రామికంగా ముందంజలో ఉంది. కానీ పారిశ్రామికాభివృద్ధికి సరైన ప్రోత్సాహం లభించలేదు. హైదరాబాద్‌ రాష్ట్రంలో స్థాపించిన పరిశ్రమలైన బోధన్‌లోని నిజాం చక్కెర కర్మాగారం, సిర్పూర్‌లోని పేపర్, సరసిల్క్‌ పరిశ్రమలు, వరంగల్‌ జిల్లాలోని అజాంజాహి మిల్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత (1956 - 70) నిరాదరణకు గురయ్యాయి. 

 

 

రచయిత: బండారి ధనుంజయ

 


 

మరిన్ని అంశాలు... మీ కోసం!

తెలంగాణలో భూసంబంధాలు

వ్యవసాయ రంగం

1956 నాటి తెలంగాణ ఆర్థిక ప‌రిస్థితులు

 

Posted Date : 16-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌