• facebook
  • whatsapp
  • telegram

నిరుద్యోగిత 

సమస్యలకే సమస్య!


ప్రపంచ వ్యాప్తంగా పేద దేశమైనా, పెద్ద ధనిక దేశమైనా పట్టిపీడించే సమస్య ఒకటే, అదే నిరుద్యోగం. అదో సామాజిక, ఆర్థిక సమస్య. సరైన చర్యలు తీసుకోకపోతే వర్తమానాన్ని వణికిస్తుంది. భవిష్యత్తును భగ్నం చేస్తుంది. సమస్యలకే సమస్యగా మారి అపార మానవవనరులను నిర్వీర్యం చేస్తుంది. దేశాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. అందరినీ వేధిస్తున్న ఆ నిరుద్యోగ సమస్యకు కారణాలు, అందులోని రకాల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. 

పనిచేసే వయసు అంటే 15 నుంచి 60 సంవత్సరాలు. ఆ మధ్యలో వయసు కలిగి, పని చేయగలిగిన సామర్థ్యం ఉండి,  పని చేయాలనే కోరిక ఉన్న వ్యక్తులకు, మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా పని లభించని స్థితిని నిరుద్యోగం అంటారు. 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వృద్ధుల్లో పనిచేసే సామర్థ్యం, కోరిక ఉన్న‌ప్ప‌టికీ అలాంటి వారిని నిరుద్యోగులుగా భావించ‌రు. 15 - 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నప్పటికీ అంగవైకల్యం లేదా మానసిక లోపం ఉండి పనిచేసే సామర్థ్యం లేని వారిని నిరుద్యోగులుగా గుర్తించరు. కొంతమంది ధనికుల్లో పనిచేసే సామర్థ్యం, వయసు ఉన్నప్పటికీ వారిలో పనిచేయాలనే కోరిక లేక స్వచ్ఛందంగా నిరుద్యోగులుగా ఉంటే, వారినీ నిరుద్యోగులుగా భావించరు.


    నిరుద్యోగం ఒక సాంఘిక, ఆర్థిక సమస్య. అది ఒక దేశ వర్తమాన, భవిష్యత్తు జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది అనేక కొత్త సమస్యలకు కారణంగా మారుతోంది. మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి అభిప్రాయంలో ‘నిరుద్యోగం అనేది సమస్యలకే సమస్య’. యువకుల్లో కొందరు తీవ్రవాదులుగా మారడానినికి ఇదో ప్రధాన కారణంగా నిలుస్తోంది. నిరుద్యోగుల రూపంలో అపార మానవ వనరులు నిరుపయోగంగా పడి ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధి  కుంటుపడుతోంది. 


    అభివృద్ధి చెందిన దేశాల్లో సార్థక డిమాండ్‌ సమస్య (కొరత) వల్ల నిరుద్యోగం ఏర్పడుతుంది. అంటే ఉత్పత్తయిన వస్తువులకు తగినంత డిమాండ్‌ లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. దీన్ని ‘సార్థక డిమాండ్‌ కొరత’ (Lack of Effective Demand) అంటారు. ఈ డిమాండ్‌ కొరత వల్ల ఉత్పత్తి ప్రోత్సాహం తగ్గి శ్రామికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో మూలధన కొరత వల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది.

నిరుద్యోగిత - భావనలు

*    ఒక వ్యక్తి రోజుకు ఎనిమిది గంటలు లేదా ఏడాదిలో 273 రోజులు పనిచేస్తే అతడిని ప్రామాణిక సంవత్సర ఉద్యోగిగా పరిగణిస్తారు.

*    మన దేశంలో నిరుద్యోగిత గణాంకాలు అంచనా వేసిన సంస్థ - జాతీయ నమూనా సర్వే సంస్థ (National Sample Survey Organisation - NSSO). దీన్ని 1950లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది.  

*    1951లో స్థాపించిన కేంద్ర గణాంక సంస్థ (Central Stastical Organisation - CSO), NSSO లను 2019లో విలీనం చేసి ‘జాతీయ గణాంక సంస్థ’ (National Statistical Organisation - NSO) గా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రస్తుతం మన దేశంలో నిరుద్యోగిత గణాంకాలను అంచనా వేస్తోంది. 

*    ఆరో పంచవర్ష ప్రణాళికను (1980-85) ‘నిరుద్యోగిత నిర్మూలన ప్రణాళిక’ అని కూడా పిలుస్తారు. 

*    జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నిరుద్యోగితను మూడు రకాలుగా వర్గీకరించింది.


1) నిరంతర నిరుద్యోగిత లేదా సాధారణ స్థితి ఉండే నిరుద్యోగిత: ఒక వ్యక్తి పనిచేయడానికి ఇష్టపడి, పనికోసం ప్రయత్నించి, సంవత్సరంలో ఎక్కువ కాలం ఖాళీగా ఉండటాన్ని నిరంతర నిరుద్యోగిత అంటారు. శాశ్వత ఉద్యోగాన్వేషణలో ఉన్న విద్యావంతులు, నైపుణ్యం ఉన్నవారికి ఈ రకమైన భావన చాలావరకు సరిపోతుంది. దీన్నే బహిరంగ నిరుద్యోగిత అని కూడా అంటారు.

2) వారపరమైన స్థితి ఉండే నిరుద్యోగిత (Weekly Status Unemployment): వారంలో ఒక వ్యక్తి కనీసం గంట పనిచేస్తే వారపరమైన స్థితి ప్రకారం అతడిని ఉద్యోగిగా పరిగణిస్తారు. కనీసం గంట కూడా పనిచేయకపోతే అతడిని నిరుద్యోగిగా భావిస్తారు.

3) రోజువారీ స్థితి ఉండే నిరుద్యోగిత (Daily Status Unemployment): ఒక వ్యక్తికి రోజులో ఏ మాత్రం పని దొరకని పరిస్థితిని రోజువారీ స్థితి ఉన్న నిరుద్యోగితగా పరిగణిస్తారు.

కారణాలు:

*    ఉపాధి రహిత వృద్ధి

*    శ్రామిక శక్తిలో పెరుగుదల

*    ప్రతికూల సాంకేతికత

*    ప్రతికూల విద్యా వ్యవస్థ 

*    సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు

 

నిరుద్యోగిత రకాలు

ప్రచ్ఛన్న నిరుద్యోగిత (Disguised Unemployment): ఈ నిరుద్యోగిత సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ రంగంలో ఉంటుంది. కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఏర్పడే చక్రీయ నిరుద్యోగితకు కూడా ఈ భావనను అన్వయించవచ్చు. ఉత్పత్తి ప్రక్రియలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది ఉంటే వారిని ‘ప్రచ్ఛన్న నిరుద్యోగులు’ అంటారు. పని చేస్తున్న మొత్తం శ్రామికుల్లో కొంతమందిని తొలగించినప్పటికీ ఉత్పత్తి ఏమాత్రం తగ్గదు. అలాంటివారిని కూడా ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగి ఉపాంత ఉత్పాదకత శూన్యంగా లేదా రుణాత్మకంగా లేదా నామమాత్రంగా ఉండటమే దీనికి కారణం. ఈ రకమైన నిరుద్యోగిత భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉంది.

రుతు సంబంధిత నిరుద్యోగిత: కొన్ని రంగాల్లో సంవత్సరంలో కొద్దిరోజులు మాత్రమే ఉపాధి లభిస్తుంది. మిగిలిన కాలంలో వారు నిరుద్యోగులుగా ఉంటారు. ఈ రకమైన నిరుద్యోగితను రుతు సంబంధిత నిరుద్యోగిత అంటారు. భారతదేశంలోని వ్యవసాయ రంగం, దాని అనుబంధ పరిశ్రమల్లో ఈ నిరుద్యోగిత కనిపిస్తుంది. 

వ్యవస్థాపరమైన నిరుద్యోగిత: ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తుంది. ఉదా: భారతదేశం. ఆర్థిక వ్యవస్థలో గత 30 - 40 ఏళ్లలో పెరిగిన శ్రామికుల సంఖ్యా రేటు కంటే ఉద్యోగ అవకాశాల పెరుగుదల రేటు తక్కువగా ఉండటం వల్ల ఈ నిరుద్యోగిత ఏర్పడుతుంది. ఆర్థికాభివృద్ధి రేటు మందకొడిగా ఉండటమే దీనికి కారణం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉండటం, పూరక వనరుల కొరత కారణంగా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు కుంటుపడి వ్యవస్థాపరమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది. ఈ రకమైన నిరుద్యోగితను బహిరంగ నిరుద్యోగిత అంటారు. ఉపాధి అవకాశాలు లేక పెద్ద సైన్యంలా ఉండే ఈ నిరుద్యోగాన్ని ‘మార్క్సియన్‌ నిరుద్యోగిత’ అని ప్రముఖ మహిళా ఆర్థికవేత్త జాన్‌ రాబిన్‌సన్‌ పేర్కొన్నారు. 

అల్ప ఉద్యోగిత (Under Employment): ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉత్పాదక పనుల్లో పనిచేయడాన్ని అల్ప ఉద్యోగిత అంటారు.

సంఘృ ష్ట నిరుద్యోగిత (Frictional Unemployment): దేశంలోని శ్రామికులు ఒక వృత్తి నుంచి మరొక వృత్తికి మారే కాలంలో ఏర్పడే నిరుద్యోగితను సంఘృష్ట నిరుద్యోగిత అంటారు.

చక్రీయ నిరుద్యోగిత: అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాపార కార్యకలాపాల్లో మందకొడితనం ఏర్పడటం వల్ల సాధారణంగా ఏర్పడే నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగిత అంటారు.

సాంకేతికపర నిరుద్యోగిత: ఆర్థిక వ్యవస్థలో కొత్త సాంకేతికత ప్రవేశం వల్ల శ్రామికులను తొలగించడం వల్ల ఏర్పడే నిరుద్యోగితను సాంకేతికపరమైన నిరుద్యోగిత అంటారు.

అనుద్యోగిత (Non - Employment): ఈ స్థితిలో ప్రజలు నిరుద్యోగులు కావచ్చు లేదా సంప్రదాయ అసంఘటిత రంగాల్లో  పనిచేస్తూ ఉండవచ్చు.

విద్యావంతుల్లో నిరుద్యోగిత: చదువుతోపాటు నైపుణ్యం ఉన్న వ్యక్తికి, అర్హతలకు తగిన ఉద్యోగం దొరకకపోతే ఆ వ్యక్తిని విద్యను పొందిన నిరుద్యోగి అంటారు. ఇది అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఉంటుంది. ఉదా: భారతదేశం 

బహిరంగ నిరుద్యోగిత (Open Unemployment): శ్రామికులకు చేయడానికి ఏ పని లభించకపోతే వారు బహిరంగ నిరుద్యోగిత కిందకు వస్తారు. చదువుకున్నవారు నిరుద్యోగులుగా ఉండటం, నైపుణ్యం లేని కారణంగా శ్రామిక నిరుద్యోగిత ప్రబలడం ఈ రకమైన నిరుద్యోగితలోకి వస్తాయి. భారతదేశంలో పనికోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్లడం తరచుగా కనిపిస్తుంది. దీన్ని కూడా బహిరంగ నిరుద్యోగితకు ఉదాహరణగా చెప్పవచ్చు.

తాజా గణాంకాలు (2021)

సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (CMIE) 2022 మే 15న వెల్లడించిన నివేదిక ప్రకారం నిరుద్యోగిత గణాంకాలు: 

*    భారతదేశ నిరుద్యోగిత రేటు - 7.3%

*    గ్రామీణ నిరుద్యోగిత రేటు - 6.8%

*    పట్టణ నిరుద్యోగిత రేటు - 8.5%


2022, ఏప్రిల్‌ ప్రకారం 

* తెలంగాణ నిరుద్యోగిత రేటు - 9.9 శాతం

* ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగిత రేటు -  5.3 శాతం


రచయిత: బండారి ధనుంజయ

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  జాతీయాదాయం

పన్నుల సంస్కరణలు - రాబడి మార్పులు

‣ ద్రవ్యోల్బణం

 

 ‣ ప్ర‌తిభ పేజీలు

ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 17-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌