• facebook
  • whatsapp
  • telegram

ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశాల్లో మార్పులు

బైపీసీ స్ట్రీమ్‌ కోర్సుల కోసం విశ్వవిద్యాలయాల వారీగా ప్రవేశాలు

పూర్వపు ఏపీఎంసెట్, ప్రస్తుత ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశ విధానాల్లో ఈ ఏడాది నుంచి సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పును విద్యార్థులూ, తల్లిదండ్రులూ గమనించాలి. పాత విధానంలో ప్రవేశాల కోసం ప్రయత్నిస్తే విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమలుచేయనున్న కౌన్సెలింగ్‌ విధానంపై అవగాహన లేకపోతే మంచి ర్యాంకర్లు సైతం సీట్లను కోల్పోవాల్సి ఉంటుందని గమనించాలి. 

ఎంసెట్‌ ప్రారంభంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ నిర్వహించి ఆయా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించేది. బైపీసీ స్ట్రీమ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం ఈ ఏడాది నుంచి అన్ని విశ్వవిద్యాలయాలకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లో ఈ విషయం పొందుపరిచింది. 

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం బైపీసీ స్ట్రీమ్‌ కోర్సుల్లో ప్రవేశ ప్రకటన విడుదల చేశాయి. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ మత్య్స విశ్వవిద్యాలయం కొద్ది రోజుల్లో ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 

ఒకే కౌన్సెలింగ్‌లో దాదాపు 29 కళాశాలలకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవడంలో గందరగోళం, ప్రాధాన్యాలు గుర్తించలేకపోవడం లాంటి సమస్యలతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకుని వేరువేరుగా కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నీట్‌ ఫలితాల అనంతరం ఏపీఈఏపీసెట్‌ సీట్ల కేటాయింపు చేసేందుకు ఆయా విశ్వవిద్యాలయాలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. 

బైపీసీ స్ట్రీమ్‌ కోర్సులు 

బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ గుంటూరు లాంఫారమ్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా భర్తీ చేయనున్నారు. బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ (పశువైద్య శాస్త్రం) కోర్సులో ప్రవేశాలను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించనున్నారు. బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ కోర్సులో ప్రవేశాలను పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం భర్తీ చేసుకోనుంది. బీఎఫ్‌ఎస్సీ (ఫిషరీ సైన్స్‌) ప్రవేశాలను నర్సాపురం కేంద్రంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ మత్య్స విశ్వవిద్యాలయం భర్తీ చేసుకోనుంది. విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం సీట్ల నిష్పత్తి ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నారు. 

విశ్వవిద్యాలయాల కళాశాలలు - అందుబాటులో ఉన్న సీట్లు 

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో గుంటూరు జిల్లా బాపట్ల, తిరుపతి, శ్రీకాకుళం జిల్లా నైరా, తూ.గో. జిల్లా రాజమండ్రి, కర్నూలు జిల్లా మహానంది కళాశాలలు, ఈ ఏడాది నుంచి నూతనంగా ప్రారంభించిన ఉదయగిరిలోని మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలలు శ్రీకాకుళం జిల్లా ఎడ్చెర్ల, ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం, మార్కాపురం, కడప జిల్లా బద్వేలు, అనంతపురంలో ఒకటి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 1002 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో తిరుపతి, కృష్ణాజిల్లా గన్నవరం, కడపజిల్లా ప్రొద్దుటూరు, శ్రీకాకుళం జిల్లా గరివిడిలో పశువైద్య కళాశాలలు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయం గుర్తింపుతో ఎలాంటి ప్రైవేటు పశువైద్య కళాశాలలూ రాష్ట్రంలో లేవు. ఈ నాలుగు కళాశాలల్లో 316 సీట్లు అందుబాటులో ఉంటాయి. తిరుపతిలో డెయిరీ టెక్నాలజీ కళాశాలలతో పాటు మరో ప్రైవేటు కళాశాల బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ కోర్సును అందిస్తున్నాయి. మొత్తం 92 డెయిరీ టెక్నాలజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. పశువైద్య విశ్వవిద్యాలయం జాతీయ కోటా సీట్లతో కలిపి పై విధంగా సీట్లను భర్తీ చేస్తారు. 

డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం, అన్నమయ్య జిల్లా అనంతరాజుపేట, మన్యం జిల్లా పార్వతీపురం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు వద్ద ప్రభుత్వ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రకాశం జిల్లాలో రెండు, అనంతపురం జిల్లాలో రెండు విశ్వవిద్యాలయ గుర్తింపు ఉన్న ప్రైవేటు ఉద్యాన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 480 ఉద్యాన శాస్త్ర సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌ మత్స్య విశ్వవిద్యాలయం పరిధిలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద మత్య్స కళాశాలలో 40 సీట్లు అందుబాటులో ఉంటాయి.

ఇవీ వెబ్‌సైట్‌లు

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం: బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్, బి.టెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం http://www.angrau.ac.in/ సందర్శించాల్సి ఉంటుంది. 

శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం: బీవీఎస్సీ (యానిమల్‌ హజ్బెండరీ), బీటెక్‌ (డెయిరీ టెక్నాలజీ) ప్రవేశాల  కోసం https://www.svvu.edu.in/ చూడాలి. 

డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం: బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ ప్రవేశాల కోసం https://www.drysrhu.ap.gov.in/ వెబ్‌సైట్‌ సందర్శించాల్సి ఉంటుంది.     

ఆంధ్రప్రదేశ్‌ మత్య్స విశ్వవిద్యాలయం పరిధిలోని మత్స్య కళాశాలలో ప్రవేశాల కోసం ఇంకా అధికారిక వెబ్‌సైట్‌ ప్రకటించలేదు. 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కనుమరుగవుతున్న లంకలు

‣ శాస్త్రసాంకేతిక అగ్రశక్తిగా చైనా

‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం

‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?

‣ స్టడీమెటీరియల్‌.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

Posted Date : 07-09-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌