• facebook
  • whatsapp
  • telegram

‘నీట్‌’ చక్రవర్తి ప్రథమ ర్యాంకర్‌ అనుసరించిన వ్యూహం

720 మార్కులతో టాప్‌ ర్యాంక్‌

డాక్టర్‌ కలను సాకారం చేసే నీట్‌ యూజీ పరీక్షను ఏటా ఎంతోమంది విద్యార్థులు రాస్తుంటారు. మన రాష్ట్రం నుంచి చాలామంది విజయం సాధిస్తుంటారు కూడా. అయితే శ్రీకాకుళానికి చెందిన వరుణ్‌ చక్రవర్తి ఈ పరీక్షలో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించి తెలుగు విద్యార్థుల సత్తా చాటాడు. దేశవ్యాప్తంగా లక్షల మందితో పోటీపడి తానెలా మొదటి ర్యాంకు సాధించాడో, ఇందుకు అనుసరించిన వ్యూహం ఏంటో చదువుతో పంచుకున్నాడు. ఆ వివరాలు తన మాటల్లోనే..

మంచి ర్యాంకు వస్తుందని ముందు నుంచి తెలుసు. కానీ మొదటి ర్యాంకు వస్తుందని రెండోసారి కీ విడుదలయ్యాకే తెలిసింది. పరీక్ష అవ్వగానే వచ్చిన కీలో ఒక బిట్‌ తప్పుపోవడం వల్ల 715 మార్కులే వచ్చాయి అనుకున్నా. కానీ తర్వాత సవరించిన ఫైనల్‌ కీ ద్వారా ఆ బిట్‌ కూడా నేనిచ్చిన జవాబే కరెక్ట్‌ కావడంతో మొత్తం 720 మార్కులు వచ్చినట్టయ్యింది. అయితే ఇదేమీ అనుకోకుండా వచ్చిన ఫలితం కాదు. రెండేళ్లుగా దీని కోసం శ్రమిస్తున్నా. వందలకొద్దీ టెస్టులు రాశా. ఆ తర్వాతే మొదటి ర్యాంకు వచ్చింది. 

పదోతరగతి వరకూ ఏం చదవాలి, ఎటువైపు వెళ్లాలి అనేదానిపై పెద్దగా ఆలోచన ఉండేది కాదు. కానీ టెన్త్‌కి వచ్చాక మ్యాథ్స్‌ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అదే సమయంలో నెమ్మదిగా బయాలజీ మీద ఆసక్తి పెరిగింది. దాంతో ఇంటర్‌లో ఎంపీసీ బదులు బైపీసీ తీసుకున్నా. మొదటి సంవత్సరం ఆరంభం నుంచే జనరల్‌ సిలబస్‌కు సమాంతరంగా నీట్‌కు ప్రిపరేషన్‌ జరిగేది. వారానికి ఒకసారి కాలేజీలో పరీక్ష పెట్టేవారు. సిలబస్‌ పూర్తయ్యాక రివిజన్‌ టైమ్‌లో వారానికి రెండు టెస్టులు జరిగేవి. ఏడాది చివరల్లో పూర్తిగా మొదటి సంవత్సరం ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు తెచ్చుకోవడంపై దృష్టి పెట్టాను. అలాగే ఇంటర్‌ రెండో సంవత్సరం ప్రారంభంలో తొలి మూడు నెలల్లోపే సిలబస్‌ ఒకసారి చదవడం పూర్తయ్యింది. తర్వాత నుంచి టెస్టులు రాయడమే పని. నీట్‌కు రెండు నెలలు ఉన్నాయనగా రోజూ గ్రాండ్‌ టెస్టులు రాసేవాడిని. ప్రతి టెస్ట్‌లోనూ 700 నుంచి 720 మార్కులు వచ్చేవి. అలా మొదటి నుంచి కోచింగ్‌ తీసుకోవడం వల్ల ఈ ర్యాంకు సాధించడం పెద్ద కష్టమేం కాలేదు.

మన వద్ద ఎక్కువమంది విద్యార్థులు స్టేట్‌ సిలబస్‌ చదువుతుంటారు. కానీ నీట్‌ జాతీయస్థాయి పరీక్ష కావడం వల్ల కొన్ని పాఠాలు అక్కడికీ ఇక్కడికీ కొంత తేడాగా ఉంటాయి. పరీక్షలకు స్టేట్‌ సిలబస్‌ను క్షుణ్ణంగా చదువుతూనే నీట్‌ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఫాలో అవ్వాలి. పరీక్ష మొత్తం ఆ పుస్తకాల నుంచే వస్తుంది కాబట్టి వాటిని మాత్రం ఎక్కడా ఏ పాయింట్‌ మిస్‌ అవ్వకుండా ఇండెక్స్‌తో సహా చదువుకోవాలి. ఎంత చదువుతామో దానికి తగ్గ సాధన తప్పనిసరి. 

నాకు ‘ఎర్రర్‌ బుక్‌’ అని ఒక పుస్తకం ఉండేది. ప్రతిసారీ టెస్ట్‌ రాసేటప్పుడు ఏ ప్రశ్నలకు తప్పు జవాబులు రాశానో, ఎక్కడ మార్కులు పోయాయో అందులో రాసుకునేవాడిని. ఆ కాన్సెప్ట్‌లు మళ్లీ చదివి, ఆ ప్రశ్నలు మళ్లీ సాధన చేసేవాడిని. వాటికి అనుబంధంగా ఎన్నిరకాలైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో అన్నీ చదివేవాడిని. అలా తప్పు అనేది జరగకుండా జాగ్రత్తపడ్డాను. 

కెమిస్ట్రీ

సాధారణంగా కెమిస్ట్రీ అంతా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే ఇస్తారు. ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్‌... మొత్తం అన్నింటిలో ఫిజికల్‌ కెమిస్ట్రీలో అప్లికేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మిగతాది ఎక్కువ థియరీ బేస్డ్‌గా ఉంటుంది. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా మొత్తం ప్రతి వాక్యం చదువుకోవాలి. నేను అలాగే చేశాను.

ఇది కొంచెం మెమరీ బేస్డ్‌ కావడంతో ఎగ్జామ్‌ ముందు వరకూ చూసుకుంటూనే ఉన్నాను. ఆర్గానిక్‌ ఎంతో కొంత అప్లై చేయడానికి ఉంటుందిగానీ మిగతావి అలా కాదు. గుర్తుపెట్టుకోవడం అవసరం. కొంతకాలంగా నీట్‌లో థియరీ బేస్డ్‌ ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నట్లు గమనించాను. దానికి తగినట్టే నేను ప్రిపేర్‌ అయ్యాను. 

జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటే పరీక్షలో కెమిస్ట్రీని 45 నుంచి 50 నిమిషాల్లో రాసేయవచ్చు. మిగతా సమయాన్ని ఇతర విభాగాలకు వాడుకోవచ్చు. నేను అలాగే చేశాను. ఈ టైమ్‌ అలవాటయ్యేలా ప్రాక్టీస్‌ చేయాలి.

ఫిజిక్స్‌ ఎలా అంటే..

మొదట్లో ఫిజిక్స్‌ సన్నద్ధతకు ఎక్కువ టైం దొరుకుతుంది. అలాంటి సమయంలోనే క్లాసులు బాగా విని థియరీ, అప్లికేషన్‌ రెండూ సాధన చేశాను. లెక్కలు ప్రాక్టీస్‌ చేయడంతోపాటు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను కూడా బాగా చదివి ప్రిపేర్‌ అయ్యాను. ఇంతకుముందు సంవత్సరం విద్యార్థులు రాసిన పేపర్లు అన్నింటినీ మళ్లీ సాధన చేసేవాడిని. ఫిజిక్స్‌కు సంబంధించి లెక్కల్లో చాలామంది విద్యార్థులు ఒక తప్పు చేయడం గమనించాను. వారు కాలిక్యులేషన్‌ బేస్డ్‌గా ఉన్న లెక్కలు త్వరగా నేర్చేసుకుంటారు. కానీ థియరీ బేస్డ్‌గా ఉన్నవాటిపై పెద్దగా దృష్టిపెట్టరు. కానీ అది సరైన వ్యూహం కాదని నా భావన. మొదట్లోనే థియరీ ఆధారిత ప్రశ్నలు బాగా నేర్చుకుంటే తర్వాత కాలిక్యులేషన్‌ బేస్డ్‌వి చేయడం సులభం. దానివల్ల ఎగ్జామ్‌లో రెండు రకాలూ బాగా రాయగలిగే నమ్మకం వస్తుంది. బిట్‌ పోకుండా ఉంటుంది. ఎక్కడ చదివినా స్టాండర్డ్‌ బుక్స్‌ ఫాలో అయితే సరిపోతుంది.

బోటనీ, జువాలజీ

బయాలజీ పూర్తిగా గుర్తుపెట్టుకునేదే. తొలి ప్రాధాన్యం దీనికే ఉంటుంది. పరీక్షల్లో కూడా విద్యార్థులకు సమానంగా మార్కులు వచ్చినప్పుడు ర్యాంకులు ఇచ్చేందుకు ఈ విభాగపు మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల ఈ సబ్జెక్టుకు నేను అత్యంత ప్రాధాన్యం ఇస్తూ చదివాను. స్టేట్‌ సిలబస్‌కూ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలకూ ఉన్న తేడాను అనలైజ్‌ చేసుకుంటూ పరీక్షకు, ప్రశ్నకు తగినట్టుగా జవాబులు ఇవ్వడం సాధన చేశాను. జాతీయస్థాయి పరీక్ష రాస్తున్నప్పుడు పూర్తిగా సెంట్రల్‌ సిలబస్‌ను దృష్టిలో పెట్టుకునే చదవాలి.

ఎగ్జామ్‌లో మొదట బయాలజీ సెక్షన్‌ పూర్తిచేయడం మంచిది. ఆ తర్వాత ఫిజిక్స్, చివర్లో కెమిస్ట్రీ రాయడం వల్ల ముఖ్యమైన బయాలజీ సెక్షన్‌కు ప్రైమ్‌ టైమ్‌ ఇవ్వగలుగుతాం. కెమిస్ట్రీ ఎటూ గుర్తున్నవి రాసేదే కాబట్టి చివర్లో అయినా ఫర్వాలేదు. అయితే లెక్కలు చేసేటప్పుడు ఎక్కడా సమయం వృథా కాకుండా చూసుకోవాలి. 

ప్రశ్న చదవడంలో పొరపాటు చేయకూడదు. తెలిసిన ప్రశ్న తప్పు పెడితే ర్యాంకుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే కచ్చితంగా ప్రశ్నను సరిగ్గా చదివి, అర్థం చేసుకునే తీరాలి. 

అన్నీ వచ్చినట్టు అనిపించినా సరే.. మొత్తం అన్ని ప్రశ్నలు అటెమ్ట్‌ చేయకూడదు. కచ్చితంగా చాయిస్‌ తీసుకోవాలి. 

పరీక్ష వ్యవది 20 నిమిషాలు పెంచడం విద్యార్థులకు మేలు చేసేదే. కానీ మనతోపాటు అందరికీ ఆ సమయం పెరగడం వల్ల పోటీ కూడా ఎక్కువ అవుతుంది. దానికి తగినట్టు ప్లాన్‌ చేసుకోవాలి. 

నేను రోజుకు 8 నుంచి 11 గంటల వరకూ చదివేవాడిని. అది సరిపోతుందని నా అభిప్రాయం.

మొబైల్‌ ఫోన్స్, సోషల్‌ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నా. 

పేపర్‌ ఎలా ఉన్నా అటెమ్ట్‌ చేయగలిగేలా చదవాలి. అప్పుడే అనుకున్న ర్యాంకు వస్తుంది. 

నాతోపాటు చాలామంది విద్యార్థులు గ్రాండ్‌ టెస్టులు రాయడం వల్ల మాలో మాకే మంచి పోటీ ఉండేది. దాంతో ఇంకా ఉత్సాహంగా చదివేవాళ్లం. గ్రూప్‌ స్టడీ, హెల్దీ కాంపిటిషన్‌ మేలు చేస్తాయి. 

సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఏరోజు పార్ట్‌ ఆరోజు పూర్తి చేసుకోవడం ద్వారా ఒత్తిడి ఉండదు. అప్పుడే విజయం సాధించగలం!

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం

‣ టీహెచ్‌డీసీఐఎల్‌లో 181 జూనియర్‌ ఇంజినీర్‌ కొలువులు

‣ విదేశీ విద్యకు ఉపకార వేతనాలు

‣ బెల్‌లో 205 ఇంజినీర్‌ కొలువులు

‣ ఇంటర్‌ కోర్సు వివరాలివిగో..

‣ వృత్తివిద్యా పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు

Posted Date : 20-06-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.