• facebook
  • whatsapp
  • telegram

మనపై మనకు నమ్మకం ఉంటే.. విజయం మన వెంటే

* గ్రూప్‌-1 తొలి ర్యాంకర్‌ భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష

* సివిల్స్‌ లక్ష్యమని వెల్లడి

 

ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే, కాళ్ల: ‘మనపై మనకు నమ్మకం ఉంటే చాలు.. విజయం మన వెంటే ఉంటుంది. ఏదైనా సాధించవచ్చు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షలకు నా పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించా. ఫలితం దేవుడికి వదిలేశా. బాగా రాశా కనుక మంచి ఫలితం వస్తుందని భావించా. కానీ తొలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది.’ అని గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులు పోటీని చూసి భయపడొద్దని, నమ్మకం ఉంటే కచ్చితంగా విజయం సాధించొచ్చని అన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఫలితాల్లో తొలిర్యాంకు సాధించిన ఆమె గురువారం(ఆగస్టు 17) ‘ఈనాడు- ఈటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడానికి తన తండ్రి ఉపాధ్యాయుడు రామాంజనేయులు ప్రోత్సాహమే కారణమని పేర్కొన్నారు. ఏడాది పాటు దిల్లీలో ఉంటూ సిద్ధమయ్యానని వివరించారు. కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన ప్రత్యూష 22 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం విశేషం. తండ్రి వెంకట రామాంజనేయులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ప్రస్తుతం భీమవరం డీఈవో కార్యాలయంలో ఏపీవోగా పని చేస్తున్నారు. తల్లి ఉష గృహిణి.

నాన్న ప్రోత్సాహంతోనే..


‘నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది నా తండ్రి కల. అందుకే ఇంజినీరింగ్‌ లాంటి కోర్సులకు బదులు దిల్లీకి పంపి బీఏలో చేర్పించారు. డిగ్రీ పూర్తవగానే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రోత్సహించారు. అమ్మ దిల్లీలో నాతోపాటు ఉంది. నాన్న ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించా. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మా నాన్న కల. సివిల్స్‌ నా లక్ష్యం. భవిష్యత్తులో సివిల్స్‌కు ప్రయత్నిస్తా. ఇప్పటికే సివిల్స్‌ ప్రిలిమ్స్‌ రాశా. సెప్టెంబరులో మెయిన్స్‌ రాయాల్సి ఉంది’ అని వివరించారు.

యూపీఎస్సీ సన్నద్ధత పనికొచ్చింది.. 


‘ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్‌ కోసం ప్రత్యేకంగా సిద్ధమవలేదు. దిల్లీలో యూపీఎస్సీ సివిల్స్‌కు మాత్రమే సిద్ధమయ్యా. ఆ సమయంలో నాన్న సూచనతోనే ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 రాశా. ప్రిలిమ్స్‌ పరీక్ష యూపీఎస్సీ స్థాయిలో ఇవ్వడంతో సులువైంది. మెయిన్స్‌కు మాత్రం ప్రత్యేకంగా సిద్ధమయ్యా. మెయిన్స్‌ ఫలితాల తర్వాత నమూనా ముఖాముఖికి హాజరై తర్ఫీదు తీసుకున్నా. ముఖాముఖిలో అభ్యర్థుల అభిప్రాయాల ఆధారంగానే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. పశ్చిమగోదావరి జిల్లా గురించి.. నాన్న ఉపాధ్యాయుడు కాబట్టి విద్యాశాఖకు ఏం చేస్తారు..? తదితర ప్రశ్నలు అడిగారు’ అని చెప్పారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘స్మార్ట్‌’గానూ చదవొచ్చు!

‣ కేంద్ర బలగాల్లో 1,876 ఎస్‌ఐ కొలువులు

‣ మేటి మేనేజ్‌మెంట్‌ సంస్థల్లోకి ‘మ్యాట్‌’

‣ కెరియర్‌ కౌన్సెలింగ్‌కు ఉచిత సలహాలివిగో

Posted Date : 22-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌