• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్‌ 1, 2 సానుకూల సన్నద్ధత!

ఉద్యోగ సాధనకు నిపుణుల సూచనలు



ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల ఆశావహుల్లో స్తబ్ధత ఏర్పడింది. దీంతో ఇంతకాలంగా కొనసాగిస్తున్న పోటీ పరీక్షల సన్నద్ధతకు అంతరాయం ఏర్పడింది. ఇలా ప్రిపరేషన్‌ను పక్కనపెట్టి వివిధ ఇతర కార్యకలాపాల్లో లీనమవ్వటం అభ్యర్థుల దీర్ఘకాలిక లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ అనిశ్చితిని అధిగమించి పూర్వపు ఉత్సాహం, ప్రేరణలను అందిపుచ్చుకోవటం చాలా ముఖ్యం. ఇందుకు ఏమేం చేయాలో తెలుసుకుందామా?


తెలంగాణ: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై స్పష్టత రాకపోవడం, గ్రూప్‌-2 పరీక్ష జనవరికి వాయిదా పడటం, ఈ లోపల ఎన్నికల ప్రకటన రావడం.. ఇదీ వర్తమాన స్థితి. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌లపై ఏ విధంగా స్పందిస్తుంది అనే విషయంలో సందిగ్ధత.. మొదలైన కారణాలతో మెజారిటీ అభ్యర్థులు ప్రిపరేషన్‌కు దూరంగా ఉంటున్నారు.


ఆంధ్రప్రదేశ్‌: గ్రూప్‌ 1, 2 పరీక్షల ఖాళీలపై జీవోలు విడుదలైనప్పటికీ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయంలో స్పష్టత లేదు. గ్రూప్‌-1 సిలబస్‌ మారుతుందనే వార్తలు, సచివాలయ ఉద్యోగాల విషయంలో స్పష్టత లేకపోవడం, డీఎస్‌సీ ఖాళీల సంఖ్యపై స్పష్టత వస్తున్నప్పటికీ అనంతర జీవోలు విడుదల కాకపోవటం, మరో నాలుగు నెలల తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం.. ఇదీ ప్రస్తుత స్థితి. కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లపై తీసుకునే ధోరణి ఎలా ఉంటుందోననే సందేహం.. మొదలైన కారణాల వల్ల సీరియస్‌ అభ్యర్థులు కూడా 100% దృష్టిని ఈ పరీక్షలపై నిలపటం లేదు. ఫలితంగా కోరుకున్న లక్ష్యాలు మరింత దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.


లక్షలమంది పోటీపడే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలను సంతరించుకున్నప్పుడే ఉద్యోగ సాధన వరకూ విజయవంతమైన ప్రయాణం సాగించే అవకాశం ఉంటుంది. లేకపోతే.. ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించుకోలేక ఈ పోటీ ప్రయాణంలో మధ్యంతరంగా విరమించే ప్రమాదం ఎక్కువ. నిజానికి ఈ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసినవారిలో సుమారుగా 90 శాతం మంది మధ్యలో చేతులెత్తేసేవారే. సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆటుపోట్లను తట్టుకుంటూ ఉండే అభ్యర్థులు సగటు స్థాయి ప్రజ్ఞావంతులే అయినా అంతిమంగా కొలువులు పొందుతూ ఉంటారు.


ఈ ప్రత్యేక లక్షణాలు ముఖ్యం


1. సుదీర్ఘ పోరాటం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడేటప్పుడే సుదీర్ఘ కాల పోరాటానికి సిద్ధపడాలి. అప్పుడే ఎటువంటి అవాంతరాలైనా సులభంగా ఎదుర్కొనే మానసిక స్థితి ఏర్పడుతుంది. స్థానిక పరిస్థితుల వల్ల యూపీఎస్సీ తరహాలో ఒక షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి క్లిష్టతను ముందుగానే ఊహించుకుని అందుకనుగుణంగా ఆర్థిక, ఇతర వనరులను సమకూర్చుకుని చిట్టచివరి లక్ష్యం చేరేవరకు సన్నద్ధత కొనసాగిస్తూనే ఉండాలి. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో నోటిఫికేషన్లు, షెడ్యూలు వెలువడినప్పటికీ తుది ఫలితం వెంటనే ఆశించకుండా ఎప్పుడు పరీక్షలు జరిగినా రాసేందుకు సిద్ధమే అన్నట్లుగా ఉండాలి.


2. సబ్జెక్టుతో అనుసంధానం

అవిచ్ఛిన్నంగా చదవటం అనేది అభ్యర్థులకు ఉండాల్సిన మరొక తప్పనిసరి లక్షణం. నోటిఫికేషన్‌ కోసం సంవత్సరాల తరబడి నిరీక్షణ, పరీక్షలు వాయిదా పడుతూ ఉండటంతో వారి ప్రిపరేషన్‌ ప్రయాణంలో అంతరాలు వస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతిరోజూ కనీసం నాలుగు నుంచి ఆరు గంటలైనా వివిధ పేపర్ల సబ్జెక్టులు చదువుతూ సబ్జెక్టుతో అనుసంధానమై ఉండాలి. ఇది ఉంటే పరీక్ష ఎప్పుడు జరిగినా సమర్థంగా ఎదుర్కొని, కొలువు కొట్టే అవకాశం ఉంటుంది.


3. ‘బోనస్‌’ వ్యవధి

‘ప్రతి సంక్షోభమూ ఒక అవకాశమే’ అనే సూక్తి గుర్తు చేసుకోండి. నోటిఫికేషన్‌ వాయిదా పడుతున్నా, పరీక్షలు వాయిదా పడుతున్నా లభించే సమయాన్ని బోనస్‌గా భావించాలి. పరిజ్ఞానాన్ని మరింతగా మెరుగు పెట్టుకోవాలి. ఇలా చేసినప్పుడే ఉత్తమమైన ర్యాంకులు వస్తాయి. వాయిదాలు పడుతున్న పరిస్థితిని గమనించి ఒత్తిడి గురైతే మరింత నష్టమే గాని ప్రయోజనం ఏమీ ఉండదు. వాయిదా పడుతున్నప్పుడల్లా స్థాయిని మెరుగుపరుచుకుంటున్నామనే భావన పెంచుకంటే మనసు సానుకూలంగా స్పందిస్తుంది అందువల్ల మరింతగా చదవగలుగుతారు. జ్ఞాపకశక్తి బలంగా ఏర్పడుతుంది.



4. నోట్సు తయారీ

సొంత నోట్సు తయారు చేసుకునే సదవకాశం ఇలాంటి సందర్భాల్లోనే దొరుకుతుంది. రెండు మూడు పుస్తకాలు చదువుకొని దానిలోని సారాంశాన్నీ, ముఖ్యాంశాలనూ ఒకే నోట్సులో రూపొందించుకోవడం వల్ల పరీక్షల ముందు సమయపు వృథా తగ్గుతుంది. ఒత్తిడి కూడా తగ్గిపోయి ప్రశాంతంగా పరీక్షలు రాసే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల నోటిఫికేషన్లు వాయిదా పడినా, పరీక్షలు వాయిదా పడినా తీవ్ర ఒత్తిడికి గురికాకూడదు. ఇదో మంచి అవకాశమని భావించే తత్వాన్ని ఏర్పరచుకోవాలి.


5. ప్లాన్‌ - బి

చాలామంది అభ్యర్థులు రాష్ట్ర పోటీ పరీక్షలపై అవగాహన లేకుండా ఆర్థికంగా కొంత మొత్తాన్ని సిద్ధపరచుకుని, నిర్దిష్ట కాలానికి ప్రణాళిక రచించుకుని రంగంలోకి దిగుతారు. అయితే సకాలంలో నోటిఫికేషన్లు రాకపోవచ్చు, పరీక్షలు జరగకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఏర్పరచుకున్న డబ్బు మొత్తం అయిపోతుంది. తర్వాత ఏం చేయాలో తెలియక తీవ్ర అసహనానికి గురవుతూ దీర్ఘకాలిక లక్ష్యాన్ని విడిచి పెడుతుంటారు. అలాగే చాలామంది చిరుద్యోగులూ, నిరుద్యోగులూ ఈ వాయిదాల సంస్కృతిని అర్థం చేసుకోలేకపోతుంటారు. దిశా నిర్దేశం లేక ప్రతిభాపాటవాలు ఉండి కూడా ట్రాక్‌ తప్పుతూ ఉంటారు. మరికొంతమంది జీవనోపాధిని వదులుకొని ఈ పరీక్షలకు సిద్ధమవుతారు. కానీ సకాలంలో వారు అనుకున్నది జరగక తిరిగి జీవనోపాధి కోసం ప్రిపరేషన్‌ నుంచి వెళ్లిపోతారు. ఇలాంటి పరిస్థితుల్ని ముందుగానే అర్థం చేసుకుని ప్లాన్‌-బి అనేది ఏర్పరచుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. అంటే దీర్ఘకాలికంగా ప్రిపేర్‌ అవ్వాల్సినపుడు అటు సన్నద్థమవుతూనే ఏదైనా జీవనోపాధిని పార్ట్‌ టైమ్‌గా చేసుకోవడం ద్వారా కొన్ని ఒత్తిళ్లను అధిగమించవచ్చు. ముఖ్యంగా ఆర్థికపరమైన ఒత్తిడిని.


6. కొత్త కోర్సులు

ఇలా నోటిఫికేషన్లూ, పోటీ పరీక్షలూ వాయిదా పడుతున్న సందర్భాల్లో విలువైన సమయం సద్వినియోగం చేసుకునేందుకు ఏవైనా కొత్త కోర్సులు లేదా స్కిల్స్‌కు సంబంధించిన అభ్యసనాల్ని చేయటం మంచిది. తద్వారా ఒకవేళ పోటీ పరీక్షల్లో రాణించలేకపోయినా ఆ నైపుణ్యాలతో జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది.


7. పరిజ్ఞానానికి పదును

లభిస్తున్న ఈ సమయంలో అటు బేసిక్స్‌నూ, ఇటు వర్తమాన అంశాల పరిజ్ఞానాన్నీ సానపెట్టుకుంటూ ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే నిర్దేశించుకున్న దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించగలుగుతారు.


8. పోటీ మెలకువలు

సీనియర్‌ అభ్యర్థులనూ, సివిల్స్‌ ఆశావహులనూ తాజా అభ్యర్థులు ఎదుర్కోవాలంటే అంత సులభమైన విషయం ఏమీ కాదు. ఇలా నోటిఫికేషన్లు, పరీక్షలు వాయిదా పడినప్పుడల్లా వాళ్ళని ఎదుర్కొనేందుకు ఎటువంటి మెలకువల్ని సాధించాలి అనే పక్కా ప్రణాళిక రచించుకోవాలి. దాన్ని అమలు చేసేందుకు ఇదే అనువైన సమయమని గుర్తించండి.


9. నమూనా పరీక్షలు

ఈ సందిగ్ధ పరిస్థితిని మంచి ఫలితాలు రాబట్టుకునేందుకు వాడుకోవచ్చు. అందుకోసం పకడ్బందీగా నమూనా పరీక్షలు రాయాలి. తప్పొప్పులు సరిచూసుకుని, సరిదిద్దుకునేందుకు ఇప్పుడు లభిస్తున్న సమయాన్ని వెచ్చించాలి.


సానుకూల ధోరణి,  భవిష్యత్తు పట్ల ఆశ ఏమాత్రం  సడలకుండా సహనంతో సుదీర్ఘ ప్రయాణం చేయటమే పోటీ పరీక్షల విజయ రహస్యం. ఈ విషయం గుర్తెరిగి అందుకు అనుగుణంగా వ్యవహరించాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎయిమ్స్‌ భోపాల్‌లో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు

‣ ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనలకు.. సీఎస్‌ఐఆర్‌ నెట్‌

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!

‣ ఏఐ టూల్‌తో రెజ్యూమె రెడీ!

‣ డిగ్రీతో క్లర్క్‌ కొలువుల భర్తీ

Posted Date : 08-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌