• facebook
  • whatsapp
  • telegram

ఏఐ టూల్‌తో రెజ్యూమె రెడీ!

వివిధ వెబ్‌సైట్ల వివరాలు



ఒక మంచి రెజ్యూమె మంచి కెరియర్‌కు పునాది వంటిది. చూడగానే ఆకర్షించేలా చక్కని సీవీని తయారుచేయడం అంత సులువైన పనేం కాదు! ఇందుకోసమే ఏఐ టూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు తమ వివరాలు అందిస్తే చాలు.. చిటికెలో సమగ్రమైన రెజ్యూమెలను తయారు చేస్తాయి. అవేంటో, ఎలా వాడాలో చూసేద్దాం.


ఇప్పుడున్న పోటీలో ఉత్తమ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే. అందులోనూ అభ్యర్థిని చూడగానే తొలి అభిప్రాయాన్ని కలిగించేందుకు దోహదపడే రెజ్యూమె విషయంలో ఇది మరీ అవసరం. మన అర్హతలతోపాటు బలాలు, నైపుణ్యాలు, అనుభవాలు, అన్నింటినీ ఆసక్తికరంగా చూపించగలగడం ముఖ్యం. మంచి రెజ్యూమె అభ్యర్థి ప్రొఫెషనలిజాన్ని ప్రతిబింబిస్తుంది. కెరియర్‌ పట్ల తన పట్టుదలను సూచించగలిగే స్థాయి దీనికుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న రెజ్యూమెను తయారుచేయడంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ సహాయపడుతున్నాయి. ఒక అంచనా ప్రకారం పెద్దస్థాయిలో జరిగే నియామకాల్లో 2 శాతం రెజ్యూమెలే ప్రాథమిక వడపోతలో మిగులుతాయట. మరి ఆ రెండుశాతంలో మనం ఉండాలంటే.. ఈ టూల్స్‌ను ఉపయోగించుకుంటే సరి!


రెజ్యూమె.ఐవో

ప్రస్తుతం ఉన్న రెజ్యూమె రైటర్లలో ఇది ముఖ్యమైనది. దీంతో కేవలం నిమిషాల్లోనే ప్రొఫెషనల్‌ సీవీలు తయారుచేసే వీలుంది. యూజర్లు ఇక్కడుండే టెంప్ల్లేట్స్‌లో ఏది కావాలంటే అది ఉపయోగించుకోవచ్చు. కవర్‌ లెటర్లు కూడా ఉచితంగా లభిస్తాయి. వీటికి కూడా ప్రత్యేకంగా టెంప్లేట్స్‌ ఉన్నాయి. నచ్చిన విధంగా రెజ్యూమెను సిద్ధం చేసి వర్డ్‌ లేదా పీడీఎఫ్‌ డాక్యుమెంట్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో స్పెల్లింగ్‌ చెక్, సమ్మరీ తయారీ ఆటోమేటిగ్గా జరిగిపోతాయి.  

వెబ్‌సైట్‌: https://resume.io


రెజ్యూమేకర్‌.ఏఐ

అమెజాన్, వాల్‌మార్ట్, టెస్లా, లెవీస్‌ వంటి దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించిన ఎంతోమంది ఈ టూల్‌ను ఉపయోగించినట్టు చెప్పారు. ప్రొఫెషనల్‌ రెజ్యూమె టెంప్ల్లేట్స్‌ ఎన్నో ఇందులో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగిస్తూ చక్కని సీవీలను తయారుచేసుకునే వీలుంది. దీనిలో డేటా ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం ఉంది. మనం ఇచ్చే సమాచారం ఏ విధంగానూ ఎవరూ చెడు మార్గాల్లో వినియోగించకుండా ఈ ఏర్పాటు చేశారు. 

వెబ్‌సైట్‌: https://resumaker.ai


కాన్వా రెజ్యూమె మేకర్‌

ఇందులో వందలాదిగా ఉన్న టెంప్లేట్స్‌ నుంచి మన పరిశ్రమ, అవసరానికి తగినట్టుగా నచ్చింది తీసుకోవచ్చు. దాన్ని అవసరానికి తగినట్టుగా మార్చుకునే వీలుంది. రంగు, ఫాంట్, లేఅవుట్‌.. వంటివి మార్చడంతోపాటు గ్రాఫిక్స్‌ కూడా జతచేర్చవచ్చు. ఒక అంచనా ప్రకారం.. రిక్రూటర్లు రెజ్యూమె చూసిన మొదటి ఆరు సెకన్లలోనే అభ్యర్థి వారికి నచ్చిందీ లేనిదీ అంచనాకు వచ్చేస్తారట! ఆలోపే మన స్కిల్స్‌ను చక్కగా తెలిసేలా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మన డిజైన్‌ను సేవ్‌ చేసుకోవడంతోపాటు తిరిగి ఎడిట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

వెబ్‌సైట్‌: https://www.canva.com/en_gb/


రెజి 

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. రెజి ఓపెన్‌ ఏఐ జీపీటీతో పనిచేస్తోంది. రెజ్యూమె రాసేందుకు, ఎడిట్‌ చేసేందుకు, క్రమబద్ధీకరించేందుకు.. అన్ని విధాలా ఉపయోగపడుతుంది. సాఫ్ట్‌వేర్‌ వినియోగంపై ఎటువంటి అవగాహన లేని వాళ్లయినా సరే దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. విషయాన్ని బుల్లెట్‌ పాయింట్ల రూపంలో విభజిస్తుంది. రెజ్యూమె బిల్డింగ్‌ సాఫ్ట్‌వేర్స్, సేవలను అందించేందుకు ఇది ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు, కాలేజీలతో అనుసంధానమై పనిచేస్తూ మెరుగైన పనితీరు కనబరుస్తోంది. 

వెబ్‌సైట్‌: https://www.rezi.ai/


కిక్‌ రెజ్యూమె

దీనిలో ఆటోపైలెట్‌ బిల్ట్‌ ఇన్‌ సెటప్‌ ఉంది. ఇందులో 20 వేలకు పైగా ముందుగా రాసిపెట్టిన వాక్యాలున్నాయి. వీటిని మన అవసరానికి తగినట్టుగా ఉపయోగించుకోవచ్చు.  ఏఐ రైటర్, టెంప్లేట్స్‌.. ఇలా చాలా అభ్యర్థుల కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ టూల్‌ జీపీటీ-4 ద్వారా పనిచేస్తోంది. అభ్యర్థులు తప్పుల్లేకుండా సరైన రెజ్యూమెలు రాసేందుకు ఉపయోగపడుతుంది. 

వెబ్‌సైట్‌: https://www.kickresume.com


డిజైన్స్‌ ఏఐ

ఇందులో కాపీ రైటర్స్, వీడియో మేకర్స్, డిజైన్‌ మేకర్స్‌ వంటి ఎన్నో టూల్స్‌తోపాటు గ్రాఫిక్‌ మేకర్, కలర్‌మ్యాచర్‌ టూల్స్‌తో కూడా పనిచేసుకోవచ్చు. వెయ్యికి పైగా రెజ్యూమె  టెంప్లేట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఏ పరిశ్రమలో ఉద్యోగం ఆశించేవారైనా సరే వారికి కావాల్సిన రెజ్యూమెలు లభిస్తాయి. ఒక్క పేజే ఉండాలా, అక్షరాలు ఏ విధంగా ఉంటే చదవడానికి వీలుగా ఉంటుంది.. ఇటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. 

వెబ్‌సైట్‌: https://designs.ai


జెటీ

ఇందులో ఉన్న రెడీమేడ్‌ కంటెంట్‌ను సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ రెజ్యూమె రైటర్లు తయారుచేశారు. వీటిని ఉపయోగించుకోవడమే కాకుండా మన పాత రెజ్యూమెలను అప్‌లోడ్‌ చేస్తే కొత్త ఫార్మాట్లలోకి అదే ఆటోమేటిగ్గా మారుస్తుంది. అంటే ఒక్కసారి కావాల్సిన వివరాలేంటో నిర్ణయించుకుని అందిస్తే.. తర్వాత సమయపు వృథా లేకుండా ఎన్నిసార్లైనా ఫార్మాట్‌ మార్చుకుని ఉపయోగించుకోవచ్చు. 

వెబ్‌సైట్‌: https://zety.com
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ గేట్‌ తుది సన్నద్ధత

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

‣ ఐటీ ఉద్యోగానికి టెక్‌ స్కిల్స్‌!

‣ ఉచిత బీటెక్‌ చదువు.. ఆపై లెఫ్టినెంట్‌ కొలువు

Posted Date: 01-11-2023


 

రెజ్యూమె

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం