• facebook
  • whatsapp
  • telegram

గేట్‌ తుది సన్నద్ధత

* ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో పరీక్షలు

ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో నిర్వహించే గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)కు 3 నెలలకు పైగా వ్యవధి ఉంది. పరీక్షలోపు అందుబాటులో ఉన్న సమయాన్ని అభ్యర్థులు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో చూద్దాం. 


అభ్యర్థులు ఇప్పటివరకూ గేట్‌ సన్నద్ధత చివరి ఘట్టంలో ఉండి ఉంటారు. కొంతమంది సన్నద్ధత మధ్యలో ఉంటారు. మరికొందరు సబ్జెక్టుల్లోని కొన్ని అంశాలను మాత్రమే చదివి ఉంటారు. ఇప్పటివరకూ సాగించిన ప్రిపరేషన్‌ ఒక ఎత్తయితే.. ఇప్పుడున్న వ్యవధిలో వ్యూహాత్మకంగా మెరుగులు దిద్దుకోవడం మరో ఎత్తు.  


గేట్‌ స్కోరును ఆధారంగా తీసుకుని వివిధ ఐఐటీలూ, ఐఐఎస్‌సీ బెంగళూరు, ఎన్‌ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్‌/పీహెచ్‌డీ కోర్లుల్లో ప్రవేశం లభిస్తుంది. నెలవారీ రూ.12,400 ఉపకార వేతనం పొందుతారు. ఇంకా వివిధ మహారత్న, మినీరత్న, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలకు కూడా ఈ స్కోరే ఆధారం. ఐఐటీల్లో ఎంఈ/ఎంటెక్‌ సీటు అంటే.. నాణ్యమైన సాంకేతిక విద్య మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా అత్యుత్తమ సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు పొందగల సదవకాశం. బంగారు భవితను దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్షకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలి. 


పునశ్చరణే మంత్రం

సన్నద్ధత చివరి ఘట్టంలో ఉన్న అభ్యర్థులు మిగిలిన అంశాలు పూర్తి చేయాలి. కఠినమైన అంశాలు చదవకపోతే ఈ సమయంలో ముందుగా వాటిపై దృష్టి సారించాలి. 

సన్నద్ధత పూర్తికాగానే అన్నీ చదివామని విశ్రాంతి స్థితిలోకి వెళ్లకుండా కఠినమైన అంశాలతో సహా చదివిన అన్ని (సులభమైన, మధ్యస్థ) అంశాలను తప్పనిసరిగా పునశ్చరణ (రివిజన్‌) చేయాలి. 

సన్నద్ధత మధ్యలో ఉంటే వీలైనంత త్వరగా అన్ని అంశాలూ చదవాలి. తర్వాత పరీక్షలో మార్కుల వెయిటేజీ ఆధారంగా కఠినమైన అంశాలు చదవాలి. సన్నద్ధత పూర్తవగానే అన్ని అంశాలనూ పునశ్చరణ చేయాలి. 

సబ్జెక్టుల్లో కొన్ని అంశాలను మాత్రమే చదివితే గేట్‌ సిలబస్‌పరంగా ఈ సమయంలో ఏ అంశాలపై, ఏ సబ్జెక్టులపై దృష్టిపెడితే ఎక్కువ మార్కులు వస్తాయో గుర్తించి వాటిపై శ్రద్ధ వహించాలి. చదివింది తక్కువ అయినాసరే.. వాటన్నిటినీ తప్పకుండా రివిజన్‌ చేయాలి. 

సన్నద్ధత పూర్తయిన అభ్యర్థులు మాత్రం ఎక్కువ మార్కులు వచ్చే అంశాలపై పునశ్చరణలో, పరీక్ష ముందూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి.  

ప్రిపరేషన్‌ చివరి ఘట్టంలో ఉన్నా, మధ్యలో ఉన్నా, కొన్ని అంశాలు మాత్రమే సాధన చేసినా.. అభ్యర్థులందరికీ రివిజన్‌ తప్పనిసరి. పరీక్షలో గెలిపించడానికి తోడ్పడేది ఇదే.  


సిలబస్‌కు తగ్గట్టు...

గేట్‌కు వ్యవధి తక్కువగా ఉన్న కారణంగా.. రోజుకు 8 నుంచి 10 గంటలు చదవడం అవసరం. 

ఈ సమయంలో క్లిష్టమైన కీలకాంశాలను మరోసారి మననం చేయాలి. 

గతంలో ఎన్నడూ అడగని అంశాలపై తగిన దృష్టి సారించాలి. 

యూపీఎస్సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్, సివిల్‌ సర్వీసెస్‌ అంశాలను చాలావరకూ గేట్‌లో అడుగుతుంటారు. కాబట్టి వీటిని గేట్‌ సిలబస్‌కు అనుగుణంగా సాధన చేయాలి. 

ఆన్‌లైన్‌లో నిర్వహించే నమూనా పరీక్షలు రాయాలి. దీనివల్ల సన్నద్ధతలో నాణ్యత అర్థం అవుతుంది. సమగ్ర అవగాహన లేని విషయాలను పునశ్చరణ చేసుకోవచ్చు. 

గత గేట్‌ ప్రశ్నపత్రాల నుంచి దాదాపు 25 శాతం ప్రశ్నలు పునరావృతం అవుతాయి. వీటికోసం సుమారు 25 సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాధన చేస్తే ఫలితం ఉంటుంది. 

75 శాతం ప్రశ్నలు సృజనాత్మకంగా, పరిశోధనాత్మకంగా ఉంటాయి. వీటి కోసం మౌలికాంశాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 

కొన్ని అంశాలకు పూర్తిగా సమాచారం ఇవ్వరు. తార్కికంగా ఆలోచించి వాటికి సమాధానం రాబట్టాలి. ఇలాంటి ప్రశ్నలు ప్రామాణిక పాఠ్యపుస్తకాల్లోని అభ్యాస ప్రశ్నల్లో ఉంటాయి. 


అంశాలవారీగా..

ప్రతిరోజూ 2 లేదా 3 సబ్జెక్టుల నుంచి ముఖ్యమైన ఫార్ములాలు అభ్యసించి వాటిని నోట్సుగా తయారుచేసుకోవాలి. ఇది పరీక్ష ముందురోజు వేగంగా పునశ్చరణకి ఉపయోగపడుతుంది. 

సన్నద్ధత సమయంలో తయారుచేసుకున్న చిన్న పట్టికలు/ షార్ట్‌ నోట్స్‌ పునశ్చరణలో సద్వినియోగం చేసుకోవాలి. 

బహుళైచ్ఛిక ప్రశ్నల విషయంలో ఒక ఫార్ములాను, మౌలికాంశాన్ని విద్యార్థి ఎన్నివిధాల తప్పు చేయొచ్చో, ఎన్ని రకాల సమాధానాలు వస్తాయో ముందుగానే పేపరు సెట్టర్లు ఊహిస్తారు. దానికి అనుగుణంగా ఆప్షన్లు ఇస్తారు. నచ్చిన సమాధానం కనపడగానే వెంటనే గుర్తించవద్దు. ఒక్క క్షణం మిగతా ఆప్షన్లు కూడా పరిశీలించి చూడాలి. 

బహుళ ఎంపిక ప్రశ్నల్లో ఒకటికంటే ఎక్కువ సరైన ఆప్షన్‌లు ఉంటాయి. అన్ని సరైన ఆప్షన్లనూ గుర్తించాలి. ఉదాహరణకు ఇచ్చిన నాలుగు ఆప్షన్‌లలో మూడు సరైనవైతే ఆ సరైన మూడు ఆప్షన్‌లను గుర్తించాలి. ఒకవేళ ఒకటి లేదా రెండు సరైన ఆప్షన్‌లు గుర్తించినా మార్కులు ఇవ్వరు. 

ప్రతి ఫార్ములాకు సంబంధించి ఒకటి లేదా రెండు న్యూమరికల్‌ ప్రాబ్లమ్స్‌ను అభ్యాసం చేయాలి. 


 అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం

గేట్‌లో అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం లభిస్తుంది. కాబట్టి ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్నింటిలో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి. 

సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. అందువల్ల చదివిన అంశాల్లో ప్రశ్నలు ఏ విధంగా అడిగినా సంబంధించిన జవాబు రాబట్టే విధంగా సాధన చేయాలి. 

గతంలో చదివినవి గుర్తుంటాయని భావించకుండా అన్ని అంశాలనూ మళ్లీ మననం చేయాలి. అంటే సాధారణ, అతి సాధారణ, మధ్యస్థ అంశాలతోపాటు కఠినమైన అంశాలను కూడా పునశ్చరణ చేయాలి. 

పరీక్ష సమయంలో ఏ ప్రశ్నలు రాస్తే, ఎన్ని ప్రశ్నలు రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయో చూడాలి. సన్నద్ధత సమయంలో కూడా ఇదే సూత్రాన్ని పాటించాలి. 


రుణాత్మక మార్కులతో జాగ్రత్త 

పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నందున కచ్చితంగా తెలిసిన సమాధానాలు మాత్రమే రాయాలి. అంచనా వేసి సమాధానాలు గుర్తించడం వల్ల ఒక్కోసారి నష్టం జరుగుతుంది. ఇక్కడ న్యూమరికల్, బహుళ ఎంపిక ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉండవని మరవద్దు. 

పరీక్ష సమయం దగ్గరపడుతున్నకొద్దీ  కొంతమంది సాధారణంగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ సమయంలో మానసిక ప్రశాంతతో ఉండి ఇప్పటివరకూ చేసిన సన్నద్ధత పరీక్ష రాయడానికి సరిపోతుందనే ధైర్యంతో ముందుకు సాగాలి. 

 కొంతమంది పరీక్ష ముందురోజు నిద్ర, ఆహారం విస్మరిస్తారు. ఇది మరుసటి రోజు పరీక్షపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. 

ఈ కీలక సమయంలో సమయం వృథా చేయడాన్ని నిరోధించాలి. టీవీ, సినిమా, యూట్యూబ్ చూడటం, ఫేస్‌బుక్‌ వాడటం, వాట్సాప్‌లో చాటింగ్‌లు మానివేయడం ఎంతైనా మంచిది 

పరీక్ష సమయం దగ్గరపడుతుంటే కొంతమంది విద్యార్థులు ఆందోళనకు, ఒత్తిడికి గురి అవుతుంటారు. దీన్ని అధిగమించడానికి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ అరగంట యోగా, ధ్యానం, వ్యాయామం చేస్తే ఒత్తిడి మాయవువుతుంది. 

పరీక్ష రాయడానికి ముందు ప్రశాంతత ముఖ్యం. సరిగా సిద్ధం కాలేదనో, మరే కారణం వల్లనైనా ఆందోళన చెందవద్దు. 

పరీక్షలో కఠినమైన ప్రశ్నలను చూసి ఆందోళనకు గురికాకూడదు. మొత్తం పేపర్‌ కఠినంగా అనిపించినప్పటికీ కంగారు అనవసరం. గేట్‌ స్కోర్‌ కేవలం సహ అభ్యర్థుల సాపేక్ష ప్రతిభపై ఆధారపడి ఉంటుందని మరిచిపోవద్దు. పూర్వపు గేట్‌ పరీక్షలను పరిశీలించినట్లయితే.. కొన్ని విభాగాల్లో 100కు 65 నుంచి 75 మార్కులు సాధించినవారికి కూడా ఉత్తమ ర్యాంకులు వచ్చాయి. 


- ప్రొ. వై.వి. గోపాలకృష్ణమూర్తి

సీఎండీ, ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడెమీ

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘క్యాట్‌’ స్కోరుకు సన్నద్ధత!

‣ ఐటీ ఉద్యోగానికి టెక్‌ స్కిల్స్‌!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ పీజీ విద్యార్థులకు పది వేల స్కాలర్‌షిప్పులు (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

Posted Date: 31-10-2023


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌