Post your question

 

  Asked By: జి. అమూల్య.

  Ans:

  చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ)ను ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎంఏ) అందిస్తోంది. సీఎంఏ, సీఏ రెండూ ప్రొఫెషనల్‌ కోర్సులే. ఇవి ఫైనాన్స్, అకౌంటింగ్‌కు సంబధించిన రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తాయి. సీఏ కోర్సు అకౌంటింగ్, టాక్సేషన్, ఆడిటింగ్‌ రంగాల్లో అవకాశాలు కల్పిస్తే, సీఎంఏ కోర్సు కాస్టింగ్, అకౌంటింగ్‌లో అవకాశాలను అందిస్తుంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు రెండు కోర్సులకూ సమాన ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రైవేటు, బహుళజాతి సంస్థలు ఈ రెండు కోర్సుల్లోనూ ఉపాధిని కల్పిస్తున్నాయి. సొంతంగా ప్రాక్టీస్‌ చేయదలిస్తే సీఏ కోర్సు పూర్తిచేసినవారికి కాస్త ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ కోర్సులను పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లోని బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇన్‌కమ్‌ టాక్స్, ఆడిట్‌ విభాగాల్లో కూడా ఉద్యోగాలున్నాయి. ఈ రెండు కోర్సుల్లో దాదాపుగా 80 శాతం సిలబస్‌ సమానం కాబట్టి ఒకే సన్నద్ధతతో రెండూ పూర్తి చేసుకోవచ్చు. ఈ రెండు కోర్సులతోపాటు కంపెనీ సెక్రటరీ కోర్సును కూడా పరిగణనలోకి తీసుకుని, ఈ మూడింటిలో ఏవైనా రెండు పూర్తి చేస్తే భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌
   

  Asked By: సుమాంజలి

  Ans:

  మీరు సీఏ ఇంటర్మీడియట్‌ పరీక్షకు సిద్దమవుతున్నారు కాబట్టి సీఏ ఫైనల్‌ పూర్తయ్యేవరకు ఎలాంటి ఉద్యోగ ఆలోచనలూ లేకుండా శ్రద్ధతో చదివి సీఏ ఫైనల్‌ని విజయవంతంగా పూర్తి చేయండి. ఒకవేళ మీరు సీఏ ఇంటర్మీడియట్‌తోనే చదువు ఆపేయాలనుకొంటే, దాంతో పాటు డిస్టెన్స్‌ లేదా ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బీ కామ్‌ డిగ్రీనీ పూర్తిచేయండి. ఇటీవలే యూజీసీ వారు సీఏ (ఫైనల్‌)ని పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీకి సమానంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు ఉద్యోగమార్కెట్‌లో సీఏ ఇంటర్మీడియట్‌ని అనధికారికంగా గ్రాడ్యుయేషన్‌కు సమానంగా గుర్తిస్తున్నారు. అధికారికంగా మాత్రం ఎలాంటి ఉత్తర్వులూ లేవు. ప్రభుత్వరంగ బ్యాంకులతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ సీఏ ఫైనల్‌ పూర్తిచేయడం కనీస అర్హత. మీరు సీఏ ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన తరువాత, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఆరు సబ్జెక్టులు పూర్తిచేసి బీకామ్‌ డిగ్రీని పొందవచ్చు. సీఏ పూర్తి చేశాక ప్రభుత్వరంగ సంస్థల్లో, బ్యాంకుల్లో, బహుళజాతి, అంతర్జాతీయ సంస్థల్లో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు పొందవచ్చు. సీఏ ఇంటర్‌తో కూడా మీరు చాలా ప్రైవేటు రంగ సంస్థల్లో,  ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలకు అర్హులవుతారు. సీఏతో పాటుగా జి.ఎస్‌.టి., ఈఆర్‌పీ, వివిధ దేశాల టాక్స్‌ సిస్టమ్‌ల్లో ప్రత్యేక శిక్షణ పొందితే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: జి. త్రివేణి

  Ans:

  బీఎస్‌సీ (బీజడ్‌సీ) చదివిన తరువాత బోటనీ/ జువాలజీ/ కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/ జెనెటిక్స్‌/ మైక్రో బయాలజీ/ బయో ఇన్ఫర్మాటిక్స్‌/ ఇమ్యునాలజీలో పీజీ చేసి పరిశోధన వైపు వెళ్ళవచ్చు. ముందుగా మీరు ఏ సబ్జెక్టులో పీజీ చేయాలనుకొంటున్నారో, ఏ యూనివర్సిటీలో చదవాలనుకొంటున్నారో నిర్ణయించుకోవాలి. ఎంచుకున్న యూనివర్సిటీల వెబ్‌సైట్ల ద్వారా ప్రవేశ పరీక్షల వివరాలను తెలుసుకోవాలి. సాధారణంగా అన్ని విశ్వవిద్యాలయాలూ ప్రవేశ పరీక్షల ద్వారానే ప్రవేశాలను పూర్తి చేస్తున్నాయి. ఆయా విశ్వవిద్యాలయాల గత సంవత్సర ప్రవేశ పరీక్షల పరీక్షపత్రాలను పరిశీలించి పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకోండి. పీజీ పూర్తి చేశాక, యూజీసీ- సీఎస్‌ఐఆర్‌ నిర్వహించే జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌/ నెట్‌లో కానీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్‌ పరీక్షలో కానీ ఉత్తీర్ణత సాధించాలి. ఏదైనా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలో ప్రవేశం పొంది, పరిశోధన చేయండి. పీహెచ్‌డీ తర్వాత ఇంకా పరిశోధన కొనసాగించాలనుకొంటే, విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో పోస్ట్‌ డాక్టొరల్‌ రిసెర్చ్‌ని కూడా చేయవచ్చు. కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఐదు  సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సునూ అందిస్తునాయి. మీకు ఆసక్తి ఉంటే ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌లను సందర్శించి మరిన్ని వివరాలను తెలుసుకోండి. - ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: జి. కోటేశ్వర్, ఆదిలాబాద్‌

  Ans:

  పర్యావరణ శాస్త్రం (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌)లో పీజీ చదవాలనే మీ నిర్ణయం అభినందనీయం. మీరు ఈ కోర్సు చదవడానికి అర్హులే. దీన్ని మన దేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా, కాకతీయ, శ్రీవేంకటేశ్వర, ఆంధ్ర, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంది. దూరవిద్య ద్వారా కూడా చదవవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ యూనివర్సిటీ, డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలు మాత్రమే ఎంఎస్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సును దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి. రెగ్యులర్‌గా చదవడానికి ఆయా యూనివర్సిటీల ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం పొందవచ్చు. దూరవిద్యలో చదవాలనుకుంటే ఆ విశ్వవిద్యాలయాల ప్రవేశ ప్రకటన వెలువడినపుడు దరఖాస్తు చేసి ప్రవేశం పొందవచ్చు.
  ఎంఎస్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో బోటనీ, ఎకాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, జాగ్రఫీ, పర్యావరణం, వాతావరణం లాంటివి బోధిస్తారు. ఈ కోర్సు చదివినవారికి ఎన్విరాన్‌మెంటల్‌ కన్సల్టెంట్‌గా, ఎన్విరాన్‌మెంటల్‌ అటార్నీగా, సస్టెయినబిలిటీ స్పెషలిస్ట్‌గా, ఎన్విరాన్‌మెంటల్‌ సైంటిస్ట్‌గా, పొల్యూషన్‌ కంట్రోల్‌ నిపుణుడిగా, పర్యావరణ విధాన నిపుణుడిగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల్లో ఉపాధి అవకాశాలున్నాయి. ఈ కోర్సుకు విదేశాల్లోనూ ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇదే సబ్జెక్టులో పీహెచ్‌డీ చేసి బోధన రంగంలో ఉపాధి పొందవచ్చు. -
  ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

  Asked By: బి. పూజిత

  Ans:

  ఎంఏ ఇంగ్లిష్‌ చదివిన తరువాత ఇంటర్‌మీడియట్‌ చదువుతున్నవారికి ఇంగ్లిష్‌ బోధించే అధ్యాపకులుగా ఉద్యోగం పొందవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్‌లో కానీ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్లెట్‌లో కానీ ఉత్తీర్ణత సాధించి, డిగ్రీ చదువుతున్న వారికి ఆంగ్లం బోధించే అధ్యాపకులుగా ఉద్యోగం పొందవచ్చు. ఏదైనా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి యూనివర్సిటీలో అధ్యాపకులుగా చేరవచ్చు. ఎంఏ ఇంగ్లిష్‌ చదివాక బీఈడీ చేసి కేంద్రప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టవచ్చు. భాషపై మంచి పట్టు సాధించి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ సంస్థల్లో బోధకునిగా స్థ్టిరపడవచ్చు, లేదా స్వయంగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌ సంస్థను ప్రారంభించవచ్చు. ఆంగ్లంతో పాటు మరో భాషలో ప్రావీణ్యం సంపాదించి అనువాదకులుగా స్థిరపడవచ్చు. మీ భాషాజ్ఞానానికి సృజనాత్మకత తోడైతే వాణిజ్య ప్రకటనల రంగంలో కంటెంట్‌ రైటర్‌గా మంచి అవకాశాలుంటాయి. విదేశాల్లోనూ ఇంగ్లిష్‌ భాష బోధించడానికి చాలా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ప్రచురణ, పత్రికా రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. టెక్నికల్‌ రైటర్‌గా, కంటెంట్‌ రైటర్‌గా, స్టూడెంట్‌ కౌన్సిలర్‌గా కూడా విధులు నిర్వర్తించవచ్చు.  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: బి. ప్రతాప్‌ సింగ్

  Ans:

  బీఎస్సీ (స్టాటిస్టిక్స్‌) చదివిన తరువాత ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌ చదవవచ్చు. ఎంబీఏ కూడా చదివే అవకాశం ఉంది. ఎంబీఏలో బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు చదవొచ్చు. ఇన్సూరెన్స్‌ రంగానికి సంబంధించి అక్చూరియల్‌ సైన్స్‌లో డిప్లొమా కానీ పీజీ కానీ చేయవచ్చు. ఈ కోర్సులు చదవడం వల్ల మెరుగైన ఉద్యోగావకాశాలుంటాయి. డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ చదివినవారికి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్‌ రంగాల్లో చాలా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వారు నిర్వహించే అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. కేంద్ర స్థాయిలో నేషనల్‌  శాంప్లింగ్‌ సర్వే లాంటి సంస్థల్లో అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకొని ఆ రంగంలోనూ ప్రవేశించవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

  Asked By: సుశ్రిత తోడ్కర్, కడప

  Ans:

  మాస్టర్స్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎం.ఎస్‌.సి.) బయోకెమిస్ట్రీ రెండు సంవత్సరాల పీజీ కోర్సు. ఇతర సైన్స్‌ సబ్జెక్టులతో పూర్తి చేస్తే ప్రభుత్వ వైద్యశాలల్లో క్లినికల్‌ బయోకెమిస్ట్‌గా, ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్‌లలో టెక్నీషియన్‌గా కెరియర్‌ను మొదలుపెట్టవచ్చు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన దిళీఖిళి, దీళీగి, దీతీగి, ఖిదిలీళి, మెడికల్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌లు, ఫార్మా పరిశోధన సంస్థలతో పాటు, ప్రైవేటు ఫార్మా, బయోటెక్‌  సంస్థల్లో టెక్నీషియన్‌గా, శాస్త్రవేత్తగా ఉపాధి పొందవచ్చు. దిళీఖిళి నిర్వహించే నెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా కూడా స్థిరపడవచ్చు. పీహెచ్‌డీ చేసి పరిశోధన, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ పోలిస్తే దీన్ని చదివేవారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగ మార్కెట్‌లో వీరి కొరత ఎక్కువగా ఉంది. బయోకెమిస్ట్రీలో జీవుల శరీరంలో జరిగే రసాయన ప్రక్రియల గురించి సైద్ధాంతిక, ఆచరణాత్మక స్థాయిలో  బోధిస్తారు. డిగ్రీ స్థాయిలో బీఎస్‌సీ బయో కెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ చదివినవారు ఈ కోర్సుకు అర్హులు. ఎం.ఎస్‌.సి. బయోకెమిస్ట్రీ

  Asked By: వి. రమేష్

  Ans:

  సాధారణంగా ఎంఏ (తెలుగు) చదివినవారు  అధ్యాపకులుగా, టీపీటీ చేసి ఉపాధ్యాయులుగా స్థిరపడతారు. ఈ రెండూ కాకుండా ఇతర అవకాశాలంటే.. ముందుగా మీడియా, జర్నలిజం రంగాల గురించి చెప్పవలసి ఉంటుంది. ఇటీవలికాలంలో ఈ రెండు రంగాలకు ప్రాధాన్యం పెరిగింది. సమకాలీన అంశాలపై ఆసక్తి, ఉచ్చారణపై పట్టు సాధించి, సృజనాత్మకతను పెంపొందించుకుంటే మీడియా, పత్రికా రంగంలో విలేఖరులుగా, కంటెంట్‌ రచయితలుగా, న్యూస్‌ ప్రెజెంటర్‌లుగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. వీటితో పాటు వెబ్‌ చానల్స్, సినిమా, నాటక రంగాల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు. భాషాశాస్త్రంలో ప్రావీణ్యం సాధించి కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌ రంగంలో ప్రవేశించవచ్చు. ఆంగ్ల, హిందీ భాషలపై మంచి పట్టు సాధించి అనువాద రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. వీటితో పాటుగా, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ ప్రయత్నించవచ్చు.

  Asked By: ఆర్‌. నిఖిత

  Ans:

  బీఎస్సీ కంప్యూటర్స్‌ తరువాత మీరు ఏదైనా సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు చేసే అవకాశం ఉంది. ఏ కోర్సు చేయాలనేది మీ భవిష్యత్‌ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు కంప్యూటర్‌ రంగంలోకి వెళ్ళాలనుకొంటే కోడింగ్, డాట్‌ నెట్, జావా, హెచ్‌టీఎంఎల్, టెస్టింగ్‌ సంబంధిత కోర్సులు చేయవచ్చు. మల్టీమీడియా రంగంలో ఆసక్తి ఉంటే యానిమేషన్, గేమింగ్‌ లాంటివి చేయవచ్చు. డేటా అనలిటిక్స్‌ రంగంలోకి వెళ్లాలంటే మెషిన్‌ లర్నింగ్, పైతాన్, ఆర్‌ ప్రోగ్రామింగ్, డేటా విజువలైజేషన్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ లాంటి కోర్సుల గురించీ ఆలోచించవచ్చు. ఇవే కాకుండా డిజిటల్‌ మార్కెటింగ్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ క్వాలిటీ, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, మొబైల్‌ కంప్యూటింగ్‌ లాంటి కోర్సులు కూడా చేయవచ్చు. ఉద్యోగావకాశాల పరంగా పీజీ కోర్సు చెయ్యడం మంచిది. భవిష్యత్తులో మీరు వ్యాపార రంగంలోకి వెళ్ళాలనుకుంటే ఎంబీఏ కోర్సునూ; ఐ.టి./ కంప్యూటర్స్‌ రంగంలో స్థిరపడాలనుకుంటే ఎం.సి.ఎ.నూ చెయ్యడం మంచిది. - ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

  Asked By: బి.అనిల్‌

  Ans:

  స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టు మీద పట్టున్నవారికి విస్తృతంగా అవకాశాలు ఉంటాయి. పీజీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ లేదా ఎంస్టాట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డేటాను విశ్లేషించి, వ్యాపార వ్యవహారాల గురించి నిర్ణయాలు తీసుకోవడం స్టాటిస్టిక్స్‌తో సాధ్యం అవుతుంది. డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్‌ లేదా మ్యాథ్స్‌ చదివినవారు ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సులకు దేశంలో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ)అగ్రగామి సంస్థ. ఐఎస్‌ఐలో ఎంస్టాట్‌ కోర్సు చదివినవారికి ప్రతినెల రూ.8000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇక్కడ చదివినవారు ఆకర్షణీయ వేతనాలతో బహుళజాతి సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశం కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా, ఆంధ్రా యూనివర్సిటీ...మొదలైన సంస్థల్లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ కోర్సు అందుబాటులో ఉంది. పీజీలో స్టాటిస్టిక్స్‌ చదివినవారికి ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, యాక్చూరియల్, డేటా మెట్రిక్స్, మార్కెటింగ్‌ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ తర్వాత నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్‌) స్కోర్‌తో పీహెచ్‌డీలో చేరవచ్చు. ఇలా అవకాశం పొందినవారు నెలనెలా స్టైపెండ్‌ అందుకోవచ్చు. మరో పీజీ చదవాలనే ఆసక్తి ఉంటే బిజినెస్‌ ఎనలిటిక్స్‌లో ఎంబీఏ కూడా చేయవచ్చు. యాక్చూరియల్‌ సైన్స్‌లో సర్టిఫికెట్, డిప్లొమాకోర్సులు కూడా చదువుకోవచ్చు. పీహెచ్‌డీ పూర్తిచేసుకున్నవారు బోధన, పరిశోధనల్లో రాణించవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌