Post your question

 

    Asked By: కె. గోపాల్‌

    Ans:

    ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ రెండు సంవత్సరాల పీజీ కోర్సు. దీనిలో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల గురించిన సిద్ధాంతాలనూ, విషయాలనూ బోధిస్తారు. సాధారణంగా ఈ కోర్సు చదవాలంటే,  పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌తో డిగ్రీ సాధించి ఉండాలి. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏ డిగ్రీ చదివినవారికైనా  పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. బీఎస్‌సీ (ఎంపీసీ) చేసిన మీరు పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ చేయడానికి అర్హులే. అయితే, ఈ కోర్సు మీ ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని విశ్లేషించుకుని పై నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఈ కోర్సు పూర్తి చేసినవారికి విద్యావేత్త, పొలిటికల్‌ కన్సల్టెంట్, రాజకీయాలకు సంబంధించిన కంటెంట్‌ రైటింగ్‌ లాంటి ఉద్యోగాలతోపాటు పొలిటికల్‌ సర్వే సంస్థల్లో, స్వచ్ఛంద సంస్థల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ అవ్వాలనుకొంటే ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌లో కనీసం 55 శాతం మార్కులు సాధించి, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత లేదా పొలిటికల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ కానీ చేసి ఉండాలి. మీరు జూనియర్‌ లెక్చరర్‌ కావాలనుకొంటే పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత అవసరం. ఉభయ తెలుగు రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా  మీరు జేఎల్, డీఎల్‌ ఉద్యోగాలను పొందవచ్చు.  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: పి. గోపాల్‌

    Ans:

    ఎంఎస్‌సీ బోటనీ కోర్సులో వృక్షశాస్త్రంతో పాటు వ్యవసాయం, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌కు సంబంధించిన విషయాలనూ నేర్పుతారు. ఈ కోర్సు చదవడానికి బీఎస్‌సీ ఉత్తీర్ణులవ్వడం కనీస అర్హత. అన్ని జాతీయ/రాష్ట్ర  విద్యాసంస్థలు ప్రవేశ పరీక్ష ద్వారా చేర్చుకుంటాయి. ఎంఎస్‌సీ బోటనీ పూర్తి చేసినవారికి బయోటెక్నాలజీ రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువ. బోటనీలో పీజీ చేసి జూనియర్‌ కళాశాలల్లో బోధించవచ్చు. సీఎస్‌ఐఆర్‌ నిర్వహించే నెట్‌ / రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ కళాశాలల్లో బోధనాపరమైన ఉద్యోగాలను పొందవచ్చు. బోటనీలో పీహెచ్‌డీ చేసి విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక వృత్తిలో స్థిరపడవచ్చు. వీటితో పాటు విత్తన తయారీ సంస్థలు, బయోలాజికల్‌ సప్లై, నర్సరీ, ఫుడ్‌ ప్రొడక్షన్, కెమికల్, వ్యవసాయానికి సంబంధించిన రంగాల్లో చాలా అవకాశాలున్నాయి. ఫార్మా సంస్థల్లో కూడా బోటనీలో పీజీ చేసినవారికి ఉద్యోగాలు లభిస్తాయి. బోటనీతో పాటుగా కంప్యూటర్‌ సంబంధిత కోర్సులు చేసి బయో ఇన్‌ఫర్మాటిక్స్‌లో కూడా ప్రవేశించవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: హేమ

    Ans:

    ఏ భాష నేర్చుకోవడానికైనా ఆ భాష ప్రాథమికాంశాలు నేర్చుకుని రోజూ మాట్లాడటం సాధన చెయ్యాలి. రోజువారీ సంభాషణల్లో దాన్ని ఉపయోగించటం చాలా ముఖ్యం. మీరు ఎంఏ ఇంగ్లిష్‌ ఉత్తీర్ణులు అయివున్నారు కాబట్టి, సబ్జెక్టు పరంగా మీకు ఆంగ్లం పట్ల  మంచి పట్టు ఉండే అవకాశం ఉంటుంది. వీలున్నంత ఎక్కువగా ఇంగ్లిషు మాట్లాడటానికి ప్రయత్నించండి. ఆంగ్ల దిన పత్రికలు రోజూ చదివి పదసంపదని పెంచుకోండి. మాట్లాడుతున్నప్పుడు తప్పులు వచ్చినా ఆగిపోకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూనే ఉండండి. ఇంగ్లిషు టీవి ఛానల్స్‌ బాగా చూస్తూ భాషకు సంబంధించిన మెలకువల్ని నేర్చుకోండి. కమ్యూనికేషన్,. పబ్లిక్‌ స్పీకింగ్‌ కోర్సులు అంతర్జాలంలో కోకొల్లలు.పీజీ డిప్లొమా ఇన్‌ కమ్యూనికేటివ్‌ ఇంగ్లిషు లాంటి కోర్సులు, బ్రిటిష్‌ కౌన్సిల్‌ వారు నిర్వహించే లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ కోర్సులు చేయండి. అవసరమనుకుంటే ఏదైనా స్పోకెన్‌ ఇంగ్లిషు కోర్సులో చేరండి. ఫోన్‌ ద్వారా కానీ, కంప్యూటర్‌ ద్వారా కానీ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణను ఆన్‌లైన్‌ ద్వారా పొందండి. భారత ప్రభుత్వం రూపొందించిన ళీజూత్త్రితిలీ , విశిగినిలి లర్నింగ్‌ ప్లాట్‌ఫారంలో చాలా కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు ఎడెక్స్, యుడెమీ, అప్‌గ్రాడ్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లో కూడా కోర్సులు నేర్చుకోవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: టి. సుస్మితకె

    Ans:

    బీఎస్‌సీ బయోటెక్నాలజీ కోర్సు బయాలజీ, టెక్నాలజీ రంగాల కలయికతో రూపుదిద్దుకుంది. బయాలజీ పట్ల ఆసక్తి, టెక్నాలజీపై పట్టు ఉన్నవారు ఈ కోర్సులో చక్కగా రాణించగలరు. బయోటెక్నాలజీ కోర్సులకు దేశ విదేశాల్లో మంచి భవిష్యత్‌ ఉంది. ఈ కోర్సులు చదివినవారికి ఫార్మా, బయోటెక్, ఇమ్యునాలజీ కంపెనీల్లో, వాక్సిన్‌ తయారీ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఉన్నత విద్య విషయానికి వస్తే.. బీఎస్‌సీ బయోటెక్నాలజీ చేసినవారు ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ కోర్సును చేయొచ్చు, మన దేశంలో ఎంఎస్‌సీ  బయోటెక్నాలజీ కోర్సును అందించే విద్యా సంస్థల్లో జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయాలు  ముందు వరసలో ఉంటాయి. వీటితో పాటు చాలా కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పీజీ బయోటెక్నాలజీని అందిస్తున్నాయి. ఈ కోర్సులో ప్రవేశానికి ఎన్‌టీఏ వారు నిర్వహించే కంబైన్డ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌  బయోటెక్నాలజీ (సీఈఈబీ) ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.  ఎంఎస్‌సీలో బయోటెక్నాలజీ  కోర్సు మాత్రమే కాకుండా మాలిక్యులర్‌ బయాలజీ,  హ్యూమన్‌ జెనెటిక్స్, మెడికల్‌ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, యానిమల్‌ బయోటెక్నాలజీ లాంటి కోర్సులని కూడా ఎంచుకోవచ్చు. ఎంఎస్‌సీ తర్వాత పీ‡హెచ్‌డీ చేసి పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తగా కూడా స్థిరపడవచ్చు. మేనేజ్‌ మెంట్‌/వ్యాపార రంగం వైపు ఆసక్తి ఉన్నవారు ఎంబీఏ బయోటెక్నాలజీ కోర్సులో కూడా చేరవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: స్నేహ. కె

    Ans:

    హెల్త్‌కేర్‌ రంగంలో కూడా ఇతర రంగాల మాదిరిగానే మేనేజర్‌లకు ప్రాధాన్యం ఉంది. వైద్యశాలలో రోగులకు ప్రత్యక్షంగా సేవలు అందించనప్పటికి, వారికి అందే వైద్యానికి సంబంధించిన నాణ్యత, ఇతర విషయాలపై వీరు విలువైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్పత్రి సిబ్బందిని నియమించడం, వారి వేతనాలు, ఉద్యోగానికి సంబంధించిన నిబంధనలు రూపొందించడంలో హెచ్‌.ఆర్‌. మేనేజర్‌లు కీలక పాత్ర పోషిస్తారు. దీనితో పాటు సిబ్బంది శిక్షణను కూడా వీరే పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక కాలేజీల విషయానికి వస్తే
    నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులను వెతకడం, వారిని నియమించడంలో హెచ్‌.ఆర్‌. మేనేజర్‌లు కీలక పాత్ర పోషిస్తారు. ఇక మీ ప్రశ్న విషయం చూస్తే.. కాలేజీలతో పోలిస్తే హెల్త్‌కేర్‌ రంగంలోనే హెచ్‌.ఆర్‌. మేనేజర్‌లకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. హాస్పిటల్‌లో హెచ్‌.ఆర్‌. మేనేజర్‌గా ప్రయత్నించాలనే మీ నిర్ణయం సరైనదే. దానికి ముందు హాస్పిటల్‌/ హెల్త్‌ కేర్‌కు సంబంధించి ఏదైనా డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సుని చేయడం వల్ల ఈ రంగంలో మీకు ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. - బి.రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: శివకుమార్‌

    Ans:

    మీరు యు.ఎస్‌. టాక్సేషన్‌ కంపెనీలో ఏ రోల్‌లో పనిచేశారో చెప్పలేదు. ఈ రంగంలో ఎదగాలంటే ఎకౌంటింగ్‌ రంగంలో సర్టిఫికెట్‌ ఉండడం అవసరం. ఏసీసీఏ వారు అందించే షార్ట్‌ టర్మ్‌ కోర్సులైన ఐఎఫ్‌ఆర్‌ డిప్లొమా లేదా ఐఎఫ్‌ఆర్‌ సర్టిఫికెట్‌ కోర్సును ఎంచుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.accaglobal.com/in/en.html ను సందర్శించండి. మీరు లాంగ్‌ టర్మ్‌ కోర్సులను ఎంచుకోదలిస్తే యూఎస్‌- సీపీఏ కోర్సును లేదా యూఎస్‌- సీఎంఏ కోర్సును ఎంచుకోవచ్చు. నిర్దిష్టంగా యు.ఎస్‌. టాక్సేషన్‌ కోర్సులు మనదేశంలో అందుబాటులో లేవు. ఇలా కాకుండా ఎంబీఏ ఫైనాన్స్‌ కోర్సును ఎంచుకుని మీ అభిరుచికి తగ్గట్టు ఫైనాన్స్‌ రంగంలో ఉపాధి పొందొచ్చు. మీరు టాక్సేషన్‌ రంగంలోనే స్థిరపడాలనుకొంటే సీఏ, ఏసీఎస్, ఐసీడబ్ల్యూఏ లాంటి కోర్సుల గురించీ ఆలోచించండి. - బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి. నరేంద్ర

    Ans:

    ఏ రంగంలో డిగ్రీ చేసినవారైనా బ్రాంచిలకు అతీతంగా ఐటీ, సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన కొలువులకు మొగ్గు చూపడం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ నేర్చుకోవడానికి ఇప్పుడు ఆన్‌లైన్‌ మాధ్యమంలో చాలా కోర్సులున్నాయి. టెస్టింగ్‌ నేర్చుకొని సాఫ్ట్‌వేర్‌ టెస్టర్‌గా కెరియర్‌ను మొదలు పెట్టాలనుకుంటే సెలీనియం (Selenium suite of tools) నేర్చుకోవలసి ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీ జావా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో ఉంటుంది. అందుకని మీరు జావాను ముందుగా నేర్చుకోవలసి ఉంటుంది. ఈ కోర్సునూ, దీనికి అనుసంధానమైన వివిధ మాడ్యూళ్లనూ పూర్తి చేసిన తరువాత సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం సంపాదించే అవకాశాలున్నాయి. వివిధ రకాల ప్రాజెక్టుల్లో పనిచేసి అనుభవం సంపాదించాక సాఫ్ట్‌వేర్‌ రంగంలో మీ కెరియర్‌ ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది.
    రోబోట్‌ అండ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ టెస్ట్‌ ఆటోమేషన్, కంప్యూటర్‌ నెట్‌ వర్కింగ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ గ్రీన్‌ బెల్ట్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ ఆటోమేషన్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లైఫ్‌ సైకిల్, గూగుల్‌ ఐటీ ఆటోమేషన్‌ విత్‌ పైతాన్, గూగుల్‌ ఐటీ సపోర్ట్, లీన్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లాంటి ఆన్‌లైన్‌ కోర్సులను లిండా, యుడెమి, కోర్స్‌ఎరా లాంటి వేదికలపై నేర్చుకోవచ్చు. సాఫ్ట్‌వేర్‌ కోర్సులతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ని కూడా పెంచుకొనే ప్రయత్నం చేయండి.  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎం. శ్రీనివాస్

    Ans:

    బీటెక్‌ సివిల్‌ చేసినవారికి ఉద్యోగావకాశాలు బాగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులకు సివిల్‌ ఇంజినీర్ల అవసరం ఎక్కువ. ప్రైవేటు రంగంలో సైట్‌ ఇంజినీర్‌గా, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌గా, అసిస్ట్టెంట్‌ ఇంజినీర్‌గా, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌గా, కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించే పరీక్షలు రాసి అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా రహదారులు- భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ, పురపాలక శాఖ, గ్రామీణ నీటి సరఫరా పనుల శాఖల్లో ఉద్యోగాలు పొందవచ్చు.యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షలు రాసి దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో చేరవచ్చు. గేట్‌ పరీక్ష రాసి ప్రభుత్వరంగ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా, ఇంజినీర్‌ ట్రైనీగా కూడా స్థిరపడవచ్చు. 
    ఇవన్నీ కాకుండా సొంతంగా కన్సల్టెన్సీ పెట్టుకొని డిజైన్‌లు, డ్రాయింగ్‌లతో పాటు వాల్యుయేషన్‌ కూడా చేయవచ్చు. కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసి ఉద్యోగావకాశాల్ని పెంచుకోవచ్చు. అమ్మాయిలకు కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌ సరైన ఎంపికే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఉద్యోగం అయినా, ఏ ఇంజినీరింగ్‌ అయినా అమ్మాయిలందరికీ అర్హత ఉంటుంది. ఆసక్తి ఉంటే నిస్సంకోచంగా అమ్మాయిలూ సివిల్‌ ఇంజినీరింగ్‌ ఎంచుకోవచ్చు.
     

    Asked By: పి. వీరేష్‌ కుమార్‌

    Ans:

    చార్టెడ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రెటరీ కోర్సులు ప్రముఖమైన ప్రొఫెషనల్‌ కోర్సులు. వీటిని చదివిన వారు అకౌంటింగ్, ఆడిటింగ్, ఫైనాన్స్‌ సంబంధిత లావాదేవీలను న్యాయపరంగా, వ్యాపార నిబంధనలు, ప్రభుత్వ చట్టాల ప్రకారం జరిగేలా చూస్తారు. చార్టెడ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సులను ఒకేసారి పూర్తి చేయడం దాదాపుగా అసాధ్యమనే  చెప్పాలి. ఈ సంస్థల నియమ నిబంధనల ప్రకారం ఒక సంస్థలో రిజిస్టర్‌ అయితే ఆ కోర్సుతో పాటు, ముందస్తు సమాచారంతో డిగ్రీ/పీజీ మాత్రమే చేయడానికి అనుమతి ఉంది. 
    సీఏ కోర్సు పూర్తి చేసిన వారికి చార్టెడ్‌ అకౌంటెంట్, టాక్స్‌ కన్సల్టెంట్‌లు, ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌లుగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును పూర్తి చేసినవారికి కాస్ట్‌ అకౌంటెంట్, కాస్ట్‌ రిడక్షన్‌ కన్సల్టెంట్‌లుగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. సీఎస్‌ పూర్తి చేసిన వారికి కంపెనీ సెక్రెటరీ, కంపెనీ రిజిస్ట్రార్, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌/ ఫైనాన్స్‌ ఆఫీసర్లుగా అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు(లు) పూర్తిచేసిన తరువాత పీజీ/ పీహెచ్‌డీ చేసి, బోధన రంగంలో స్థిరపడే అవకాశాలూ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లోనూ వీరికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. 
    సీఏతోపాటు యూజీ, యూజీతోపాటు సీఏను పూర్తిచేయడం తప్పనిసరి కాదు. యూజీ డిగ్రీ, సీఏలను ఒకేసారి చేయడం వల్ల తక్కువ సమయంలో రెండు సర్టిఫికెట్‌లు పొందే అవకాశం ఉంది. ఈ మూడు ప్రొఫెషనల్‌ కోర్సులనూ డిగ్రీ/పీజీకి సమానంగా పరిగణించాలన్న డిమాండ్‌ ఎప్పటినుంచో ఉంది. కోర్సులు పూర్తిచేసిన వారికి కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంక్‌లు, ప్రభుత్వ ఆడిట్‌ సంస్థలు నోటిఫికేషన్‌ ద్వారా రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.- ప్రొ.బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: Lambu Swapna

    Ans:

    You must complete PG in Economics. Generally ask 50 % marks.