Post your question

 

    Asked By: బి.నీలిమ

    Ans:

    ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదివితే, ఆ రెండు డిగ్రీలూ చెల్లుబాటు అవుతాయా? అనే సందేహం చాలా సంవత్సరాలుగా చాలామందిని వేధిస్తూనే ఉంది. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఏక కాలంలో రెండు డిగ్రీలు చదవడానికి వెసులుబాటు కల్పించే నిబంధనలను యూజీసీ 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో కొన్ని నియామక సంస్థలు రెండు డిగ్రీలు ఏక కాలంలో చదివినప్పటికీ, అవి ఒకటి రెగ్యులర్, మరొకటి దూరవిద్య ద్వారా అయితే ఆ రెండు డిగ్రీలనూ పరిగణనలోకి తీసుకొనేవి, ఉద్యోగావకాశాలు కల్పించేవి. కొన్ని సందర్భాల్లో మాత్రం దరఖాస్తు నింపేటప్పుడు రెండు డిగ్రీలు చదివిన కాలాన్ని ఒకే సంవత్సరంలో పేర్కొంటే, కంప్యూటర్‌ పోర్టల్‌లో ఎర్రర్‌ మెసేజ్‌ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు యూజీసీ అధికారికంగా అనుమతి ఇచ్చినందున భవిష్యత్తులో ఈ  సమస్య కూడా పరిష్కారం కావొచ్చు. మీరు టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉంటే, స్కూల్‌ అసిస్టెంట్, పీజీటీ ఉద్యోగాలకు అర్హురాలిని అన్న నమ్మకంతో ఉద్యోగ సన్నద్ధత మొదలు పెట్టండి. ఒకవేళ ఒకే సమయంలో చదివిన రెండు డిగ్రీలూ చెల్లుబాటు కావేమో అన్న సందేహం ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూవుంటే.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరో పీజీని దూరవిద్య ద్వారా పూర్తిచేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: అఖిల్‌

    Ans:

    మీరు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ, బీఈడీ చేశాక ‘డీ…ఎస్సీకి అర్హత లేదు’ అని ఎందుకు అన్నారో కారణం తెలుసుకొని ఉండాల్సింది. అప్పుడే మీరు ఉన్నతాధికారులనో, న్యాయస్థానాన్నో ఆశ్రయించివుంటే, మీ సమస్యకు పరిష్కారం లభించివుండేది. మీరు ఇంటిగ్రేటెడ్‌ పీజీ చదివిన విద్యాసంస్థను సంప్రదించి డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు విడివిడిగా ఇస్తారేమో కనుక్కోండి. కొన్ని యూనివర్సిటీలు ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో ఎగ్జిట్‌ క్లాజ్‌ ప్రవేశపెట్టి యూజీ, పీజీ రెండు డిగ్రీలూ ఇస్తున్నాయి. ఇక మీ ప్రశ్న విషయానికి వస్తే- మీరు బీఈడీ చేసిన తరువాత డిగ్రీ చదివినా, డీఎస్సీకి అర్హులవుతారు. మీరు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బీఈడీ తరువాత డిగ్రీ చేశారు కాబట్టి ఆ విషయాన్ని సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ వారు ఒప్పుకోకపోతే పై అధికారుల్ని కలవండి. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక, ఇలాంటి చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు నిరభ్యంతరంగా డీఎస్సీకి సన్నద్ధం కండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: తేజ

    Ans:

    ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించడానికి స్పీచ్‌ థెరపీ కోర్సులను నేర్చుకోవాలన్న మీ కోరిక అభినందనీయం. సాధారణంగా ఇలాంటి కోర్సులను ప్రత్యక్ష విధానంలో చదివితేనే నైపుణ్యాలు మెరుగవుతాయి. మీకు రెగ్యులర్‌ కోర్సులు చదవడానికి వీలు అవ్వకపోతే- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్, దిల్లీ స్టేట్‌ గవర్నమెంట్‌ పారామెడికల్‌ కౌన్సిల్, యుడెమిల ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులు చేసే అవకాశం ఉంది. చాలా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు ఈఎన్‌టీ హాస్పిటల్స్‌ కూడా స్పీచ్‌ థెరపీలో ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత గురించి పూర్తిగా తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వి.స్నేహ

    Ans:

    నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం- ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలంటే ఇంటర్‌/ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ పూర్తి అయి ఉండాలి. అదనంగా టెట్‌/ సీ టెట్‌లో కూడా కచ్చితంగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల అభ్యర్థనల మేరకు కొన్ని సందర్భాల్లో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డీఈడీ../ బీఈడీ చివరి సెమిస్టర్‌/ సంవత్సరం చదువుతున్నవారికి కూడా డీఎస్సీకి దరఖాస్తు చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. కానీ, డీ.. ఎస్సీ ఫలితాలు విడుదలై, సర్టిఫికెట్ల పరిశీలన నాటికి డీఈడీ/ బీఈడీ ఫలితాలు వచ్చి ఉండాలి.
    మీ విషయానికొస్తే.. ప్రస్తుతం బీఈడీ మూడో సెమిస్టర్‌లో ఉన్నారు. బీఈడీ పూర్తి అయి ఫలితాలు వచ్చేవరకు మరో సంవత్సరం పట్టొచ్చు. టెట్‌ రాయాలంటే మీరు బీఈడీ రెండో సంవత్సరంలో ఉండాలి. టెట్‌ నోటిఫికేషన్‌ వచ్చాక దానికి దరఖాస్తు చేసి అందులో ఉత్తీర్ణత సాధిస్తే, తర్వాత వచ్చే డీ.. ఎస్సీ నోటిఫికేషన్‌లో బీఈడీ చివరి సంవత్సరం చదువుతున్నవారికి అవకాశం కల్పిస్తే, మీరు ఆ డీఎస్సీకి అర్హులవుతారు. బీఈడీ చదువుతూ ఒకే సంవత్సరంలో టెట్, డీఎస్సీ లాంటి రెండు పోటీ పరీక్షలకు సన్నద్ధత సాధించడం చాలా కష్టం. ఈ క్రమంలో మీరు ప్రస్తుతం చదువుతున్న బీఈడీ శిక్షణపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ముందుగా మీరు బీఈడీ కోర్సును శ్రద్ధగా చదువుతుండండి. టెట్‌/ సీటెట్‌కు దరఖాస్తు చేసి, అందులో ఉత్తీర్ణత సాధిస్తే, వచ్చే సంవత్సరం వెలువడే డీఎస్సీ నోటిఫికేషన్‌కు మీరు అర్హులవుతారు.
    - ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: శ్రావ్య యాదవ్‌

    Ans:

    మీరు బీఈడీ, ఎంఏ (ఇంగ్లిష్‌) డిగ్రీలను ఏ విద్యా సంవత్సరంలో పూర్తిచేశారో చెప్పలేదు. యూజీసీ నిబంధనల ప్రకారం 2022 నుంచి మాత్రమే ఏక కాలంలో చేసిన రెండు డిగ్రీలు  చెల్లుబాటవుతాయి. ఆ నిబంధనల ప్రకారం- రెండు డిగ్రీ కోర్సులు, రెండు పీజీ కోర్సులు మాత్రమే ఏక కాలంలో చదివే అవకాశం ఉంది. కానీ, బీఈడీ అనేది నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) గుర్తించిన వృత్తివిద్యా కోర్సు. ప్రస్తుతానికి, ఎన్‌సీటీఈ బీఈడీతో పాటు మరో డిగ్రీని ఒకే సమయంలో చదవడానికి అనుమతి ఇవ్వలేదు. మీరు కచ్చితంగా ఈ రెండు డిగ్రీలనూ 2022కి ముందే ఏక కాలంలో చేసి ఉంటారు కాబట్టి ఒక డిగ్రీని మాత్రమే వాడుకోవాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మీరు డీఎస్‌సీ స్కూల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లిష్‌) ఉద్యోగానికి అర్హులు కారు. మరోసారి రెగ్యులర్‌/ దూరవిద్య ద్వారా పీజీ చేసి ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ అవ్వాలన్న మీ కోరికను నెరవేర్చుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వాణిశ్రీ

    Ans:

    మీరు బీఏ (స్పెషల్‌ తెలుగు) పూర్తయ్యాక రెండు సంవత్సరాల బీఈడీని తెలుగు మెథడాలజీతో కనీసం 50 శాతం మార్కులతో పూర్తి చేయండి. ఆ తరువాత, సీటెట్‌ కానీ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్‌ (టీఎస్‌ టెట్‌/ ఏపీ టెట్‌) రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించండి. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ వచ్చేవరకు వేచి చూడకుండా, ఇప్పటినుంచే సన్నద్ధత మొదలుపెట్టండి. రాత పరీక్షలో సాధించిన మార్కులతో తయారుచేసిన మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. ఉదాహరణకు - తెలంగాణ రాష్ట్ర టీచర్‌  రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ 80 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షను 160 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతో కంప్యూటర్‌పై నిర్వహిస్తారు. ఒక్కో సరైన సమాధానానికి 0.5 మార్కులు. జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 20, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ నుంచి 20, తెలుగు భాష నుంచి 88, టీచింగ్‌ మెథడాలజీ నుంచి 32 ప్రశ్నలుంటాయి. సీటెట్‌/ టీఎస్‌ టెట్‌/ ఏపీ టెట్‌లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజి ఇచ్చి మొత్తం వంద మార్కులకు మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు. ఈ పరీక్ష పుస్తకాల విషయానికొస్తే, మీరు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టు పుస్తకాలతో పాటు, డిగ్రీ, బీఈడీలో చదివిన ప్రామాణిక పుస్తకాలను బాగా అర్థం చేసుకొని చదివి నోట్సు తయారు చేసుకోండి. జనరల్‌ నాలెడ్జ్‌ కోసం మార్కెట్‌లో ఉన్న డీఎస్సీ/గ్రూప్స్‌ పుస్తకాలను చదవండి. కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్రమం తప్పకుండా వార్తాపత్రికలను చదివి నోట్సు తయారుచేసుకోండి. ప్రణాళిక ప్రకారం చదివితే మీ ఆశయాన్ని నెరవేర్చుకోవడం కష్టం కాదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: Srinivas

    Ans:

    One who possess a Bachelor's Degree and B. Ed (General) with one year Diploma in Special Education (OR) Bachelor's Degree and General B. Ed degree with two year diploma in Special Education recognized by the Rehabilitation Council of India (RCI) are eligible for  DSC in Andhra Pradesh State.

    Asked By: వి. శ్రీలలిత, నెల్లూరు

    Ans:

    గతంలో బీఈడీ ప్రోగ్రామ్‌ దూరవిద్యా విధానంలో చాలా యూనివర్సిటీల్లో ఉండేది. బీఈడీ ప్రోగ్రామ్‌ కాలవ్యవధిని రెండు సంవత్సరాలకు పెంచాక, మారిన ఎన్‌సీటీఈ నిబంధనల దృష్ట్యా చాలా యూనివర్సిటీల్లో ఈ ప్రోగ్రామ్‌ ప్రస్తుతం లేదు. ఎన్‌సీటీఈ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో అనుమతితో మాత్రమే బీఈడీ దూరవిద్య/ కరస్పాండెన్స్‌ విధానంలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఈడీ ప్రోగ్రామ్‌ ఉంది. బీఈడీని దూరవిద్యలో చేయాలంటే రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ విద్యార్హతతో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో కనీసం రెండేళ్ల బోధనానుభవం కచ్చితంగా ఉండాలి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తమిళనాడులో బీఈడీ ప్రోగ్రామ్‌ దూరవిద్య/ కరస్పాండెన్స్‌ విధానంలో లేదు. వివిధ యూనివర్సిటీల వెబ్‌సైట్‌లను తరచుగా సందర్శిస్తూ బీఈడీ ప్రోగ్రామ్‌ (దూరవిద్య/ కరస్పాండెన్స్‌) సమాచారాన్ని తెలుసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. చరిత

    Ans:

    మీరు ఈ డిప్లొమాని ఇంటర్మీడియట్‌ తర్వాత చేసివుంటే, డిగ్రీ కూడా చదివే ప్రయత్నం చేయండి. డిగ్రీ చదివిన తరువాత బీఈడీ కూడా చేసే అవకాశం ఉంది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా తరువాత నాలుగు సంవత్సరాల వ్యవధి ఉన్న ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ/ బీకామ్‌ బీఈడీ కోర్సు కూడా చేయొచ్చు. ఎలిమెంటరీ ఎడ్యుకేష న్‌లో డిప్లొమాతో పాటు ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ చేసినట్లయితే, బీఈడీ చేయకుండా నేరుగా ఎంఈడీ చేయడానికి అర్హులవుతారు.
    డీఈడీ/ బీఈడీ తరువాత టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలల్లో బోధన రంగంలోకి ప్రవేశించవచ్చు. మీరు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా తరువాత ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ, పీజీలతో పాటు ఎంఈడీ+ పీహెచ్‌డీ కూడా చేసినట్లయితే  బీఈడీ/ ఎంఈడీ కోర్సులను బోధించడానికి అర్హులవుతారు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌