Post your question

 

    Asked By: జయశ్రీ

    Ans:

    ఇటీవలి కాలంలో ల్యాప్‌టాప్‌ విద్యావ్యవస్థలో ఒక భాగం అయింది. ముందుగా మీ అమ్మాయి చదవబోయే కోర్సు, ఆ కోర్సుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ల గురించి వారి సీనియర్‌ విద్యార్థులనూ, అధ్యాపకులనూ అడిగి తెలుసుకోవాలి. ల్యాప్‌టాప్‌ కొనడానికి మీ బడ్జెట్‌ ఎంత అనేది కూడా ముఖ్యం. 50,000 నుంచి 60,000 రూపాయిల్లో మంచి ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వేగవంతమైన ప్రాసెసర్‌ కంపైల్‌ సమయాన్ని వేగవంతం చేస్తుంది. మల్టీ టాస్కింగ్‌లో సహాయపడుతుంది. క్వాడ్‌-కోర్‌ i5 లేదా అంతకంటే ఎక్కువ ప్రాసెసర్‌ ఉండటం మంచిది. కోడ్‌ను కంపైల్‌ చేస్తున్నప్పుడు కనిష్ఠంగా 8 జీబీ రామ్‌ అవసరం. 13 అంగుళాల తెరపై ప్రోగ్రామింగ్‌ చేయడం అంత సులభం కాదు. 15-అంగుళాలూ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న స్క్రీన్‌కి వెళ్లడానికి ప్రయత్నించండి. ల్యాప్‌టాప్‌కు కీ బోర్డ్‌ కూడా చాలా ప్రధానం. ల్యాప్‌టాప్‌ కొనడానికి ముందు, ల్యాప్‌టాప్‌లో టైపింగ్‌ టెస్ట్‌ని తెరిచి, మీరు నిమిషానికి మీ గరిష్ట పదాలను చేరుకునేలా చూసుకోండి. ల్యాప్‌టాప్‌లో ఎక్కువ స్టోరేజ్‌ స్పేస్‌ ఉంటే కంపైల్‌ సమయాన్ని తగ్గిస్తుంది. మీ ల్యాప్‌టాప్‌లో సాలిడ్‌ స్టేట్‌ డ్రైవ్‌ (ఎస్‌ఎస్‌డీ) ని కనీసం 512 జీబీ ఉండేట్లుగా చూసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఆశ్రిత దేవరకొండ

    Ans:

    ఒకప్పుడు ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు వస్తేనే ఇంజినీరింగ్‌లో సీట్‌ వచ్చేది. ఇప్పుడు చాలా ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు వచ్చాక ఇంజినీరింగ్‌లో సీటు తెచ్చుకోవడం సులువైంది కానీ చదవడం కష్టం అయింది. వీటితో పాటు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీ కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ సీట్లు కూడా ఉన్నాయి.
    ప్రస్తుతం మీ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది- ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాలేదు కాబట్టి ఇంజినీరింగ్‌ కాకుండా మరేదైనా డిగ్రీ కోర్సు చదవడం. రెండోది- ర్యాంకుతో సంబంధం లేకుండా అధిక ఫీజు కట్టి మంచి ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరడం. మూడోది- ఒక సంవత్సరం లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకోవడం. ఇంజినీరింగ్‌ కాకుండా, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీకాం, ఐదు సంవత్సరాల న్యాయవిద్య, మల్టీమీడియా లాంటి కోర్సులను ఎంచుకొని బాగా చదివి, మెరుగైన భవిష్యత్తును పొందవచ్చు. మీకు ఆర్థిక స్థోమత ఉంటే ఏదైనా మంచి కాలేజీలో ఇంజినీరింగ్‌లో చేరే ప్రయత్నం చేయండి. దీంట్లో ఉండే ప్రమాదం ఏంటంటే- మీరు చదవబోయే మంచి ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో మీకంటే మెరుగైన ప్రతిభకలవారితో పోటీపడాలి. గత అనుభవాలను పరిశీలిస్తే ఇలాంటివారు ప్రతిభావంతులతో పోటీ¨పడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి, మీ క్లాస్‌మేట్స్‌తో సమానంగా రాణించగలననే నమ్మకం ఉంటే నిరభ్యంతరంగా ఇంజినీరింగ్‌ కోర్సు చదవండి. ఇక బ్రాంచి విషయానికొస్తే మీరు భవిష్యత్తులో ఏ రంగంలో, ఎలా స్థిరపడాలని అనుకుంటున్నారనేది ఆధారంగా చేసుకొని నిర్ణయం తీసుకోండి. ఇంజినీరింగ్‌ బ్రాంచి కంటే.. ఈ నాలుగేళ్లూ ఎలా చదువుతారు, కమ్యూనికేషన్, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్, అనలిటికల్, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను ఎలా మెరుగుపర్చుకొంటారు అనేవి మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఏడాది పాటు విసుగు లేకుండా, ఇష్టంతో, పట్టుదలతో, ఓపిగ్గా చదవగలననే నమ్మకముంటేనే లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ గురించి ఆలోచించండి. 
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  

    Asked By: ఎం.ముస్తాక్‌

    Ans:

    బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సులు చేసినవారికి మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. కానీ, ఈ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులవల్ల మీరు డిగ్రీలో చదివిన సిలబస్‌కు తోడుగా మరికొన్ని కోర్సులు చేస్తే ఐటీ ఉద్యోగం సంపాదించవచ్చు. ఈ రంగంలో స్థిరపడాలనుకొంటే స్టాటిస్టిక్స్, ఎమ్‌ఎస్‌ ఎక్సెల్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, డేటా విజువలైజేషన్, మైక్రోసాఫ్ట్‌ పవర్‌ బీఐ, మెషిన్‌ లెర్నింగ్, టేబ్ల్యు, ఎస్‌క్యూఎల్‌లపై గట్టి పట్టు సాధించాలి. వీటితో పాటు డేటా మైనింగ్, బ్లాక్‌ చైన్, డేటా మోడలింగ్‌లపై కూడా మంచి అవగాహన ఉంటే ఈ రంగంలో రాణించడం కష్టం కాదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. శివశంకర్రెడ్డి

    Ans:

    ఇంగ్లిష్‌ మన మాతృభాష కాదు కాబట్టి వ్యాకరణ దోషాలు సహజమే. మనలో చాలామంది ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగల్గినా రాయడంలో తప్పులు చేస్తారు. వ్యాకరణ దోషాలు కనిపెట్టి సరిదిద్దటానికి వివిధ రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా గ్రామర్లి, జింజర్, ప్రూఫ్‌ రీడర్, స్క్రిబెన్స్, లింగ్వీక్స్‌ లాంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆంగ్లంలో డ్రాఫ్టింగ్‌ మెలకువలు పెంచుకోవాలంటే ముందుగా మీకు గ్రామర్‌పై మంచి పట్టు ఉండాలి. అందుకోసం మొదటగా హైస్కూల్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ అండ్‌ కంపోజిషన్‌ (రెన్‌ అండ్‌ మార్టిన్‌) పుస్తకాన్ని చదివి, బాగా సాధన చేయండి. ఆంగ్ల పదసంపద పెంచుకోవడానికి ఏదైనా ఒక ఆంగ్ల వార్తాపత్రిక క్రమం తప్పకుండా చదవండి. మీరు ఎంత ఎక్కువగా సాధన చేస్తే, అంత తక్కువ దోషాలతో రాయగలరు. యాప్‌ల ద్వారా రాసే భాషను మెరుగుపర్చుకొనే క్రమంలో మీరు ఎక్కువగా ఎలాంటి తప్పులు చేస్తున్నారో, ఆ తప్పులు ఎలా సరి అవుతున్నాయో తెలుసుకొని మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి.

    Asked By: కె. సుదీక్ష

    Ans:

    సైకాలజీలో పీజీ చేసిన వారు కౌన్సెలర్‌లుగా స్థిరపడే అవకాశం ఉంది. సైకాలజీతో పాటు కెరియర్‌ గైడెన్స్‌లో డిప్లొమా కానీ, సర్టిఫికెట్‌ కోర్సు కానీ చేస్తే కెరియర్‌ కౌన్సిలర్‌గా కూడా అవకాశాలుంటాయి. మీకు సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఏదైనా కోర్సు చేసి ట్రైనర్‌గా కూడా రాణించవచ్చు. హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌లో ఏమైనా కోర్సులు చేసి మేనేజ్‌మెంట్‌/ బిజినెస్‌ రంగంలోనూ ప్రవేశించవచ్చు. బీఈడీ, ఎంఈడీ చేసి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో అధ్యాపక వృత్తినీ ఎంచుకోవచ్చు. సైకాలజీలోనే పీ‡హెచ్‌డీ చేసి, ఆ రంగంలోనే అధ్యాపక వృత్తిని చేపట్టవచ్చు. మీకు ఆసక్తి ఉంటే పరిశోధన రంగంలో కూడా ఉద్యోగావకాశాలు ఉంటాయి. హెల్త్‌కేర్‌ రంగంపై ఆసక్తి ఉంటే కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో రోగులకూ, వారి సహాయకులకూ కౌన్సెలింగ్‌ చేసే ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు. స్వచ్ఛంద సేవాసంస్థల్లో, మీడియా రంగంలో సైకాలజీ చదివినవారికి పరిమిత సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎం.అనిరుధ్

    Ans:

    ఎంఎస్‌ ఎలక్ట్రానిక్స్‌ చదివినవారికి బోధన, పరిశోధన, రక్షణ రంగాలతోపాటు టెలివిజన్, ఆటోమొబైల్, రెఫ్రిజిరేటర్‌ తయారీలో ఉద్యోగావకాశాలుంటాయి. మహారత్న, నవరత్న లాంటి ప్రభుత్వరంగ సంస్థల్లో ఇంజినీర్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. కంప్యూటర్‌ హార్డ్‌వేర్, నెట్‌వర్క్, డిజైన్, డెవలప్‌మెంట్, ఆటోమేషన్‌ రంగాల్లో కూడా ప్రవేశించవచ్చు. ప్రముఖ ఐటీ కంపెనీల్లోనూ ఎలక్ట్రానిక్స్‌ సంబంధిత విభాగాలు ఉంటాయి. ఎంటెక్‌లో చదివిన స్పెషలైజేషన్‌కు అనుగుణంగా నచ్చిన ఉద్యోగాలకు ప్రయత్నించండి, యూఎస్‌లో ఎంఎస్‌ చేయడం వల్ల ప్రధానంగా.. మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. బీటెక్‌లో చదివిన సబ్జెక్ట్‌లో మాత్రమే కాకుండా యూఎస్‌లో మీకు నచ్చిన సబ్జెక్ట్‌లో ఎంఎస్‌ చేసే వెసులుబాటూ ఉంది.

    -బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  

    Asked By: డి.ప్రవల్లిక

    Ans:

    ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్లాలంటే బీటెక్‌ చదివినవారికంటే ఎక్కువ కష్టపడాల్సిఉంటుంది. అయితే ఈ రంగంలో రాణించడం అసాధ్యం కాదు. మీరు ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదివిఉంటే, ఎంసీఏ కోర్సు చదవొచ్చు. అలా కుదరకపోతే కంప్యూటర్‌/ సాఫ్ట్‌వేర్‌లో పీజీ డిప్లొమా/డిప్లొమా చేయండి. ఇంటర్‌ విద్యార్హతతో బీసీఏ కూడా చేసే అవకాశం ఉంది. మొదటగా మీరు ఎంఎస్‌-ఎక్సెల్, సీ‡ ప్రోగ్రామింగ్, జావా, పైతాన్‌ లాంటి లాంగ్వేజెస్‌ నేర్చుకుని, సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగానికి ప్రయత్నించండి. అదేవిధంగా, ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న సాఫ్ట్‌వేర్‌ కోర్సులూ, ఉద్యోగాల గురించి తెలుసుకుని, వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. - బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  

    Asked By: కార్తీక్

    Ans:

    బీటెక్‌ మెకానికల్‌ చదివినవారు యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ రాయటానికి అర్హులవుతారు. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, కోల్‌ ఇండియా, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోలియం కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌ గ్రిడ్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, భారత్‌ ఎలక్ట్రానిక్స్, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇంజినీర్స్‌ ఇండియా, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్, మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్, నేషనల్‌ అల్యూమినియం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లాంటి  ప్రభుత్వరంగ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలుగా, ఇంజినీర్‌ ట్రైనీలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. పైవాటిలో చాలా సంస్థలు గేట్‌ పరీక్షలో వచ్చిన స్కోరు ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతాయి. డీ…ఆర్‌డీవో లాంటి రక్షణ సంస్థల్లో, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. రాష్ట్ర రోడ్‌ రవాణా సంస్థల్లో కూడా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి కొలువులు లభిస్తాయి. వీటితో పాటు డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు.  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి.వీరారెడ్డి, కడప

    Ans:

    -  బీఎస్సీ (ఎంపీసీఎస్‌) తరువాత ఎంసీఏ చదివితే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఎంసీఏ కోర్సులో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ చదివితే ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో థియరీతో పాటు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ల గురించి ఎక్కువగా నేర్చుకుంటారు. మీకు లాజిక్, అల్గారిథమ్స్‌ల్లో గట్టి పట్టుండి, బోధన/పరిశోధన రంగంపై ఆసక్తి ఉంటే ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు ఎంచుకోండి. బీఎస్సీ (ఎంపీసీఎస్‌), బీటెక్‌ (సీఎస్‌ఈ), ఎంసీఏ..ఈ మూడు కోర్సులూ ఉపయోగకరమైనవే. దేని ప్రాధాన్యం దానిదే. బీటెక్‌ (సీఎస్‌ఈ) చదివినవారికి త్వరగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వస్తుంది కానీ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం పొందాలంటే డిగ్రీ మాత్రమే ఉంటే సరిపోదు. విషయ పరిజ్ఞానం, లాజికల్‌ థింకింగ్, అనలిటికల్‌ థింకింగ్, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లాంటివి ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తాయి. వీటితోపాటు మీరు చదువుకొన్న విద్యాసంస్థ ర్యాంకింగ్, విశ్వసనీయత, ప్రాంగణ నియామకాలు కూడా మీరు త్వరగా ఉద్యోగం పొందడంలో ఉపయోగపడతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,

    Asked By: పుల్కారామ్

    Ans:

    మీరు సర్టిఫికెట్లను ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఆ ప్రాంతానికి చెందిన పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. ఆ రిపోర్టు ఆధారంగా మీరు చదివిన స్కూల్‌ నుంచి స్టడీ సర్టిఫికెట్లను తీసుకోవచ్చు. ఎస్‌ఎస్‌సీ బోర్డులో డూప్లికేట్‌ టెన్త్‌ క్లాస్‌ సర్టిఫికెట్‌ను పొందవచ్చు.