Post your question

 

  Asked By: కె. గోపాల్‌

  Ans:

  ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ రెండు సంవత్సరాల పీజీ కోర్సు. దీనిలో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల గురించిన సిద్ధాంతాలనూ, విషయాలనూ బోధిస్తారు. సాధారణంగా ఈ కోర్సు చదవాలంటే,  పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌తో డిగ్రీ సాధించి ఉండాలి. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏ డిగ్రీ చదివినవారికైనా  పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. బీఎస్‌సీ (ఎంపీసీ) చేసిన మీరు పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ చేయడానికి అర్హులే. అయితే, ఈ కోర్సు మీ ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని విశ్లేషించుకుని పై నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఈ కోర్సు పూర్తి చేసినవారికి విద్యావేత్త, పొలిటికల్‌ కన్సల్టెంట్, రాజకీయాలకు సంబంధించిన కంటెంట్‌ రైటింగ్‌ లాంటి ఉద్యోగాలతోపాటు పొలిటికల్‌ సర్వే సంస్థల్లో, స్వచ్ఛంద సంస్థల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ అవ్వాలనుకొంటే ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌లో కనీసం 55 శాతం మార్కులు సాధించి, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత లేదా పొలిటికల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ కానీ చేసి ఉండాలి. మీరు జూనియర్‌ లెక్చరర్‌ కావాలనుకొంటే పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత అవసరం. ఉభయ తెలుగు రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా  మీరు జేఎల్, డీఎల్‌ ఉద్యోగాలను పొందవచ్చు.  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: రామకృష్ణ

  Ans:

  బీటెక్‌ (ఈసీఈ) చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చాలా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగానికొస్తే గేట్‌ రాసి ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందవచ్చు. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్ష రాసి కేంద్ర ఇంజినీరింగ్‌ సర్వీసుల్లో కూడా కొలువు సాధించవచ్చు. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ఈసీఐఎల్, డీఆర్‌డీఎల్, బీడీఎల్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ప్రైవేటు రంగానికొస్తే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్‌  పరికరాలు తయారుచేసే సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి. ఇవి కాకుండా సాఫ్ట్‌వేర్‌ / డేటా సైన్సెస్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌/ వీఎల్‌ఎస్‌ఐ లాంటి కోర్సులు నేర్చుకొని ఆ రంగంలో కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం సాధించాలంటే మీ ఇంజినీరింగ్‌ విషయ పరిజ్ఞానంతో పాటు కంప్యూటర్‌ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఏదైనా విదేశీ భాషలో ప్రావీణ్యం లాంటివి ఎంతో అవసరం. మీకు సొంతంగా పరిశ్రమ నెలకొల్పాలన్న ఆసక్తి ఉంటే ఏదైనా టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌లో చేరి మీ ఆకాంక్షను నెరవేర్చుకొనే ప్రయత్నం చేయండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: పి. గోపాల్‌

  Ans:

  ఎంఎస్‌సీ బోటనీ కోర్సులో వృక్షశాస్త్రంతో పాటు వ్యవసాయం, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌కు సంబంధించిన విషయాలనూ నేర్పుతారు. ఈ కోర్సు చదవడానికి బీఎస్‌సీ ఉత్తీర్ణులవ్వడం కనీస అర్హత. అన్ని జాతీయ/రాష్ట్ర  విద్యాసంస్థలు ప్రవేశ పరీక్ష ద్వారా చేర్చుకుంటాయి. ఎంఎస్‌సీ బోటనీ పూర్తి చేసినవారికి బయోటెక్నాలజీ రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువ. బోటనీలో పీజీ చేసి జూనియర్‌ కళాశాలల్లో బోధించవచ్చు. సీఎస్‌ఐఆర్‌ నిర్వహించే నెట్‌ / రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ కళాశాలల్లో బోధనాపరమైన ఉద్యోగాలను పొందవచ్చు. బోటనీలో పీహెచ్‌డీ చేసి విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక వృత్తిలో స్థిరపడవచ్చు. వీటితో పాటు విత్తన తయారీ సంస్థలు, బయోలాజికల్‌ సప్లై, నర్సరీ, ఫుడ్‌ ప్రొడక్షన్, కెమికల్, వ్యవసాయానికి సంబంధించిన రంగాల్లో చాలా అవకాశాలున్నాయి. ఫార్మా సంస్థల్లో కూడా బోటనీలో పీజీ చేసినవారికి ఉద్యోగాలు లభిస్తాయి. బోటనీతో పాటుగా కంప్యూటర్‌ సంబంధిత కోర్సులు చేసి బయో ఇన్‌ఫర్మాటిక్స్‌లో కూడా ప్రవేశించవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: చేతన్‌ కశ్యప్‌

  Ans:

  బీటెక్‌ బయోటెక్నాలజీ  కోర్సు అప్లైడ్‌ సైన్స్‌ విభాగంలోకి వస్తుంది. ప్రాణులు, రసాయనాలు, బయోప్రోసెసింగ్‌ విషయాలను ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. దీనిలో చేరడానికి ఇంటర్మీడియట్‌ లేదా 10+2లో మ్యాథ్స్‌/ బయాలజీ , ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు ఇంటర్మీడియటలో ఆంగ్లం ఒక సబ్జెక్టుగా చదివివుండడం తప్పనిసరి. ఈ కోర్సుకు ప్రవేశాలు ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన మెరిట్‌ను బట్టి జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సును ఎన్‌ఐటీ వరంగల్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో పాటు అతితక్కువ ప్రైవేట్‌ కళాశాలలు అందిస్తున్నాయి. బీటెక్‌ బయోటెక్నాలజీ తరువాత జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌తో పీజీ చేయొచ్చు. డిగ్రీలోనే జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదవాలనే కోర్కె మీకు బలంగా ఉంటే, ఇంటర్మీడియట్‌ అర్హతతో నాలుగు సంవత్సరాల జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుని కూడా చదవొచ్చు. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదవాలనుకునేవారు ఇంటర్మీడియట్‌ లేదా 10 +2 లో మ్యాథ్స్‌/ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ కోర్సు ఎస్‌ఆర్‌ఎం, శారద లాంటి కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.   - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: వీ రెడ్డి, రాజమండ్రి

  Ans:

  మనదేశంలో చాలా ఆసుపత్రుల్లో, ఆరోగ్య కేంద్రాల్లో  ఆరోగ్య కార్యకర్తల కొరత చాలా ఉంది. ముఖ్యంగా నర్సింగ్‌ విభాగంలో పనిచెయ్యడానికి ఎంతోమంది అవసరం. ఎంఎస్‌సీ నర్సింగ్‌.. రెండు సంవత్సరాల పీజీ కోర్సు. దీన్ని పూర్తిచేసినవారికి నర్స్‌ ఎడ్యుకేటర్, రిజిస్టర్డ్‌ నర్స్, స్టాఫ్‌ నర్స్, క్లినికల్‌ నర్స్‌ మేనేెజర్‌ లాంటి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా కార్పొరేట్, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో కూడా కొలువులుంటాయి. విదేశాల్లోనూ నర్సులకు చాలా డిమాండ్‌ ఉంది. హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఎ చేసి హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌గా కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో మంచి వేతనంతో ఉద్యోగం పొందవచ్చు. నర్సింగ్‌లో పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. ప్రజారోగ్య రంగంలో ఆసక్తి ఉంటే ఎంపీహెచ్‌ కోర్సు చేసే అవకాశం ఉంది. ఇవే కాకుండా న్యూట్రిషన్, సైకాలజీ లాంటి కోర్సులు చదివి ఆయా రంగాల్లోనూ స్థిరపడొచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: త్యాగరాజు, ఖమ్మం

  Ans:

  అందరికీ హిందీ భాషను నేర్పించడం, సర్టిఫై చెయ్యడం దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉద్దేశం. వివిధ వయసులున్నవారికి వారు చదువుతున్న తరగతులను బట్టి, పరిచయ, ప్రాథమిక, మాధ్యమిక, ప్రవీణ ఉత్తరార్ధ, రాష్ట్ర భాష ప్రవీణ పరీక్షలను ఎన్నో సంవత్సరాలుగా పారదర్శకతతో నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులు చేసినవారు హిందీ భాషపై మంచి పట్టు సాధించడంతో పాటు, ఈ భాషా నైపుణ్యం మీద ఆధార పడివుండే ఉద్యోగ అవకాశాలను కూడా పొందగలరు. బీఎడ్, ఎంఎడ్‌లను హిందీ సబ్జెక్టులో చేసి, హిందీ అధ్యాపకులుగా స్థిరపడాలనుకునేవారికి ఈ కోర్సు ఎంతో దోహదపడుతుంది. మీ ప్రశ్న విషయానికి వస్తే.. ప్రవీణ ఉత్తరార్థ, బీఏ హిందీ- అంటే బ్యాచిలర్స్‌ స్థాయితో సమానంగా పరిగణిస్తారు. ఈ కోర్సు పరీక్ష రాయడానికి  మీరు ఏ విద్యార్హతతో ఉన్నా ఫరవాలేదు, కానీ ఈ పరీక్ష ఉత్తీర్ణులైన తరువాత హిందీ ప్రచార సభలో రిజిష్టర్‌ చేసుకొని ఆ సర్టిఫికెట్‌ను అర్హతగా పరిగణించాలంటే.. తప్పనిసరిగా 10+2 లేదా ఇంటర్మీడియట్‌ను పూర్తిచేసి, 17 ఏళ్ల వయసు నిండినవారై ఉండాలి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: హేమ

  Ans:

  ఏ భాష నేర్చుకోవడానికైనా ఆ భాష ప్రాథమికాంశాలు నేర్చుకుని రోజూ మాట్లాడటం సాధన చెయ్యాలి. రోజువారీ సంభాషణల్లో దాన్ని ఉపయోగించటం చాలా ముఖ్యం. మీరు ఎంఏ ఇంగ్లిష్‌ ఉత్తీర్ణులు అయివున్నారు కాబట్టి, సబ్జెక్టు పరంగా మీకు ఆంగ్లం పట్ల  మంచి పట్టు ఉండే అవకాశం ఉంటుంది. వీలున్నంత ఎక్కువగా ఇంగ్లిషు మాట్లాడటానికి ప్రయత్నించండి. ఆంగ్ల దిన పత్రికలు రోజూ చదివి పదసంపదని పెంచుకోండి. మాట్లాడుతున్నప్పుడు తప్పులు వచ్చినా ఆగిపోకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూనే ఉండండి. ఇంగ్లిషు టీవి ఛానల్స్‌ బాగా చూస్తూ భాషకు సంబంధించిన మెలకువల్ని నేర్చుకోండి. కమ్యూనికేషన్,. పబ్లిక్‌ స్పీకింగ్‌ కోర్సులు అంతర్జాలంలో కోకొల్లలు.పీజీ డిప్లొమా ఇన్‌ కమ్యూనికేటివ్‌ ఇంగ్లిషు లాంటి కోర్సులు, బ్రిటిష్‌ కౌన్సిల్‌ వారు నిర్వహించే లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ కోర్సులు చేయండి. అవసరమనుకుంటే ఏదైనా స్పోకెన్‌ ఇంగ్లిషు కోర్సులో చేరండి. ఫోన్‌ ద్వారా కానీ, కంప్యూటర్‌ ద్వారా కానీ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణను ఆన్‌లైన్‌ ద్వారా పొందండి. భారత ప్రభుత్వం రూపొందించిన ళీజూత్త్రితిలీ , విశిగినిలి లర్నింగ్‌ ప్లాట్‌ఫారంలో చాలా కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు ఎడెక్స్, యుడెమీ, అప్‌గ్రాడ్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లో కూడా కోర్సులు నేర్చుకోవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: టి. సుస్మితకె

  Ans:

  బీఎస్‌సీ బయోటెక్నాలజీ కోర్సు బయాలజీ, టెక్నాలజీ రంగాల కలయికతో రూపుదిద్దుకుంది. బయాలజీ పట్ల ఆసక్తి, టెక్నాలజీపై పట్టు ఉన్నవారు ఈ కోర్సులో చక్కగా రాణించగలరు. బయోటెక్నాలజీ కోర్సులకు దేశ విదేశాల్లో మంచి భవిష్యత్‌ ఉంది. ఈ కోర్సులు చదివినవారికి ఫార్మా, బయోటెక్, ఇమ్యునాలజీ కంపెనీల్లో, వాక్సిన్‌ తయారీ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఉన్నత విద్య విషయానికి వస్తే.. బీఎస్‌సీ బయోటెక్నాలజీ చేసినవారు ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ కోర్సును చేయొచ్చు, మన దేశంలో ఎంఎస్‌సీ  బయోటెక్నాలజీ కోర్సును అందించే విద్యా సంస్థల్లో జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయాలు  ముందు వరసలో ఉంటాయి. వీటితో పాటు చాలా కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పీజీ బయోటెక్నాలజీని అందిస్తున్నాయి. ఈ కోర్సులో ప్రవేశానికి ఎన్‌టీఏ వారు నిర్వహించే కంబైన్డ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌  బయోటెక్నాలజీ (సీఈఈబీ) ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.  ఎంఎస్‌సీలో బయోటెక్నాలజీ  కోర్సు మాత్రమే కాకుండా మాలిక్యులర్‌ బయాలజీ,  హ్యూమన్‌ జెనెటిక్స్, మెడికల్‌ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, యానిమల్‌ బయోటెక్నాలజీ లాంటి కోర్సులని కూడా ఎంచుకోవచ్చు. ఎంఎస్‌సీ తర్వాత పీ‡హెచ్‌డీ చేసి పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తగా కూడా స్థిరపడవచ్చు. మేనేజ్‌ మెంట్‌/వ్యాపార రంగం వైపు ఆసక్తి ఉన్నవారు ఎంబీఏ బయోటెక్నాలజీ కోర్సులో కూడా చేరవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: స్నేహ. కె

  Ans:

  హెల్త్‌కేర్‌ రంగంలో కూడా ఇతర రంగాల మాదిరిగానే మేనేజర్‌లకు ప్రాధాన్యం ఉంది. వైద్యశాలలో రోగులకు ప్రత్యక్షంగా సేవలు అందించనప్పటికి, వారికి అందే వైద్యానికి సంబంధించిన నాణ్యత, ఇతర విషయాలపై వీరు విలువైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్పత్రి సిబ్బందిని నియమించడం, వారి వేతనాలు, ఉద్యోగానికి సంబంధించిన నిబంధనలు రూపొందించడంలో హెచ్‌.ఆర్‌. మేనేజర్‌లు కీలక పాత్ర పోషిస్తారు. దీనితో పాటు సిబ్బంది శిక్షణను కూడా వీరే పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక కాలేజీల విషయానికి వస్తే
  నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులను వెతకడం, వారిని నియమించడంలో హెచ్‌.ఆర్‌. మేనేజర్‌లు కీలక పాత్ర పోషిస్తారు. ఇక మీ ప్రశ్న విషయం చూస్తే.. కాలేజీలతో పోలిస్తే హెల్త్‌కేర్‌ రంగంలోనే హెచ్‌.ఆర్‌. మేనేజర్‌లకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. హాస్పిటల్‌లో హెచ్‌.ఆర్‌. మేనేజర్‌గా ప్రయత్నించాలనే మీ నిర్ణయం సరైనదే. దానికి ముందు హాస్పిటల్‌/ హెల్త్‌ కేర్‌కు సంబంధించి ఏదైనా డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సుని చేయడం వల్ల ఈ రంగంలో మీకు ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. - బి.రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: జి. లక్ష్మణ్‌

  Ans:

  గేట్‌తో సంబంధం లేకుండా కూడా చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఈఎస్‌ఈ (ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌) కు ప్రతి సంవత్సరం యు.పి.ఎస్‌.సి పరీక్షను నిర్వహిస్తుంది. దేశ రక్షణకు సంబంధించిన ఉద్యోగాల కోసం డి.ఆర్‌.డి.ఒ. ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహిస్తుంది. త్రివిధ దళాల విషయానికొస్తే- ఇండియన్‌ నేవీలో యూనివర్సిటీ ఎంట్రీ స్కీం ద్వారా, ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు ద్వారా, వైమానిక దళంలో ఏఎఫ్‌ క్యాట్‌ ద్వారా ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ఇవే కాకుండా భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్, ఇస్రో లాంటి పరిశోధన సంస్థల్లోనూ మెకానికల్‌ ఇంజినీర్‌లకు వారి విద్యార్హత ఆధారంగా ఉద్యోగ అవకాశాలున్నాయి.
  వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్, కోల్‌ ఇండియా లిమిటెడ్, బీహెచ్‌ఈఎల్, ఆర్‌ఐటీఈఎస్‌ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా గేట్‌తో కాకుండా వారు నిర్వహించే రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఇంజినీరింగ్‌ పోస్టులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఏఈఈ, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ లాంటి పోస్టులను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. రైల్వే శాఖలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లాంటి సంస్థలు కూడా గేట్‌తో సంబంధం లేకుండా వారి ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌లు జారీ చేస్తాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌