Asked By: సురేష్ ముదావత్
Ans:
డిగ్రీ చదువుతూనే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నందుకు అభినందనలు. చాలామంది విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు/ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేవరకు కనీస అవగాహన పెంచుకోరు. చివరి నిమిషంలో సరైన సన్నద్ధత లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. డిగ్రీ పరీక్షలైనా, పీజీ ఎంట్రెన్స్ అయినా, పోలీస్ పరీక్ష అయినా సమయ నిర్వహణ అత్యంత ప్రధానం.
డిగ్రీ పరీక్షలో సమాధానాలు వ్యాస రూపంలో రాయాలి. పోటీ పరీక్షల్లో అయితే ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ పద్ధ్దతిలో ఉంటాయి. డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణత అనేది పూర్తిగా మీ ప్రతిభ పైనే ఆధారపడి ఉంటుంది. పోటీ పరీక్షల్లో మీ విజయం మీ ప్రయత్నం పైనే కాకుండా ఇతర అభ్యర్థుల సన్నద్ధతపై కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని పోటీ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కులుంటాయి. కాబట్టి, మీకు ఏ ప్రశ్నలకు సమాధానాలు తెలుసో, ఏ ప్రశ్నలకు సమాధానాలు తెలియవో ఒక అవగాహన ఉండాలి.
ఏదైనా పరీక్ష రాసే ముందు, ఆ పరీక్షకు సంబంధించిన సిలబస్ క్షుణ్ణంగా పరిశీలించండి. ఆ తరువాత పాత ప్రశ్నపత్రాలను చూసి ప్రశ్నల సరళిని గమనించి, అవగాహన పెంచుకోండి. గతంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారిని కలిసి వారి విజయగాథలను తెలుసుకోండి. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులను కలిసి సందేహాలను నివృత్తి చేసుకోండి. సిలబస్‌కు అనుగుణంగా వివిధ ప్రామాణిక పుస్తకాలు చదివి, స్వయంగా నోట్స్ తయారుచేసుకొని సన్నద్ధత మొదలుపెట్టండి. మీ సన్నద్ధతని అంచనా వేసుకోవడానికి, టైం మేనేజ్మెంట్ కోసం ఎక్కువ సంఖ్యలో మాక్ టెస్ట్ లను రాయండి. పోటీ పరీక్షలు రాస్తున్న ఇతర అభ్యర్థులతో కలిసి కంబైన్డ్ ప్రిపరేషన్ చేయండి. వీటితో పాటు నాణ్యమైన కోచింగ్ అందించే శిక్షణ సంస్థ నుంచి కోచింగ్ తీసుకొనే ప్రయత్నం కూడా చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్