Post your question

 

    Asked By: రిషిత

    Ans:

    వివిధ విద్యాసంస్థలు ఇచ్చే అడ్మిషన్‌ నోటిఫికేషన్ల ప్రకారం ఎంబీఏ చదవడానికి ఉద్యోగానుభవమేదీ అవసరం లేదు. కానీ ఈ అనుభవం ఉన్న వారికి ప్రాంగణ నియామకాల్లో మంచి కొలువులూ, ఎక్కువ వేతనాలూ లభించే అవకాశం ఉంటుంది. ఎక్కువ డిమాండ్‌ ఉన్న ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఎంబీఏ ముందు వరసలో ఉంటుంది. ఏ ప్రొఫెషనల్‌ కోర్సుకయినా విజ్ఞానంతో పాటు మెలకువలు చాలా అవసరం. ఉద్యోగానుభవంతో నేర్చుకోగలిగే కొన్ని ప్రత్యేక మెలకువలను విద్యాసంస్థలు తరగతి గదిలో అందించలేవు. మీరు మేనేజ్‌మెంట్‌ కెరియర్లో అత్యున్నత స్థాయికి వెళ్లాలంటే కనీసం రెండు సంవత్సరాల ఉద్యోగానుభవంతో పాటు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి ఎంబీఏ చదివే ప్రయత్నం చేయండి.  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎస్‌. రవిశంకర్‌

    Ans:

    వేర్‌ హౌసింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌లో వివిధ హోదాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. మెయింటెనెన్స్‌ ఇంజినీర్, సూపర్‌ వైజర్, స్టాక్‌ కీపర్, స్టోర్‌ ఎగ్జిక్యూటివ్, ఇన్‌వెంటరీ సూపర్‌ వైజర్, వేర్‌హౌస్‌ మేనేజర్‌..ఇలా భిన్న విధుల్లో చేరవచ్చు. ఎంఎస్‌ ఆఫీస్‌లో ప్రావీణ్యంతో పాటు క్యాడ్‌లో కొంత పరిజ్ఞానాన్ని కూడా సంపాదిస్తే మీ అవకాశాలు మెరుగవుతాయి. మీరు ఫార్మా, బేవరెజెస్, హాస్పిటల్స్, ఈ- కామర్స్, లాజిస్టిక్స్, మాన్యుఫాక్చరింగ్, ఇంజినీరింగ్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. - ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: మురళీ కిరణ్‌

    Ans:

    ఎమ్మెస్సీలో కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయోటెక్నాలజీ, మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్‌ల్లో ఏ కోర్సు చదివినా కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు మాత్రమే అర్హత పొందుతారు. ఈ రెండు కోర్సులూ విభిన్నమైనవీ, ప్రత్యేకమైనవీ. మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది, ఏ రంగంలో స్థిరపడాలనుకొంటున్నారు అనే విషయాలను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. పరిశోధన, బోధన రంగాల్లో ఆసక్తి, విదేశాల్లో స్థిరపడాలన్న అభిలాష లాంటివీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. ఏ యూనివర్సిటీల్లో చదవాలనుకొంటున్నారో, ఆ వర్సిటీల సిలబస్‌ను గమనించి ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకోండి.
    కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయోటెక్నాలజీ అప్లైడ్‌ సైన్స్‌ కోర్సు అయితే మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్‌ అనేది కొంతవరకు బేసిక్‌ సైన్స్‌ అని చెప్పవచ్చు. రెండు కోర్సుల్లోనూ పరిశోధనకు విస్తృత అవకాశాలున్నాయి. రెండు కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి.
    - ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సాయి చరణ్‌

    Ans:

    మెషిన్‌ లర్నింగ్‌ నేర్చుకోవడానికి పైతాన్‌ సరిపోతుంది. మీరు డేటా అనలిటిక్స్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే SQL నేర్చుకొంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. డేటా ఎక్స్‌ట్రాక్షన్‌ యూజింగ్‌ SQL, R  ప్రోగ్రామింగ్, జావా అండ్‌ జావా స్క్రిప్ట్, జూలియా, LISP,  డేటా విజువలైజేషన్‌ కోసం Tableau కూడా నేర్చుకొనే ప్రయత్నం చేయండి. మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌ ఎల్, అడ్వాన్స్‌డ్‌ SQL, స్టాటిస్టిక్స్, మల్టీ వేరియేట్‌ అనాలిసిస్, న్యూరల్‌ నెట్‌ వర్క్స్, ఎన్‌ఎల్‌పీ లాంటి సబ్జెక్టుల బేసిక్స్‌పై కనీస పరిజ్ఞానం ఉంటే మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎం. రత్నకుమార్‌

    Ans:

    కొద్దికాలంగా సైబర్‌ సెక్యూరిటీకి ప్రాధాన్యం పెరగడం వల్ల ఉద్యోగ మార్కెట్లో ఈ రంగానికి డిమాండ్‌ బాగా ఉంది. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు సాఫ్ట్‌వేర్‌ రంగంతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ రంగాల్లోనూ విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. మీరు ఐటీ ప్రొఫెషనల్‌గా ఏ విభాగంలో పనిచేస్తున్నారో తెలియజేయలేదు. మీరు ప్రస్తుతం పనిచేస్తున్న స్పెషలైజేషన్‌కూ, సైబర్‌ సెక్యూరిటీకీ ఏదైనా సంబంధం ఉందేమో చూడండి. దాన్ని ఆధారంగా చేసుకొని సైబర్‌ సెక్యూరిటీ రంగంలో మీకున్న ఉపాధి అవకాశాలను అంచనా వేసుకోండి. మీరు యుడెమి, క్లౌడ్‌ ఎరాల నుంచి పూర్తిచేసిన కోర్సులు ఈ రంగంపై అవగాహన కల్పించడానికి ఉపయోగపడతాయి కానీ, ఉద్యోగం సంపాదించి సైబర్‌ సెక్యూరిటీ రంగంలో స్థిరపడటానికి పెద్దగా ఉపకరించకపోవచ్చు.
    సైబర్‌ సెక్యూరిటీ అనేది విశాలమైన పరిధి ఉన్న విభాగం. మీరు ఇందులో ఏ ఉద్యోగం చేయాలనుకొంటున్నారో నిర్ణయం తీసుకొని దానికి కావాల్సిన విద్యార్హతలు, మెలకువల గురించి తెలుసుకోండి. వాటిలో శిక్షణ పొందండి. సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌గా పనిచేయడానికి ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలతో పాటు సైబర్‌ సెక్యూరిటీలో శిక్షణ అవసరం. ఈ రంగంలో ప్రవేశించాలంటే సమస్య పరిష్కార సామర్థ్యం, నాయకత్వ నైపుణ్యాలు, విభిన్న సెక్యూరిటీ స్పెషలైజేషన్లలో అనుభవం, భావప్రకటనా నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, డేటాను విశ్లేషించడం లాంటివి ఎంతో అవసరం. వీటితో పాటు విండోస్, యునిక్స్, లినెక్స్, ఫైర్‌ వాల్స్, నెట్‌ వర్క్‌ సెగ్మెంటేషన్, నెట్‌ వర్క్‌ యాక్సెస్‌ కంట్రోల్, డీఎన్‌ఎస్, రూటింగ్, ప్రాక్సీ సర్వీసెస్, థర్డ్‌ పార్టీ ఆడిటింగ్, క్లౌడ్‌ రిస్క్‌ అసెస్మెంట్‌ మెథడాలజీలో కనీస పరిజ్ఞానం అవసరం.
    కోర్సుల విషయానికొస్తే..
    సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీలను సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్, ఎథికల్‌ హ్యాకర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్, క్లౌడ్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్, సైబర్‌ ప్రో ట్రాక్‌ల్లో మీ అవసరానికి తగినట్లుగా ఎంచుకోండి. పైన చెప్పిన విభాగాల్లో శిక్షణానంతరం సైబర్‌ సెక్యూరిటీ రంగంలో నెట్‌వర్క్‌ సెక్యూరిటీ ఇంజినీర్, సైబర్‌ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్, సైబర్‌ సెక్యూరిటీ మేనేజర్, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ అనలిస్ట్‌ లాంటి ఉద్యోగాల్లో స్థిరపడొచ్చు.
    - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎన్‌. అశోక్‌

    Ans:

    సీఎస్‌ఐఆర్‌ / యూజీసీ నెట్‌ (లైఫ్‌సైన్సెస్‌) పరీక్ష కోసం ఎకాలజీ (పీటర్‌ స్టిలింగ్‌), ప్లాంట్‌ ఫిజియాలజీ (టైజ్, జైగర్‌), మాలిక్యులర్‌ అండ్‌ సెల్‌ బయాలజీ (హార్వే లోడిష్‌), జెనెటిక్స్‌ (బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌), మాలిక్యులర్‌ బయాలజీ (కార్ప్స్‌), ఇమ్యునాలజీ (ఇవాన్‌ రోట్టిస్‌), ఇమ్యునాలజీ (క్యూబీ), బయోకెమిస్ట్రీ (లెహింగర్‌), బయోకెమిస్ట్రీ (వోట్‌), బయోకెమిస్ట్రీ (స్ట్రైయర్‌), డెవలప్‌మెంటల్‌ బయాలజీ (గిల్బర్ట్‌) పుస్తకాలను చదవండి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నపత్ర నమూనాను పూర్తిగా అర్థం చేసుకోండి. ప్రతి విభాగానికీ నిర్దిష్ట సంఖ్యలో ఇచ్చిన ప్రశ్నలన్నింటినీ అధ్యయనం చేయండి. పైన చెప్పిన పుస్తకాల నుంచి ఆసక్తి ఉన్న విభాగాల్లో మాదిరి ప్రశ్నలు, సమాధానాలు తయారుచేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం సంసిద్ధులు కండి. రుణాత్మక మార్కులుంటాయి కాబట్టి కచ్చితంగా జవాబులు తెలిసిన ప్రశ్నలనే రాయండి.సీఎస్‌ఐఆర్‌ / యూజీసీ నెట్‌కు రోజుకు 6 గంటలు చొప్పున కనీసం 6నెలలు నిరాటంకంగా చదివితే అనుకూల ఫలితం సొంతమవుతుంది.- ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కె. చంద్రశేఖర్‌

    Ans:

    ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది విద్యార్ధులు మంచి ఉద్యోగం పొందడం ఎలా అనే ఆలోచిస్తున్నారు తప్ప తామే ఒక సంస్థను ప్రారంభించి పదిమందికీ ఉద్యోగాలు కల్పించాలని అనుకోవట్లేదు. అతి తక్కువమంది మాత్రమే ఈ దిశలో ఆలోచిస్తున్నారు. కంపెనీ (సంస్థ) స్థాపించి ఉపాధి కల్పించాలనే మీ ఆశయం అభినందనీయం. ఒక కంపెనీ స్థాపించి దాన్ని విజయవంతంగా నడిపించాలంటే ప్రేరణ, అభిరుచి, స్వీయ క్రమశిక్షణ, రిస్క్‌ తీసుకోగల సామర్ధ్యం, సృజనాత్మక ఆలోచనలు, పట్టుదల, ప్రణాళిక, నిరంతర అధ్యయనం లాంటి లక్షణాలుండాలి.

    మొదటిగా ఏ రంగంలో అడుగు పెట్టాలో స్పష్టత ఉండాలి. ఒకప్పటి లాగా బ్యాంకుల చుట్టూ మూలధనం గురించి తిరగవలసిన పని లేదు. మీ ఆలోచన నచ్చి, అది లాభసాటిగా ఉందనుకుంటే ఏంజిల్‌ ఇన్వెస్టర్స్, క్రౌడ్‌ ఫండింగ్‌ లాంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా సంస్థను స్థాపించడం, దాన్ని లాభాల బాట పట్టించడం అనేది కోర్సుల ద్వారా మాత్రమే నేర్చుకునేది కాదు. కానీ కోర్సులు చదవితే కంపెనీ వ్యవస్థాపకుడికి కావలసిన విషయ పరిజ్ఞానాన్ని పొందవచ్చు.

    ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో కోర్సుల విషయానికొస్తే ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, అహ్మదాబాద్‌ వారు రెండు సంవత్సరాల పీజీ కోర్సు అందిస్తున్నారు. ప్రముఖ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో (ఐఐఎం, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఐఐటీ మేనేజ్‌మెంట్‌ స్కూల్స్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల బిజినెస్‌ స్కూల్స్, నార్సీమోంజి, సింబయాసిస్, ఎండీఐ, నిర్మా మొదలైనవి) రెండు సంవత్సరాల పీజీ చేస్తూ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సబ్జెక్టును ఐచ్ఛికంగా ఎంచుకొని కంపెనీ (సంస్థ) స్ధాపించడానికి కావలసిన మెలకువలు నేర్చుకోండి. అవకాశం ఉంటే రెండు, మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసి సొంతంగా ఒక సంస్థను ప్రారంభించొచ్చు.

    నేషనల్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైసెస్, హైదరాబాద్‌ వారు కూడా ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో వివిధ శిక్షణ ప్రోగ్రాంలను నిర్వహిస్తున్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, హైదరాబాద్‌ వారు స్వల్పకాలిక కోర్సులను అందిస్తున్నారు. ఇవే కాకుండా చాలా విశ్వవిద్యాలయాల ఆంత్రప్రెన్యూర్‌షిప్‌  విభాగాలు కూడా ఈ రంగంలో శిక్షణ తరగతులు, సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఇంక్యుబేటర్‌లనూ, హబ్‌లనూ ప్రారంభించాయి. ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌లను అందుబాటులో ఉంచాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని కంపెనీని స్థాపించాలన్న మీ కలను సాకారం చేసుకోండి.
    - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎల్‌. సాయికుమార్‌

    Ans:

    జావా ఆధారిత అప్లికేషన్‌ల డిజైన్, డెవలప్‌మెంట్, నిర్వహణల బాధ్యత చూసేవారిని జావా డెవలపర్‌ అంటారు. జావా డెవలప్‌మెంట్‌లో కెరియర్‌ని ఎంచుకోవాలంటే బేసిక్‌ జావా, అడ్వాన్స్‌డ్‌ జావా ప్రోగ్రామింగ్‌ సంపూర్ణంగా నేర్చుకోవాలి. దీనిలో ఉద్యోగం సంపాదించాలంటే  జావా సర్వర్‌ పేజెస్‌ అండ్‌ సర్వ్‌లెట్స్, వెబ్‌ ఫ్రేమ్‌ వర్క్స్, సర్వీస్‌ ఓరియంటెడ్‌ ఆర్కిటెక్చర్‌/ వెబ్‌ సర్వీసెస్‌ హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ లాంటి వెబ్‌ టెక్నాలజీలు, ఎక్స్‌ఎంఎల్, జేఎస్‌ఓఎన్‌ లాంటి మార్క్‌ అప్‌ లాంగ్వేజెస్, ఆబ్జెక్టివ్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ లాంటి ప్రాధమిక నైపుణ్యాలు అవసరం.
    వీటితో పాటు అడ్వాన్స్‌డ్‌ నైపుణ్యాలైన ఏఐ అండ్‌ మెషిన్‌ లర్నింగ్, బ్లాక్‌ చెయిన్, పైతాన్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, హడూప్, బిగ్‌ డేటా, మొబైల్‌ టెక్నాలజీస్, అడ్వాన్స్‌డ్‌ జావా స్క్రిప్ట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ అయిన యాంగ్యులర్, రియాక్ట్‌లతో పాటు స్ప్రింగ్‌ బూట్‌/మైక్రో సర్వీసెస్‌లో అవగాహన ఉంటే మంచి జావా డెవలపర్‌గా రాణిస్తారు.
    జావాతో పాటు MySQL లాంటి డేటా బేస్‌ లాంగ్వేజ్‌ కూడా నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. జావా ప్రోగ్రామింగ్‌పై పూర్తి పరిజ్ఞానానికి పైన చెప్పిన నైపుణ్యాలు కూడా తోడైతే జావా డెవలపర్‌గా, అప్లికేషన్‌ డెవలపర్‌ జావాగా, పైతాన్‌ డెవలపర్‌ గా, జావా ప్రోగ్రామర్‌ అనలిస్ట్‌గా, జావా ఆర్కిటెక్ట్‌గా ప్రముఖ సాఫ్ట్‌వేర్‌/ వ్యాపార సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనంతో మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు.
    - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ. లక్ష్మారెడ్డి

    Ans:

    పదో తరగతి విద్యార్హతతో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జనరల్‌ డ్యూటీ, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో గ్రామీణ్‌ డాక్‌ సేవక్, భారత రైల్వేలో హెల్పర్, భారత సైన్యంలో, వైమానిక దళం, నౌకా దళం, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లలో, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ రంగ సంసల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, హాస్పిటల్స్‌లో అటెండర్‌ లాంటి ఉద్యోగాలతో పాటు ఆర్‌టీసీలో బస్‌ కండక్టర్‌ ఉద్యోగాలకు కూడా టెన్త్‌ సరిపోతుంది. ఈ అర్హతతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే ప్రభుత్వ వాహనాల డ్రైవర్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. ఇటీవలికాలంలో పైన చెప్పిన ఉద్యోగాలను చాలావరకు పొరుగు సేవల ద్వారా తాత్కాలికంగా ఒప్పంద పద్ధతిలో నియమిస్తున్నారు. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి ఇంటర్మీడియట్‌ విద్యార్హత. పదో తరగతి తరువాత ఐటీఐ కానీ, పాలిటెక్నిక్‌ కానీ, ఇంటర్మీడియట్‌ కానీ, డిగ్రీ కానీ చదివితే మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులవుతారు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. అమూల్య.

    Ans:

    చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ)ను ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎంఏ) అందిస్తోంది. సీఎంఏ, సీఏ రెండూ ప్రొఫెషనల్‌ కోర్సులే. ఇవి ఫైనాన్స్, అకౌంటింగ్‌కు సంబధించిన రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తాయి. సీఏ కోర్సు అకౌంటింగ్, టాక్సేషన్, ఆడిటింగ్‌ రంగాల్లో అవకాశాలు కల్పిస్తే, సీఎంఏ కోర్సు కాస్టింగ్, అకౌంటింగ్‌లో అవకాశాలను అందిస్తుంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు రెండు కోర్సులకూ సమాన ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రైవేటు, బహుళజాతి సంస్థలు ఈ రెండు కోర్సుల్లోనూ ఉపాధిని కల్పిస్తున్నాయి. సొంతంగా ప్రాక్టీస్‌ చేయదలిస్తే సీఏ కోర్సు పూర్తిచేసినవారికి కాస్త ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ కోర్సులను పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లోని బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇన్‌కమ్‌ టాక్స్, ఆడిట్‌ విభాగాల్లో కూడా ఉద్యోగాలున్నాయి. ఈ రెండు కోర్సుల్లో దాదాపుగా 80 శాతం సిలబస్‌ సమానం కాబట్టి ఒకే సన్నద్ధతతో రెండూ పూర్తి చేసుకోవచ్చు. ఈ రెండు కోర్సులతోపాటు కంపెనీ సెక్రటరీ కోర్సును కూడా పరిగణనలోకి తీసుకుని, ఈ మూడింటిలో ఏవైనా రెండు పూర్తి చేస్తే భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌