Post your question

 

  Asked By: జి. దిలీప్‌సాయి

  Ans:

  మీరు ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో ఉన్నారు కాబట్టి, ఇప్పటినుంచే ఎంఎస్‌ కోర్సు చదవడానికి కావాల్సిన ఏర్పాట్లు మొదలుపెట్టండి. కెనడాలో ఎంఎస్‌ చేయాలంటే జీఆర్‌ఈ స్కోర్‌ తోపాటు, టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ అవసరం. వీటిల్లో మంచి స్కోర్‌ సంపాదిస్తే ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశంతోపాటు, స్కాలర్‌షిప్‌ కూడా లభించే అవకాశం ఉంది.
  కొన్ని యూనివర్సిటీలు టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ల్లో వచ్చిన స్కోర్‌తోనూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కెనడాతో పోలిస్తే జర్మనీలో ట్యూషన్‌ ఫీజు నామమాత్రం. జర్మనీలో చాలా యూనివర్సిటీలు ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌ స్కోర్‌ ఆధారంగానే అడ్మిషన్‌లు ఇస్తున్నాయి. కొన్ని జర్మన్‌ యూనివర్సిటీలు మాత్రం  ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌తో పాటు జీఆర్‌ఈ స్కోర్‌ కూడా పరిగణనలోకి తీసుకొంటున్నాయి.
  ముందుగా ఏ దేశంలో, ఏయే యూనివర్సిటీలో ఎంఎస్‌ని ఏ స్పెషలైజేషన్‌తో చదవాలనుకొంటున్నారో నిర్ణయించుకోండి. యూనివర్సిటీల వెబ్‌సైట్‌లకు వెళ్ళి ఫీజు వివరాలను, ఆ నగరంలో వసతికయ్యే ఖర్చుల వివరాలను తెలుసుకొని, అవసరమైన ఆర్థిక వనరుల గురించి కూడా ఆలోచించండి.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: డి. కిరణ్‌కుమార్‌

  Ans:

  బీటెక్‌ డిగ్రీలో పోషకాహారానికి (న్యూట్రిషన్‌) సంబంధించిన కోర్సులు ఏమీ చదివివుండరు కాబట్టి, ఈ సబ్జెక్టు గురించి మీరు ప్రాథమిక స్థాయి నుంచి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా చేయడానికి ఇంటర్మీడియట్‌ విద్యార్హత సరిపోతుంది. సాధారణంగా న్యూట్రిషన్‌ కోర్సును డిగ్రీలో హోమ్‌ సైన్స్‌తో పాటు కానీ, లైఫ్‌ సైన్స్‌ సబ్జెక్టులు, ఫుడ్‌ టెక్నాలజీ కాంబినేషన్‌లో కానీ చదివే అవకాశం ఉంది. న్యూట్రిషన్‌ కోర్సును పీజీ స్థాయిలో చదవాలనుకొంటే, న్యూట్రిషన్‌కు సంబంధించిన డిగ్రీ చదివి ఉండాలి. సెంటర్‌ ఫర్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ స్టడీస్, డిల్లీలో న్యూట్రిషన్‌కు సంబంధించిన పీజీ డిప్లొమా చేయడానికి ఏ డిగ్రీ చదివినవారైనా అర్హులే. Course Era, Udemy, ed X లాంటి ఆన్‌లైన్‌ అభ్యాస వేదికల్లో న్యూట్రిషన్‌ సబ్జెక్టులను నేర్చుకోండి. పైన పేర్కొన్న ఆన్‌లైన్‌ కోర్సులు పోషకాహారంపై అవగాహన మాత్రమే కల్పిస్తాయి. న్యూట్రిషనిస్ట్‌గా స్థిరపడటానికి మాత్రం న్యూట్రిషన్‌ కోర్సుని పీజీ స్థాయిలో చదివి ఉండాలి.

  Asked By: శ్యామ్‌ప్రసాద్‌

  Ans:

  ఐటీ రంగంలో స్థిరపడటానికి ఏ బ్రాంచిలో ఇంజినీరింగ్‌ చేసినా సరిపోతుంది. కాకపోతే, ఇంజినీరింగ్‌లో చదివిన బ్రాంచికి సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు ఉంటే సంబంధిత ఇంజినీరింగ్‌ బ్రాంచితో సంబంధమున్న ఐటీ అప్లికేషన్స్‌ గురించి కొంత అవగాహన ఉంటుంది. మీరు ఐటీ రంగంలో ప్రవేశించాలంటే రెండు మార్గాలున్నాయి. కెమికల్‌ ఇంజనీరింగ్‌కి సంబంధించిన ఐటీ అప్లికేషన్స్‌లో శిక్షణ పొంది, రసాయనిక పరిశ్రమ కోసం ఐటీని వృద్ధి చేస్తున్న సంస్థల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించడం;  అన్ని రంగాలకూ సంబంధించిన ఐటీ సంస్థలకు కావాల్సిన జనరల్‌ సాఫ్ట్‌వేర్‌ నేర్చుకొని ఆ సంస్థల్లో స్థిరపడటం.
  మీరు కెమికల్‌ ఇంజినీరింగ్‌ సంబంధిత ఐటీ ఉద్యోగాల కోసం MATLAB, SCILAB, ASPEN, HYSYS, CHEMCAD లాంటి సాఫ్ట్‌వేర్‌ నేర్చుకోండి. ప్రస్తుతం ఉన్న అవసరాల దృష్ట్యా ఏదైనా ఐటీ రంగంలోకి ప్రవేశించాలంటే ఎంఎస్‌ ఎక్సెల్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, మ్యాట్‌ ల్యాబ్, సీ ప్రోగ్రామింగ్, జావా, విజువల్‌ బేసిక్, ఎస్‌క్యూఎల్‌ లాంటివి నేర్చుకోవడం ముఖ్యం. కంప్యుటేషన్, సిమ్యులేషన్, ఆటోమేషన్‌లకు సంబంధించిన ఐటీ టూల్స్‌ గురించీ తెలుసుకోండి. ఐటీ రంగంలో రాణించాలంటే కోడింగ్, ప్రోగ్రామింగ్, ప్రాబ్లం సాల్వింగ్‌ లాంటి నైపుణ్యాలతో పాటు భావ వ్యక్తీకరణ సామర్ధ్యం, ఆంగ్ల భాషపై పట్టు, బృందాల్లో పనిచేయగలగటం, నాయకత్వ లక్షణాలు చాలా అవసరం.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: రవికుమార్

  Ans:

  కెమికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచి తక్కువ కాలేజీల్లో అందుబాటులో ఉండటం వల్ల ఈ కోర్సు చదివినవారికి డిమాండ్‌ ఉంది. ఈ కోర్సు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల సమ్మేళనం. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారు కెమికల్‌ ఇంజినీర్‌గా, ఎనర్జీ ఇంజినీర్‌గా, పెట్రోలియం ఇంజినీర్‌గా, నూక్లియర్‌ ఇంజినీర్‌గా, ప్రొడక్ట్‌ ఇంజినీర్‌గా, ప్రాసెస్‌ ఇంజినీర్‌గా ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయి. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ఎనర్జీ, ఫార్మా, ఫుడ్‌ అండ్‌ బెవరెజ్, వాటర్‌ ట్రీట్‌మెంట్, సిమెంట్‌ తయారీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల్లో, ఉక్కు పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కోర్సు చదివితే మనదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగానూ ఉపాధి అవకాశాలుంటాయి. ఇంజినీరింగ్‌ చదివాక ఎంటెక్, పీ‡హెచ్‌డీ లాంటి ఉన్నత విద్యావకాశాలు కూడా ఉన్నాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: కె. విజయ్‌కుమార్‌

  Ans:

  సాధారణంగా ఏ బ్రాంచితో ఇంజనీరింగ్‌ చేసినవారికైనా కనీసం నాలుగు అవకాశాలు ఉంటాయి. మొదటిది- వారికి సంబంధించిన బ్రాంచిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కోర్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం. రెండోది- ఐటీ/ సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్ళడం. మూడోది- సొంతంగా ఒక సంస్థ స్థాపించడం. నాలుగోది- ఉన్నత విద్యను అభ్యసించడం. వీటితో పాటు డిగ్రీ అర్హతతో పోటీ పరీక్షలు రాయడమూ మరొక మార్గం. ఇక మీ అబ్బాయి విషయానికొస్తే పైన చెప్పిన ఐదు అవకాశాల్లో తనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోమని చెప్పండి. ఇటీవలి కాలంలో చాలా ప్రభుత్వరంగ సంస్థలు గేట్‌ ద్వారా నియామకాలు చేస్తున్నాయి. మీ అబ్బాయిని గేట్‌ రాయమని చెప్పండి. గేట్‌ ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీల్లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌ చేసే అవకాశం ఉంది. క్యాట్‌ రాసి ఐఐఎంల్లాంటి విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయవచ్చు. క్యాట్‌లో మంచి స్కోర్‌ రాకపోతే, వివిధ ప్రైవేటు మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు నిర్వహించే ప్రత్యేకమైన ప్రవేశ పరీక్షల ద్వారా ఆయా సంస్థల్లో కూడా ఎంబీఎ చేయవచ్చు. జీఆర్‌ఈ, టోఫెల్‌ల ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఉన్నాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: శ్రీనిఖిత, హైదరాబాద్‌

  Ans:

  ఇటీవలికాలంలో మీడియా చానల్స్‌ ఎక్కువ అవడం వల్ల జర్నలిజం కోర్సులకు బాగా ఆదరణ పెరిగింది. కమ్యూనికేషన్‌ రంగంలో వస్తోన్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా జర్నలిజం కోర్సుల్లో కూడా వివిధ స్పెషలైజేషన్లను ప్రారంభించారు. ఈ మార్పుల వల్ల జర్నలిజం చదివినవారికి విభిన్న ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. జర్నలిజం కోర్సును సాధారణంగా మాస్‌ కమ్యూనికేషన్‌తోగానీ, మీడియా స్టడీస్‌తోగానీ కలిపి బోధిస్తారు. జర్నలిజం చదివిన తర్వాత ప్రింట్‌ మీడియా, టెలివిజన్, పబ్లిక్‌ రిలేషన్స్, అడ్వర్‌టైజింగ్‌ రంగాల్లో కెరియర్‌ను ప్రారంభించవచ్చు. సామర్థ్యమున్నవారు ఈ రంగంలో స్వయంగా సంస్థను ప్రారంభించి మరికొంత మందికి ఉపాధి కల్పించవచ్చు. జర్నలిజం అనేది ప్రొఫెషనల్‌ కోర్సు. ఇలాంటి కోర్సులకు పరిజ్ఞానంతోపాటు నైపుణ్యం కూడా చాలా అవసరం. ముఖ్యంగా భావ వ్యక్తీకరణ, కనీసం రెండు భాషలపై పట్టు జర్నలిజంలో ప్రధానం. మీకీ రంగం మీద విపరీతమైన ఆసక్తి ఉంటే.. నిరభ్యంతరంగా జర్నలిజం కోర్సును చదవొచ్చు. ప్రస్తుతం మీరు చదువుతోన్న కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సు కూడా జర్నలిజం, మాస్‌ మీడియా రంగాల్లో కెరియర్‌కు బాగా ఉపయోగపడుతుంది. వీడియో ప్రొడక్షన్, రేడియో ప్రొడక్షన్, కన్వర్టెంట్‌ ప్రొడక్షన్‌ లాంటి సాంకేతిక రంగాల్లో రాణించే అవకాశాలున్నాయి. జర్నలిజం కోర్సులు చదివినవారు జర్నలిస్ట్‌గా, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా, కంటెంట్‌ రైటర్స్‌గా, ఎడిటర్స్‌గా కెరియర్‌ని ప్రారంభించవచ్చు. కెరియర్‌ ప్రారంభంలో అంత ఆకర్షణీయమైన వేతనాలు పొందలేనప్పటికీ ఉద్యోగానుభవంతో మంచి ఎదుగుదలని ఆశించవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: - అస్లామ్‌ షేక్‌

  Ans:

  ఐటీఐకి పదో తరగతి ఉత్తీర్ణత కనీస అర్హత. మీరు బీటెక్‌ తరువాత ఐటీఐ చేయవచ్చు. కానీ, అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పదో తరగతి తరువాత ఆరు సంవత్సరాలు చదివి, ఇప్పుడు ఐటీఐ చదవడం అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. కెరియర్‌ నిర్ణయాలు చాలా జాగ్రత్తతో తీసుకోవాలి. ఇంజినీరింగ్‌ చదివిన తరువాత ఐటీఐ లాంటి కోర్సు చదవడం వల్ల చెప్పుకోదగ్గ ప్రయోజనం ఉండదు. మీకు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రంగంలో విషయ పరిజ్ఞానం సరిపడేంత లేకపోతే, దాన్ని పెంచుకొనే ప్రయత్నం చేసి మెరుగైన ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: రామకృష్ణ

  Ans:

  బీటెక్‌ (ఈసీఈ) చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చాలా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగానికొస్తే గేట్‌ రాసి ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందవచ్చు. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్ష రాసి కేంద్ర ఇంజినీరింగ్‌ సర్వీసుల్లో కూడా కొలువు సాధించవచ్చు. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ఈసీఐఎల్, డీఆర్‌డీఎల్, బీడీఎల్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ప్రైవేటు రంగానికొస్తే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్‌  పరికరాలు తయారుచేసే సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి. ఇవి కాకుండా సాఫ్ట్‌వేర్‌ / డేటా సైన్సెస్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌/ వీఎల్‌ఎస్‌ఐ లాంటి కోర్సులు నేర్చుకొని ఆ రంగంలో కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం సాధించాలంటే మీ ఇంజినీరింగ్‌ విషయ పరిజ్ఞానంతో పాటు కంప్యూటర్‌ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఏదైనా విదేశీ భాషలో ప్రావీణ్యం లాంటివి ఎంతో అవసరం. మీకు సొంతంగా పరిశ్రమ నెలకొల్పాలన్న ఆసక్తి ఉంటే ఏదైనా టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌లో చేరి మీ ఆకాంక్షను నెరవేర్చుకొనే ప్రయత్నం చేయండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: చేతన్‌ కశ్యప్‌

  Ans:

  బీటెక్‌ బయోటెక్నాలజీ  కోర్సు అప్లైడ్‌ సైన్స్‌ విభాగంలోకి వస్తుంది. ప్రాణులు, రసాయనాలు, బయోప్రోసెసింగ్‌ విషయాలను ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. దీనిలో చేరడానికి ఇంటర్మీడియట్‌ లేదా 10+2లో మ్యాథ్స్‌/ బయాలజీ , ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు ఇంటర్మీడియటలో ఆంగ్లం ఒక సబ్జెక్టుగా చదివివుండడం తప్పనిసరి. ఈ కోర్సుకు ప్రవేశాలు ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన మెరిట్‌ను బట్టి జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సును ఎన్‌ఐటీ వరంగల్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో పాటు అతితక్కువ ప్రైవేట్‌ కళాశాలలు అందిస్తున్నాయి. బీటెక్‌ బయోటెక్నాలజీ తరువాత జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌తో పీజీ చేయొచ్చు. డిగ్రీలోనే జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదవాలనే కోర్కె మీకు బలంగా ఉంటే, ఇంటర్మీడియట్‌ అర్హతతో నాలుగు సంవత్సరాల జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుని కూడా చదవొచ్చు. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదవాలనుకునేవారు ఇంటర్మీడియట్‌ లేదా 10 +2 లో మ్యాథ్స్‌/ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ కోర్సు ఎస్‌ఆర్‌ఎం, శారద లాంటి కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.   - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌