Post your question

 

    Asked By: శ్రీనిఖిత, హైదరాబాద్‌

    Ans:

    ఇటీవలికాలంలో మీడియా చానల్స్‌ ఎక్కువ అవడం వల్ల జర్నలిజం కోర్సులకు బాగా ఆదరణ పెరిగింది. కమ్యూనికేషన్‌ రంగంలో వస్తోన్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా జర్నలిజం కోర్సుల్లో కూడా వివిధ స్పెషలైజేషన్లను ప్రారంభించారు. ఈ మార్పుల వల్ల జర్నలిజం చదివినవారికి విభిన్న ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. జర్నలిజం కోర్సును సాధారణంగా మాస్‌ కమ్యూనికేషన్‌తోగానీ, మీడియా స్టడీస్‌తోగానీ కలిపి బోధిస్తారు. జర్నలిజం చదివిన తర్వాత ప్రింట్‌ మీడియా, టెలివిజన్, పబ్లిక్‌ రిలేషన్స్, అడ్వర్‌టైజింగ్‌ రంగాల్లో కెరియర్‌ను ప్రారంభించవచ్చు. సామర్థ్యమున్నవారు ఈ రంగంలో స్వయంగా సంస్థను ప్రారంభించి మరికొంత మందికి ఉపాధి కల్పించవచ్చు. జర్నలిజం అనేది ప్రొఫెషనల్‌ కోర్సు. ఇలాంటి కోర్సులకు పరిజ్ఞానంతోపాటు నైపుణ్యం కూడా చాలా అవసరం. ముఖ్యంగా భావ వ్యక్తీకరణ, కనీసం రెండు భాషలపై పట్టు జర్నలిజంలో ప్రధానం. మీకీ రంగం మీద విపరీతమైన ఆసక్తి ఉంటే.. నిరభ్యంతరంగా జర్నలిజం కోర్సును చదవొచ్చు. ప్రస్తుతం మీరు చదువుతోన్న కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సు కూడా జర్నలిజం, మాస్‌ మీడియా రంగాల్లో కెరియర్‌కు బాగా ఉపయోగపడుతుంది. వీడియో ప్రొడక్షన్, రేడియో ప్రొడక్షన్, కన్వర్టెంట్‌ ప్రొడక్షన్‌ లాంటి సాంకేతిక రంగాల్లో రాణించే అవకాశాలున్నాయి. జర్నలిజం కోర్సులు చదివినవారు జర్నలిస్ట్‌గా, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా, కంటెంట్‌ రైటర్స్‌గా, ఎడిటర్స్‌గా కెరియర్‌ని ప్రారంభించవచ్చు. కెరియర్‌ ప్రారంభంలో అంత ఆకర్షణీయమైన వేతనాలు పొందలేనప్పటికీ ఉద్యోగానుభవంతో మంచి ఎదుగుదలని ఆశించవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: - అస్లామ్‌ షేక్‌

    Ans:

    ఐటీఐకి పదో తరగతి ఉత్తీర్ణత కనీస అర్హత. మీరు బీటెక్‌ తరువాత ఐటీఐ చేయవచ్చు. కానీ, అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పదో తరగతి తరువాత ఆరు సంవత్సరాలు చదివి, ఇప్పుడు ఐటీఐ చదవడం అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. కెరియర్‌ నిర్ణయాలు చాలా జాగ్రత్తతో తీసుకోవాలి. ఇంజినీరింగ్‌ చదివిన తరువాత ఐటీఐ లాంటి కోర్సు చదవడం వల్ల చెప్పుకోదగ్గ ప్రయోజనం ఉండదు. మీకు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రంగంలో విషయ పరిజ్ఞానం సరిపడేంత లేకపోతే, దాన్ని పెంచుకొనే ప్రయత్నం చేసి మెరుగైన ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రామకృష్ణ

    Ans:

    బీటెక్‌ (ఈసీఈ) చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చాలా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగానికొస్తే గేట్‌ రాసి ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందవచ్చు. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్ష రాసి కేంద్ర ఇంజినీరింగ్‌ సర్వీసుల్లో కూడా కొలువు సాధించవచ్చు. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ఈసీఐఎల్, డీఆర్‌డీఎల్, బీడీఎల్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ప్రైవేటు రంగానికొస్తే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్‌  పరికరాలు తయారుచేసే సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి. ఇవి కాకుండా సాఫ్ట్‌వేర్‌ / డేటా సైన్సెస్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌/ వీఎల్‌ఎస్‌ఐ లాంటి కోర్సులు నేర్చుకొని ఆ రంగంలో కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం సాధించాలంటే మీ ఇంజినీరింగ్‌ విషయ పరిజ్ఞానంతో పాటు కంప్యూటర్‌ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఏదైనా విదేశీ భాషలో ప్రావీణ్యం లాంటివి ఎంతో అవసరం. మీకు సొంతంగా పరిశ్రమ నెలకొల్పాలన్న ఆసక్తి ఉంటే ఏదైనా టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌లో చేరి మీ ఆకాంక్షను నెరవేర్చుకొనే ప్రయత్నం చేయండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: చేతన్‌ కశ్యప్‌

    Ans:

    బీటెక్‌ బయోటెక్నాలజీ  కోర్సు అప్లైడ్‌ సైన్స్‌ విభాగంలోకి వస్తుంది. ప్రాణులు, రసాయనాలు, బయోప్రోసెసింగ్‌ విషయాలను ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. దీనిలో చేరడానికి ఇంటర్మీడియట్‌ లేదా 10+2లో మ్యాథ్స్‌/ బయాలజీ , ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు ఇంటర్మీడియటలో ఆంగ్లం ఒక సబ్జెక్టుగా చదివివుండడం తప్పనిసరి. ఈ కోర్సుకు ప్రవేశాలు ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన మెరిట్‌ను బట్టి జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సును ఎన్‌ఐటీ వరంగల్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో పాటు అతితక్కువ ప్రైవేట్‌ కళాశాలలు అందిస్తున్నాయి. బీటెక్‌ బయోటెక్నాలజీ తరువాత జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌తో పీజీ చేయొచ్చు. డిగ్రీలోనే జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదవాలనే కోర్కె మీకు బలంగా ఉంటే, ఇంటర్మీడియట్‌ అర్హతతో నాలుగు సంవత్సరాల జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుని కూడా చదవొచ్చు. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదవాలనుకునేవారు ఇంటర్మీడియట్‌ లేదా 10 +2 లో మ్యాథ్స్‌/ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ కోర్సు ఎస్‌ఆర్‌ఎం, శారద లాంటి కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.   - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌