• facebook
  • whatsapp
  • telegram

కామర్స్‌లో మెరుద్దాం

రాష్ట్ర అర్హత పరీక్ష (సెట్‌)లోని మొత్తం 30 సబ్జెక్టుల్లో కామర్స్‌ సబ్జెక్టు ఒకటి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రామాణిక పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ముఖ్యమైన అంశాలతోపాటు వర్తమాన వ్యవహారాలను కూడా అధ్యయనం చేస్తే మంచి స్కోరుతో కామర్స్‌ సెట్‌ అర్హత సులభంగా సాధించవచ్చు!

ఎం.కామ్‌ పూర్తిచేసినవారూ, ఎం. కామ్‌ చివరి సంవ‌త్స‌రం (చివరి సెమిస్టర్‌) చదువుతున్నవారూ కామర్స్‌ సెట్‌ రాయడానికి అర్హులు. ఓపెన్‌ క్యాటగిరీ విద్యార్థులకు పీజీలో కనీసం 55% మార్కులు అవసరం. బీసీ, ఎస్‌.సి, ఎస్‌.టి, వికలాంగులకు 50% మార్కులు ఉండాలి. ముఖ్యవిషయం ఏమిటంటే- ఈ సెట్‌ రాయటానికి వయః పరిమితి లేదు. ఎన్నిసార్లయినా రాయవచ్చు. కామర్స్‌ సెట్‌ అర్హత సాధించిన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగ నియామకాలకు అర్హత పొందుతారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో పీ.హెచ్‌.డీ.లో ప్రవేశం పొందడానికి అర్హత ఉంటుంది. వీటితోపాటు ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో బోధించడానికి ప్రాధాన్యం లభిస్తుంది.
కామర్స్‌ సెట్‌కు సంబంధించి మూడు పేపర్లుంటాయి. వీటిలో మొదటి పేపర్‌ జనరల్‌ స్టడీస్‌. రెండో, మూడో పేపర్లు కామర్స్‌కు సంబంధించి ఉంటాయి. మొదటి పేపర్‌ 100 మార్కులు, రెండో పేపర్‌ 100 మార్కులు, మూడో పేపర్‌ 150 మార్కులకు నిర్వహిస్తారు.


గతంలో రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడిగా సెట్‌ను నిర్వహించినపుడు కామర్స్‌ సెట్‌కు 10,517 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 8,268 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మొదటి దశలో 1577 మంది కనీస అర్హత మార్కులు పొందారు. వీరి నుంచి చివరగా 510 మంది కామర్స్‌ సెట్‌లో అర్హత సాధించినట్లు ప్రకటించారు. విభాగాల వారీగా అర్హతకు నిర్దేశించిన కటాఫ్‌ మార్కులు: ఓపెన్‌ కేటగిరి- 51.43 శాతం, బీ.సీ. అభ్యర్థులు- 48.57 శాతం, ఎస్‌.సీ., ఎస్‌.టీ. అభ్యర్థులు- 47.43 శాతం, వికలాంగులకు 46.86 శాతం మార్కులుగా నిర్దేశించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత అభ్యర్థులు సరైన ప్రణాళికతో కృషి చేయాల్సివుంటుంది.

పేపర్‌-1 జనరల్‌ పేపర్‌ ఆన్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌
ఈ పేపర్‌లో అభ్యర్థుల బోధన, పరిశోధన సామర్థ్యాలను, సాధారణ పరిజ్ఞానాన్ని అంచనా వేయడానికి వివిధ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్కటి రెండు మార్కుల చొప్పున 60 ప్రశ్నలుంటాయి. 50 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. మొత్తం 100 మార్కులు. రుణాత్మక (నెగెటివ్‌) మార్కులు లేవు.

పేపర్‌-2 కామర్స్‌
దీనిలో కామర్స్‌కు సంబంధించిన 10 సబ్జెక్టులను 10 యూనిట్లుగా ఇచ్చారు. ఈ పది సబ్జెక్టుల నుంచి 50 ప్రశ్నలు- అంటే ప్రతి సబ్జెక్టు నుంచి సగటున 5 ప్రశ్నల చొప్పున ఇస్తారు. ప్రతి ప్రశ్నకూ రెండు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. అభ్యర్థులు ప్రణాళికతో అన్ని సబ్జెక్టులూ విశ్లేషిస్తూ చదివినట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు.
* యూనిట్‌-I (బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌): వివిధ సంవత్సరాలనూ, శాతాలనూ లోతుగా చదవాలి.
* యూనిట్‌-II (ఆర్థిక, నిర్వహణ అకౌంటింగ్‌): ఇందులో అభ్యర్థులు వివిధ సూత్రాలను చదువుతూ, చిన్న చిన్న సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి.
* యూనిట్‌-III (వ్యాపార అర్థశాస్త్రం): ముఖ్యమైన అంశాలను వివిధ పటాల సహాయంతో చదివితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
* యూనిట్‌-IV (వ్యాపార గణాంక శాస్త్రం & దత్తాంశ విశ్లేషణ): కంప్యూటర్‌ వినియోగం గురించి మంచి పరిజ్ఞానం సాధించాలి.
* యూనిట్‌-V (వ్యాపార నిర్వహణ): దీనిలో ముఖ్యమైన నిర్వహణ శాస్త్రవేత్తల పేర్లు, సంవత్సరాలు, వివిధ పద్ధతులను మననం చేస్తూ చదవాలి.
* యూనిట్‌-VI (మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌): ప్రాథమిక భావనలను లోతుగా అధ్యయనం చేస్తూ సమగ్రంగా చదవాలి.
* యూనిట్‌-VII (ఆర్థిక నిర్వహణ శాస్త్రం): అభ్యర్థులు చిన్న చిన్న సమస్యలను వివిధ సూత్రాలను ఉపయోగిస్తూ సాధన చేయాలి. దీనిలో తక్కువ అంశాలు ఉండటం వల్ల త్వరగా, సమగ్రంగా చదవవచ్చు.
* యూనిట్‌-VIII (మానవ వనరుల నిర్వహణ): సులభంగా సన్నద్ధం కావడానికి తోడ్పడే సబ్జెక్టుల్లో ఇదొకటి. కాబట్టి అభ్యర్థులు ఇష్టపడి క్రమపద్ధతిలో చదవాలి.
* యూనిట్‌-IX (బ్యాంకింగ్‌, విత్త సంస్థలు): అభ్యర్థులు దీన్ని చదివేటప్పుడు- వివిధ బ్యాంకులు స్థాపించిన సంవత్సరాలు, ప్రధాన కార్యాలయాలు, వాటి మూలధనాలు, వాటి ఛైర్మన్ల పేర్లు, బ్యాంకుల విధులు, వర్తమాన అంశాలను జోడిస్తూ చదివితే మంచి ఫలితం ఉంటుంది.
* యూనిట్‌-X (అంతర్జాతీయ వ్యాపారం): వివిధ అంతర్జాతీయ సంస్థలను స్థాపించిన సంవత్సరాలు, వాటి ప్రధాన కార్యాలయాలు ఉన్న దేశాలు/ పట్టణాలు, వాటి అధిపతుల పేర్లను చదవాలి.

పేపర్‌-3 కామర్స్‌
దీనిలో 5 ప్రధాన సబ్జెక్టుల సిలబస్‌ను చేర్చారు. ఆసక్తికర అంశం ఏమిటంటే- వీటిలో 3 సబ్జెక్టులు రెండో పేపర్‌లో కూడా నిర్దేశించారు. అందుకని అభ్యర్థులు ప్రధాన సబ్జెక్టులను లోతుగా, క్షుణ్ణంగా చదవాలి. మూడో పేపర్‌లో మొత్తం 75 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులకు దీన్ని నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టు నుంచీ సగటున 15 ప్రశ్నల చొప్పున ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
యూనిట్‌-I (అకౌంటింగ్‌, ఫైనాన్స్‌): సమగ్రంగా చదువుతూ అకౌంటింగ్‌, ఫైనాన్స్‌లో కంప్యూటర్‌ వినియోగించడంపై పరిజ్ఞానాన్ని పొందాలి.
యూనిట్‌-II (మార్కెటింగ్‌): ముఖ్యమైన ప్రాథమిక భావనలను లోతుగా చదువుతూ సాధన చేయాలి.
యూనిట్‌ -III (మానవ వనరుల నిర్వహణ): దీనిలోని అంశాలను సమగ్రంగా విశ్లేషిస్తూ చదివితే మంచి ప్రయోజనం ఉంటుంది.
యూనిట్‌ -IV (అంతర్జాతీయ వ్యాపారం): అభ్యర్థులు వివిధ సంస్థలను స్థాపించిన సం॥, ప్రధాన కార్యాలయాలు, వివిధ భావనలను వర్తమాన అంశాలతో జోడిస్తూ సమగ్రంగా చదవాలి.
యూనిట్‌ -V (ఆదాయపు పన్ను చట్టం, పన్ను ప్రణాళిక): అభ్యర్థులు ఈ సబ్జెక్టులో వివిధ సం॥రాలు, ప్రాథమిక భావనలు, వివిధ సెక్షన్లు, పన్నురేట్లు, లెక్కింపు విధానం గురించి లోతుగా చదివితే మంచి ఫలితం ఉంటుంది.

ఆర్థిక నిర్వహణ శాస్త్రంలో చిన్న చిన్న సమస్యలను వివిధ సూత్రాలను ఉపయోగిస్తూ సాధన చేయాలి. దీనిలో తక్కువ అంశాలు ఉండటం వల్ల త్వరగా, సమగ్రంగా చదవవచ్చు.


 

Posted Date : 02-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌