• facebook
  • whatsapp
  • telegram

మెలకువలు పాటిస్తే మార్కులు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుదారులు ఐచ్ఛిక సబ్జెక్టుపై తగిన దృష్టిపెట్టడం అవసరం. ఆర్థిక శాస్త్రంలో మెరుగైన మార్కులు తెచ్చుకోవాలంటే ఏ తీరులో సిద్ధం కావాలి? కీలకమైన అంశాలేమిటి?

విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకానికి నెట్‌/సెట్‌లో అర్హత తప్పనిసరి. భవిష్యత్‌లో గురుకులాల్లో, సాధారణ డిగ్రీ కాలేజీల్లో నియామకాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ పరీక్షకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో పోటీ పడుతున్నారు. అందుకే మూస పద్ధతిలో కాకుండా విశ్లేషణాత్మక విధానంలో సబ్జెక్టును అధ్యయనం చేయాలి. ఎకనామిక్స్‌ ఆప్షనల్‌ నేపథ్యంలో అనేక అంశాలు నిరంతరం మారుతుంటాయి. సిలబస్‌ ఆధారంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో వచ్చే మార్పులు, ప్రస్తుత బడ్జెట్‌, ఆర్థిక సర్వేల ఆధారంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు అధ్యయనం చేయాలి. పరీక్షకు తక్కువ సమయం ఉన్నందువల్ల రోజువారీ అధ్యయనం చేయాల్సిన అంశాలను జాబితాగా రాసుకుని దాన్ని కచ్చితంగా అమలు చేయాలి. గతంలో వచ్చిన ప్రశ్నల అంశాలపై దృష్టి పెట్టడం అవసరం. దీనివల్ల సంబంధిత పాఠ్యాంశం నుంచి ప్రశ్న ఏ కోణంలో అడుగుతున్నారో తెలుసుకోవచ్చు.


సబ్జెక్టువారీ విశ్లేషణ

సూక్ష్మ ఆర్థిక శాస్త్రం
గిరాకీ సంబంధిత అంశాలు అతిముఖ్యమైనవి. ముఖ్యంగా డిమాండ్‌ నిర్వచనాలు, దాన్ని నిర్ణయించే అంశాలు, ప్రయోజనం, లాభాలు, వ్యయాలు... ముఖ్యంగా సగటు, ఉపాంత వ్యయాలు, లాభాలు- కారణాలు, లెక్కించే పద్ధతులు తెలుసుకోవాలి. ఉదాసీనతా వక్రరేఖల లక్షణాలు, ఏకస్వామ్యం, పరిమితస్వామ్యం, మార్కెట్లు వాటి లక్షణాలు, వివిధ రకాల మార్కెట్ల లక్షణాలు, ఆ మార్కెట్లలో ధర నిర్ణయించే విధానాలు అధ్యయనం చేయాలి. కాల్డర్‌, హిక్స్‌, పారిటో, అభిలషణీయత వంటి విషయాలను సంక్షేమ అర్థశాస్త్రంలో చదవాలి.

స్థూల అర్థశాస్త్రం
ద్రవ్య డిమాండ్‌ సంబంధిత అంశాలు, పెట్టుబడి, ఉద్యోగిత, వడ్డీ రేట్లు వంటివి ఎలా నిర్ణయమవుతాయి, వాటి లక్షణాలు, పరిమితులను అధ్యయనం చేయాలి. ఫిలిప్స్‌ వక్రరేఖ లక్షణం, ఆర్మి స్వభావం తప్పనిసరిగా చదవాలి. వ్యాపార చక్రాలు ఎన్ని రకాలు, కారణాలు, ప్రభావాలు/ఫలితాలు, అవి సంభవించటానికి ఆర్థిక వ్యవస్థలో తోడ్పడే అంశాలు చదవాలి. బౌమల్‌, టాబిన్‌ సిద్ధాంతాలు కచ్చితంగా అధ్యయనం చేయాలి.

అభివృద్ధి-ప్రణాళిక
ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని నిర్ణయించు అంశాలు, వాటిని కొలిచే వివిధ సూచికలు, మానవాభివృద్ధి నివేదిక తయారీకి ఉపయోగించే అంశాలు, మానవాభివృద్ధి నివేదికలో భారత్‌ స్థానం తెలుసుకోవాలి. ఆర్థర్‌ లూయిస్‌, హర్షమన్‌, లెబాన్‌స్టెయిన్‌ తెలిపిన సిద్ధాంతాల వివరణలు తెలుసుకోవాలి. ప్రణాళికలు, లక్ష్యాలు, రకాలను విశ్లేషణాత్మకంగా చదవాలి.

ప్రభుత్వ విత్తం
ఈ విభాగంలో బడ్జెట్‌ లోట్లు, కేటాయింపులు, ఇటీవలి బడ్జెట్‌ ముఖ్యాంశాలు చదవాలి. పన్నుల రకాలు, వాటి వాటాలు, ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, వాటి ప్రభావాలు, ఆర్థిక సంఘాల ఛైర్మన్‌లు, ఆర్థిక సంఘం సిఫార్సులు, ఆదాయ పంపిణీకి ప్రాతిపదికలు, వాటా శాతాలు తెలుసుకోవాలి.

అంతర్జాతీయ అర్థశాస్త్రం
అంతర్జాతీయ వ్యాపారం నిర్ణయించే సంప్రదాయ సిద్ధాంతాలయిన నిరపేక్ష, తులనాత్మక సిద్ధాంతాలు, ఆధునిక సిద్ధాంతం అయిన హిక్సర్‌-ఒహ్లిన్‌ సిద్ధాంతం- లియంటిప్‌ వైపరీత్యం, విదేశీ చెల్లింపు శేషంలోని వివిధ ఖాతాలు, వివిధ రకాల వర్తక నిబంధనలు, విదేశీ మారకం రేటు రకాలు, వాటి లాభనష్టాలు అధ్యయనం చేయాలి.

భారత ఆర్థిక వ్యవస్థ
వ్యవసాయ ప్రాధాన్యతాంశాలు, వ్యవసాయ విప్లవం ప్రాధాన్యం, నూతన ఆర్థిక సంస్కరణలు, వివిధ పారిశ్రామిక తీర్మానాలు, రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధానం అమలుకు రెపో, CRR, SLR లను మార్పు చేసే విధానం, ద్రవ్యం, ద్రవ్యోల్బణం కారణాలు, నివారణ చర్యలు, దేశంలో ప్రధాన సామాజిక ఆర్థిక సమస్యలయిన పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, జనాభా- 2011కు సంబంధించిన అంశాలు, అమలులో ఉన్న వివిధ అభివృద్ధి పథకాలు చదవాలి.

స్టాటిస్టిక్స్‌
గణాంక శాస్త్రంలో భాగంగా సగటులు, కేంద్ర విస్తరణ మాపనలు, నమూనాలు, సహసంబంధ అంశాలు మొదలైన అంశాల నుంచి సుమారు 5 లోపు ప్రశ్నలు రావటానికి అవకాశం ఉంది. దీన్ని కూడా అభ్యర్థులు నిర్లక్ష్యం చేయకూడదు.

కచ్చితంగా చదవాల్సినవి
ప్రధాన సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలు పట్టిక రూపంలో రాసుకొని చదవటం ద్వారా పునశ్చరణ చేయటం తేలిక అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక సిద్ధాంతాలు- ఆర్థికవేత్తలు, అభివృద్ధి సిద్ధాంతాలు, రూపకర్తలు, ద్రవ్యం, జాతీయాదాయం, బడ్జెట్లు నిర్వచనాలు, రకాలు, ప్రణాళికల లక్ష్యాలు, ప్రాధాన్యాలు, రూపకర్తలు, భారీ పరిశ్రమలు- స్థాపించిన సంవత్సరాలు, వాటి ప్రదేశాలు, అభివృద్ధి పథకాలు- సం॥లు, ద్రవ్యంలోని ఎం1, ఎం2, ఎం3, ఎం4 వంటి అంశాలు, ఆర్థిక సంఘాల చైర్మన్లు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఏర్పాటు చేసిన సం॥లు, అవి ఉండే ప్రదేశాలు, ఆర్థిక రంగ సంబంధిత కమిటీలు- ఛైర్మన్‌లు మొదలైనవి చదవాలి. ఈ రకంగా వాటికి సంబంధించిన భావనలు, సిద్ధాంతాలు, ప్రాథమిక అంశాలపై పట్టు సాధించవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికబద్ధంగా, విశ్లేషణాత్మకంగా చదివితే విజయం మీదే.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌