• facebook
  • whatsapp
  • telegram

సాధనే బోధన మంత్రం

ఉపాధ్యాయ అర్హత పరీక్ష... టెట్‌లో బోధనా పద్ధతులకు (పెడగాజి) 12 మార్కులు కేటాయించారు. ఈ సబ్జెక్టులో ఎక్కువమంది కచ్చితమైన సమాధానాలు గుర్తించటంలో కొంత అయోమయానికి గురవుతుంటారు. శాస్త్రీయంగా, క్రమపద్ధతిలో సాధన చేస్తే దీనిలో మంచి మార్కులు సాధించవచ్చు.
బి.ఇడి., డి.ఇడి పూర్తిచేసిన వారందరూ ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టాలంటే టెట్‌ అర్హత సాధించాలి. దీనికి డీఎస్సీలో 20% వెయిటేజీ కూడా ఉంది.
* పేపర్‌-I, పేపర్‌-II సైన్సు విభాగం రాసే అభ్యర్థులు ప్రధానంగా 7 యూనిట్లను అధ్యయనం చేయవలసి ఉంటుంది.
* టెట్‌ పేపర్‌-I రాసే అభ్యర్థులు, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి మొత్తం 12 ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. ఇందులో గణితం నుంచి 6 ; సామాన్య, సాంఘిక శాస్త్రాల నుంచి 6 ప్రశ్నలు వస్తాయి.
* టెట్‌ పేపర్‌-II రాసే సైన్సు విద్యార్థులు గణితశాస్తం, భౌతికశాస్త్రం, జీవశాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి మొత్తం 12 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఇందులో గణితశాస్త్ర బోధనా పద్ధతుల నుంచి 6 ; భౌతిక, జీవశాస్త్ర బోధనా పద్ధతుల నుంచి 6 ప్రశ్నలు వస్తాయి.
* పేపర్‌-I, పేపర్‌-II టెట్‌లో పైన పేర్కొన్నట్టు 3 సబ్జెక్టుల్లో ఉన్న ‘సహసంబంధం’, ‘సారూప్యత’ థర్మాల ఆధారంగా వీటిని కలిపి చదవడం ద్వారా వీటిపై పట్టు సాధించవచ్చు.
* పేపర్‌-I, పేపర్‌-II, సైన్సు విభాగంలో గల గణితం, శాస్త్ర బోధనా పద్ధతుల్లో సారూప్యత, సహసంబంధం కల్గిన అంశాలుగా 6 యూనిట్లను పేర్కొనవచ్చు. 1) లక్ష్యాలు- స్పష్టీకరణలు, విలువలు 2) బోధనా పద్ధతులు 3) బోధనోపకరణాలు 4) విద్యా ప్రణాళిక & పాఠ్యపుస్తకం 5) పథక రచనలు 6) మూల్యాంకనం.
మొదటి యూనిట్లోని స్పష్టీకరణలను బాగా గుర్తుంచుకోవాలి. కంటెంట్‌ అంశాలతో అనుప్రయుక్తం చేస్తూ సాధన చేయాలి. అలాగే విలువలకు సంబంధించి కీలక పాయింట్లను ఆధారంగా చేసుకుని తరగతి గది సన్నివేశాలకూ, నిత్యజీవిత సందర్భాలకూ అన్వయిస్తూ సాధన చేయాలి.
                              రెండో యూనిట్‌ బోధనా పద్ధతులు. ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ, అన్వేషణ, ప్రకల్పన, కృత్యాధార బోధనా పద్ధతులు, క్రీడా పద్ధతులు (కిండర్‌ గార్డెన్‌, మాంటిస్సోరి), ప్రయోగశాల పద్థతి, సాంఘికశాస్త్ర బోధనా పద్ధతులైన ఉపన్యాస, ఉపన్యాస ప్రదర్శన, చర్చా,
సాంఘిక ఉద్గార, వనరుల పద్ధతులు.  ఇందులో నిర్వచనాలు, ముఖ్యంగా ఆ పద్ధతులను ఉపయోగించే సందర్భాలు, బోధించదగిన బోధనాంశాలు, ప్రాథమిక సూత్రాలు, గుణాలు, దోషాలు బాగా చదవాలి.
మూడో యూనిట్‌- బోధనోపకరణాలు. ఇవి రూప సామీప్యతకు దోహదపడి అభ్యసనను, బోధనను సులభతరం చేస్తాయి. ఇందులో ఎడ్గారు డేల్‌ అనుభవ శంఖువు, బోధనోపకరణాల వర్గీకరణ, జియోబోర్డు, కృత్యాపకరణాలైన హెర్బేరియం, అక్వేరియం, వైవేరియం, టెర్రేరియం; వైజ్ఞానిక వనరులైన వైజ్ఞానిక కేంద్రాలు, వైజ్ఞానిక సంఘాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, వైజ్ఞానిక వస్తు ప్రదర్శన శాలలు, నక్షత్రశాల, సంచార విజ్ఞానశాస్త్ర వాహనం మొ॥. పేపర్‌-I అభ్యర్థులు అదనంగా ప్రాథమిక గణితశాస్త్ర బోధనాపేటిక, ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనాపేటిక, సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనాపేటిక, సాంఘిక శాస్త్ర బోధనోపకరణాలైన పటాలు , గ్లోబులు, చార్టులు, గ్రాఫ్‌లు అతిముఖ్యాంశాలు. వీటిని ఉపయోగించే సందర్భాలు, వీటి ప్రయోజనాలను అభ్యసించాలి.
నాలుగో యూనిట్‌ విద్యాప్రణాళిక & పాఠ్య పుస్తకం. విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వ సాధనకు విద్యావేత్తలు కీలకమైన అంశంగా భావించేది కరికులమ్‌. ఇందులో నిర్వచనాలు, కరికులమ్‌ నిర్మాణ సూత్రాలు, తార్కిక, మనోవైజ్ఞానిక, శీర్షిక, ఏకకేంద్ర, సర్పిల పద్ధతులు; కరికుల నిర్మాణానికి వివిధ కమిటీలు, కమీషన్‌లు చేసిన సూచనలు; వివిధ తరగతుల్లోని నూతన పాఠ్యపుస్తకంలోని పాఠాంశాలు, ఏ పద్ధతిని అనుసరించి విషయ వ్యవస్థీకరణ జరిగిందో అవగాహన చేసుకోవాలి.
                  బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగించే మొట్టమొదటి బోధనోపకరణమైన పాఠ్యపుస్తకం, ఈ పుస్తక సమర్థతను లెక్కించే హంటర్స్‌ స్కోర్‌ కార్డ్‌, వోగల్స్‌ స్పాట్‌ చెక్‌ మూల్యాంకన పద్ధతుల్లోని ముఖ్యాంశాలు, వాటికి ఇవ్వవలసిన పాయింట్లు ముఖ్యమైనవి.
ఐదో యూనిట్‌ సంగతి చూద్దాం. పథక రచన ప్రయోజనాలు, రూపకల్పనలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, వార్షిక పథకం, యూనిట్‌ పథకం ఉద్దేశం, సోపానాలు, పీరియడ్‌ పథకం నిర్వచనాలు, సోపానాలు, ప్రయోజనాలు; హెర్బార్ట్‌ బోధనా సోపానాలు; నిర్మాణాత్మక పద్ధతి, అభ్యసన సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన బోధనా పద్ధతులు, అభ్యసనా పద్ధతులు; సూక్ష్మ బోధన-చరిత్ర, నిర్వచనాలు, సోపానాలు,

ప్రయోజనాలు అతి కీలకాంశాలు.
ఆరో యూనిట్‌ మూల్యాంకనం & సీసీఈ. మూల్యాంకనం నిర్వచనాలు, మాపనం - మూల్యాంకనం తేడాలు మూల్యాంకనం- ఉద్దేశం; ఉత్తమ మూల్యాంకనం లక్షణాలు (విశ్వసనీయత, సప్రమాణత, విషయ నిష్టత/లక్ష్యాత్మకత) మొదలైనవి ముఖ్యమైనవి. పరీక్షల రకాలైన వ్యాసరూప; సంక్షిప్త, లఘు, విషయనిష్ట వీటి రకాలు ప్రయోజనాలు, పరిమితులు కూడా ప్రధానమైనవే.
ప్రస్తుతం పాఠశాలల్లో నిర్వహించే నిరంతర సమగ్ర మూల్యాంకనం- నిర్వచనం, సమగ్రాభివృద్ధికి బోధిస్తున్న సహ పాఠ్య కార్యక్రమ వివరాలు, మదింపు అంటే, నిర్మాణాత్మక మదింపు- మూల్యాంకన సాధనాలు; గ్రేడింగ్‌ విధానం, సంగ్రహణాత్మక మదింపు; విద్యా ప్రమాణాలు, గణిత విద్యా ప్రమాణాలు, శాస్త్ర విద్యాప్రమాణాలు, నూతన పాఠ్య పుస్తకాలలోని పాఠ్య విషయాల ఆధారంగా విద్యా ప్రమాణాలను పరీక్షించటానికి ప్రశ్నల రూపం (Text Items) సాధన చేయాలి.
          ఏడో యూనిట్‌లో గణిత, శాస్త్రాల నిర్వచనాలు, చారిత్రక సమీక్ష, అరబ్బులు, ఈజిప్టులు, గ్రీకులు, రెనెడ్‌ కార్టె, పైథాగరస్‌, యూక్లిడ్‌, హైపాపాటియా, భారతీయుల గణిత కృషికి నిదర్శనాలు, ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్‌ గణిత సేవలు అతి ముఖ్యాంశాలు.
శాస్త్రం నిర్వచనాలు, శాస్త్ర స్వభావం, ప్రక్రియ నైపుణ్యాలు, పరికల్పనల రకాలు, పేపర్‌-I అభ్యర్థులు అదనంగా సాంఘిక శాస్త్రం నిర్వచనాలు, స్వభావం, సామాజిక శాస్త్రాలు- సాంఘిక శాస్త్రం మధ్య భేదాలు అతి ముఖ్యాంశాలుగా భావించాలి.
    ఎనిమిదో యూనిట్‌- సహ సంబంధం. నిర్వచనాలు, ప్రయోజనాలు, గణితం- ఇతర సబ్జెక్టులతో సహసంబంధం; విజ్ఞాన శాస్త్రం- ఇతర సబ్జెక్టులతో సహసంబంధం; సాంఘిక శాస్త్రం- ఇతర సబ్జెక్టులతో సహసంబంధం... వీటిని కంటెంట్‌ అంశాలకు అనుప్రయుక్తం చేస్తూ చదవాలి.


స్కోరుకు సూత్రాలివీ..
* ప్రతి పాఠ్యాంశాన్నీ చదివి కీలక భావనలపై పట్టుస సాధించాలి. పునఃస్మరణ చేయాలి.
* తరగతి గది సన్నివేశాలకూ, పాఠ్యపుస్తక అంశాలకూ, కంటెంట్‌కూ, నిత్యజీవిత సందర్భాలకూ అన్వయించుకుంటూ చదవాలి.
* ప్రతి పాఠ్యాంశానికీ సంబంధించిన మంచి ప్రామాణికమైన అనుప్రయుక్త ప్రశ్నలను సాధన చేయాలి.
* ప్రతి పాఠ్యాంశంలో గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను ఆధారం చేసుకుని ఎలాంటి ప్రశ్నలు రాబోతాయో అంచనా వేసుకుంటూ చదవాలి. గత టెట్‌ ప్రశ్నపత్రాలను చూస్తే... 90 శాతం ప్రశ్నలు 1) లక్ష్యాలు- స్పష్టీకరణలు, విలువలు 2) బోధనా పద్ధతులు 3) బోధనోపకరణాలు 4) మూల్యాంకనం అండ్‌ సీసీఈ 5) గణిత, శాస్త్ర స్వభావం యూనిట్లనుంచే వచ్చాయి. ఇది గుర్తించి వీటిపై అధిక శ్రద్ధ చూపాలి.
ప్రతి పాఠ్యాంశంలో గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను ఆధారం చేసుకుని ఎలాంటి ప్రశ్నలు రాబోతాయో అంచనా వేసుకుంటూ చదవాలి.

Posted Date : 06-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌