• facebook
  • whatsapp
  • telegram

పరిశోధనలతో వెలుగులు పంచుతూ..!

* కంటి వైద్యంలో యువతికి పురస్కారం

వైద్య విద్య పూర్తైన వెంటనే వృత్తిలో స్థిరపడిపోవాలనుకునేవారే ఎక్కువ. కానీ, తెనాలికి చెందిన విష్ణుదీప్తి మాత్రం... తన చదువు క్లిష్టమైన అనారోగ్య సమస్యలెన్నింటికో పరిష్కారం చూపించాలనుకున్నారు. ఇందుకోసం గత పదేళ్లుగా కంటి వైద్యంపై పరిశోధనలెన్నో చేశారు. చెన్నైలోని శంకర్‌ నేత్రాలయ మెడికల్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ నుంచి ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్‌ అవుట్ గోయింగ్‌ ఫెలో ఇన్‌ సబ్‌ స్పెషాలిటీ’ అవార్డుని అందుకోనున్నారు...

‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్న సూక్తి అందరికీ తెలిసిందే. కానీ, కళ్లకి అనారోగ్యాలు, అనుకోని ప్రమాదాలు... కారణాలేవైతేనేం సరైన చికిత్స అందకపోతే జీవితం అంధకారమయం అవుతుంది. ఏ చికిత్సకైనా పరిశోధనలే ప్రాణం. మంచి వైద్యాన్ని అందించడానికి ఇవి ఎంతో అవసరమని భావించి... పీజీ అయ్యాక ఆ దిశగా అడుగులు వేశా. ఈ విషయంలో అమ్మ డా. శారదే నాకు స్ఫూర్తి. ఆవిడ తెనాలిలో ప్రముఖ వైద్యురాలు. శారద సర్వీస్‌ సొసైటీ పేరుతో సేవాకార్యక్రమాలెన్నో నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచీ తనలానే నేనూ డాక్టర్‌ని కావాలని కలలు కనేదాన్ని. అనుకున్నట్లుగానే కోనసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నుంచి ఎంబీబీఎస్‌ పట్టా అందుకున్నా. తర్వాత శ్రీరామచంద్ర యూనివర్సిటీ నుంచి ఆఫ్తల్మా లజీలో పీజీ పూర్తి చేశా. ఆ సమయంలో తమిళనాడు రాష్ట్ర వైద్య సదస్సులో కంటి కణాలపై ఇచ్చిన ప్రజెంటేషన్‌కు బెస్ట్‌ పేపర్‌ అవార్డు లభించింది.


అధ్యయనానికి అమెరికా..

ఆ ఉత్సాహంతోనే కంటి నల్లగుడ్డులోని ఐదు పొరల లోపలి కణాలు దెబ్బతినటంతో చూపు మందగించడంపై పరిశోధనలు చేశా. దెబ్బతిన్న కణాలను తిరిగి ఎలా చైతన్యం చేయవచ్చో నిరూపించా. దీన్ని గుర్తించిన అఖిల భారత నేత్రవైద్యుల సొసైటీ  2015లో ‘యంగ్‌ రిసెర్చర్‌ అవార్డు’ని అందించింది. అమెరికాలో అధ్యయనానికి రూ.లక్ష రవాణా భత్యాన్ని ఇచ్చి ప్రోత్సహించింది. అక్కడికి వెళ్లిన నేను బాల్టిమోర్‌లోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ హాస్పిటల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనల్లో పాల్గొన్నా. తిరిగొచ్చాక మదురైలోని అరవింద ఐ కేర్‌ సిస్టమ్స్‌లో మెడికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించా. ఈ క్రమంలోనే వేల ఉచిత కంటి వైద్య శిబిరాల్లో పాల్గొని సేవలందించా. తర్వాత క్లిష్టమైన నేత్ర సమస్యల్ని గుర్తించి వాటి గురించి లోతైన అధ్యయనం చేయాలనుకున్నా. ఇందుకోసం చెన్నైలోని శంకర్‌ నేత్రాలయ ఫౌండేషన్‌లో చేరి మెడికల్‌ రెటీనాతో పాటు యువిటీస్‌ (కంటి ఇన్‌ఫెక్షన్ల)పై ఫెలోషిప్‌ పూర్తి చేశా. ఇందులో నా ప్రతిభను గుర్తించిందా సంస్థ. దీనిలో భాగంగా  నవంబరు 18న బంగారు పతకాన్ని అందుకోనున్నా. ఈ మధ్యే వైజాగ్‌లో ‘క్రోమా కంటి వైద్యశాల’ను ప్రారంభించా. భవిష్యత్తులో పేదలకు ఉచిత కంటి వైద్యం అందించేందుకు ప్రణాళికలూ వేసుకుంటున్నా.


మరింత సమాచారం... మీ కోసం!

‣ కొలువుల జాతర.. రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.