• facebook
  • whatsapp
  • telegram

IT Jobs: ఐటీ నియామకాలు తగ్గుతాయా?

* వచ్చే ఏడాది ప్రాంగణ ఎంపికల్లో 20 శాతం కోత?
* ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న కంపెనీలు

 

ఈనాడు - హైదరాబాద్‌: కొవిడ్‌ మహమ్మారి అన్ని రంగాలకు నష్టం చేస్తే, ఐటీ రంగం మాత్రం అనూహ్యంగా లాభపడింది. లాక్‌డౌన్‌ల వల్ల ఇళ్ల నుంచే అన్ని పనులు చక్కబెట్టాల్సి రావడం, పిల్లల చదువులూ ఆన్‌లైన్‌లో సాగడం దీనికి ప్రధాన కారణం. ప్రపంచ వ్యాప్తంగా చదువులు, ఆఫీసు పనులు, వ్యాపారాలు.. అన్ని ఆన్‌లైన్లోనే నిర్వహించాల్సి రావడంతో, ఐటీ సేవలకు విశేష గిరాకీ ఏర్పడింది. ఇందువల్ల మనదేశంలోని ఐటీ కంపెనీలకు పెద్దఎత్తున కొత్త ప్రాజెక్టులు లభించాయి. నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు పెద్దఎత్తున ఐటీ నిపుణులను కంపెనీలు నియమించుకున్నాయి. గత రెండేళ్లలో ఇదే పరిస్థితి. కొత్త నైపుణ్యాలు కలిగిన వారి కోసం ఐటీ కంపెనీలు కళాశాలల ప్రాంగణాల్లో ఎంపికలు కూడా పెద్దఎత్తున చేపట్టాయి. ప్రత్యేక నైపుణ్యాలున్న వారిని ఇతర కంపెనీల నుంచి ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీలు, జీతభత్యాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాయి. మంచి ప్యాకేజీలు ఇచ్చే కంపెనీలకు వెళ్లిపోవడానికి అనుభవజ్ఞులైన ఐటీ ఉద్యోగులు సిద్ధపడటంతో.. సిబ్బంది వలసలు 20 శాతానికి మించాయి. తమ నిపుణులను అట్టే పెట్టుకునేందుకు అన్ని కంపెనీలు పదోన్నతులు, ప్రోత్సాహకాలు ఇచ్చాయి. ఇటీవలి వరకు ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. నూతన నియామకాల్లో ఆచితూచి వ్యవహరించడంతో పాటు, అధిక వేతనం ఆశ చూపుతూ, అనుభవజ్ఞులను ఆకర్షించడంలోనూ ఐటీ కంపెనీలు నెమ్మదించాయి. అమెరికా, ఐరోపాల్లో మాంద్యం భయాలే ఇందుకు కారణం.

 

ఐటీ వ్యయాలు తగ్గుతాయనే

అమెరికాలో ద్రవ్యోల్బణం 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగింది. దీనివల్ల అక్కడ కేంద్ర బ్యాంకు (యూఎస్‌ ఫెడ్‌) నగదు లభ్యత తగ్గించేందుకు వడ్డీ రేట్లను పెంచుతోంది. ఫలితంగా ఆర్థిక మాంద్యం ముప్పునకు దగ్గరవుతున్నామనే ఆందోళన అక్కడ వ్యక్తమవుతోంది. ఫలితంగా వివిధ రంగాల కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా తమ ఐటీ బడ్జెట్లలో కోత వేస్తున్నట్లు సమాచారం. ఇదే ధోరణి కొనసాగితే మనదేశంలోని ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు తగ్గుతాయి. ఆ మేరకు కొత్త నియామకాలు పరిమితమవుతాయని అంచనా వేస్తున్నారు. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌ తరహాలోనే ఫేస్‌బుక్‌ కూడా తన మొత్తం సిబ్బందిలో 12,000 మందికి లే ఆఫ్‌ ప్రకటిస్తోందని వార్తలొస్తున్నాయి. పనితీరు సంతృప్తికరంగా లేదనే కారణంతో దిగ్గజ టెక్‌ సంస్థలు సిబ్బందిని సాగనంపుతున్నాయి.

 

డిజిటలీకరణ ప్రాజెక్టులు కొలిక్కి

కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో, గత రెండేళ్లుగా ఆరోగ్య సంరక్షణ, రిటైల్, ఉత్పత్తి రంగాల్లో డిజిటల్‌ ప్రాజెక్టులను పెద్దఎత్తున చేపట్టారు. అవి ఇప్పుడు దాదాపు పూర్తయ్యే స్థితికి చేరుకున్నాయి. గత రెండేళ్ల స్థాయిలో కొత్తగా డిజిటల్‌ ప్రాజెక్టులు వచ్చే ఏడాది, రెండేళ్ల పాటు మన ఐటీ కంపెనీలకు లభించకపోవచ్చనే అభిప్రాయం ఉంది. అందుకే నూతన నియామకాలను సంస్థలు తగ్గించేస్తాయంటున్నారు.

 

భారీ మొత్తం ఆఫర్లు ఉండవ్‌

ప్రస్తుత పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఒకటి, రెండేళ్లు ప్రాంగణ ఎంపికలు 15-20% వరకు తగ్గే అవకాశం ఉందని టెక్‌ఎరా గ్లోబల్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ కిరణ్‌ చెరుకూరి వివరించారు. అనుభవజ్ఞుల నియామకాలూ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. కంపెనీ మారితే అధికంగా వేతనం చెల్లించే ధోరణి కూడా మారుతుందని, సహేతుక పెంపుదల మాత్రమే ఉండొచ్చని అన్నారు. ఫ్రెషర్లకు మాత్రం జీతభత్యాలు తగ్గకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘ఫ్రెషర్లకు జాబ్‌ ఆఫర్లు ఇచ్చిన కంపెనీలు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని, ఆఫర్లను కొన్ని కంపెనీలు వెనక్కి తీసుకుంటున్నాయంటూ..’ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ, కొంత ఆలస్యం అయినా ఐటీ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయని, ఒకసారి జాబ్‌ ఆఫర్‌ ఇచ్చాక, ఉద్యోగం ఇవ్వకపోవడం అనేది పెద్ద కంపెనీల్లో దాదాపుగా ఉండదని పేర్కొన్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.