• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మీరెంత శ్రద్ధగా వింటారు?

అధ్యాపకులు చెప్పే పాఠాలు అర్థం కావాలన్నా.. ఇంటర్వ్యూల్లో అధికారుల ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పాలన్నా.. బృంద చర్చల్లో అర్థవంతంగా మాట్లాడాలన్నా శ్రద్ధగా ఆలకించే నైపుణ్యం ఎంతో అవసరం. విద్యార్థులూ, ఉద్యోగార్థులూ, ఉద్యోగులూ అనే  తేడా లేకుండా అందరికీ ఎంతగానో ఉపయోగపడే సామర్థ్యమిది. దీన్ని మెరుగుపరుచుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం! 

మనసులోకి ఇతర ఆలోచనలేవీ రానీయకుండా శ్రద్ధగా వినే సామర్థ్యం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇతర నైపుణ్యాలన్నీ కూడా దీని మీదే ఆధారపడి ఉంటాయి. తరగతిలో అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విన్నప్పుడే బాగా అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడే పరీక్షల్లో వాటిని చక్కగా రాయగలుగుతారు. ఆ తర్వాత ఎక్కువ మార్కులూ సాధించగలుగుతారు. ఈ విజయాలన్నింటికీ మూలం శ్రద్ధగా వినడమే కదా. 

ఉద్యోగార్థుల విషయానికి వస్తే.. బృంద చర్చల్లో భాగంగా ఎదుటివాళ్లు చెప్పే విషయంతో ఏకీభవించాలన్నా, ఖండించాలన్నా, సహానుభూతిని తెలియజేయాలన్నా వారు చెప్పేదేమిటో వినటం ఎంతో అవసరం అవుతుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక దీంతో పనిలేదనుకున్నా పొరబడినట్టే. అప్పుడు కూడా ఈ సామర్థ్యం అవసరమే. పై అధికారులు చెప్పింది ఏమిటో సరిగా వినకపోతే వాటిని సవ్యంగా అర్థం చేసుకోలేము. దాంతో ఆచరణలో పొరపాట్లు తప్పవు. అందుకే వారి ఆదేశాలను స్పష్టంగా గహించి జాగ్రత్తగా అమలుచేస్తూ పనులు పూర్తిచేయగలగాలి. 

మన ఎదురుగా ఎవరు మాట్లాడినా.. దృష్టిని వారి మీదే కేంద్రీకరించాలి. చెబుతున్న విషయాన్ని ఆసక్తిగా వినాలి. ఇలా చేయడాన్ని అలవాటు చేసుకుంటే.. భావవ్యక్తీకరణ నైపుణ్యమూ పెరుగుతుంది. చెప్పిదాన్ని పొరపాటుగా అర్థంచేసుకునే అవకాశమే ఉండదు.

శరీర భాష: మీరెంత ఆసక్తిగా వింటున్నారనే విషయాన్ని మీ శరీర భాషను బట్టి కూడా చెప్పేయొచ్చు. కుర్చీలో విశ్రాంతిగా కూర్చోవడం, చుట్టుపక్కల లేదా టైమ్‌ చూడటం.. లాంటివన్నీ అనాసక్తిగా వింటున్నారనే విషయాన్ని చెప్పకనే చెబుతాయి. కుర్చీలో నిటారుగా కూర్చోవడం, మెల్లగా తలాడించడం లాంటి వాటి వల్ల శ్రద్ధగా వింటున్నారనే విషయం చూసేవారికి అర్థమవుతుంది. 

సందేహ నివృత్తి: వక్తలు ఒక్కోసారి కొత్త పదాలను ప్రయోగించవచ్చు. వాటిని ఇంతకు ముందెప్పుడూ మీరు విని ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సందేహ నివృత్తి చేసుకోవడానికి సంకోచించకూడదు. అలాచేయకపోతే ఎదుటివాళ్లు ఒక అర్థంలో చెబితే మీరు మరోలా అర్థం చేసుకునే ప్రమాదమూ ఉండొచ్చు. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే చివరి వరకూ ఆగి నివృత్తి చేసుకోవడం మంచిది. 

అభిప్రాయ భేదాలు: ఎదుటివారి అభిప్రాయాలు, ఆలోచనలతో మీరు కొన్నిసార్లు ఏకీభవించవచ్చు. మరికొన్నిసార్లు విభేదించనూ వచ్చు. అలాంటి సందర్భాల్లో వాళ్లు మాట్లాడుతుండగానే మధ్యలో అడ్డుపడకూడదు. వారి అభిప్రాయాలను పూర్తిగా పంచుకున్న తర్వాత మీ అభ్యంతరాలను తెలియజేయొచ్చు. ఉదాహరణకు ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బృంద చర్చల్లోనూ పాల్గొంటారు. ఎదుటివారి ఆలోచనలతో విభేదించాలనుకున్నప్పుడు చివరివరకూ ఆగి.. మీ అభిప్రాయాలను మర్యాదగా తెలియజేయాలి. 

విషయావగాహన: శ్రద్ధగా వినడం వల్ల వక్తల ఆలోచనలూ, అభిప్రాయాలపై స్పష్టత ఏర్పడుతుంది. విషయావగాహనా పెరుగుతుంది. ఏకీభవించడం, విభేదించడంతోపాటుగా సహానుభూతినీ తెలియజేయగలుగుతారు. ప్రోత్సాహకరమైన పని వాతావరణంలో సానుకూల ఫలితాలను సాధించడానికి సమష్టిగా కృషిచేసే అవకాశమూ కలుగుతుంది. 


ఏకాగ్రత కావాలి 

ఎదుటివాళ్లు చెప్పింది స్పష్టంగా అర్థం కావాలంటే ముందుగా కావలసింది ఏకాగ్రత. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మీ దృష్టి వారి మీద మాత్రమే ఉండాలి. సెల్‌ఫోన్‌ చూడటం, అనాసక్తిగా, మొక్కుబడిగా వినడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఆ తర్వాత అప్పటివరకూ విన్న దానిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయమన్నా చెప్పలేక తడబడతారు. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మెరుగైన కెరియర్‌కు.. కన్స్యూమర్‌ లా!

‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

Posted Date : 25-04-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌