• facebook
  • whatsapp
  • telegram

పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

పరీక్ష ఏదైనా ఎంతోకొంత టెన్షన్‌ ఉండకమానదు. కానీ మనలో కొందరు విద్యార్థులు మరీ కంగారు పడిపోతూ దాన్ని యాంగ్జైటీ స్థాయికి తీసుకెళ్తుంటారు. అది ఎగ్జామ్‌లో వచ్చే ఫలితాలకే కాదు, ఆరోగ్యానికీ అంత మంచిది కాదు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో, ఏం చేస్తే తగ్గుతుందో ఒకసారి చూద్దామా!

ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే పరీక్షలంటే వచ్చే కంగారు అత్యంత సాధారణం. అయితే దాన్ని ఎంత వరకూ తీసుకుంటున్నాం, ఎలా ఎదుర్కొంటున్నాం అనేది ముఖ్యం. పూర్తిగా చదివింది మర్చిపోయే స్థాయిలో పుట్టే కంగారును దూరం పెట్టాలంటే మాత్రం కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు నిపుణులు. 

పరీక్షల ముందు కలిగే ఆందోళన, కంగారులను ఒక రకమైన పర్‌ఫార్మెన్స్‌ యాంగ్జైటీగా చెబుతారు. ఎలా అయినా బాగా రాయాలనే బలమైన కోరిక.. అధికమైన యాంగ్జైటీకి కారణమవుతుంది. ఇది తక్కువ స్థాయిలో ఉంటే ప్రేరణ కలిగిస్తూ సత్ఫలితాలను ఇవ్వగలదు. కానీ ఎక్కువ అయితే మాత్రం మానసికంగా, శారీరకంగా లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, వికారం, గుండె వేగం పెరగడం, అన్నీ వాయిదా వేయాలి అనిపించడం, కోపం, చిరాకు వంటివి కలగొచ్చు.

కుదిరితే పరీక్ష కేంద్రానికి వెళ్లి, అక్కడ కాసేపు కూర్చుని చదువుకోవడం, ఆ పరిసరాలను అలవాటు చేసుకోవడం లాంటివి చేస్తే..  కొత్త ప్రదేశం అనే భావన పోతుంది. కొంతవరకూ కంగారూ తగ్గుతుంది. దీంతో మనసు తేలికై, పరీక్ష బాగా రాయవచ్చు.

ఎంత చదువులో ఉన్నా.. రాత్రిళ్లు తగిన సమయం నిద్రపోవడం తప్పనిసరి. ఇది కేవలం పరీక్ష ముందురోజు రాత్రి మాత్రమే కాదు.. ఎగ్జామ్‌ దగ్గర పడుతున్న రోజుల్లోనూ ఉండాలి. తాను తెలుసుకున్న సమాచారాన్ని నిక్షిస్తం చేసుకునేందుకు, అవసరమైనప్పుడు తిరిగి గుర్తుచేసుకునేందుకు మెదడుకు సరైన సమయం కావాలి. ఇలాంటి చక్కని నిద్ర ఆందోళనను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

ఎంత క్లిష్టమైన అంశం అయినా సాధన చేసేకొద్దీ సులభం అయిపోతుంది. అలా పదే పదే చేసే సాధన ఆత్మవిశ్వాసాన్ని కలిగించి యాంగ్జైటీని దూరం చేస్తుంది. ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లడం ఎల్లప్పుడూ విజయాన్ని చేరువ చేస్తుంది. 

కనీస వ్యాయామం చేయడం శారీరకంగానే కాదు, మానసికంగానూ మేలు చేస్తుంది. చిన్న చిన్న బరువులెత్తడం, వాకింగ్‌కు వెళ్లడం, యోగా.. మొత్తంగా శారీరకంగా యాక్టివ్‌గా ఉండటం పరీక్ష  యాంగ్జైటీని దూరం చేస్తుంది. అలాగే డీప్‌ బ్రీతింగ్, ప్రోగ్రెసివ్‌ మజిల్‌ రిలాక్సేషన్, మెడిటేషన్‌ వంటి టెక్నిక్స్‌ కూడా ఉపయోగపడతాయి.

నెగ్గుతామో లేదో అని కంగారుపడే బదులు.. కచ్చితంగా విజయం సాధిస్తాం అని నమ్మడం, ఊహించుకోవడం వల్ల అనవసరమైన ఆందోళనలు పోగొట్టుకోవచ్చు. అవసరం అయినప్పుడు ఇంట్లో వారి సహాయం తీసుకోవడం కూడా ఉపకరిస్తుంది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ రైల్వే రక్షణ వ్యవస్థలో మీరూ భాగమవుతారా?!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ పుస్తక పఠనం ఆస్వాదిస్తున్నారా.span>

Posted Date: 23-04-2024


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం