* ప్రస్తుత పరిస్థితుల్లో జారీకి కనీసం 35- 40 రోజుల సమయం
* ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఉన్నత విద్య, పర్యాటకం, ఇతర పనుల మీద విదేశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారా..? అయితే వెంటనే పాసుపోర్టు కోసం దరఖాస్తు చేసుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో పాస్‌పోర్టు జారీ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 35- 40 రోజుల సమయం పడుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని దరఖాస్తుదారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య సూచించారు. తీర్థయాత్రలు, పర్యాటకం కోసం వెళ్లాలనుకునేవారు పాస్‌పోర్టు తీసుకున్నాకే విమాన టికెట్లు బుక్ చేసుకోవాలన్నారు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితి, ఉన్నత విద్య, ఉద్యోగం తదితర అవసరాల కోసం వెళ్లేవారి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. విమాన టికెట్లు బుక్ చేసుకున్నందున పాస్‌పోర్టు అపాయింట్మెంట్ స్లాట్లను ముందుకు మార్చడం సరికాదన్నారు. పరిమిత మానవ వనరులు, సాంకేతిక సహకారం నేపథ్యంలో కొన్ని దరఖాస్తుల్ని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లోనే(పీఎస్కే) పూర్తి చేస్తున్నట్లు వివరించారు. కొత్తగా పాస్‌పోర్టు, రీ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకునేవారికి పలు సూచనలు చేస్తూ నవంబర్ 13న ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అవి..
* అంతర్జాతీయ ప్రయాణాలకు వీసా జారీ చేసే దేశాలు పాస్‌పోర్టు గడువును కనీసం ఆరు నెలలుగా ఉండాలని నిర్దేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వీసా కావాలనుకునేవారు పాస్‌పోర్టు రీ ఇష్యూ కోసం ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
* పాస్‌పోర్టు ఉన్నవారు దాని గడువు ముగియడానికి ఏడాది ముందే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. దరఖాస్తు పరిశీలన సమయంలో అంతకుముందు పాస్‌పోర్టుల్ని చూపించాలి. పాస్‌పోర్టు రీ ఇష్యూకు ఎలాంటి గడువు లేదు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకునేవారికి పెనాల్టీ ఉండదు.
* అత్యవసర పరిస్థితుల్లో స్లాట్ ముందు తేదీల్లో కావాలనుకొనే దరఖాస్తుదారుల కోసం సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో సోమ, గురువారాల్లో ప్రత్యేక కౌంటర్ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారుల అభ్యర్థనను పరిశీలించాక.. అందుబాటులో ఉన్న అవకాశాల్ని పరిశీలించి స్లాట్‌లో మార్పులు చేస్తాం.
* పాస్‌పోర్టులో ఇంటిపేరు లేనివారు.. రీ ఇష్యూ కోసం స్వీయ ధ్రువీకరణ సమర్పించాలి. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ దరఖాస్తులో భాగస్వామి పేరు చేర్చడం, చిరునామా మార్పునకు వివాహ ధ్రువపత్రాన్ని జత చేయాలి.
* తత్కాల్ పాస్‌పోర్టుకోసం దరఖాస్తు చేసుకునేవారు 13 ధ్రువపత్రాల్లో కనీసం 3 సమర్పించాలి. అందులో ఒకటి దరఖాస్తుదారు ప్రస్తుత చిరునామాతో ఉండాలి.
* దరఖాస్తుదారులు తప్పుడు వెబ్సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అపాయింట్మెంట్ స్లాట్ తేదీల్లో మార్పు, పాస్‌పోర్టు సేవల కోసం మధ్యవర్తుల్ని నమ్మకూడదు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.