• facebook
  • whatsapp
  • telegram

Group1 Mains: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు

* తాజాగా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశం
* ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టీకరణ
* ఏపీపీఎస్సీ, రాష్ట్రప్రభుత్వం తీరుపై తీవ్ర ఆక్షేపణ
* మూల్యాంకనం నిష్పాక్షికంగా జరగలేదని వెల్లడి

ఈనాడు, అమరావతి: 2018 నాటి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ (27/2018) ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో (చేత్తో దిద్దడం) అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జవాబుపత్రాల మూల్యాంకనానికి రాష్ట్రప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. రెండోసారి, మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలూ చట్టవిరుద్ధమని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీచేసిన జాబితాను రద్దుచేసింది. తాజాగా ప్రధాన పరీక్ష నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వాన్ని, ఏపీపీఎస్సీని ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని పేర్కొంది. పరీక్షకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని, ఎంపిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఎంపికై పోస్టింగ్‌ తీసుకున్న అభ్యర్థులు హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో హక్కులను కోరబోమని న్యాయస్థానం ఆదేశాలతో ఏపీపీఎస్సీకి అఫిడవిట్‌ ఇచ్చారని గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. 2018 గ్రూప్‌-1 ప్రధానపరీక్ష జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ ప్రక్రియను రద్దుచేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. డిజిటల్‌ మూల్యాంకనంలో 326 మందిని ఏపీపీఎస్సీ అర్హులుగా తేల్చిందని, ఆ తర్వాత జరిగిన మాన్యువల్‌ మూల్యాంకనంలో వారిలో 202 మందిని (62%) అనర్హులుగా నిర్ణయించారని, జవాబుపత్రం ఒకటే అయినప్పుడు ఎలా మూల్యాంకనం చేసినా అంతమంది ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు. వ్యాజ్యాలపై హైకోర్టు పలు దశల్లో విచారణ జరిపింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో ఎంపికైనవారికి ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియ కొనసాగించుకునేందుకు 2022 జూన్‌ 24న హైకోర్టు ధర్మాసనం.. ఏపీపీఎస్సీకి అనుమతిచ్చింది. నియామకాలు జరిపితే.. అవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని వెల్లడించింది. పోస్టింగ్‌ ఉత్తర్వుల్లోనూ ఈ విషయాన్ని పొందుపరచాలని పేర్కొంది. హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రధాన వ్యాజ్యాలపై ఇటీవల తుది విచారణ జరిపి బుధవారం తీర్పు ఇచ్చారు.


అందులో వివరాలు ఇలా..
 

‘‘హాయ్‌ల్యాండ్‌ ఆవాస రిసార్ట్స్‌లో 2021 డిసెంబరు 5 నుంచి 2022 ఫిబ్రవరి 26 మధ్య తొలిసారి మాన్యువల్‌ మూల్యాంకనం చేసినట్లు పిటిషనర్లు ఆధారాలతో రుజువు చేశారు. మాన్యువల్‌ మూల్యాంకనం కోసం అవసరమైన సామగ్రి ముద్రణ, సరఫరా కోసం డేటాటెక్‌ మెథడాక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఏపీపీఎస్సీ 2021 నవంబరులో రూ.17,936 చెల్లించింది. మూల్యాంకనం ఏర్పాట్లకు రూ.20.06 లక్షలు చెల్లించారు. అక్కడ ప్రక్రియ జరగకపోతే సొమ్ము చెల్లించక్కర్లేదు. ఈ చెల్లింపులపై వివరణ ఇచ్చే విషయంలో ఏపీపీఎస్సీ, రాష్ట్రప్రభుత్వం విఫలమయ్యాయి.

* రెండోసారి మాన్యువల్‌ మూల్యాంకనానికి 49,000 ఓఎంఆర్‌ బార్‌కోడ్‌ షీట్ల ముద్రణ, సరఫరా నిమిత్తం ప్రభుత్వం డేటాటెక్‌ సంస్థకు రూ.3.34 లక్షలు చెల్లించింది. దీన్నిబట్టి రెండుసార్లు మాన్యువల్‌ మూల్యాంకనం చేసినట్లు స్పష్టమవుతోంది. ఇలా ఎందుకు చేశారో ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకే తెలుసు.

* 2022 మార్చి 25 నుంచి 2022 మే 25 మధ్య రెండోసారి మాన్యువల్‌ మూల్యాంకనం జరిగినట్లు పిటిషనర్లు రుజువు చేశారు.

* ప్రజల్లో విశ్వాసం కలిగించేలా రాష్ట్రప్రభుత్వం, యంత్రాంగాలు నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహించాలి. మూడు మూల్యాంకనాల్లో అక్రమాలకు పాల్పడి లబ్ధి పొందినవారిని గుర్తించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దుచేయడమే ఉత్తమం.

* మూల్యాంకనంలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని పిటిషనర్లు సమర్పించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి. నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేయడంలో ఏపీపీఎస్సీ, ప్రభుత్వం విఫలమయ్యాయి. జవాబుపత్రాలను చేత్తో దిద్దాలని హైకోర్టు ఆదేశించాక ఏపీపీఎస్సీ, రాష్ట్రప్రభుత్వం మరిన్ని అవకతవకలకు పాల్పడ్డాయి. ఈ అవకతవకలే ఎంపిక ప్రక్రియ చట్టబద్ధతను వేలెత్తి చూపడానికి కారణం అయ్యాయి. ఏపీపీఎస్సీ, రాష్ట్రప్రభుత్వం తీరుతో జవాబుపత్రాల మూల్యాంకనం నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా జరగలేదు. రెండు, మూడుసార్లు మాన్యువల్‌ మూల్యాంకనం చేయడం ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థులను అనర్హులుగా పేర్కొని.. నచ్చినవారిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనాన్ని రద్దు చేస్తున్నాం’’ అని తీర్పులో పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్‌, ఎం.విజయ్‌కుమార్‌, న్యాయవాదులు జె.సుధీర్‌, ఫణికుమార్‌, తాండవ యోగేశ్‌ తదితరులు వాదనలు వినిపించారు.


రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: రాష్ట్ర ప్రభుత్వం
 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యర్థులు ఆందోళన చెందనక్కర్లేదు. ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రయోజనాల్ని కాపాడతాం. వారి తరఫున న్యాయపోరాటం చేస్తాం’ అని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలపై అప్పీలు చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ మరో ప్రకటనలో తెలిపారు.





 

  ఏపీపీఎస్సీ గ్రూప్‌-I స్క్రీనింగ్ టెస్ట్  


  పేపర్‌-1: జనరల్‌ స్టడీస్‌  
 

చరిత్ర, సంస్కృతి

రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు

భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు

భూగోళశాస్త్రం


  పేపర్ 2: జనరల్‌ ఆప్టిట్యూడ్‌  
 

జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, మానసిక సామర్థ్యాలు

శాస్త్ర, సాంకేతిక రంగాలు

   ఏపీపీఎస్సీ పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు 
 

   ఏపీపీఎస్సీనమూనా ప్రశ్నపత్రాలు  



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.