• facebook
  • whatsapp
  • telegram

అగ్రికల్చర్‌లోనూ నీట్‌ ర్యాంకర్లే

* తొలి మూడు ర్యాంకులు అమ్మాయిలకే
* నీట్‌లో ఆరో ర్యాంకర్‌ సింధుకు మొదటి ర్యాంకు
* స్నికితకు నీట్‌, ఎంసెట్‌లోనూ మూడో స్థానమే


ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో మొదటి మూడు ర్యాంకులు అమ్మాయిలే దక్కించుకున్నారు. తరువాత వరుసగా ఏడు ర్యాంకులను అబ్బాయిలు కైవసం చేసుకున్నారు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష- నీట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారే ఇక్కడా అగ్రగణ్యులుగా నిలిచారు. జేఎన్‌టీయూహెచ్‌లో శనివారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌, ఇతర అధికారులు ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫలితాలను విడుదల చేశారు. నీట్‌లో జాతీయస్థాయి ఆరో ర్యాంకర్‌, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి చైతన్య సింధు తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌లో ప్రథమ ర్యాంకు సాధించారు (ఏపీ ఎంసెట్‌ అగ్రికల్చర్‌లోనూ ఆమెకే తొలి ర్యాంకు). నీట్‌ 14వ ర్యాంకర్‌ సాయిత్రిషారెడ్డి ఎంసెట్‌లో రెండో స్థానంలో నిలవగా.. నీట్‌ మూడో ర్యాంకర్‌ తుమ్మల స్నికిత ఎంసెట్‌లోనూ అదే ర్యాంకు సాధించడం విశేషం. నీట్‌లో 107వ ర్యాంకు సాధించిన దర్శి విష్ణుసాయి ఇక్కడ 4వ ర్యాంకు సాధించాడు (ఏపీ ఎంసెట్‌లోనూ ఈ విద్యార్థి 4వ ర్యాంకు పొందడం గమనార్హం). నీట్‌లో 33వ ర్యాంకు సాధించిన రుషిత్‌ ఇక్కడ 5వ ర్యాంక్‌ కైవసం చేసుకున్నాడు. టాప్‌-10 ర్యాంకర్లలో ఏపీ, తెలంగాణ విద్యార్థులు చెరిసగం దక్కించుకున్నారు. పరీక్షలు రాసిన వారి సంఖ్య, అర్హత సాధించిన వారి సంఖ్యలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలే రెట్టింపు కావడం మరో విశేషం.
నవంబరు మొదటి వారంలో కౌన్సెలింగ్‌!
నవంబరు తొలి వారంలో బీఎస్‌సీ అగ్రికల్చర్‌ సీట్ల భర్తీకి ప్రవేశ ప్రకటన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా పాపిరెడ్డి చెప్పారు. ఇంటర్‌ హాల్‌టికెట్‌ సంఖ్యలు తప్పుగా వేసిన వారు 2,200 మంది ఉండగా పలుమార్లు ఫోన్‌ చేసి తెప్పించామని, ఇంకా కొందరు స్పందించకపోవడంతో వారికి ర్యాంకులు ఇవ్వలేదని ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్దన్‌ తెలిపారు. 
* 63,857 మంది పరీక్షకు హాజరుకాగా.. 59,113 మంది కనీస మార్కులు సాధించి అర్హత పొందారు. గత ఏడాది 93.01 శాతం మంది అర్హత సాధించగా ఈసారి అది 92.57 శాతమే
* ఇంటర్‌ లేదా సమాన హోదా మార్కులు ఇవ్వకపోవడంతో 667 మందికి ర్యాంకులు కేటాయించలేదు.
* ఎంసెట్‌లో అర్హత సాధించినా ఇంటర్‌లో తప్పడంతో 300 మంది ర్యాంకులు పొందలేకపోయారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.