• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉద్యోగం మీకే ఎందుకివ్వాలి

నియామక సంస్థలు కోరుకునే ప్రత్యేక అర్హతలు, నైపుణ్యాలు

ప్రముఖ సంస్థల్లో కొలువు సాధించాలనే ఆశ చాలామందికి ఉంటుంది. సహజంగా ఆ ఉద్యోగాల కోసం ఎంతో పోటీ ఉంటుంది. అలాంటివారిలో మీరూ ఉన్నారనుకోండి... ‘ఆ ఉద్యోగం నాకే రావాలి’ అని బలంగా కోరుకుంటారు కూడా. కానీ అంత మంది ఉండగా అందులోంచి మిమ్మల్ని మాత్రమే ఉద్యోగానికి ఎందుకు ఎంపిక చేయాలనే దిశగా ఎప్పుడైనా ఆలోచించారా? నియామక సంస్థలు కోరుకునే ప్రత్యేకమైన అర్హతలూ, నైపుణ్యాలూ మీకు ఉన్నాయో లేదో  పరిశీలించుకున్నారా?  

లాక్‌డౌన్‌ పరిణామాల కారణంగా ఉద్యోగ నియామకాల్లో మార్పులు వచ్చాయి. చాలా సంస్థలు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో అదనపు నైపుణ్యాలనూ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అవి ఎలా ఉండాలో తెలుసుకుందామా...

మార్పునకు స్వాగతం

నియామకాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా అభ్యర్థులూ తమను తాము మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఉద్యోగావసరాలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడానికి సిద్ధంగా ఉండే అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికే రిక్రూటర్లు ఎప్పుడూ ప్రాధాన్యమిస్తారు. అంటే అభ్యర్థులు మార్పును స్వాగతించేలా ఉండాలి. అలాగే మారిన పరిస్థితుల కారణంగా ఒత్తిడీ పెరిగింది. దాన్ని తట్టుకుని నిలబడి విధులను నిర్వర్తించేవారికే ప్రాధాన్యముంటుంది.  ఊహించని పరిస్థితుల ఎదురైనా నిర్ణీత సమయం లోపలే పని పూర్తిచేయగల సామర్థ్యం అభ్యర్థులకు ఉందో లేదో పరీక్షిస్తారు. 

అదనపు పనులకు సంసిద్ధత

పనిచేసే సంస్థ ప్రాథమ్యాలకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. సమయానుకూలంగా ఏది ముందు, ఏది వెనుక అనే క్రమం మారిపోతుంటుంది. అలాంటప్పుడు ముందుగా కేటాయించిన పనినే ముందు చేయాలనుకుంటే కుదరదు. అలాగే అదనపు బాధ్యతలను తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అదనపు పనులను భారంగా పరిగణించకూడదు. వాటిని కొత్త విషయాలు నేర్చుకోవడానికి వచ్చిన అవకాశంగా భావించాలి. ఈ లక్షణాలున్న అభ్యర్థులకు ఉద్యోగాల మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది.  

నేర్చుకోవాలనే తపన 

కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించే అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి రిక్రూటర్లు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు. తగిన సాంకేతిక నైపుణ్యాలు, అనుభవం ఉన్నప్పటికీ కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తిని కొంతమంది అభ్యర్థులు కనబరచడం లేదట. ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాలు ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. ఇలాంటివారిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి రిక్రూటర్లూ సందేహిస్తారు.   

సమయపాలన

ప్రస్తుతం చాలా నియామక సంస్థలు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీంతో కార్యాలయానికి వెళ్లడానికీ, రావడానికీ పట్టే సమయం ఆదా అవుతుంది. అయితే ఇంటి నుంచి పని విధానంలో ఎక్కువగా అవాంతరాలూ ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ఆఫీసు పనిని పూర్తిచేయాల్సి ఉంటుంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో నిరంతరం మిమ్మల్ని గమనించే పై అధికారులెవరూ ఉండరు. దాంతో పని పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, కాస్త ఆలస్యం చేయడం లాంటివి చేయకూడదు. బాధ్యతాయుతంగా పనిచేసి.. నిర్దేశించిన సమయానికి పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సాధ్యపడాలంటే సమయం విలువ మీకు తెలిసుండాలి. అప్పుడే ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేస్తూ విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు.

రాతలో ఆసక్తికరంగా

మీతోపాటు ఎంతోమంది ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు కదా. అలాంటప్పుడు ఉద్యోగం సాధించాలనే సంకల్పం మీకెంత బలంగా ఉందో తెలుసుకోవడానికి రిక్రూటర్లు రకరకాల ప్రశ్నలు సంధిస్తారు. అంతేకాదు గతంలో ఉద్యోగం చేసిన అనుభవం ఏమైనా ఉంటే దాన్ని ఆసక్తికరంగా అక్షర రూపంలో పొందుపరచమనీ అడుగుతుంటారు. అలాంటప్పుడు మీరు చేసిన రకరకాల విధులను క్రమబద్ధీకరించి, ఆసక్తికరంగా వివరిస్తూ రాయగలిగే సామర్థ్యం మీకుండాలి. రెజ్యూమెకు అదనంగా ఇలాంటి అనుభవాలను రాయమని అడగొచ్చు. కాబట్టి అప్పటికప్పుడు మీ ఉద్యోగ అనుభవాలను రాసిమ్మని అడిగినా.. వెంటనే రాయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. అటూఇటుగా అందరూ రాయగలుగుతారు. కానీ మీరు రాసిన దాంట్లో అక్షర, వ్యాకరణ దోషాలు లేకుండా.. రాసింది ఆసక్తికరంగా ఉండి చదివింపజేయాలి. అప్పుడు మాత్రమే పది మందిలో మీరు ప్రత్యేకంగా నిలవగలుగుతారు. దాంతో రిక్రూటర్ల దృష్టి సులువుగా మీవైపు మళ్లుతుంది.

సాంకేతిక నైపుణ్యం 

ఉద్యోగం సంపాదించగానే ఇక కొత్తగా ఏమీ నేర్చుకోనవసరం లేదనుకుంటారు కొంతమంది. ఇది ఎంతమాత్రం సరికాదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి. రోజువారీ విధులను నిర్వర్తించే క్రమంలో ఒక్కోసారి సాంకేతిక నైపుణ్యమూ అవసరమవుతుంది. ఈ విషయంలో మీకు తగినంత పరిజ్ఞానం లేకపోవడంతో బాధ్యతలను నిర్వర్తించడం కష్టం కావచ్చు. లేదా సమయమూ ఎక్కువగా వృథా కావచ్చు. వీటన్నింటినీ నివారించాలంటే మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం మీకు ఉండాలి. అందుకోసం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సి రావచ్చు. కాబట్టి నేర్చుకోవడానికి ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. దీని కోసం ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్‌షాప్‌లకు హాజరు కావచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించే అభ్యర్థులకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ఇలాంటివారిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి రిక్రూటర్లూ ఆసక్తి చూపిస్తారు. 

విధి నిర్వహణలో అంకితభావం

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సంస్థలు ఉద్యోగులందరినీ కీలక విధుల్లోకి తీసుకోవడం లేదు. ముఖ్యమైన కొంతమంది ఉద్యోగులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్లకు మాత్రమే ముఖ్యమైన పనులను అప్పగిస్తున్నారు. ఇలాంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటే.. అభ్యర్థులకు అంకితభావం ఎంతో అవసరం. ఎంతోమంది ఉద్యోగులు ఉండగా... అందులో నుంచి టీమ్‌ సభ్యునిగా మిమ్మల్ని మాత్రమే ఎంపిక చేయాలంటే మీకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాల్సిందే. అలాంటివాటిలో ముఖ్యమైందే అంకితభావం. ఏదైనా పనిని ప్రత్యేకంగా మీకే అప్పగిస్తే... ఆ పనిని అంతకంటే బాగా ఎవరూ చేయలేరు అన్నట్టుగా పూర్తిచేయాలి. మీరు చేసే పనులు మీలోని అంకితభావానికి నిలువెత్తు నిదర్శనంలా ఉండాలి.

Posted Date : 09-09-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌