• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విమానాశ్రయాల్లో ఉద్యోగాలు

వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ


భారత ప్రభుత్వ మినీరత్న సంస్థల్లో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో మొత్తం 956 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  


ఎయిర్‌పోర్టుల సమర్థ నిర్వహణకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సేవలు ఎంతో కీలకం. ఈ విభాగంలో ఎంపికైనవారు కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలను పర్యవేక్షిస్తూ సురక్షిత ప్రయాణాలు సాగేందుకు కృషి చేస్తారు. తాజాగా ప్రకటించిన కొలువుల్లో మేనేజర్‌ (ఇ-3) పోస్టుకు మూలవేతనం రూ.60,000, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులూ కలిపి రూ.1.5 లక్షల వరకూ ఉంటుంది. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇ-1) పోస్టుకు మూలవేతనం రూ.40,000, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులూ కలిపి రూ.లక్ష వరకూ పొందవచ్చు. సీనియర్‌ అసిస్టెంట్‌ (ఎన్‌ఇ-6) పోస్టుకు మూలవేతనం రూ.36,000, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులూ కలిపి రూ.90,000 వరకూ ఉంటుంది.     


ప్రకటించిన ఉద్యోగాల్లో మేనేజర్‌ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) పోస్టులు 2, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) ఖాళీలు 356, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) పోస్టులు 4 ఉన్నాయి. 


ఏ పోస్టుకు ఏ అర్హతలు? 


1. మేనేజర్‌ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పాసై ఉండాలి. లేదా ఏ సబ్జెక్టుతో పీజీ చేసినా హిందీ, ఇంగ్లిష్‌లను తప్పనిసరిగా చదివి ఉండాలి. ఇంగ్లిష్‌ నుంచి హిందీ, హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి, ముఖ్యంగా టెక్నికల్, సైంటిఫిక్‌ అంశాలను అనువదించడంలో అనుభవం ఉండాలి.  


2. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) పోస్టుకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో మూడేళ్ల బీఎస్సీ (సైన్స్‌) రెగ్యులర్‌ డిగ్రీ పాసవ్వాలి. లేదా ఏదైనా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో పాసవ్వాలి. ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉండాలి. 


3. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (అఫిషియల్‌ లాంగ్వేజ్‌)కు హిందీ లేదా ఇంగ్లిష్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ పాసై ఉండాలి. లేదా ఏదైనా సబ్జెక్టుతో పీజీ పాసై హిందీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాలి. 


4. సీనియర్‌ అసిస్టెంట్‌ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) హిందీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా చదవాలి. లేదా ఇంగ్లిష్‌లో పీజీ చేసి డిగ్రీ స్థాయిలో హిందీని ఒక సబ్జెక్టుగా చదవాలి. లేదా ఏదైనా సబ్జెక్టుతో పీజీ చేసి హిందీ, ఇంగ్లిష్‌ తప్పనిసరిగా చదివి ఉండాలి. 

డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులైతే పార్ట్‌టైమ్‌/కరస్పాండెన్స్‌/డిస్టెన్స్‌ విధానంలో చదివినా దరఖాస్తు చేయొచ్చు. ఇతరులు తప్పనిసరిగా రెగ్యులర్‌ విధానంలో మాత్రమే చదివివుండాలి. 

చివరి సెమిస్ట్టర్‌/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. అయితే డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ సమయానికి ఫలితాలు వెలువడి, పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.

వయసు: 21.01.2023 నాటికి సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 30 ఏళ్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు 27 ఏళ్లు, మేనేజర్‌ పోస్టుకు 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: పోస్టును అనుసరించి ఆన్‌లైన్‌ పరీక్ష, వాయిస్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్, ధ్రువపత్రాల పరిశీలన.. మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష తేదీని ఏఏఐ వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తారు.


 

పరీక్ష ఎలా ఉంటుంది?


జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) పోస్టుకు ఆన్‌లైన్‌ పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.పార్ట్‌-ఎలో 4, పార్ట్‌-బిలో 2 సెక్షన్లు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి సరైన సమాధానానికీ 1 మార్కు ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. 


పార్ట్‌-ఎ: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో 20 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌/ రీజనింగ్‌లో 15 ప్రశ్నలకు 15 మార్కులు, జనరల్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌లో 15 ప్రశ్నలకు 15 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌లో 10 ప్రశ్నలకు 10 మార్కులను కేటాయించారు. 

చదవాల్సినవి: రీజనింగ్‌లో సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్, బ్లడ్‌రిలేషన్స్, పజిల్స్, ఇనీక్వాలిటీస్, ఇన్‌పుట్‌-ఔట్‌పుట్, కోడింగ్‌-డీకోడింగ్, డేటా సఫిషియెన్సీ, ఆర్డర్‌ అండ్‌ ర్యాంకింగ్, ఆల్ఫాన్యూమరిక్‌ సిరీస్, డిస్టెన్స్‌ అండ్‌ డైరెక్షన్, వెర్బల్‌ అండ్‌ నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.

‣ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో: రీడింగ్‌ కాంప్రహెన్షన్, క్లోజ్‌ టెస్ట్, డిటెక్షన్‌ ఆఫ్‌ ఎర్రర్స్, ఇంప్రూవింగ్‌ సెంటెన్సెస్‌ అండ్‌ పేరాగ్రాఫ్స్, కంప్లీషన్‌ ఆఫ్‌ పేరాగ్రాఫ్స్, పేరా జంబ్లింగ్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, మోడ్స్‌ ఆఫ్‌ నెరేషన్, ప్రిపొజిషన్స్, వాయిస్‌ ఛేంజ్‌ మొదలైనవి ఉంటాయి. 

జనరల్‌ నాలెడ్జ్‌లో జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, వర్తమానాంశాలు, ముఖ్యమైన సంస్థలు, వాటి ప్రధాన కేంద్రాలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు, దేశాలు, వాటి రాజధానులు, కరెన్సీలు, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. 

జనరల్‌ ఆప్టిట్యూడ్‌ (న్యూమరికల్‌ ఎబిలిటీ)లో డేటా ఇంటర్‌ప్రిటేషన్,  ఏరియా అండ్‌ వాల్యూమ్, ఎస్‌ఐ అండ్‌ సీఐ, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ వర్క్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, పర్సెంటేజెస్, ఏవరేజెస్‌ నంబర్స్‌ మొదలైనవి ఉంటాయి. 

పార్ట్‌-బి: మ్యాథమెటిక్స్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, ఫిజిక్స్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు. మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు (2 గంటలు).

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 22.12.2022

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21.01.2023 


 

సన్నద్ధత ఇలా..


పార్ట్‌-బిలో ఎక్కువ మార్కులను సంపాదించడానికి 11, 12 తరగతుల మ్యాథ్స్, ఫిజిక్స్‌లను బాగా చదవాలి. వాటిలోని ప్రాథమికాంశాలు, అనువర్తనాలపై దృష్టి సారించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. గతంలో నిర్వహించిన జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రశ్నపత్రాలు వివిధ సైట్లలో అందుబాటులో ఉంటాయి. వీటిని సాధన చేయడం ద్వారా సన్నద్ధతకు మెరుగులు దిద్దుకోవచ్చు. మాక్‌ టెస్టులు రాస్తే సమయ నిర్వహణపై అవగాహన పెరుగుతుంది. అలాగే ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకుని.. అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. 


 

గేట్‌ స్కోరు ఆధారంగా...

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా మరో ప్రకటన ద్వారా 596 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయబోతోంది. గేట్‌ స్కోరు ఆధారంగా ఈ నియామకాలు ఉంటాయి. 

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇంజినీరింగ్‌ - సివిల్‌) పోస్టులు 62, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇంజినీరింగ్‌ - ఎలక్ట్రికల్‌) పోస్టులు 84, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎలక్ట్రానిక్స్‌) పోస్టులు 440, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆర్కిటెక్చర్‌) పోస్టులు 10 ఉన్నాయి. 

అభ్యర్థులు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌ (సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికేషన్స్‌/ ఆర్కిటెక్చర్‌) పాసై ఉండాలి. వయసు 21.01.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. వార్షిక వేతనం ఏడాదికి సుమారు రూ.12 లక్షలు. 

దరఖాస్తు రుసుము రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. 

అభ్యర్థులను గేట్‌ 2020/ గేట్‌ 2021/ గేట్‌ 2022 స్కోరు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌.. మొదలైన వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ను ఏఏఐ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 22.12.2022

దరఖాస్తులకు చివరి తేదీ: 21.01.2023

వెబ్‌సైట్‌: http://www.aai.aero/
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ విద్యా సంస్థలకు గ్రేడింగ్‌ ఎలా ఇస్తారు?

‣ ఏకాగ్రతతో ఎలా చదవాలి?

‣ టిస్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు ప్రారంభం

‣ అందరూ కామర్స్‌ కోర్సుల్లో చేరుతున్నారు!

‣ సందిగ్ధతను దాటి.. సన్నద్ధత వైపు!

Posted Date : 24-12-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.