‣ బీఎస్సీ(ఆనర్స్) కోర్సు ప్రవేశాలకు ప్రకటన
ఉపాధికి అవకాశమిచ్చే నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సును ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తోంది. బీఎస్సీ (హోంసైన్స్)నే ఈ కోర్సుగా మార్పు చేశారు. ఈ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదలయింది. ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా చేరటానికి అవకాశమున్న ఈ కోర్సుకు దరఖాస్తు గడువు ఆగస్టు 25వ తేదీ.
గుంటూరు లాంఫారమ్ సామాజిక విజ్ఞాన కళాశాలలో కమ్యూనిటీ సైన్స్ కోర్సు సెమిస్టర్ విధానంలో జరుగుతుంది. డిగ్రీలో మొత్తం ఎనిమిది సెమిస్టర్‌లు ఉంటాయి. మొదటి మూడు సంవత్సరాలూ పోషకాహారం, మానవ అభివృద్ధి, బాలల అభివృద్ధి, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, విస్తరణ విభాగాలకు చెందిన వివిధ కోర్సులను అభ్యసించాల్సి ఉంటుంది.
కమ్యూనిటీ సైన్స్ మూడో సంవత్సరంలో ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ ప్లాన్(ఐడీపీ) ద్వారా ఎంపికైన ప్రతిభావంతులకు విదేశాల్లో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో మూడు నెలల ఉచిత శిక్షణతో పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం దక్కుతుంది. డిగ్రీ కోర్సుతో పాటు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, సంభాషణ నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. నాలుగో సంవత్సరం తాము తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను సమాజంలో అమలుపరిచేందుకు గ్రామీణ పని అనుభవ కార్యక్రమం నిర్వహించాలి. 2020-21 విద్యాసంవత్సరం నుంచి బాలురకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు.
అవకాశాలు
డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ఎంఎస్సీ (కమ్యూనిటీ సైన్స్), పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఐసీఏఆర్, యూజీసీ నిర్వహించే జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్ అర్హత సాధించి ఉపకార వేతనాలు పొందుతున్నారు. ఐసీఏఆర్ గుర్తింపు ఉన్న కమ్యూనిటీ సైన్స్ పట్టాతో విదేశీ విశ్వవిద్యాలయాల్లోనూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత సాధిస్తున్నారు. చాలామంది ఏపీపీఎస్సీ, బ్యాంకింగ్, ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో విస్తరణ అధికారులుగా, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్‌లుగా, గ్రామ సచివాలయ సంరక్షణ అధికారులు, ఈవెంట్ మేనేజర్లుగా రాణిస్తున్నారు.
ఎవరు అర్హులు?
ఇంటర్మీడియట్‌లో బైపీసీ, ఎంపీసీ, డిప్లొమా హోంసైన్స్ ఉత్తీర్ణులైన బాలురూ, బాలికలూ ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు https://angrau.ac.in/ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని దానిని వివరాలతో నింపి ఆగస్టు 25 లోపు అందేలా పంపాలి. దరఖాస్తు ఫారాన్ని ‘రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫారమ్, గుంటూరు- 522034’ చిరునామాకు పోస్టు ద్వారా గాని, నేరుగా గాని అందజేయవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ గుత్తా రామారావు తెలిపారు.
సామాజిక అంశాల మిళితంగా కమ్యూనిటీ సైన్స్ కోర్సును రూపొందించామని కమ్యూనిటీ సైన్స్ డీన్ డాక్టర్ చిరంజీవి చెప్పారు. సామాజిక అధ్యయనం, శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు, పర్యవేక్షణ, వనరుల యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ, అంగన్వాడీ కేంద్రాల బలోపేతం అంశాలను సమర్థంగా నిర్వహించగలిగే నైపుణ్యం సాధించేందుకు ప్రత్యేకించి ఈ కోర్సును రూపొందించామని తెలిపారు.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆలస్యంగా వీసాలు.. ఏం చేస్తే మేలు?