• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆటోక్యాడ్‌తో అనేక అవకాశాలు

నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌

ఏ వస్తువునైనా తయారుచేసేటప్పుడు... భవనాలు వంటివి నిర్మించేటప్పుడు... దేన్నయినా కొత్తగా ఆవిష్కరించాలి అన్నప్పుడు డిజైన్‌ చాలా ముఖ్యం. కేవలం కాగితం మీద వేసినదానికంటే కంప్యూటర్‌లో సృష్టించే 2డీ, 3డీ డిజైన్లు మరింత ప్రభావవంతంగా మన ఆలోచనను ప్రతిబింబిస్తాయి. ఇందుకు సహకరించే ఆటోక్యాడ్‌ అప్లికేషన్‌ను ఉపయోగించడం నేర్చుకున్నవారికి డిజైనింగ్‌ కెరియర్‌లో ఎన్నో అవకాశాలున్నాయి.


క్యాడ్‌ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌) రెండు మూడు డైమన్షన్స్‌లో నమూనాలు గీసేందుకు ఉపయోగించే ఒక డిజిటల్‌ టెక్నాలజీ. దేన్నయినా తయారుచేసే ముందు దాని డిజైన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు క్యాడ్‌ ఉపయోగపడుతుంది. ఆటోక్యాడ్‌ను 1982లో ఆటోడెస్క్‌ అనే సంస్థ రూపొందించింది. అంతకుముందు డిజైన్‌ కోసం నిపుణులు చేత్తో గీసిన స్కెచ్‌లను ఉపయోగించేవారు. అలా గీయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని, సమయం ఎక్కువ పడుతుంది. కానీ ఆటోక్యాడ్‌ వచ్చాక ఆ సమస్యలకు చెక్‌ పెట్టినట్లయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, గ్రాఫిక్‌ డిజైనర్లు, ఫ్యాషన్‌ డిజైనర్లు... ఇలా చాలామంది దీన్ని ఉపయోగిస్తున్నారు. డిజిçల్‌ డిజైన్స్‌ రంగంలో ఆటోక్యాడ్‌ నిపుణుల అవసరం ఎంతో ఉంది.


 ప్రస్తుతం టెక్నికల్‌ ప్రాజెక్టులు, డ్రాయింగ్స్‌ కోసం వాడుతున్న సాఫ్ట్‌వేర్లలో ఆటోక్యాడ్‌ ముందు వరసలో ఉంది. దీంతో చాలా ఉపయోగాలున్నాయి. ఆర్కిటెక్చర్‌ ప్లానింగ్‌లో లేఅవుట్లు వేసేందుకు, మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు ఉత్పత్తుల 3డీ ప్రింటింగ్‌ కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇంటీరియర్‌ డిజైనింగ్, జ్యూవలరీ డిజైన్స్‌ తయారీలోనూ ఇది ముఖ్యపాత్ర పోషిస్తోంది.


ఎలా ఉంటుంది?


ఆటోక్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌లో విభిన్నరకాలైన టూల్స్, కమాండ్స్‌ ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే మనందరి కంప్యూటర్లలోనూ ఉండే పెయింట్‌ అప్లికేషన్‌ బాగా ప్రొఫెషనల్‌గా ఉంటే ఎలా కనిపిస్తుందో... అలా ఉంటుంది. కచ్చితమైన కొలతలతో నచ్చిన డ్రాయింగ్స్‌ను సులభంగా వేసేలా ఇన్‌బిల్ట్‌ ఆప్షన్స్‌ ఉంటాయి. పోలార్‌ ట్రాకింగ్‌ ఆప్షన్‌తో రేఖల యాంగిల్స్‌ను నిర్దేశించవచ్చు. మెకానికల్, సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఒక సెమిస్టర్‌లో ఆటోక్యాడ్‌లో ప్రాథమిక అంశాలను నేర్చుకుంటున్నారు. పూర్తిస్థాయిలో దీన్ని ఉపయోగించాలి అంటే సరైన శిక్షణ తప్పనిసరి. అలా ట్రైనింగ్‌ పొందినవారు ధ్రువపత్రం కోసం పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ఉన్న వారికి విభిన్న అవకాశాలు లభిస్తున్నాయి.


సర్టిఫికేషన్‌ పరీక్షలో డైమన్షనింగ్, మాడిఫైయింగ్, హాచింగ్, కమెంటరీస్, ప్రింటింగ్, ప్లాటింగ్‌ వంటి టెక్నిక్స్‌ ఎలా ఉపయోగిస్తున్నారో పరీక్షిస్తారు. అందువల్ల వీటిపై పట్టు సాధించడం తప్పనిసరి. ఇందులో ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్స్‌ వస్తూ ఉండటం వల్ల మనం కూడా నూతన నైపుణ్యాలు అధ్యయనం చేయడంపై దృష్టి సారించాలి.


‣ ఆటోక్యాడ్‌లో విభిన్నమైన వెర్షన్స్‌ ఉన్నాయి. ఎల్‌టీ, ఎంఈపీ, పీ అండ్‌ ఐడీ, సివిల్, మ్యాప్‌ త్రీడీ లాంటి రకాలను విభిన్న మార్కెట్‌ అవసరాలకు తగినట్టుగా అభివృద్ధి చేశారు.


 

ఉద్యోగాలేమున్నాయ్‌?


ఆటోక్యాడ్‌పై పట్టు సాధించాక ఆటోక్యాడ్‌ స్పెషలిస్ట్, మెంటర్, ఫ్రీలాన్సర్‌గా పనిచేసే అవకాశం ఉంది. డిజైన్‌ మేకింగ్‌తో సొంత సంస్థను నెలకొల్పి క్లైంట్లకు సేవలు అందించవచ్చు. ఆటోక్యాడ్‌ డిజైన్స్‌ను అమ్మకానికి పెట్టే ఆన్‌లైన్‌ సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటికి మోడల్స్‌ను అందించవచ్చు. హౌస్‌ డిజైనింగ్‌లోనూ రాణించే అవకాశం ఉంటుంది. చాలామంది తమ ఇళ్లను ప్రత్యేకంగా, కొత్తగా తీర్చిదిద్దాలి అనుకుంటారు. ఫ్లోర్‌ ప్లాన్స్, బ్లూప్రింట్స్‌ తయారీలో ఆటోక్యాడ్‌ డిజైన్స్‌ తయారీ అవసరమవుతుంది. ఏవైనా రియల్‌ ఎస్టేట్‌ ఫర్మ్స్‌తో జోడీ కట్టడం ద్వారా మీ క్యాడ్‌ వర్క్స్‌ మార్కెట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆటోక్యాడ్‌ డిజైనర్‌గానూ అవకాశాలు అందుకోవచ్చు. సర్వేయింగ్, మ్యాపింగ్‌ సర్వీసెస్‌లో స్కెచెస్‌ చేసి ఇవ్వొచ్చు. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కంపెనీలు, పేరుమోసిన  జ్యూవలరీ సంస్థల్లో కొలువుదీరొచ్చు.


ఆటోక్యాడ్‌ నేర్చుకునేందుకు కొన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్, ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్లలో కోర్సులు ఉన్నాయి. ప్రైవేట్‌లో అయితే చాలా ఇన్‌స్టిట్యూట్లు దీన్ని నేర్పిస్తున్నాయి. కోర్సెరా, యుడెమీ, స్కిల్‌షేర్‌ లాంటి సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లోనూ నేర్చుకునే అవకాశం ఉంది. ఆటోడెస్క్‌ డిజైన్‌ అకాడెమీలోనూ దీన్ని ఎలా నేర్చుకోవాలనే అంశంపై మెటీరియల్‌ దొరుకుతుంది. సంస్థను బట్టి 3 వారాల నుంచి రెండేళ్లకు పైబడి కోర్సు కాలవ్యవధి ఉంటుంది. సర్టిఫికేషన్‌ అనంతరం ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్ర‌తికూల‌ ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌కు నెట్టేయండి!

‣ కాలేజీలో చేర‌క‌పోతే ఫీజు వాప‌సు!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Posted Date : 18-08-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌