• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మార్కులను బట్టి ఉండదు.. మన విజయం!

* ప్రాంగణ ఎంపికల్లో అత్యధిక వేతనం సాధించిన ఆదిత్య 

మొదటి నుంచీ మార్కుల్లో తరగతిలో ముందుండే విద్యార్థి కాదు. పుస్తకాల పురుగు అంతకన్నా కాదు. జీవితమంటే ఎత్తు పల్లాలు సహజమనే సత్యాన్ని గ్రహించాడు. మొదటి ఇంటర్వ్యూలో విఫలమైనా అధైర్యపడలేదు. ఆత్మ విశ్వాసంతో ముందుకెళితే విజయం సాధ్యమని మాత్రం గట్టిగా నమ్మాడు ఆదిత్య సింగ్‌. అందుకే వరంగల్‌ ఎన్‌ఐటీ ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో అత్యధిక వార్షిక వేతనంతో ఉద్యోగం సొంతం చేసుకున్నాడు! 


బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆదిత్య     బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో రూ. 88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువుకు ఎంపికయ్యాడు. మిగతా అందరినీ వెనక్కి నెట్టి ఈ ఆకర్షణీయ వేతనం అందుకునేందుకు ఇతడికి ఉపకరించిన అంశాలేంటి? ముఖాముఖి జరిగిన తీరు? ఈ విశేషాలు అతడి మాటల్లోనే...  


ఈసారి వరంగల్‌ నిట్ క్యాంపస్‌ సెలక్షన్స్‌లో నాకే అత్యధిక ప్యాకేజీ వచ్చిందంటే ఆశ్చర్యంగా అనిపించింది. అయితే నేను మొదటి నుంచీ ఎప్పుడూ ఒత్తిడితో చదవలేదు. మా స్వస్థలం దిల్లీ. బాగా చదవాలనీ, ఫలానా ఉద్యోగం చేయాలనీ అమ్మా నాన్నా ఎప్పుడూ చెప్పలేదు. నా ఇష్టం మేరకే బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఎంచుకున్నా.


మొదటి సంవత్సరం నుంచే కోడింగ్‌పై పట్టు సాధిస్తూ వస్తున్నా. బహుశా నేను మేటిగా నిలవడానికి కోడింగ్‌ ఉపకరించిందని భావిస్తున్నా.


అయినా నేను మొదటి ఇంటర్వ్యూలో ఎంపిక కాలేదు. మొదట ఒక కంపెనీ ముఖాముఖికి వెళ్లగా వాళ్లు తిరస్కరించారు. వారిచ్చిన సమయానికి ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేయలేకపోవడం వల్లే నన్ను ఎంపికచేయలేదనుకుంటా. . 


మరో కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలోనూ నేను ఎంపిక కాలేదు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఒకటి రెండు వైఫల్యాలు ఎదురుకాగానే నిరాశ పడిపోతే ఏమీ సాధించలేం. 


రెండు సార్లు ఎదుర్కొన్న మౌఖిక పరీక్షలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని కోడింగ్‌తోపాటు, ఇతర అంశాలనూ సాధన చేశా.       


అలా మూడో ఇంటర్వ్యూలో అత్యధిక ప్యాకేజీకి ఎంపికయ్యా. 


బ్లాక్‌ చెయిన్, మెషిన్‌ లెర్నింగ్‌ ప్రాజెక్టులు


మొత్తం 3 రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. తొలిరౌండ్‌లో డేటా బేస్డ్‌ అంశాలు, రెండో రౌండ్లో సాంకేతిక అంశాలు (టెక్నికల్‌) పరీక్షించారు. మూడో రౌండ్లో మానవ వనరులు, మేనేజ్‌మెంట్ అంశాలను అడిగారు. 


చదువుల్లో మనం సాధించిన మార్కుల కన్నా సమస్య పరిష్కారంలో ఎంత తెలివిగా ఆలోచిస్తున్నామో, వేగంగా.. సులువుగా చేశామా లేదా అనేవి కంపెనీలు చూస్తాయి. 


బీటెక్‌లో బ్లాక్‌ చెయిన్, మెషిన్‌ లెర్నింగ్‌ సాంకేతికతలపై చాలా ప్రాజెక్టులు చేశాను. వాటిల్లో ఒకటి.. తరగతి గదిలో ఒక్క ఫొటో తీసి విద్యార్థుల హాజరు నమోదయ్యేది. హాజరు తీసుకునే క్రమంలో పేరుపేరునా పిలవడం కన్నా చిటికెలో పూర్తి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.


కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం


నేను విద్యార్థులకు ఇచ్చే సూచన ఒక్కటే. కేవలం పుస్తకాల పురుగులా ఉండకూడదు. మన ఎదుగుదలకు అనేక అంశాలు దోహదపడతాయి. ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన అవగాహన ఉంటుంది. ఉదాహరణకు మా సోదరుడు విక్రమ్‌ సింగ్‌Â నేనూ కవలలం. అతను అలహాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ చేస్తున్నాడు. రూ. 70 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యాడు. అలాగని మా సోదరుడికన్నా చదువుల్లో నేను ఎక్కువేం కాదు. పదో తరగతిలో 75 శాతం మార్కులు, ఇంటర్లో 95 శాతం మార్కులు సాధించా. కానీ మన విజయం మార్కులపై ఆధారపడి ఉందనుకోవడం పొరపాటు. క్రికెట్, బ్యాడ్మింటన్‌ లాంటి క్రీడలు ఆడతాను. కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం ఉంటే తప్పకుండా ఉన్నత శిఖరాలు అందుకోగలం అనేది నా సిద్ధాంతం. 

- గుండు పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌ 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మెరుగైన ర్యాంకుకు మెలకువలు 

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో కొలువులు

‣ క్రీడా నిర్వహణ కోర్సుల్లోకి ఆహ్వానం

‣ డిగ్రీ, పీజీతో సిపెట్‌లో ఉద్యోగాలు

‣ బోధనలో రాణించాలని ఉందా?

Posted Date : 08-05-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌