• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆఖరి దశలో క్యాట్‌ సన్నద్ధత ఎలా?

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)-2022కు మరో నాలుగు రోజుల వ్యవధి మాత్రమే మిగిలుంది. దీర్ఘ సమాధాన ప్రశ్నలను తక్కువ  సమయంలో రాసేలా నోట్సును పునశ్చరణ చేసుకోవాలి. కాన్సెప్టులు, ఫార్ములాలు, షార్ట్‌కట్స్‌ను గుర్తుపెట్టుకోవాలి. సన్నద్ధతకు తుది మెరుగులు దిద్దుకోవాలి!  


క్యాట్‌ పరీక్ష నియమ నిబంధనలను అర్థంచేసుకుంటే పరీక్ష రోజున ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారు. గత రెండేళ్ల మాదిరిగానే పరీక్ష కేంద్రం వద్ద కొవిడ్‌-19 నిబంధనలను అమలుచేస్తారు. కాబట్టి వీటిని పాటిస్తూ పరీక్ష రాయడానికి అభ్యర్థులు సిద్ధం కావాలి. 


ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు, థియరమ్స్‌ను పరీక్షకు ముందు రోజు రాత్రి రివైజ్‌ చేసుకోవాలి. కొత్త అధ్యాయాన్ని చదవడానికిగానీ, మాక్‌టెస్ట్‌ రాయడానికిగానీ ఇది తగిన సమయం కాదని గుర్తుంచుకోవాలి. ఈ సమయాన్ని పూర్తిగా పునశ్చరణ (రివిజన్‌)కు మాత్రమే కేటాయించాలి. అన్ని కాన్సెప్టులనూ మననం చేసుకుని పరీక్ష ముందురోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి.


వరుస క్రమం పాటించాలి


క్యాట్‌లో ముందుగా సమాధానం రాయాల్సిన సెక్షన్‌ను ఎంచుకునే అవకాశం అభ్యర్థులకు ఉండదు. ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లు కింది క్రమంలో ఉంటాయి. 


వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (వీఏఆర్‌సీ)


డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ (డీఐఎల్‌ఆర్‌)


క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (క్యూఏ)


 అభ్యర్థులు ముందుగా మొదటి సెక్షన్‌ అయిన వీఏఆర్‌సీని పూర్తిచేసిన తర్వాతే రెండో సెక్షన్‌కు వెళ్లాలి. ప్రతి సెక్షన్‌కూ 40 నిమిషాల చొప్పున సమయాన్ని కేటాయించారు. ఆ నిర్దిష్ట సమయంలోనే సంబంధిత సెక్షన్‌ను ముగించాలి. 40 నిమిషాల సమయం పూర్తికాగానే స్క్రీన్‌ రెండో సెక్షన్‌కు మారుతుంది. మధ్యలో ఒక సెక్షన్‌ నుంచి మరో సెక్షన్‌కు మారే అవకాశం ఉండదు.


 అభ్యర్థులు కంప్యూటర్‌ మౌస్‌ను ఉపయోగించి సమాధానాలను లాక్‌ చేయాలి. కీబోర్డును మాత్రం వాడకూడదు. దీన్ని వాడితే స్క్రీన్‌ చలనం లేకుండా స్తంభించిపోతుంది. 


అభ్యర్థి క్వాంటిటేటివ్‌ నైపుణ్యాలకు క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ సెక్షన్‌ అద్దంపడుతుంది. దీంట్లో ఎక్కువ మార్కులు సంపాదిస్తే మొత్తం పర్సంటైల్‌ పెరుగుతుంది. 


‣ డీఐ సెక్షన్‌ అభ్యర్థులకు కాస్త మధ్యస్థంగా అనిపిస్తుంది. కానీ మంచి పర్సంటైల్‌ సాధించడానికి ఇది తోడ్పడుతుంది. భాషా నైపుణ్యాల్లో వెనకబడి ఉంటే.. వెర్బల్‌ ఎబిలిటీ సెక్షన్‌ కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే సమాధానాలకు ఇచ్చే ఆప్షన్లు తికమకగా ఉంటాయి. 


ఎల్‌ఆర్‌ సెక్షన్‌ ప్రశ్నలకు అన్ని సమాధానాలూ ఒకేలా అనిపించవచ్చు. సరైన సమాధానం గుర్తించడం కష్టంగానే ఉంటుంది. తార్కికంగా ఆలోచిస్తే సరైన సమాధానాన్ని గుర్తించొచ్చు.


 

వేగం, కచ్చితత్వం 


క్యాట్‌.. అభ్యర్థుల వేగాన్ని, కచ్చితత్వాన్నీ పరీక్షిస్తుంది. 120 నిమిషాల సమయంలో అభ్యర్థులు 66 ప్రశ్నలకు (ఎంసీక్యూలు, నాన్‌-ఎంసీక్యూలు) సమాధానాలు రాయాలి. క్లిష్టమైన కాలిక్యులేషన్లు, పెద్ద పేరాలూ ఉంటాయి. ఒక్కో ప్రశ్నను సాధించడానికి వంద సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఒక సెక్షన్‌లో మిగిలిన ప్రశ్నలను.. మళ్లీ వెనక్కు వచ్చి రాసే అవకాశం ఉండదు. సమాధానాలు రాయడంలో వేగంతోపాటు వందశాతం కచ్చితత్వమూ ఉండాలి. నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కును తగ్గిస్తారు.


 

పునశ్చరణ


చాలామంది క్యాట్‌ అభ్యర్థులు పునశ్చరణ ప్రాధాన్యాన్ని అంతగా గుర్తించరు. కానీ రివిజన్‌ చేసుకోవడం వల్ల చదివిన అంశం బాగా గుర్తుండి.. సమర్థంగా పరీక్ష రాయగలుగుతామని మర్చిపోకూడదు.  


క్యాట్‌ మాత్రమే కాదు, ఏ పరీక్షలో విజయం సాధించాలన్నా ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం. క్యాట్‌ ప్రశ్నలు తికమక పెట్టినా, సుదీర్ఘంగా ఉన్నా ఈ పరీక్ష స్వభావంగా అర్థం చేసుకోవాలి. లేనిపోని భయాలకు లోనైతే ఆ ప్రభావం పరీక్ష మీద పడి సమర్థంగా రాయలేరు. నెగెటివ్‌ మార్కులు ఉన్నాయనేది గుర్తుంచుకుని సమాధానం తెలియకపోయినా ఊహించి రాయటం మానెయ్యలి. అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో రాస్తే క్యాట్‌లో ఆశించిన ఫలితం లభిస్తుంది.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఊహ‌ల‌కు రూప‌మిస్తూ... ఉత్ప‌త్తులు రూపొందిస్తూ!

‣ పవర్‌ గ్రిడ్‌లో కొలువు కావాలా?

‣ ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?

‣ బీమా పథకాలను రూపొందిస్తారా?

Posted Date : 25-11-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.