• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎప్పటి పాఠాలు అప్పుడే చదవాలి!

సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్షార్థులకు ర్యాంకర్ల సూచనలు

సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్షలో, సీఏ ఐపీసీసీలో జాతీయ స్థాయిలో అత్యున్నత ర్యాంకులు సాధించారు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన ఇద్దరు మిత్రులు. చిన్ననాటి నుంచి ఒకే పాఠశాల, కళాశాలలో చదివారు. స్నేహితులు కావడం యాదృచ్ఛికమైనా ఒకరికొకరు సన్నిహితంగా ఉంటూ మేటి ర్యాంకర్లుగా నిలిచారు- రిషబ్‌ ఓత్స్వాల్, శశి శ్రీనివాస్‌.

ఇటీవల విడుదలైన సీఎంఏ ఫౌండేషన్‌ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో రిషబ్‌ మొదటి ర్యాంకు, శశి శ్రీనివాస్‌ రెండో ర్యాంకు సాధించారు. 2022 ఫిబ్రవరిలో వచ్చిన సీఏ ఐపీసీసీ ఫలితాల్లోనూ జాతీయస్థాయిలో రిషబ్‌ 8వ ర్యాంకు, శశిశ్రీనివాస్‌ 10 ర్యాంకుతో ప్రతిభ చాటారు. వీరి విజయం వెనుక స్ఫూర్తి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంది. ఎల్‌కేజీ నుంచి తరగతిలో మొదటి ర్యాంకు తెచ్చుకోవాలనే లక్ష్యం రిషబ్‌ది. ఇక శశి శ్రీనివాస్‌ 8వ తరగతిలో ఉన్నపుడు సిటీ మాంటిస్సోరి లక్నో నుంచి పొయిట్రీ రైటింగ్‌కు ఆహ్వానాలు వచ్చాయి. ఈ పోటీలో తన పొయిట్రీకి ప్రపంచంలోనే ద్వితీయ స్థానం లభించిన ఉత్సాహం!  ఇవే వీరిద్దరూ అత్యున్నత. ర్యాంకులు సాధించడానికి పునాదులు పడ్డాయని అంటున్నారు. ఇద్దరి తండ్రులూ పలమనేరు పట్టణంలో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు. వారిద్దరు కూడా స్నేహితులు కావడం గమనార్హం. రిషబ్‌ తండ్రి రాజేష్‌ ఇంటర్మీడియట్, తల్లి సుమిత్ర కంప్యూటర్‌ సైన్స్‌ చదువుకున్నారు. శశి శ్రీనివాస్‌ తల్లి శ్రీలక్ష్మి, తండ్రి లక్ష్మిపతి ఇద్దరూ డిగ్రీ చదువుకున్నారు.

ఏ రోజు పాఠాలు ఆరోజే - రిషబ్‌ ఓత్స్వాల్‌

ఎల్‌కేజీ నుంచే కష్టపడి చదవటం అలవాటు. తరగతిలో మొదటి స్థానం రావాలని ప్రయత్నం చేసేవాణ్ని. పాఠశాల తరఫున మ్యాథ్స్‌ ఒలింపియాడ్, సైన్స్‌ ఒలింపియాడ్‌లో 6 బంగారు, మూడు రజత పతకాలు సాధించాను. పదో తరగతి పరీక్షల్లో 97 శాతం మార్కులు వచ్చాయి. గుంటూరు మాస్టర్‌ మైండ్స్‌లో ఎంఈసీ చదివాను. ఇంటర్‌లో కూడా 96 శాతం మార్కులు సాధించాను. అదే కళాశాలలో సీఏ ఫౌండేషన్‌ కోసం చేరాను. అత్యున్నత ర్యాంకులు వచ్చిన తరువాత బిగ్‌ఫోర్‌ కంపెనీలైన కేపీఎంజీ, బెంగళూరు కోరమంగళ బ్రాంచిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నాను.

దేశవ్యాప్తంగా జరిగే పరీక్షల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలంటే కష్టపడి చదవాలి. సిలబస్‌లో ఏరోజు పాఠాలు ఆరోజే పూర్తి చేసుకోవాలి. సన్నద్ధతకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి.    

రివిజన్‌ ఎంతో ముఖ్యం - శశి శ్రీనివాస్‌ 

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పొయిట్రీ పోటీల్లో ద్వితీయ స్థానం రావటం నాలో పెనుమార్పు తీసుకొచ్చింది. ఇక అక్కడి నుంచి నాలో ఉన్న చదివే శక్తిని గుర్తించాను. పదో తరగతిలో 95 శాతం మార్కులొచ్చాయి. ఇంటర్‌లో ఎంఈసీ తీసుకుని కష్టపడి చదివా. 97.5 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యా. మాస్టర్‌ మైండ్స్‌ కళాశాలలో సీఏ ఫౌండేషన్‌ కోర్సులో 400 మార్కులకు 325 మార్కులు సాధించా. అక్కడే సీఏ ఇంటర్‌మీడియట్‌లో 2022 ఫిబ్రవరి ఫలితాల్లో జాతీయస్థాయి 10వ ర్యాంకు అందుకున్నాను. ఇక సీఎంఏ ఫౌండేషన్‌లో జాతీయ స్థాయిలో ద్వితీయ ర్యాంకు పొందా. మా నాన్న కష్టపడి చదివిస్తుంటే అదే స్ఫూర్తిగా తీసుకున్నాను. ఇప్పుడు బిగ్‌ఫోర్‌కి చెందిన కేపీఎంజీ బెంగళూరు కోరమంగళలో ఇంటర్న్‌షిప్‌ ప్లేస్‌మెంట్‌ వచ్చింది. నెలకు రూ.15 వేల స్టైపెండ్‌ తీసుకుంటున్నా.

చదివిన పాఠ్యాంశాల రివిజన్‌ విద్యార్థులకు ఎంతో ముఖ్యం. అప్పుడే అన్ని అంశాలనూ గుర్తుపెట్టుకోగలుగుతాం. పాఠశాల స్థాయి నుంచే లక్ష్యం ఏర్పరచుకుంటే అత్యున్నత స్థాయికి ఎదగటానికి దోహ‌ద‌ప‌డుతుంది. 

-  మణి (పలమనేరు, న్యూస్‌టుడే)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏకకాలంలో ప్రిపరేషన్‌ ఏంతో మేలు!

‣ ఎంసెట్‌ పై సందేహాలకు సమాధానాలు

‣ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఇలా సాధించాడు!

‣ చదువుకునే చోటు ఎలా ఉండాలి?

‣ భారత విద్యార్థులకు బ్రిటిష్‌ కౌన్సిల్‌ స్కాలర్‌షిప్స్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌