• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

పరీక్ష సరళి, సన్నద్ధత వివరాలు

జనవరి 12 దరఖాస్తుకు గడువు



దేశంలో పరిశోధనలకు చిరునామా.. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌). ఈ సంస్థకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో సెక్షన్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ హోదాల్లో 444 ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. సాధారణ డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షతో నియామకాలుంటాయి. అవకాశం వచ్చినవారికి గెజిటెడ్‌ స్థాయి, ఆకర్షణీయ వేతనాలు దక్కుతాయి. యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు ఈ పోస్టులకు ప్రయత్నించవచ్చు! 


స్వయం ప్రతిపత్తి సంస్థగా 1942లో సీఎస్‌ఐఆర్‌ ఏర్పాటైంది. ఇది కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దేశంలో పరిశోధన, అభివృద్ధికి మాతృ సంస్థ సీఎస్‌ఐఆరే. దీని ఆధ్వర్యంలో 36 జాతీయ ప్రయోగశాలలు, 39 అవుట్‌రీచ్‌ కేంద్రాలు, ఒక ఇన్నోవేషన్‌ కాంప్లెక్స్, మరో మూడు పాన్‌ ఇండియా యూనిట్లు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా ఎంపికైనవారు వీటిలో ఎక్కడైనా విధులు నిర్వర్తించాలి. ఈ పోస్టులను కంబైన్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఏఎస్‌ఈ) ద్వారా భర్తీ చేస్తారు.    


ఖాళీలు.. అర్హతలు


సెక్షన్‌ ఆఫీసర్‌ గ్రూప్‌ బీ (గెజిటెడ్‌)

ఖాళీలు: 76 

అర్హత: ఏదైనా డిగ్రీ

వయసు: 33 ఏళ్లకు మించరాదు.

వేతన శ్రేణి: లెవెల్‌- 8. రూ.47,600 - 1,51,100. ఎంపికైనవారు మొదటి నెల నుంచే సుమారు రూ.85,000 అందుకోవచ్చు. 


అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌

ఖాళీలు: 368. 

అర్హత: ఏదైనా డిగ్రీ

వయసు: 33 ఏళ్లకు మించరాదు.

వేతన శ్రేణి: లెవెల్‌-7. రూ.44,900 - 1,42,400. వీరు సుమారు రూ.80,000 పొందవచ్చు.

పై రెండు పోస్టులకూ గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు వారి కేటగిరీ ప్రకారం పది నుంచి పదిహేనేళ్ల సడలింపు వర్తిస్తుంది. 


పరీక్ష ఇలా

రెండు పోస్టులకూ పరీక్షలు ఉమ్మడిగానే ఉంటాయి. మొత్తం 3 పేపర్లు. ఇవన్నీ ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. 

పేపర్‌-1: జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌. దీనికి 150 మార్కులు. 150 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి 0.33 మార్కులు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. జనరల్‌ అవేర్‌నెస్‌లో వంద, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో 50 ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. 

పేపర్‌-2: జనరల్‌ ఇంటెలిజెన్స్, రీజనింగ్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. దీనికి 200 మార్కులు. మొత్తం 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి 0.33 మార్కులు తగ్గిస్తారు. 

పేపర్‌-3: ఇంగ్లిష్‌/ హిందీ డిస్క్రిప్టివ్‌. దీనికి 150 మార్కులు. వ్యవధి 2 గంటలు. ఎస్సే, ప్రెసీ, లెటర్‌/ అప్లికేషన్‌ రాయాలి. 

సీపీటీ: అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికే కంప్యూటర్‌ ప్రొఫిషియన్షీ టెస్టు (సీపీటీ) నిర్వహిస్తారు. దీనికి వంద మార్కులు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. తుది ఎంపికలో ఈ మార్కులు పరిగణనలోకి తీసుకోరు.

ఇంటర్వ్యూ: సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే వంద మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 


ఎంపిక

సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు.. పేపర్‌-1, పేపర్‌-2ల్లో చూపిన ప్రతిభతో పేపర్‌-3కి ఎంపిక చేస్తారు. ఈ మూడు పేపర్లలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఇంటర్వ్యూకి పిలుస్తారు. తుది నియామకాలు మూడు పేపర్లు, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్‌ ప్రకారం ఉంటాయి. అంటే మొత్తం 600 మార్కులనూ పరిగణనలోకి తీసుకుంటారు. 

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు.. పేపర్‌-1, పేపర్‌-2ల్లో చూపిన ప్రతిభతో పేపర్‌-3, సీపీటీకి ఎంపిక చేస్తారు. తుది నియామకాలు మూడు పేపర్లలో సాధించిన 500 మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి.


ఇదీ సిలబస్‌

పేపర్‌-1: జనరల్‌ అవేర్‌నెస్‌లో.. భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, భారత రాజ్యాంగం, రాజనీతిశాస్త్రం, ప్రభుత్వం, సామాజిక న్యాయం, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన సంఘటనలు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌: కాంప్రహెన్షన్, యాక్టివ్‌-పాసివ్, డైరెక్ట్‌-ఇన్‌డైరెక్ట్, ప్రిపొజిషన్స్, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్, సిననిమ్స్‌/ యాంటనిమ్స్, సెంటెన్స్‌ కరెక్షన్, కామన్‌ ఎర్రర్స్, పంక్చువేషన్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌. 

పేపర్‌-2: జనరల్‌ ఇంటెలిజెన్స్, రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీ నుంచి 25, అరిథ్‌మెటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ 25, జనరల్‌ సైన్స్‌ 25, ఎకనామిక్స్, సామాజిక అభివృద్ధి, పర్యావరణం, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు 25, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్‌ 25, డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ 25, మేనేజ్‌మెంట్‌ ప్రిన్సిపల్స్‌ అండ్‌ ప్రాక్టీసెస్‌ 25, జాతీయ భౌగోళికంలో 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. 

పేపర్‌-3: ఎస్సే రైటింగ్‌లో రెండు ప్రశ్నలు రాయాలి. వీటికి వంద మార్కులు. ఒక ప్రెసీ రైటింగ్‌కు 30 మార్కులు. లెటర్‌/ అప్లికేషన్‌ రైటింగ్‌ ప్రశ్నకు 20 మార్కులు.


సన్నద్ధత ఎలా?

ప్రకటనలో సిలబస్‌ వివరాలు క్షుణ్నంగా పేర్కొన్నారు. వాటిని శ్రద్ధగా గమనించాలి. 

ఈ పరీక్షకు సిద్ధమయ్యేవారు కొన్ని అకడమిక్‌ పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ రెండూ విస్తృతంగా చదవాలి.  

పేపర్‌-1లో విజయానికి ఇంటర్మీడియట్‌/ డిగ్రీ హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా అధ్యయనం చేయాలి. డిగ్రీలో ఈ సబ్జెక్టులను చదివినవారు ఎక్కువ స్కోరు పొందవచ్చు. అలాగే గ్రూప్స్‌ అభ్యర్థులకూ ఈ పేపర్‌ బాగా కలిసొస్తుంది. 

పేపర్‌-1లోనే వర్తమానాంశాల్లో ప్రశ్నలు వస్తాయి. జాతీయ స్థాయిలో.. ముఖ్య సంఘటనలు, పర్యావరణాంశాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, రాష్ట్రాల్లోని ముఖ్య పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, క్రీడావార్తలు, నివేదికలు, కమిటీలు, కమిషన్లు, అవార్డులు, సన్మానాలు, ప్రమాదాలు, విపత్తులు, దేశంలో మొదటి స్థానంలో ఉన్నవి.. వీటిని బాగా చదవాలి. 

అంతర్జాతీయ స్థాయిలో.. ముఖ్య సమ్మేళనాలు, సంఘటనలు, ఇంటర్నేషనల్‌ అవార్డులు, ప్రపంచంలో ప్రథమం, అంతర్జాతీయ నాయకత్వం, అంతర్జాతీయ నివేదికలు, అంతర్జాతీయ కమిటీలు, సూచనలు, ప్రపంచంలోని ముఖ్య సంఘటనలు.. వీటిని తెలుసుకోవాలి. 

ఈ పేపర్‌లోని ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కోసం నోటిఫికేషన్‌లో పేర్కొన్న అంశాలను ప్రామాణిక వ్యాకరణ పుస్తకం నుంచి అధ్యయనం చేయాలి. అలాగే యూపీఎస్‌సీ వివిధ పోటీ పరీక్షలకు నిర్వహిస్తోన్న జనరల్‌ ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు. 

పేపర్‌-2లో మేటి స్కోరు కోసం ఐబీపీఎస్, ఎస్‌ఎస్‌సీ నిర్వహిస్తోన్న పరీక్షల అరిథ్‌మెటిక్, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ అంశాలను బాగా చదవాలి. 

ఈ పేపర్‌లోని జనరల్‌ సైన్స్‌ అంశాలకోసం ఇంటర్మీడియట్‌ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ పాఠాల్లోని ముఖ్యాంశాలను అధ్యయనం చేయాలి. డిగ్రీ/ పీజీలో కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యం ఉన్నవారు కంప్యూటర్‌/ ఐటీ విభాగంలో ప్రశ్నలకు సులువుగానే సమాధానం ఇవ్వగలరు. మిగిలినవారు ప్రాథమికాంశాలు చదవాలి. ముఖ్యమైన ఆర్థికాంశాలు, కేంద్రప్రభుత్వ పథకాలు, పర్యావరణం, వాతావరణ సమతౌల్యానికి సంబంధించి దేశం చేస్తోన్న కృషి.. వీటిని తెలుసుకోవాలి. ఈ పేపర్‌లో భాగమైన ఎథిక్స్, డెసిషన్‌ మేకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ ప్రశ్నల సన్నద్ధతకు సివిల్స్‌ ప్రిలిమ్స్‌ సీశాట్‌ ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల జాగ్రఫీ పుస్తకాలు బాగా చదివితే ఆ విభాగంలో ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. 

పేపర్‌-3లో విజయానికి ఇప్పటి నుంచే ఆంగ్లంలో వ్యాసాలు రాయడాన్ని సాధన చేయాలి. ద హిందూ/ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో వచ్చే వ్యాసాలు చదివి, అందులోని ముఖ్యాంశాలను చూడకుండా రాయాలి. సమాచారం, భావ వ్యక్తీకరణ, భాషపై పట్టు కీలకం. 

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పేపర్‌-1, పేపర్‌-2 పాత ప్రశ్నపత్రాలను కనీసం ఆరేడు బాగా సాధన చేయాలి. అలాగే ప్రిలిమ్స్‌ మాదిరి ప్రశ్నపత్రాలు, మాక్‌ టెస్టులూ ఉపయోగమే. 

హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్‌ సైన్స్‌ అంశాలకు గ్రూప్‌-1, గ్రూప్‌-2 పాత ప్రశ్నపత్రాలూ బాగా చదివితే ఎక్కువ ప్రయోజనం.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, ఐబీపీఎస్‌ పీవో పాత, మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేస్తే అరిథ్‌మెటిక్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్‌ ఇంగ్లిష్‌ అంశాల్లో ఎక్కువ మార్కులకు అవకాశం ఉంది. 

భిన్న అంశాల్లో అవసరమైన పరిజ్ఞానం ఉన్నవారే ఈ పరీక్షలో విజేతలు కాగలరు. అందువల్ల పలు పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నలను సాధన చేస్తేనే విజయం దక్కుతుంది. అలాగే మాక్‌ టెస్టులూ రాయాలి. 

రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివాటిని వదిలేయాలి. 


ముఖ్య సమాచారం..

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 12, 2024 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ.500.

పరీక్ష తేదీలు: ఫేజ్‌-1 ఫిబ్రవరిలో నిర్వహించవచ్చు. పేపర్‌-1, పేపర్‌-2లు విడిగా నిర్వహిస్తారా, ఒకేరోజు ఉంటాయా నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాతే పేపర్‌-3 ఉంటుంది. 

సమీపంలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్‌. 

వెబ్‌సైట్‌: https://www.csir.res.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

‣ అర్థం చేసుకుంటూ చదివితే.. అధిక మార్కులు!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ అణుశక్తి విభాగంలో ఉద్యోగాలు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-12-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌