• facebook
  • whatsapp
  • telegram

ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

* యూజీ, పీజీ కోర్సు్ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌అడుగడుగునా సౌకర్యం..దాంతోపాటు హుందాతనం అందిస్తాయి పాద రక్షలు. నచ్చిన రంగుల్లో.. మెచ్చిన ఆకారంలో రూపొంది.. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకర్షిస్తూ.. మన్నికతో సేవలందిస్తాయి.  వీటి తయారీలో నిపుణుల పాత్రే కీలకం. ఈ పరిశ్రమలో ఎన్నో అవకాశాలున్నాయి. ఫుట్‌వేర్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు వీటిని సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసమే జాతీయ ప్రాధాన్య సంస్థ ఎఫ్‌డీడీఐ నెలకొల్పారు. ఇక్కడ యూజీ, పీజీల్లో కోర్సులు లభిస్తున్నాయి. వాటిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు!

ఫుట్‌వేర్, ఫ్యాషన్, రిటైల్, లెదర్‌ యాక్సెసరీ, లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తుల తయారీలో అర్హులకు శిక్షణ ఇచ్చి, నాణ్యమైన మానవ వనరులను పరిశ్రమలకు అందించి, వాటి నుంచి మన్నికైన వస్తువులు రూపొందించి, ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ వాటా పెరిగేలా చేయడానికి.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) 1986లో నెలకొల్పారు. 2017లో ఇది జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందింది. దీనికి దేశవ్యాప్తంగా 12 కేంద్రాలు ఉన్నాయి. వీటిని హైదరాబాద్, నోయిడా, రోహ్‌తక్, కోల్‌కతా, ఫుర్సత్‌గంజ్, చెన్నై, జోధ్పూర్, చిండ్వారా, పట్నా, చండీగఢ్, గుణ, అంక్లేశ్వర్‌ల్లో ఏర్పాటుచేశారు. వీటిలో పాదరక్షలు, లెదర్‌ ఉత్పత్తుల తయారీ, వాటి విక్రయాలకు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్‌ డిగ్రీలను అందిస్తున్నారు. యూజీ, పీజీల్లో అన్ని సంస్థల్లోనూ 2360 సీట్లు ఉన్నాయి. ఆల్‌ ఇండియా స్కిల్‌ టెస్టు (ఏఐఎస్‌టీ)లో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది.  

పాద రక్షలు, తోలు ఉపకరణాలు, జీవన శైలి ఉత్పత్తులకు సంబంధించి ఉన్నత విద్య అందిస్తోన్న ప్రపంచ స్థాయి మేటి మూడు సంస్థలు/ విశ్వవిద్యాలయాల్లో ఎఫ్‌డీడీఐ ఒకటిగా గుర్తింపు పొందింది.

ప్రపంచ పాద రక్షల తయారీ కేంద్రంగా దేశాన్ని రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. భారత్‌లో తోలు, తోళ్ల ఉత్పత్తుల పరిశ్రమ 2030 నాటికి సుమారు రూ.3.92 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం వీటి తయారీలో బాగా కలిసొస్తోంది. అలాగే ఫుట్‌వేర్‌ రిటైల్‌ విభాగంలో 2030 నాటికి కొత్తగా 2.5 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

ప్రపంచ ఫుట్‌వేర్‌ ఉత్పత్తుల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. తోలు దుస్తుల ఉత్పత్తుల్లో ద్వితీయ స్థానం మనదే. తోలు వస్తువుల ఎగుమతుల్లో ఐదో స్థానంలో ఉన్నాం. దేశ జీడీపీలో ఫుట్‌వేర్‌ పరిశ్రమ వాటా రెండు శాతం. సుమారు 44 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. గత కొన్నేళ్ల నుంచి ఫుట్‌వేర్, అపారెల్‌ పరిశ్రమ బాగా వృద్ధి చెందుతోంది. 


ఉపాధి అవకాశాలు 

ఎఫ్‌డీడీఐ సంస్థల్లో డిజైన్‌ కోర్సులు పూర్తిచేసినవారికి ఎక్కువగా పాదరక్షలు, దుస్తులు, లెదర్‌ ఉత్పత్తులు తయారు చేసే సంస్థల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. బీబీఏ, ఎంబీఏతో.. ఏరియా మేనేజర్, ఫ్లోర్‌ మేనేజర్, స్టోర్‌ మేనేజర్, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ మొదలైన హోదాలతో పాదరక్షలు, తోలు ఉపకరణాలు విక్రయించే సంస్థలు, రిటైల్‌ చెయిన్లలో ఉద్యోగాలు ఉంటాయి. ఎక్కువ అవకాశాలు కార్పొరేట్‌ రిటైల్‌ దుకాణాల్లో లభిస్తాయి. ఫుట్‌వేర్‌ డిజైన్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి.. పాదరక్షల తయారీ విభాగంలోని ఉద్యోగాలతోపాటు పాదరక్షలు విక్రయించే కొలువులూ దక్కుతాయి. 

‣ అడిడాస్, యాక్షన్, బాటా, ప్యూమా, గ్లోబస్, ఖాదిమ్స్, లైఫ్‌స్టైల్, ల్యాండ్‌మార్క్, మ్యాక్స్, రీబక్, లిబర్టీ, రిలయన్స్‌ రిటైల్, వెస్ట్‌సైడ్, ఉడ్‌ల్యాండ్, వీకేసీ, షాపర్స్‌ స్టాప్, ప్యాంటలూన్స్‌.. మొదలైన సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా ఎఫ్‌డీడీఐ విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. 

ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులు చదివినవారు.. ఫ్యాషన్‌ డిజైనర్లు, యాక్సెసరీ డిజైనర్లు, టెక్స్‌టైల్‌ డిజైనర్లు, ఫ్యాషన్‌ ఇలస్ట్రేటర్స్, స్పోర్ట్స్‌వేర్‌ డిజైనర్లు, డిజిటల్‌ ఫ్యాషన్‌ డిజైనర్లు, ఫ్యాషన్‌ మర్చెండైజర్లు, బయ్యర్లు, ఫ్యాషన్‌ స్టైలిస్ట్స్, ఫ్యాషన్‌ కన్సల్టెంట్లు, ఎడ్యుకేటర్లు, ఫ్యాషన్‌ ఇంటస్ట్రీ ప్రొఫెషనల్స్, బ్రాండు మేనేజర్లు, కమ్యూనికేషన్‌ స్పెషలిస్టులు, ఆంత్రప్రెన్యూర్, ఫ్యాషన్‌ జర్నలిస్టు, ఫ్యాషన్‌ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్, గ్రాఫిక్‌ డిజైనర్, ఫ్రీలాన్స్‌ డిజైనర్, ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్, పర్సనల్‌ స్టైలిస్ట్, ఫ్యాషన్‌ కోఆర్డినేటర్‌.. తదితర హోదాలతో రాణించవచ్చు. వీరికి దుస్తుల తయారీ సంస్థల్లోనూ అవకాశాలుంటాయి.  


ఏం నేర్పుతారంటే...

కోర్సులో భాగంగా వివిధ పదార్థాలు, ఉత్పత్తులు ఉపయోగించి పాదరక్షలు, తోలు ఉత్పత్తులు, జీవన శైలి ఉపకÛరణాలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు. యంత్రాల సాయంతో వాటిని డిజైన్‌ చేయిస్తారు. వినియోగదారుల అవసరాలపై అవగాహన కల్పించి, అందుకు అనుగుణంగా ఉత్పత్తులు సృష్టించడంపై దృష్టి సారిస్తారు. వీటితోపాటు రిటైల్‌ మేనేజ్‌మెంట్, వినియోగదారుల స్వభావం/ఆలోచన తీరు, రిటైల్‌ కమ్యూనికేషన్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ ఆపరేషన్, మార్కెటింగ్, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్, సేల్స్‌ మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ...తదితర అంశాల్లో అవగాహన కల్పిస్తారు.  


పోటీ పరిమితమే

పాత ప్రశ్నపత్రాలు గమనించి, సన్నద్ధమైతే రాత పరీక్షను సులువుగానే ఎదుర్కోవచ్చు. వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నలనూ ఉంచారు. వాటిని పరిశీలిస్తే పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో,  వేటిని చదవాలో అర్థం చేసుకోవచ్చు.  ప్రశ్నలు మరీ అంత కఠినంగా ఉండవు. పోటీ పరిమితమే. అందువల్ల ఈ కోర్సులపై ఆసక్తి ఉన్నవారు కొద్దిగా శ్రమిస్తే చాలు సీటు పొందడం తేలికే. తొలుత ఏర్పాటైన నోయిడా క్యాంపస్‌కు అభ్యర్థులు మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. అక్కడ సీటు పొందడానికి ఎక్కువ మార్కులు సాధించాలి. 


ఆఫ్‌లైన్‌ పరీక్ష 

యూజీ, పీజీ పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే విడిగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.  

యూజీ: 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 4 సెక్షన్ల నుంచి మొత్తం 150 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌ ఏ ఎనలిటికల్‌ ఎబిలిటీలో 25 ప్రశ్నలకు 25 మార్కులు. సెక్షన్‌ బీలో బిజినెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు 25, డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు 25 ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. సెక్షÛన్‌ సీ జనరల్‌ అవేర్‌నెస్‌ 35 ప్రశ్నలకు 35 మార్కులు. సెక్షన్‌ డీ కాంప్రహెన్షన్‌ 25, గ్రామర్, యూసేజ్‌ మొదలైనవాటి నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. వీటికి 40 మార్కులు.   

పీజీ: ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో 4 సెక్షÛన్ల నుంచి 175 ప్రశ్నలు వస్తాయి. వీటికి 200 మార్కులు. ఎనలిటికల్‌ ఎబిలిటీలో 25 ప్రశ్నలకు 50 మార్కులు. ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ గ్రామర్‌ 50 ప్రశ్నలకు 50 మార్కులు. జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరంట్‌ అఫైర్స్‌ 50 ప్రశ్నలు 50 మార్కులు. మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు, డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి.


ఫుట్‌వేర్‌ డిజైన్‌లో ఎఫ్‌డీడీఐ దేశంలోనే మేటి సంస్థ. ఈ సంస్థ ఫ్యాషన్‌ డిజైన్, ప్రొడక్ట్‌ డిజైన్, ఎంబీఏ కోర్సులనూ అందిస్తోంది. ఎఫ్‌డీడీఐ సంస్థల్లో కోర్సులు పూర్తిచేసుకున్నవారికి విస్తృతంగా కెరియర్‌ అవకాశాలు అందుతున్నాయి. ఫుట్‌వేర్‌ పరిశ్రమపై ఆసక్తి ఉన్నవారు ఈ సంస్థల్లో చేరి మేటి భవిష్యత్తుకు బాట వేసుకోవచ్చు 


- డాక్టర్‌ నరసింహుగారి టీఎల్‌ రెడ్డి, ఐఏఎస్, 

ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, ఎఫ్‌డీడీఐ, హైదరాబాద్‌.కోర్సులు.. సీట్లు 


యూజీ 

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌: ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌-760, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌-180, ఫ్యాషన్‌ డిజైన్‌-700 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులను నాలుగేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. 

బీబీఏ: రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌-240 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి నాలుగేళ్లు.  

అర్హత: బ్యాచిలర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్‌ ఉత్తీర్ణులు, చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.


పీజీ 

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌: ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ 120, ఫ్యాషన్‌ డిజైన్‌ 60 సీట్లు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధితో వీటిని అందిస్తున్నారు.   

అర్హత: ఫుట్‌వేర్‌ / లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌ / డిజైన్‌ / ఇంజినీరింగ్‌ / ప్రొడక్షన్‌/ టెక్నాలజీ/ సాధారణ బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంబీఏ (రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌): 300 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి రెండేళ్లు.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు, చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 20. ఫైన్‌తో ఏప్రిల్‌ 30, 2024 

దరఖాస్తు ధర: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.300. మిగిలిన అందరికీ  రూ.600. పరీక్ష తేదీ: మే 12

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: https://fddiindia.com/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ ఇగ్నోలో నాన్‌ టీచింగ్‌ కొలువులు

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

Posted Date: 14-12-2023


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌