• facebook
  • whatsapp
  • telegram

బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

జాబ్‌ కెరియర్‌ సక్సెస్‌కు సూచనలు



ఇంటర్వ్యూ ఏదైనా.. అభ్యర్థి ఇచ్చే జవాబులతోపాటు అతడి విజయంలో ముఖ్యపాత్ర పోషించే మరో కీలక అంశం బాడీ లాంగ్వేజ్‌! అసలు మన గురించి మన మాటలకంటే శరీర భాషే ఎక్కువగా చెప్పగలుగుతుంది అంటే అతిశయోక్తి కాదేమో! అందుకే సరైన శరీర భాషను సాధన చేయడం అభ్యర్థులకు అవసరం. అకడమిక్‌ ఇయర్‌ పూర్తవుతూ ఇంటర్వ్యూలు అధికంగా జరుగుతున్న ఈ సమయంలో మరి ఈ అంశం గురించి వివరంగా తెలుసుకుందామా!


శరీర భాష చాలా విషయాలను చెప్పకనే చెబుతుంది. కళ్లు, చేతులు, నడక, కూర్చునే తీరు.. ఇలా ప్రతి కదలికా బాడీ లాంగ్వేజ్‌లో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. వీటన్నింటినీ చక్కగా సమన్వయం చేసుకోవడం ద్వారా ముఖాముఖి సమయాల్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వగలుగుతాం. సందర్భానికి తగిన విధంగా  హుందాగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాం. 


వినేటప్పుడు..

మాట్లాడటం మాత్రమే కాదు, వినడం కూడా ఒక కళే. ఎదుటివారు చెప్పేది సాంతం వినడం, అర్థం చేసుకోవడం, అప్పుడే తిరిగి జవాబు ఇవ్వడమనేది తప్పక సాధన చేయాల్సిన విషయం. మన గురించి చెప్పుకోవాలి అనుకోవడం, తెలిసిన సబ్జెక్టు మాట్లాడేయాలి అనుకోవడం, ఆ కంగారులో సరిగా వినకపోవడం అనేది సాధారణంగా జరుగుతుంటాయి. కానీ వీలైనంతగా ఆ తప్పులను చేయకుండా ఉండటం సాధన చేయాలి. ఇంటర్వ్యూవర్‌ అభ్యర్థి అర్హత, అనుభవంతోపాటు ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ను కూడా అంచనా వేస్తారు. ఇందులో వినడమనేది ఒక ముఖ్య విషయం.

అప్రమత్తంగా ఉండటం, అవసరమైనప్పుడు తక్షణం స్పందించడం ఇక్కడ ప్రధాన లక్ష్యం. జవాబులు ఇచ్చేటప్పుడు చిన్నగా ముందుకు వంగి మాట్లాడటం ద్వారా మనం ఆసక్తిగా, సంభాషణలో మిళితమై ఉన్నట్లు కనిపించవచ్చు. సందర్భాన్ని బట్టి చిన్నగా తల ఆడించడం కూడా ఇందులో భాగం.


కూర్చునే తీరు

శరీర బరువును మనం ఏ కోణంలో ఉంచుతున్నాం అనే అంశం కూడా చాలా ముఖ్యం. నిటారుగా కూర్చోవడం, భుజాలను రిలాక్స్‌డ్‌గా ఉంచడం, కాళ్లను దగ్గరగా ఉంచుకోవడం.. ఇవన్నీ పాటించడం అవసరం. అభ్యర్థి అందరితోనూ సులభంగా కలిసిపోతాడా, నలుగురిలోనూ మాట్లాడేందుకు ఇబ్బంది పడతాడా, చెప్పే జవాబుల్లో ఎంతవరకూ నిజం ఉంది, వ్యక్తిత్వం ఎటువంటిది.. వంటివన్నీ కూర్చునే తీరుతో అంచనా వేయొచ్చు.



చేతులు

మనమే కాదు.. మన చేతులు కూడా మాట్లాడతాయి తెలుసా? చెబుతున్న అంశానికి తగిన విధంగా చేతులను కదిలించడం ద్వారా మన సమాధానాలను మరింత స్థిరంగా తెలియజేయవచ్చు. అలాగే మాట్లాడటం ఆపినప్పుడు చేతులను న్యూట్రల్‌ పొజిషన్‌లో ఉంచడం ద్వారా వినడంపై ఏకాగ్రత పెంచవచ్చు. ఎదురుగా ఉన్న టేబుల్‌ లేదా డెస్క్‌పై కుదిరితే చేతులను రెస్ట్‌ పొజిషన్‌లో ఉంచుకోవచ్చు. అదే సమయంలో మరీ అధికంగా ఉపయోగించకుండా జాగ్రత్త వహించడం అవసరం, అలా చేస్తే ఎదుటి వారి ఏకాగ్రత మనం మాట్లాడే అంశం మీద నుంచి పక్కకు వెళ్లే పరిస్థితి తలెత్తుతుంది.


తిరిగి వెళ్లేటప్పుడు..

రావడం ఎంత ఆత్మవిశ్వాసంతో లోపలికి అడుగుపెడతామో.. వెళ్లేటప్పుడు కూడా అంతే హుందాగా వెళ్లడం ద్వారా ఇంటర్వ్యూవర్‌ వద్ద మంచి అభిప్రాయాన్ని కొనసాగించవచ్చు. చక్కని చిరునవ్వు, కరచాలనంతో తిరిగి వెళ్లేటప్పుడు ‘థాంక్యూ’ చెప్పవచ్చు. గది తలుపు మూసేటప్పుడు కూడా ఇదేవిధంగా ఉండాలి.



సాధనతో..

ఇంటర్వ్యూలకు సమాధానాలు ఎలా అయితే సాధన చేస్తామో బాడీ లాంగ్వేజ్‌ను కూడా అదే విధంగా సాధన చేయడం అవసరం. అప్పుడే మెరుగైన ప్రదర్శన కనబరచగలం. నిజానికి మనసులో భయం ఉన్నా నిరంతరం సాధన చేయడం ద్వారా దీన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో కనిపించవచ్చు. ఇందుకు ఆన్‌లైన్‌లో వివిధ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో చాలా కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి.


చిరునవ్వు

ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లిన దగ్గర్నుంచి చిరునవ్వుతో పలకరించడం, ప్రశ్నలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం, అవసరమైనప్పుడు ఆ నవ్వును కొనసాగించడం ద్వారా అక్కడి వాతావరణాన్ని తేలికపరచొచ్చు. ఒక మంచి సానుకూల వాతావరణంలో సంభాషణ జరిగితే వచ్చే ఫలితాలు కూడా ఆశావహంగా ఉంటాయనేది నిపుణుల సూచన. అదే సమయంలో సాంకేతిక అంశాలు, సీరియస్‌ అంశం మాట్లాడేటప్పుడు ఆ సందర్భానికి తగిన విధంగా ముఖకవళికలు ఉండటం అవసరం.


కళ్లలోకి చూడటం

ఇంటర్వ్యూ ప్యానెల్‌లో ఎందరు ఉన్నా అందరితోనూ కళ్లలోకి నేరుగా చూస్తూ మాట్లాడటం అత్యంత ప్రధానమైన అంశం. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని, మనమిచ్చే జవాబులపై మనకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. గది పైకప్పు వైపు, మూలలవైపు చూడటం, పదే పదే ఫోన్‌ లేదా వాచ్‌ చూసుకోవడం, మాట్లాడేటప్పుడు తరచూ కళ్లు మూసుకోవడం, ఎదుటి వారి కళ్లలోకి చూడలేకపోవడం అనేది మనసులోని ఆందోళనలను, ఆత్మవిశ్వాస కొరతను సూచిస్తుంది. అలా అని చూపు తిప్పుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోతే ఎదుటివారిని కొంత ఇబ్బందికి గురిచేసే ప్రమాదం ఉన్నందున సందర్భానికి తగిన విధంగా, వారిని ఇబ్బంది పెట్టకుండా చూడటం అవసరం.



ఐ కాంటాక్ట్‌కు ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే ఎదుటివారి కళ్లలోకి చూస్తూ మాట్లాడినప్పుడే వారు నిజంగా మనతో సంభాషణలో మమేకం కాగలరు. ఎంత ఇంటర్వ్యూ అయినా అది చివరికొచ్చేసరికి ఒక సంభాషణగానే మిగులుతుంది. అందుకే మన ఆసక్తినీ, ఆత్మవిశ్వాసాన్నీ వ్యక్తపరిచే ఐ కాంటాక్ట్‌ విషయంలో అశ్రద్ధ వహించకూడదు.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 06-12-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం