• facebook
  • whatsapp
  • telegram

పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

ఎన్విరాన్‌మెంటల్‌ లా కోర్సు, కెరియర్‌ వివరాలు



లక్షల కోట్ల జీవరాశులకు ఆలవాలమైన ఈ భూమ్మీద అన్నీ ప్రకృతికి లోబడి జీవిస్తుంటాయి.. కానీ ఒక్క మనిషి మాత్రమే స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తూ పర్యావరణ సమతుల్యతకు భంగం వాటిల్లేలా నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్‌ తరాలకు ముప్పుగా పరిణమిస్తుంటాడు. ఇటువంటి సందర్భాల్లో ఆ తీరును ప్రశ్నిస్తూ, పుడమి పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తారు పర్యావరణ న్యాయవాదులు! వాతావరణ మార్పులు వేగంగా సంభవిస్తున్న ఈ కాలంలో ‘ఎన్విరాన్‌మెంటల్‌ లా’ విద్యార్థులకు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఈ కెరియర్‌ గురించి  ముఖ్య వివరాలు తెలుసుకుందామా..! 


ప్రస్తుత సమాజంలో పర్యావరణం పట్ల అందరికీ అవగాహన, బాధ్యత ఉండాలన్నది వాస్తవం. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, జీవరాశులు అంతరించిపోవడం.. వంటివన్నీ నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు. ఇందులో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించే వ్యక్తుల, సంస్థల విషయంలో చట్టం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడే పర్యావరణ లాయర్ల అవసరం ఏర్పడుతుంది. వాతావరణ సమస్యలు, కాలుష్యం, వృథాల నిర్వహణ.. వంటి వివిధ అంశాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. గాలి-నీటి నాణ్యత, వేట, చేపల వేట, రసాయన భద్రత, అటవీ సంరక్షణ, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ.. వంటి అంశాలు సైతం పర్యావరణ పరిరక్షణతో ముడిపడి ఉన్నాయి. 


వాతావరణాన్ని కాపాడటానికి సంబంధించిన చట్టాలు, పాలసీలు, రెగ్యులేషన్స్‌ వంటివన్నీ ’ఎన్విరాన్‌మెంటల్‌ లా’లో ఉంటాయి. మన దేశంలో ఎన్నో ముఖ్యమైన సహజ సంపదలు ఉన్నాయి. భారత్‌ వాతావరణ అవసరాలు, ఇబ్బందులు మిగతా ప్రపంచంతో పోలిస్తే వేరు. దీనికి తగ్గట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ చట్టాలు మన దేశ అవసరాలకు తగిన విధంగా అప్‌డేట్‌ అవుతూ వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పులతో ఎప్పటికప్పుడు నూతనంగా మార్పులు చోటుచేసుకున్నాయి. నిలకడైన అభివృద్ధిలోనూ, వాతావరణ సమస్యలను పరిష్కరించడంలోనూ ఎన్విరాన్‌మెంటల్‌ చట్టాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. 


ఎక్కడ?  

ఎన్విరాన్‌మెంటల్‌ లా చదువుకున్న వారు లా సంస్థలు, వివిధ సంస్థల లీగల్‌ డిపార్ట్‌మెంట్లు, పర్యావరణ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఎన్‌జీవోల్లో పనిచేసే వీలుంటుంది. మనదేశంలో వాతావరణ సమస్యలకు సంబంధించిన అంశాలను నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) చూసుకుంటుంది. ఈ ‘లా‘ విభాగంలో ఇతర లాయర్ల మాదిరిగా అధిక జీతభత్యాలు లేకపోయినప్పటికీ తగిన విధంగా వేతనాలు అందే వీలుంటుంది. అనుభవం, పనిచేస్తున్న సంస్థ, ప్రదేశాన్ని బట్టి ఈ లాయర్ల ఆర్జనలో తేడా ఉంటుంది. ఆదాయం మాట పక్కన ఉంచితే భవిష్యత్తు తరాలకు భరోసానిచ్చే ఈ పవిత్రమైన వృత్తిలో భూమిని పరిరక్షించే బాధ్యతను విద్యార్థులు స్వీకరిస్తారు.

క్లాట్, ఎల్‌శాట్, ఏఐఎల్‌ఈటీ.. వంటి ప్రవేశపరీక్షల ద్వారా కాలేజీల్లో అడ్మిషన్లు పొంది దీనికి సంబంధించిన కోర్సుల్లో చేరవచ్చు. 

లీగల్‌ అనలిస్ట్, లీగల్‌ కౌన్సెలర్, లా ఆఫీసర్, ఎన్విరాన్‌మెంట్‌ అడ్వొకేట్‌ వంటి పోస్టుల్లో కొలువు దీరవచ్చు. 

రాష్ట్ర, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డులు, కార్పొరేట్‌ కార్యాలయాల్లో కొలువులు లభిస్తాయి. 

భారత్‌లోనే కాకుండా యూఎస్‌ఏ, యూకే వంటి ఇతర దేశాల్లోనూ ఎన్విరాన్‌మెంటల్‌ లాయర్ల అవసరం చాలా ఉంది. 


వివిధ స్థాయుల్లో..

ప్లస్‌ టూ తర్వాత ఈ దిశగా పయనించి అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చు. గ్రాడ్యుయేట్‌ లెవెల్లో సాధారణ లా డిగ్రీల మాదిరిగానే ఉన్నా, దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎల్‌ఎల్‌ఎం, డిప్లొమా, సర్టిఫికెట్‌ స్థాయుల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

మన దేశంలో ఉన్న ప్రముఖ న్యాయ కళాశాలలు అన్నింటిలోనూ ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్‌ లా యూనివర్సిటీలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు వర్సిటీల్లో దీనిపై అధ్యయనం చేయవచ్చు. 


ముఖ్యమైన కోర్సులు.. 

ఎల్‌ఎల్‌ఎం ఇన్‌ ఆయిల్, గ్యాస్‌ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లా బి ఎల్‌ఎల్‌ఎం ఇంటర్నేషనల్‌ లా అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌  బి మాస్టర్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ పాలసీ అండ్‌ లా బి ఎల్‌ఎల్‌ఎం ఇన్‌ ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌ 

ఎల్‌ఎల్‌ఎం/ ఎమ్మెస్సీ ఇన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌. 


ఏం చదువుతారు?

ఇందులో భాగంగా విద్యార్థులు ఎకోసిస్టమ్, ఎకాలజీ, పర్యావరణ సమస్యలకు కారణాలు, దీనివల్ల జరిగే సామాజిక మార్పులు, ఇంటర్నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ లా, కాలుష్య నివారణ చట్టాలు, సహజ వనరుల పునర్వినియోగం, జంతు సంరక్షణ చట్టాలు, వాతావరణ కాలుష్య నివారణ వంటి అంశాలన్నీ చదువుకుంటారు. దేశవిదేశీ నిబంధనలతోపాటుగా స్థానిక చట్టాల గురించి సైతం అధ్యయనం చేస్తారు. వాతావరణానికి సంబంధించి రాజకీయ, న్యాయసంబంధ, సామాజిక అంశాలను తెలుసుకుంటారు. బయోడైవర్సిటీ, బయోసేఫ్టీ, పర్యావరణ పరిరక్షణలో ఎన్‌జీవోల పాత్ర, న్యూక్లియర్‌ ఎనర్జీ తదితర అంశాలపై లోతుగా నేర్చుకుంటారు.


ప్రముఖ విద్యాసంస్థలు..

ఈ కోర్సులను అందిస్తున్న దేశంలోని ముఖ్యమైన విద్యాసంస్థలు.. 

ఎన్‌ఎస్‌ఐయూ - బెంగళూరు 

ఎన్‌ఎల్‌యూ - దిల్లీ 

ఎన్‌ఎల్‌యూజేఏఏ - గువాహటి 

హెచ్‌ఎన్‌ఎల్‌యూ - రాయ్‌పుర్‌

ఇవేకాక.. ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.  ప్రాథమిక అవగాహన కోసం అన్ని ప్రముఖ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనూ లభించే ఎన్విరాన్‌మెంటల్‌ లా కోర్సులను పరిశీలించవచ్చు. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ అణుశక్తి విభాగంలో ఉద్యోగాలు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో అవకాశాలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 19-12-2023


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌